district-head-quartersసీఎం ఆదేశం

అన్ని జిల్లా కేంద్రాల్లో సమీకృతజిల్లా కార్యాలయాల సముదాయాలు, జిల్లా పోలీస్‌ కార్యాలయాలు నిర్మించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. వెంటనే డిజైన్లు ఖరారుచేసి టెండర్లు పిలవాలని, ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తి చేయాలని కోరారు. ప్రజలు, అధికారులకు సౌకర్యంగా ఉండేవిధంగా అన్ని వసతులతో కార్యాలయాలుండాలని సీఎం చెప్పారు. సంగారెడ్డి, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన కలెక్టరేట్లు కొత్తగా నిర్మించినందున, వాటి స్థానంలో కొత్త కార్యాలయాలు అవసరం లేదని సీఎం స్పష్టంగా చెప్పారు. మిగతా 28 జిల్లా కేంద్రాల్లో జిల్లా కార్యాలయాలు నిర్మించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ బడ్జెట్లోనే నిధులు కేటాయిస్తామని, ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తి కావాలని ఆదేశించారు.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాల నిర్మాణాలపై జనవరి 19న ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, మిషన్‌ భగీరథ వైస్‌ ఛైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్పీ సింగ్‌, సీనియర్‌ అధికారులు సునీల్‌శర్మ, రామకృష్ణారావు, శాంతకుమారి, స్మితా సభర్వాల్‌, గణపతిరెడ్డి, సురేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, మర్రి జనార్ధన్‌రెడ్డి, ఆరూరి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు సౌకర్యం, అధికార వికేంద్రీకరణ లక్ష్యాలతో తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని, పాలనా కార్యకలాపాలు సమర్థవంతంగా జరుగాలంటే మంచి కార్యాలయాలు కూడా చాలా అవసరమని సీఎం చెప్పారు. జిల్లా కేంద్రాల్లో పోలీస్‌, ఫైర్‌ కార్యాలయాలు తప్ప మిగతా కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండేలా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలు నిర్మించాలని సీఎం చెప్పారు. భవిష్యత్‌ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని కార్యాలయాలు డిజైన్‌ చేయాలని సూచించారు. ఆర్‌ అండ్‌ బీ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన డిజైన్లను సీఎం పరిశీలించారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు, పని చేసే అధికారులకు సౌకర్యంగా ఉండాలని, వివిధ సందర్భాల్లో సమావేశాలు, స్టేట్‌ ఫెస్టివల్స్‌, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనువుగా ఉండాలని ఆదేశించారు.

ముఖ్యమంత్రి, మంత్రులు జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహించడంతోపాటు, వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించడానికి వీలుగా కాన్ఫరెన్స్‌ హాలు నిర్మించాలని సీఎం ఆదేశించారు. భవన సముదాయంలోని ప్రతీ గదికి గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించే విధంగా క్రాస్‌ వెంటిలేషన్‌ ఉండాలని, పచ్చదనం ఉట్టిపడేలా ల్యాండ్‌ స్కేపింగ్‌ చేయాలని, వాకింగ్‌ ట్రాక్స్‌ ఉండాలని, ఎక్కువ వాహనాలు పట్టేవిధంగా పార్కింగ్‌ ఉండాలని సీఎం సూచించారు. అధికారులు, ఉద్యోగులు, ప్రజలకోసం టాయిలెట్లు, క్యాంటీన్లు, లంచ్‌ రూములు, బ్యాంకు, ఏటీఎం, మీ సేవా కేంద్రం, రికార్డు రూమ్‌, స్ట్రాంగ్‌ రూమ్‌, విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌, జనరేటర్‌, ఫైర్‌ స్టేషన్‌, ఎనిమల్‌ ట్రాప్స్‌ విధిగా ఉండాలని చెప్పారు. వెయ్యి మంది పట్టేవిధంగా కాన్ఫరెన్స్‌ హాలు నిర్మించాలని చెప్పారు. ప్రతీ జిల్లా కేంద్రంలో 20-25 ఎకరాల విశాల విస్తీర్ణంలో సముదాయం ఉండాలని చెప్పారు.

ప్రస్తుతమున్న అవసరాలతోపాటు భవిష్యత్తులో మరిన్ని సేవలు కూడా అందించే విధంగా ఈ కాంప్లెక్స్‌ ఉండాలని, ఇరుకిరుకుగా కాకుండా విశాలంగా నిర్మించాలని చెప్పారు. వీలైనంత త్వరగా డిజైన్లు ఖరారుచేసి, టెండర్లు పిలవాలన్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు భవన సముదాయాల నిర్మాణంకోసం అవసరమైన స్థలాలు గుర్తించారని, త్వరలోనే వాటికి లే అవుట్లు కూడా తయారు చేయాలని సీఎం చెప్పారు. సమీకృత జిల్లా కార్యాలయాలతోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో పరేడ్‌గ్రౌండ్‌తోకూడిన పోలీసు కార్యాలయాలు (డీపీవో) నిర్మించాలని సీఎం ఆదేశించారు. తమిళనాడులో డీపీవోలు బాగున్నట్లు సమాచారం ఉందని, ఉన్నతస్థాయి అధికార బృందం వెంటనే అక్కడికి వెళ్లి అధ్యయనం చేయాలని సీఎం చెప్పారు. డీజీపీ నాయకత్వంలోని బృందం తమిళనాడులో పర్యటన జరిపి, నివేదిక, డిజైన్లు ప్రభుత్వానికి అందించాలని చెప్పారు.

పోలీసులు నేర భాష మార్చుకోవాలి

జిల్లా పోలీసు కార్యాలయాల చర్చ వచ్చినప్పుడు, క్రైమ్‌ మీటింగ్స్‌ నిర్వహించుకోవడానికి కాన్ఫరెన్స్‌ హాలు కూడా ఉండాలని పోలీసు అధికారులు ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తనదైన శైలిలో వ్యంగ్యోక్తి విసిరారు. ‘పోలీసులు నేర భాష మాట్లాడితే ఎలా? ప్రతీ నెలా నిర్వహించే సమీక్షకు క్రైమ్‌ మీటింగ్‌ అని పేరు పెట్టారు. అది తప్పు. నెగెటివ్‌ సెన్స్‌లో ఉండొద్దు. క్రైమ్‌ మీటింగ్‌కు పేరు మార్చండి. ఇంకా ఇలాంటి నెగెటివ్‌ భావనలు ఉండే పదాలను కూడా మార్చండి’ అని సూచించారు.

మిషన్‌ భగీరథ పనుల్లో వేగం పెంచాలి

అధికారులు, వర్కింగ్‌ ఏజెన్సీలు సమన్వయంతో పనిచేసి మిషన్‌ భగీరథ పనుల్లో వేగం పెంచాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. గ్రామాల్లో పనులు ఆశించిన వేగంతోనే జరుగుతున్నా పట్టణ, నగర ప్రాంతాల్లో జాప్యం జరుగుతున్నదని సీఎం అభిప్రాయపడ్డారు. ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి, పనుల్లో వేగం పెంచేలా కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు.

Other Updates