cm-ugadiకొత్త సంవత్సరంలో కూడా తెలంగాణ రాష్ట్రం అద్భుత ఫలితాలను సాధిస్తుందని, సుస్థిర అభివృద్ధితో దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతుందని ముఖ్యమంత్రి. కె. చంద్ర శేఖరరావు అన్నారు. జనహితలో పంచాంగ శ్రవణం అనంతరం సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ, అనేక బాధలు, అవస్థలు పడ్డ తెలంగాణ స్వరాష్ట్రంలో అనూహ్యమైన ప్రగతిని సాధించి అద్భుతమైన రీతిలో దేశంలో సగర్వంగా తలెత్తుకున్నదని గుర్తుచేశారు.

కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఆర్థిక రంగంలో ప్రస్తుతం 21 శాతం వృద్ధిరేటు సాధించిందని, ఏటా 15 వేల కోట్ల నుంచి 20 వేల కోట్ల రూపాయాల అదనపు ఆదాయం వస్తోందని చెప్పారు. ఆర్థిక ప్రగతి సుస్థిరంగా కొనసాగు తున్న తరుణంలో ప్రభుత్వం నిర్ధిష్ట కార్యాచరణతో ముందుకు పయనిస్తోందన్నారు.

‘విన్‌ స్టన్‌ చర్చిల్‌ యుద్ధనేతగా రాణించారు. పరిపాలన సరిగా చేయలేదు. మీరు అలాకాదు’ అని కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ తనతో అన్నమాటలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేస్తూ, దైవ కృపవల్ల ఇక్కడ పాలన బాగాసాగుతోంది. రాష్ట్రం దేశానికి తలమానికంగా నిలచింది. సంక్షేమంలో మనమే ముందున్నాం అని చెప్పారు. ‘హేవళంబి నామ సంవత్సరంలో అద్భుత ఫలితాలుంటాయన్న సంతోషాన్ని మీఅందరితో పంచుకుంటున్నా. పంచాంగ శ్రవణం మంచి బొకేలా వుంది. ఈ సారి శుభగ్రహాలు మూడొంతుల వరకూ ఆధిపత్యంలో వున్నాయి. శుభగ్రహాల అనుగ్రహం రాష్ట్రంపై వుంది.కాబట్టి అంతకన్నా సంతోషకరమైన వార్త వుండదు. వర్షాలు బాగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని పండితులు చెప్పారు. శాస్త్రవేత్తలు కూడా ఇదే మాట అంటున్నారు. పంచాంగం, శాస్త్రీయంగా అభిప్రాయం ఏకోన్ముఖంగా ఉంది’ అని ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తంచేశారు.

‘హోమ్‌ మంత్రి నాయని నరసింహారెడ్డికి కొన్ని ఇబ్బందులు వుంటాయని అంటున్నారు. ఈ సారి పోలీసులు జాగ్రత్తగా వుండాలని పంచాంగ శ్రవణకర్త అన్నప్పుడు అంతవరకూ సభలో నవ్వుతూ వున్న పోలీస్‌ కమీషనర్‌ మహేందర్‌ రెడ్డి ముఖంలో మార్పువచ్చింది’ అని నవ్వుతూ ముఖ్యమంత్రి ఛలోక్తి విసరగానే సభలో నవ్వులు వెల్లివిరిసాయి. శాంతిభద్రతలను కట్టుదిట్టం చేసేందుకు మరిన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంటామని సి.ఎం చెప్పారు. రాష్ట్రంలో ఐ.ఏ.ఎస్‌ లు, ఐ.పి.ఎస్‌ లు అభినందనీయమైన రీతిలో పనిచేస్తున్నారని ఆయన ప్రశంసించారు.

రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇప్పటివరకూ రికార్డుస్థాయిలో 3,500 పైచిలుకు పరిశ్రమలు వచ్చాయని, రూ.50 వేల కోట్ల పెట్టుబడులతో రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ ప్రజలంతా సుఖంగా వుండాలని, సుఖశాంతులతో వర్థిల్లాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, శాసన సభ స్పీకర్‌ సిరికొండ మధుసూదనా చారి, శాసన మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ కూడా సభలో ప్రసంగించి, రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు,

ఈ సభకు రాష్ట్రమంత్రులు, వివిధ సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. జనహితలో తొలిసారిగా జరిగిన ఈ ఉగాది వేడుకలు అందరిలో నూతనోత్సాహాన్ని నింపాయి.

Other Updates