time

”ఇవ్వాళ ఎలాగైన ఎక్కువ సమయం చదువుకోవాలి”.

”ఎన్నోసార్లు ‘టైమ్‌’ను చదువుకోసం ఉపయోగించాలని అనుకుంటాను నాకు తెలియకుండానే అనవసరంగ ‘వేస్ట్‌’ అవుతుంది”.

”రోజుకు ఎన్నిగంటలు పడుకోవాలి. ఎన్ని గంటలు చదువుకోవాలో తెలియటం లేదు”.

”రోజంతా చదువుతునే వుంటాను కాని.. సిలబస్‌ అయిపోవటం లేదు.. ఇంకా ఎన్ని గంటలు చదవాలో? తెలియటం లేదు”.

”పది నిమిషాలు ఫ్రెండ్‌ను కలుద్దామనుకున్నాను. కాని అది గంటసేపు అయిపోయింది.”

”ప్రతిరోజు ప్రొదున్నే నిద్రనుండి లేవాలనుకుంటాను, కాని లేవలేక పోతున్నాను ప్చ్‌! ఎలా!”

పై సమస్యలున్న వాళ్ళు తప్పకుండా ఇది మీకోసమే, విద్యార్థులకు ముఖ్యంగా ”పోటీ పరీక్షల కోసం” సన్నద్ధం అయ్యే విద్యార్థులకు తప్పకుండా ”సమయపాలన” గురించి అవగాహన అవసరం. సమయాన్ని ఎవరైనా ‘మేనేజ్‌’ చెయ్యగలుగుతారా! అంటే నిజంగా చెయ్యలేము. ఎందుకంటే ప్రపంచంలో అందరికి సమయం సమానమే. అమెరికా ప్రెసిడెంట్‌, ఒలింపిక్స్‌లో గెలిచిన క్రీడాకారులకయినా సమయం 24 గంటలే. శాస్త్రవేత్తలకు, విజయం సాధించే విద్యార్థులకూ సమయం 24 గంటలే, విజయం సాధించలేని విద్యార్థులకూ 24 గంటలే మరి, ఎక్కడుంది సమస్య… మనలోనే.. మనల్ని మనం సరిగ్గా అర్థం చేసుకోకపోవటంవల్ల, మనకున్న ఉద్వేగాలను క్రమబద్ధీకరించు కోకపోవటంవల్ల, మనకున్న పనులలో ఏది ముందుగా చెయ్యాలో తెలుసుకోకపోవడంవల్ల.. మనకు తెలియకుండా వేరొకరు వచ్చి మన సమయాన్ని దొంగిలిస్తారు… ఆ తర్వాత మనకు నిరాశ, నిస్తేజం మిగుల్తాయి… వీటి నుంచి రక్షించుకోవాలంటె ABCD Time గురించి తెలుసుకోవాలి.

సమయం ఊరికనే ఎగిరిపోతుంది.

ఏదైనా నువ్వనుకున్న సమయంకంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది.

ఒక సమయానికి చదువుకుందామనుకుంటావు కాని… తప్పకుండా ఆ సమయానికి ఇంకేదో పని చేస్తుంటావు..

ఇప్పుడు వారంలో ఉన్న 168 గంటలను ఎలా సద్వినియోగపరుచుకోవాలి. ఈ క్రింది పద్ధతుల ద్వారా తెలుసుకుందాం.

A – Anticipate & Plan:

రాబోయే ఇబ్బందులను ఊహించి, ప్లాన్‌ చెయ్యండి

B – Break taskdown: చెయ్యాల్సిన పనులను విడగొట్టండి

C – Cutoff finished topics : చేసిన పనులను లిస్ట్‌నుండి కట్‌ చెయ్యండి

D – Don’t Postpone : వాయిదా వెయ్యకండి

A – Anticipate & Plan

రాబోయే ఇబ్బందులను ఊహించి, ప్లాన్‌ చెయ్యండి

Study Schedule తయారుచేసే ముందురోజు, మనం చేసే ‘పని’ని అర్థం చేసుకోవాలి. రోజుకు 8 గంటలు చదువుతాను అనేది ప్లాన్‌ కాదు. ఒక ఊహగానే వుంటుంది. ప్లాన్‌లో ప్రతి గంటకు ఏమి చెయ్యాలో నిర్ణయించుకోవాలి. ఎన్ని గంటలు మనం రిలాక్స్‌ కావాలో, ఎన్ని గంటలు స్నేహితులతో కలిసి enjoyచెయ్యాలనుకుంటున్నామో నిర్ణయించుకోవాలి. అలా అని విపరీతమైన ‘ఆశ’తోTime ప్లాన్‌ చేస్తే, మనం ఏమి చెయ్యకుండా ఉండిపోతాము. ఉదా:- సాయంత్రం 4 నుండి రాత్రి 10 వరకు చదువుతాను అనుకుంటె, అందులో, హాస్టల్‌ రూమ్‌లో, తల్లిదండ్రులతో ఉంటె ఇది సాధ్యం కాకపోవచ్చు. కాని లైబ్రరీలో వుంటూ చదువుకున్నప్పుడు సాధ్యం కావచ్చు. కాబట్టి మన పరిస్థితి ఏ రోజుకు ఆ రోజు రాబోయే అడ్డంకులను ఊహించుకుని టైమ్‌ టేబుల్‌ వేసుకోవాలి. ఉదా:- సాయంత్రం 5.30కి మన మిత్రుడు తనకు సందేహాలున్నాయి నీతో చర్చించాలి వస్తానన్నాడు. ఇలాంటి వాటిని పరిగణనలోకి తీసుకుని మన షెడ్యూలు తయారు చేసుకోవాలి. చదువుకునేటప్పుడు తప్పకుండా మొబైల్‌ ఫోన్‌ను స్విచ్‌ ఆఫ్‌ చెయ్యాలి. రోజులో సాయంత్రం, ప్రొద్దున మాత్రమే మొబైల్‌ ఓపెన్‌ చేసి, మాట్లాడాల్సిన వాళ్లతో మాట్లాడి మళ్లీ ఫోన్‌ ఆపెయ్యాలి. ఏ స్నేహితులతో మాట్లాడాలి, ఏ స్నేహితులతో అందుబాటులో ఉండాలో నిర్ణయించుకొని ప్రతి గంటకు 10 ని||లు Break తీసుకుని చదువుకోవడం సాధన చెయ్యాలి.

మనం Day maker or Night maker తెలుసుకోవాలి. అంటే ప్రొద్దున్నే లేవగలుగుతామా! రాత్రి ఎక్కువసేపు మెళకువ ఉండగలుగుతామా! అర్థం చేసుకోవాలి.

Day maker: పొద్దున ఎప్పుడు అంటే అప్పుడు లేచి చదవగలుగుతారు, వీరు చదువును వీలైనంతవరకు పగలు, ఉదయాన్నే చదువుతారు.

Night maker: వీళ్లు రాత్రిపూట ఎక్కువసేపు ఉండగలుగుతారు. ప్రొద్దున్న లేవలేరు. కాబట్టి చదువును రాత్రిపూటనే ప్లాన్‌ చేసుకోవాలి.

చదువుకోవడం ఇబ్బంది అవుతుంటేె, స్నేహితులతో ఇబ్బంది అవుతుంటే ఎవ్వరికీ చెప్పకుండా, సెల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి చదువుకోవడానికి లైబ్రరీ, రీడింగ్‌ రూంలో చదువుకోవడం మంచిది.

B – Break taskdown:

చెయ్యాల్సిన పనులను విడగొట్టండి

సిలబస్‌ను సాధ్యమైనంత చిన్నచిన్న భాగాలుగా విడగొట్టండి. భాగాలుగా చేసిన తర్వాత, ఆ పాఠ్యాంశాల్ని చదవండి. ఎన్నిసార్లు చదివితే మీరు చూడకుండా, ఆబ్జెక్టివ్‌ టైప్‌ క్వశ్చన్స్‌ను ఎక్కువ మార్కులు/ఎక్కువ జవాబులు కరెక్టుగా చేయగలరో తెలుసుకోండి.

ప్రతిసారి వచ్చిన మార్కులు తక్కువగా వస్తే మళ్లీ చదివి కనీసం 70% వచ్చేవరకు ప్రయత్నం చేయాలి. తర్వాత రివిజన్‌లో మిగతా ప్రయత్నం చెయ్యాలి.

విడగొట్టిన భాగాలకు అనుగుణంగా సమయాన్ని కూడా విడగొట్టాలి. మనం అనుకున్న దానికంటె చదివి అర్థం చేసుకోవడం ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాబట్టి ప్రతి టైమ్‌ షెడ్యూల్‌లో కనీసం 20% సమయం ఎక్కువగా పెట్టుకోవాలి.

ప్రతిసారి మనం అనుకున్నదానికంటె ఎక్కువ సమయం తీసుకుంటేె ఆ ఎక్కువ సమయాన్ని కలుపుకుని టైమ్‌ షెడ్యూల్‌ వేసుకోవాలి.

వేగంగా చదవడం అవసరమే అయితే, చదివింది ఎంత రీప్రొడ్యూస్‌ చేస్తున్నామనేది ముఖ్యం, సమయాన్ని పాటిస్తూ వేగాన్ని పెంచే సాధన చెయ్యాలి.

C – Cutoff finished topics :

చేసిన పనులను లిస్ట్‌నుండి కట్‌ చెయ్యండి

ప్రతిరోజూ రాసుకున్న సిలబస్‌ పూర్తి చేసిన తర్వాత వాటిని కట్‌ చెయ్యండి. పూర్తి చేశానన్న తృప్తి మీరు చెయ్యబోయే పనికి స్ఫూర్తినిస్తుంది.

పోటీ పరీక్షలకు చాలా సిలబస్‌ వుంటుంది. కాబట్టి ఎప్పుడూ సిలబస్‌ను అందుబాటులో పెట్టుకోవాలి. వీలయితే జిరాక్స్‌ కాపీని గోడకు అంటించుకోవడం, ఒక కాపీని మనతో పెట్టుకోవడం చేయాలి.

చదివాము అని సిలబస్‌ కాపీలో మార్క్‌ చేసుకుంటూ దాని ప్రక్కన ఎంత సమయం పట్టిందో రాసుకోవడం అవసరం. క్వశ్చన్‌ బ్యాంక్‌ పూర్తి చేయడానికి ఎంత సమయం పట్టిందో, 70% మార్కులు రావడానికి ఎంత సమయం పట్టిందో కూడా వ్రాసుకోవాలి. ఇదంతా మనం grasping, reproducing కోసం తీసుకున్న సమయం తెలుసుకోవడంవల్ల, రాబోయే కాలంలో ఎంత సమయం

ఉపయోగించుకోవాలో ఒక నిర్ధారణకు రావడం సులభం అవుతుంది.

D – Don’t Postpone:

వాయిదా వెయ్యకండి

చిన్నప్పుడు సమయపాలనను గురించి చెప్పి కొన్ని మాటలు మా ‘టీచర్లు చెప్పేవారు’ ‘రేపు చెయ్యాల్సిన పని ఇవ్వాళ చెయ్యి, ఇవ్వాళ చెయాల్సిన పని ఇప్పుడే చెయ్యి’ అని… ఎందుకంటే రేపటికి సరియైన రూపంలేదు, రేపు ఏమవుతుందో మనకు తెలియదు.. కాబట్టి ఇవ్వాళను సమర్థవంతంగా ఉపయోగించు కుంటేె, ప్రతిరోజు నీ సామర్థ్యాన్ని మెరుగు పరుస్తుంది.

వాయిదా వేస్తున్నావంటేె, నీ గురించి నువ్వు అర్థం చేసుకోవాలి. చదవాల్సిన అంశం, చాలా కఠినంగా వున్నట్టు అనిపిస్తే నీకు ఆ అంశం అవగాహన లేనట్టు, నీకు అస్సలు రాదు అని అర్థం చేసుకోవాలి.

సమయం ఎక్కువగా ఈ వాయిదాల్లో వేస్ట్‌ అవుతుందంటే నీకు, నీవు చెయ్యాల్సిన పనిమీద నైపుణ్యాలు, శ్రద్ధ పెట్టాలనే తలంపు చాలా తక్కువస్థాయిలో ఉన్నట్టు అర్థం చేసుకోవాలి.

అలా ‘పోస్ట్‌పోన్‌’ చేస్తున్న అంశాన్ని అర్థం చేసుకోవడానికి వీలయితే స్నేహితులతో చర్చించడం లేదా అధ్యాపకులను సంప్రదించి దానిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించి దానిపై పట్టు సాధించడం చెయ్యాలి. అప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ సిలబస్‌ పూర్తి చెయ్యడానికి అవకాశం దొరుకుతుంది.

పై విషయాలను అర్థం చేసుకుంటే సమయపాలన అనేది మన ఆలోచనలకు, ఉద్వేగాలకు నైపుణ్యాలకు సంబంధించిన అంశంగా అర్థం అవుతుంది. కాబట్టి వాటిని మెరుగుపరు చుకుంటే తప్పకుండా మీ సమయం మీకు అందుబాటులో వుంటుంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. విజయం మీదే. ఆల్‌ ది బెస్ట్‌.

డాక్టర్‌ వీరేందర్‌

Other Updates