magaగంగిరెద్దుల ఆటలు, జంగమోళ్ల పాటలు, బసవయ్య గంటలు, రామజోగుని రాగాలు, యక్షగానాలు, చిందు నృత్యాలు, పటం కథలు, భక్తి ఆలాపనలతో పల్లెలు ఒక ఆధ్యాత్మికమైన, సంస్కృతీపరమైన శోభను సంతరించుకొని ఉండేవి. పట్నంలో బ్రతికే జీవులు ఎప్పుడెప్పుడు పల్లెకు చేరుదామా అని చూసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ టీవీ మాధ్యమం, ఆ తరువాత సినిమా పుణ్యమా అని పగటి వేషగాళ్ల బ్రతుకులు ఎక్కడగాకుండా పోయాయి. వీరంతా వలస కూలీలుగా, సంచార జీవులుగా పొట్టచేతబట్టుకొని వివిధ ప్రాంతాలకు వలసలు వెళ్లడంతో నేటి తరానికి పగటి వేషగాళ్లనేవారు ఉండేవారన్న విషయం కూడా తెలియకుండా పోయింది. ప్రపంచీకరణ చేసిన ఈ పాపం భారతీయ సంస్కృతికి తీరని నష్టాన్నే మిగిల్చిందని చెప్పాలి. కుటుంబ విలువలను నాటకాలుగా వేసిన పగటి వేషగాళ్ల నాటకాల స్థానంలో, ప్రజలిప్పుడు నేరాలు, ఘోరాలు లాంటి టీవీ కార్యక్రమాలు చూస్తున్నారు. వీరనారుల జీవిత చరిత్రలను చూసిన ప్రజలు, కుటుంబాల్లో కుట్రలు కుతంత్రాలను సృష్టించే నీతి బాహ్యమైన సీరియళ్లను చూస్తున్నారు. ఇలా ఒక్కటేమిటి మనిషిని మనిషితనం నుంచి దూరం చేసే అనేక కార్యక్రమాలు నేడు ప్రజల దైనందిన జీవితంలో కాలక్షేపాలుగా మారడం వల్ల అనేక అనర్ధాలు వాటిల్లుతున్నాయి. అదే టీవీల స్థానంలో, నేటికీ పగటి వేషాలే ఉండి ఉంటే మనం ముప్పై యేండ్లు వెనక ఉండే వాళ్లం కావచ్చు కానీ.. మూడువేల యేళ్ళయినా తరగని కుటుంబ వ్యవస్థకు బీజం పడేది. ఇంతలా ఆనాడు సమాజాన్ని ప్రభావితం చేసిన అనేక పగటి వేషాల్లో ముఖ్యమైన కొన్ని పగటివేషాలను ఒకసారి పరిశీలిద్దాం.

ఆది బైరాగి వేషం: జీవితాన్నంతా అవపోసన పట్టినట్టుగా వ్యవహరించే వీరు.. ఇంటింటికి తిరుగుతూ జీవిత పరమార్ధాన్ని ప్రజలకు వివరించేవారు..

”ఖానా నహిఖాతా, పానీ నై పీతా,

మాటీ ఖానా, మాటీ పీనా, మాటీ మే సో జనా”

అంటే అన్నం తినడం లేదు, భోజనం చేయడం లేదు, ఆ బైరాగి (శివుడు) సృష్టించిన ఈ మట్టినే తింటున్నాం, మట్టినే తాగుతున్నాం, మట్టిలోనే పడుకుంటున్నాం అంటున్న ఆ బైరాగి మాటల్లో మట్టి నుంచే వచ్చిన గింజలను తింటున్నాం, నీటినే తాగుతున్నాం, చివరికి మట్టిలోకే జారుకుంటాం అనే భావన హృదయాలను తాకుతుంది.

బుడబుక్కల వారు: బుడబుక్కలవారు మొన్నటి వరకు కనిపించిన సందర్భాలు ఉన్నాయి.

‘ఏయ్‌ నిలునిలు ఛండాలీ..

అయిరె అంబా పల్కు- జగదాంబ పల్కు,

అయి పల్కు- ఆయితాయి పల్కు

సద్గుణాంబా పల్కు- సైకత్‌ స్రోణీ పల్కు,

యక్షిణీ పలుకు-అంబర పక్షి పలుకు,

ఆకాశవాణి పల్కు-కంచిలోని కామాక్షీ పల్కు,

కాలి కింద భూదేవి పల్కు”

అంటూ అన్ని నిజాలే చెప్తం, మేం పలకడం కాదు దేవతలే మమ్మల్ని పలికిస్తున్నారని చెబుతూ ప్రజలకు వారి సమస్యలకు పరిష్కారం చూపే సందర్భాలు అనేకం ఉన్నాయి. బుడబుక్కల వారిలో అనేక రకాలు ఉన్నా వారు ఎంచుకున్న విధానం ఒక్కటే కావడంతో వీరందరిని బుడబుక్కలవారనే అంటున్నారు.

చాత్తాద వైష్ణవుల వేషం : ద్వాదశ నామాలు (ఊర్థ్వ పుండ్రములు) ధరించి మృదంగ హార్మోనియ సహా వాద్యాలతో, గజ్జలు, చిరుతలతో హరిదాసు వలె వేషధారణ గావించి స్టేజి పైకి ప్రవేశించి.. కలియుగ శతాబ్దములు ఐదువేల సంవత్సరములంటూ మొదలు పెట్టి, క్రీస్తు పూర్వం రెండువేల అరవై సంవత్సరముల క్రితం శ్రీ శంకరాచార్యుల వారు పుట్టారని అప్పట్లో ప్రపంచమంత శివమతమేనని చెబుతారు.

సోమయాజులు సోమిదేవమ్మ వేషం: పగటి వేషాలు పూర్తిగా సీరియస్‌ గా, హితోపదేశాలతో కాకుండా హాస్యాన్ని పండించే కళాకారులున్నారు అనేందుకు సోమయాజులు సోమిదేవమ్మ వేషం కథలు మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇందులో హాస్యంతో పాటు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్ధాల్ని ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా వ్యక్తీకరించడం ముదావహం.

ఫకీరు సాయిబుల వేషం: ఫకీరు సాయిబుల వేషం ప్రజలకు ఖురాన్‌ వేదాంతాన్ని పరిచయం చేసిందనే చెప్పాలి. గెడ్డం, మీసం, రంగు రంగుల లుంగీ, లాల్చి, తలపాగ, చేతిలో కంజీర, మరొకరి చేతిలో గిరక బాజీరా పట్టుకొని తెలుగు, హిందీలను ఖైమా చేస్తూ వీరు పలికే మాటలు పల్లె ప్రజలను విపరీతంగా ఆకట్టుకునేవిధంగా ఉంటూ సెకను కూడా ఆపకుండా తన గొప్పదనాన్ని చెబుతూ ప్రజలను నవ్విస్తుంటాడు.

”అరే మన్ము జేబోల్‌ తేరేఠికానా, కహాసేతూ, ఆయాహైయావో తెరానా?”

పిట్టల దొర వేషం: చక్కగా క్రాపు దువ్వుకొని నెత్తిన దొరటోపి పెట్టుకొని, కాకి చొక్కా, కాకీ నిక్కరు చేతిలో కట్టెతుపాకీ, ఫ్రెంచి కటింగ్‌ మీసాలు — అద్దాలు లేని కళ్ల జోడు, సంకకు జోలె వేసుకొని చూడగానే గమ్మతిగా కనిపించే పిట్టల దొర సెకను కూడా ఆపకుండా డైలాగులు చెప్తూ ప్రజలను నవ్విస్తుంటాడు.

సంతానం లేనివారికి పిల్లలనిస్తున్నాం, సంతానం ఎక్కువైతే డాక్టర్ల చేత కుటుంబ నియంత్రణ కటింగ్‌ చేయిస్తున్నాం సార్‌ , యిల్లు హైలెట్‌ సర్‌ ఇరాక్‌ బాంబులేసినా పెకలది సార్‌, భూకంపవచ్చిన బద్దలవదు సార్‌, పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు కనిపిస్తనే ఉంటడు సార్‌, తామరతుండు దూలాలు, వరి వాసాలు, మొన్న వచ్చిన గాలివానకు పడిపోయినయి సార్‌, మళ్లీ అంత పెద్ద ఇల్లుకట్టాలంటే డబ్బులు సరిపోతలేవని మీ ఇంటికి సాయానికి వచ్చినాను సార్‌ అంటూ అందరిని కడుపుబ్బా నవ్విస్తాడు.

గంగిరెద్దుల వేషం: చూడ చక్కనైన ఎద్దుకు చక్కనైన అలంకరణలు చేసి, కాళ్లకు గజ్జెలు, నుదిటిన బొట్టుపెట్టి ముస్తాబు చేస్తారు. ఇక గంగిరెద్దులవాడు నోటిలో పీకను పట్టుకొని అలనాటి తెలుగు గీతాలను ఆలపిస్తూ ప్రజలను సమ్మోహితులను చేస్తుంటాడు. ఇప్పటికి పండగలు వచ్చినప్పుడు ఇళ్లముందుకు వచ్చి భిక్షాటన చేస్తుంటాడు.

వీరే కాదు పగటి వేషాలతో పొట్ట పోసుకుంటూ ప్రజలకు మంచిని నేర్పుతూ చెడుకు పోతే ఏమవుతుందో హెచ్చరించే వీరు, అప్పుడప్పుడూ కడుపుబ్బా నవ్విస్తారు, అంతేకాదు సమాజంలోని రుగ్మతలపై వ్యంగ్యాస్త్రాలతో జాగతం చేస్తుంటారు. పైన చెప్పిన పగటి వేషగాళ్లేకాదు దాదాపు వంద పైచిలుకు పగటి వేషగాళ్ళు వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. ఏది ఏమైనా పగటి వేషగాళ్లు సమాజహితులు అన్న మాటను మాత్రం మరిచిపోవద్దు. వారికి ఆదరణ పెరగాలి ఉన్నతమైన విలువలతో కూడిన సమాజం మళ్లీ తిరిగిరావాలిని ఆశిద్దాం.

శ్రీపాద రమణాచారి

Other Updates