telanganaరెండు వేల ఏళ్ల నాడే అతి అపూర్వమైన జీవన విధానాన్ని ప్రారంభించిన నేల ఇది.. ఈ మట్టి వాసనలోనే ఒక అనిర్వచనీయమైన మాధుర్యం ఉంది. వేదాలకు చక్కని భాష్యాలు చెప్పిన మహా పండితులను కన్న నేల ఇది. తత్త్వశాస్త్రాన్ని మధించి, సాత్విక పద్ధతిలో అర్థం చేసుకుని ప్రపంచానికి మార్గదర్శనం చేసిన మేధ తెలంగాణ.. ఇక్కడి మట్టి దిబ్బలు బౌద్ధమేధకు పసిడికొండలయ్యాయి. కొలనుపాక జైనులకు స్వర్గ ధామంగా మారిన సీమ.. అధిక్షేపం ఇక్కడి రక్తంలో ఉన్న ప్రాథమిక లక్షణం… రాచరికాన్ని ధిక్కరించే ధోరణిని సహజంగానే వంటబట్టించు కున్న మట్టి ఇది. అదే సమయంలో అన్ని రకాల తాత్త్విక ధోరణులను అందిపుచ్చుకున్న మహానుభావులు ఉన్న భూమి తెలంగాణా.. ఇక్కడ ఇల్లు, వాకిలి పట్టకుండా వెళ్లిపోయిన బైరాగులూ ఉన్నారు.. ఇల్లే వైకుంఠం అని భావించిన చార్వాకులూ ఉన్నారు.. శిల్ప సౌందర్య శాస్త్రానికి పునాది రామప్ప. మెతుకు సీమ మెదక్‌, ఏకశిలాపురి వరంగల్లు బౌద్ధ శిల్పి ఉలుల నైపుణ్యానికి నిలువెత్తు ప్రతీకలు.. బోధన్‌, వేములవాడ ఆలయాలు హైందవ ఆరాధనా వైభవ చిహ్నాలు.. కురవి, ఐనవోలు, కొండగట్టు, కీసర, మేడారం జాతరలు జానపద సుసంపన్నతకు తార్కాణాలు.. సాహిత్య వైభవానికైతే అంతే లేదు.. ఎన్నని చెప్పేది.. రెండు వేల ఏళ్ల నాటి మహత్తర చరిత్ర తెలంగాణ సాహిత్యానిది.. సాహిత్య సరస్వతి అనేక ప్రక్రియల రూపంలో ఇక్కడ ఉద్భవించి ఇతర ప్రాంతాలకు ప్రవహించింది.. ఈ గడ్డ సాహిత్యానికి పురిటిగడ్డ.. అచ్చమైన తెలుగు సారస్వత సంపదకు నిలయం. ఈ గడ్డపై వ్యాస భాగవతాన్ని తెలుగు తరాలకు అందించిన పుణ్యపేటి బమ్మెర పోతన ఒక్కడు మాత్రమే సహజకవి కాదు.. తెలంగాణ నేలలో పుట్టడమే సహజ ప్రతిభ కలిగి పుడతాడు మానవుడు… వృత్తులు, ప్రవృత్తులతో సంబంధం లేకుండా అచ్చమైన తెలుగులో, నిజమైన కావ్య సృజన చేయగల మహానుభావులు తెలంగాణ మాగాణంలో ప్రతి అణువులోనూ కనిపిస్తారు.. ఇక్కడ పుట్టింది ఒక పోతన కాదు… వేన వేల పోతన్నలు.. వారు సృష్టించింది అనంత భాగవత కవితా స్రవంతి…ఒక్కమాటలో చెప్పాలంటే.. తెలంగాణ లోని సాహితీ సాంస్కృతిక వైభవం సుసంపన్నమైన జీవన విధానాన్ని ప్రపంచానికి అందించింది.

తెలుగువాళ్లందరినీ ఒక తాటిపైకి తీసుకువచ్చి పరిపాలించింది మొట్టమొదట శాతవాహనులు. వారి రాజధాని ప్రస్తుతం మహారాష్ట్ర ఔరంగాబాద్‌ సమీపంలోని ప్రతిష్ఠానపురం. దీనికి ఆనాటి పేరు పైఠాన్‌. కొంతకాలం మాత్రమే ఇక్కడి నుంచి పరిపాలించిన శాతవాహనులకు, ఆ తరువాత కరీంనగర్‌ జిల్లాలోని కోటిలింగాల రెండో రాజధానిగా మారింది. క్రీస్తుపూర్వం 230-క్రీస్తు శకం 220 నాటి మాట ఇది. సుమారు అయిదు వందల సంవత్సరాల పాటు అద్భుతంగా సాగిన రాజ్యం ఇది. అంటే దాదాపు 2300 సంవత్సరాల క్రితమే భారత దేశంలో తెలుగు వారి సామ్రాజ్యం అఖండంగా విస్తరించింది. మన దేశంలో చంద్రగుప్త మౌర్య సామాజ్యం తరువాత అంత విస్తారంగా, స్వర్ణయుగాన్ని అనుభవించిన రాజ్యం తెలంగాణ. శాతవాహనుల రెండో రాజధానిగా గుంటూరు జిల్లాలోని ధరణికోట అలియాస్‌ ధనుష్కోటి కానీ, అమరావతి కానీ అయి ఉండవచ్చని చరిత్రకారులు అంచనా వేశారు.. ఇలా చెప్పటానికి ఎలాంటి ఆధారాలు కనిపించవు.

శాతవాహనుల తరువాత తెలుగువారందరినీ ఏకఛత్రాధి పత్యంగా పరిపాలించిన వాళ్లు కాకతీయులు.. క్రీస్తు శకం 1083 నుంచి 1323 దాకా 240 సంవత్సరాల పాటు తెలుగు దేశాన్ని ఒకటి చేసి పాలించిన వాళ్లు కాకతీయులు.. వీరి రాజధాని ఓరుగల్లు.. ఇప్పుడు అంతా చెప్పుకునే వరంగల్‌. ప్రజలకు అన్ని రంగాల్లో విశిష్టమైన సంస్కృతిని, నాగరికతను అందించిన వజ్రయుగం. విద్య, విజ్ఞాన, వైద్య రంగాల్లో నిర్మాణ రంగంలో తెలుగువారు విశ్వవ్యాప్త కీర్తిని సాధించింది కాకతీయుల కాలంలోనే. మల్లయుద్ధంలో మేటిపోటరి జగజ్జట్టీలను తయారు చేసి ప్రపంచ వ్యాప్తంగా పంపించింది ఇక్కడి నుంచే. ఆ తరువాత విష్ణుకుండినులు నల్లగొండ కేంద్రంగా అద్భుతమైన రాజ్యాన్ని నిర్మాణం చేశారు. కాకతీయుల పతనం తరువాత హరిహర రాయలు, బుక్కరాయలు, ఓరుగల్లు వారైన విద్యారణ్యుల వారి నాయకత్వంలో కర్ణాటకలోని హంపిలో విజయనగర సామ్రాజ్య నిర్మాణాన్ని చేశారు. హరిహరరాయలు, బుక్కరాయలు కాకతీయ సామ్రాజ్యం చివరలో ఇక్కడి నుంచి వెళ్లిన వారే. విజయనగర సామ్రాజ్యం తెలుగు వారి చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం గా చెప్పుకుంటారు. అంతకంటే గొప్ప వారైన కాకతీయులు, శాతవాహనులు మాత్రం కాల గర్భంలో కలిసిపోయే ప్రయ త్నం జరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి బయటపడి మన మూలాలను మనం తిరిగి నిలబెట్టుకునే అవకాశం లభించింది.

తెలంగాణ దక్కన్‌ పీఠభూమి లో ఉండటం వల్ల ఈ మూలాలు అవిచ్ఛిన్నంగా దుర్భేద్యంగా ఉండిపో యాయి. మన జీవన విధానం అంతా ఒక స్థిరమైన మార్గంలో పురోగమించటానికి కారణం కూడా పీఠభూమి కావటం వల్లనే. ఎందుకంటే ఒక ప్రదేశంలోని భౌగోళిక స్థితిగతులు అక్కడి సమాజంపైనా, వ్యక్తిగత జీవితంపైనా ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. మైదాన ప్రాంతాల్లో జీవించే వారికి, పీఠ భూముల్లో నివసించే వారికి మధ్య అంతరం ఎంతో ఉంటుంది. మైదాన ప్రాంతాల వారు లౌక్యంగా వ్యవహరిస్తారు.. హుందాగా కనిపిస్తారు.. పీఠభూమి ప్రాంత వాసులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటారు.. సూటిగా ఉంటారు. ఇక్కడ వర్షాభావ పరిస్థితులు ఎక్కువ. ప్రజలు వ్యాయామ కఠినీకృత శరీరులు కావటం కూడా ఇక్కడి జనజీవన స్రవంతిపై ప్రభావం చూపింది. అన్నింటికీ మించి మెట్ట పంటలు ఎక్కువగా పండటం వల్ల ఇక్కడి సంస్కృతిలో మట్టితో సమన్వయం అధికంగా కనిపిస్తుంది. వర్షాధార సేద్యానికి అలవాటు పడ్డవాళ్లు కాబట్టే, తెలంగాణ ప్రజలు బుద్ధి కంటే ఎక్కువగా హృదయాన్ని అభిమానించారు. ఇక్కడి సంస్కృతిలో మర్యాదలు, మన్ననలు విశిష్టంగా ఉంటాయి. కులభేదాలకు అతీతంగా ఉంటాయి. గ్రామాలకు గ్రామాలే ఒక కుటుంబంగా ఉంటాయి. చాకలి, కమ్మరి, కుమ్మరి, మంగలి, వడ్రంగి, తమ్మలి, దళిత, బేగాం, నీరడి కులాలెన్నో తెలంగాణా పల్లెల్లో మనకు కనిపిస్తాయి. వీళ్ల మధ్య అనూహ్యమైన అనుబంధాలు, బంధుత్వ పిలుపులు కనిపిస్తాయి. వినిపిస్తాయి. వారిలో ఒకరికి ఒకరు అన్న, మామ, బావ, వదిన, అక్క, ఇలా రకరకాల బంధాలు ప్రజల అనుబంధాలను పెనవేస్తాయి. ఇళ్లల్లో కూడా ఇదే రకమైన విధానం కనిపిస్తుంది. ”ఏందె నాయినా” అని పిలవటంలో ఉండే ఆత్మీయత, నాన్నగారూ… వదినగారూ.. మరిదిగారూ.. అని పిలవటంలో ఉండదు. ఎవరినైనా ఆప్యాయంగా అక్కున చేర్చుకోవటంలో కానీ, సహాయపడటంలో కానీ, తెలంగాణా ప్రజలు ముందుంటారు.. ఈ గుణం తెలంగాణ ప్రజల్లో అధికంగా ఉంటుందని సుప్రసిద్ధ పరిశోధకులు బిఎన్‌ శాస్త్రి గారు ఒక చోట వ్యాఖ్యానించారు.. దీనికి కారణం భౌగోళిక పరిస్థితులేనని ూడా ఆయన అంటారు.

మట్టిని కాదని ఇక్కడి ప్రజలు బతకలేరు.. ‘దేశమంటే మట్టి కాదోయ్‌…’ అన్న కవుల కోవలో మట్టిని విస్మరించి బతకటం ఇక్కడి ప్రజలకు చేతకాదు.. అసలు తెలంగాణ పేరులోనే మట్టి అస్తిత్వం గోచరిస్తుంది. తెలుగుల మాగాణం తెలంగాణం. అంటే తెలుగు సిరులుగా పండే భూమి అని అర్థం. అందు ఇక్కడ ప్రతి పండుగా ఆ మట్టితోనే ముడి పడి ఉంటుంది. తెలంగాణ పదసీమల్లో ప్రకృతి పరవ శించి తాండవం చేస్తుంది. దానికి ప్రతిరూపమే తెలంగాణ లో ఘనంగా జరుపుకునే పండుగ బొడ్డెమ్మ, బతుకమ్మ. దసరాకు ముందు ఇరవై రోజుల పాటు చేసుకునే పండుగలివి. మొదటి తొమ్మిది రోజులు మట్టితో బొడ్డెమ్మను చేసి పాటలు పాడుకుంటూ కన్నెపిల్లలు పండుగ చేసుకుంటే, తరువాత పూలతో జరుపుకునే పండుగ బతుకమ్మ.. దేవతకు ప్రకృతితో సమతుల్యం చేసి జరుపుకునే పండుగ ఇది. మృత్యువును తొలగించుకుని బతుకు కోసం సమస్త జీవాలకు ఆధారభూతమైన ప్రకృతిని పరవశంతో ఆరాధించే అరుదైన సంస్కృతి వేలం తెలంగాణకు మాత్రమే చెందింది. దశమహావిద్యలలో భగళ సంప్రదాయం ప్రధానమైంది. దుర్గా శక్తి రూపాలలో భగళ రూపం కూడా ఒకటి. దసరా నవరాత్రులలో దుర్గాపూజను చేస్తాం. అంతకు ముందు బతుకమ్మ రూపంలో భగళను ఆరాధిస్తాం. ఇందుకు ప్రతిరూపంగానే బతుకమ్మకు పసుపు పచ్చ అలంకారం కనిపిస్తుంది.

ప్రపంచంలో పూవులతో తొమ్మిది రోజులపాటు పండుగ జరుపుకునే సంస్కృతి ఉన్న ఏకైక జాతి తెలంగాణాయే. ఈ పండుగను ఏనాడు ఏ ప్రభుత్వాలు గుర్తించలేదు. ఇది కూడా ఓ పండుగేనా అన్న ఈసడింపులు కూడా ఎదురైన సందర్భాలు ఉన్నాయి. ఇంతకాలానికి తెలంగాణ సాకారమైన వేళ ప్రభుత్వం తొట్టతొలుత తీసుకున్న నిర్ణయం ప్రజల్లో మమేకమైన మేడారం, బోనాలు, బతుకమ్మలను రాష్ట్ర పండుగలుగా గుర్తించటం. ఇంత కాలానికి తెలంగాణ సగర్వంగా జగజ్జగేయమానంగా ఈ పర్వదినా లను జరుపుకునే అవకాశం లభించింది. తెలంగాణంలో బోనాల గురించి చెప్పనే అక్కర లేదు. రాష్ట్ర రాజధానిలో నెల రోజుల పాటు నిరంతరంగా జరిగే పండుగ బోనాలు.. అమ్మవారికి భోజనాలు పెట్టడమే బోనాలు.. హైదరాబాద్‌లో ఆషాడం వచ్చిందంటే.. బోనాల సంబరం మిన్నంటుతుంది.. విచిత్రమే మంటే.. మిగతా జాతరలన్నీ పల్లెల్లోనే జరుగుతాయి.. బోనాలు మాత్రం రాజధాని మహానగరం భాగ్యనగరంలో జరుగుతాయి.. అదే విశేషం. అలా ఇలా కాదు.. ఆషామాషీ కాదు.. ఒకరోజు రెండు రోజులు కాదు.. ఒక చోట కాదు.. ఒక గుళ్లో కాదు.. ఒక అమ్మవారు కాదు.. రాజధాని అంతటా.. భాగ్యనగరం అంతా నిండైన పసుపు కుంకుమలతో నిండు ముత్తైదువలా అలరారుతుంది. నెల రోజుల పాటు సంబరాలు చేసుకుంటుంది. వీటన్నింటికీ మించింది మేడారం. ఏజెన్సీ ప్రాంతంలో ఉండే గిరిజనులు, చెంచులు, వడ్డెరలు, గోండులు, కోయల్లాంటి అనేక తెగల వాళ్లకు ఇది అపురూపమైన సంబరం.. గిరిజనులు, ఆదివాసీల పుట్టతేనంత చక్కని తీర్థం మేడారం.

ఎందుకంటే ఇక్కడ సహ స్రాబ్దుల నుంచి కూడా సన్మతముల సమాన వ్యాప్తి ఉంది. శక్తి, శివ, విష్ణు, బౌద్ధ, జైన, ఇస్లాం… ఇలా అన్ని మతాలు తెలంగాణ సమాజంలో కలగలసిపోయినవి. భారతదేశంలో ఎక్కడైనా నిజమైన సెక్యులరిజం విలసిల్లుతున్నదంటే.. అది తెలంగాణం లోనే. వీరశైవం ప్రబలంగా ఉన్న కాలంలోనూ ఇతర మత సంప్రదాయాలకు ఇక్కడ ఎలాంటి విఘాతం కలగలేదు. ఇక్కడ సూర్యుణ్ణి కూడా పూజించే సంప్రదాయం ఉంది. వరంగల్లు లోని వేయి స్తంభాల త్రికూటాలయంలో ఒక ఆలయం సూర్య దేవాలయం ఉంది. ఈ మత సంప్రదాయాల ద్వారా ప్రజల అస్తిత్వం సురక్షితంగా నిలబడింది. సాంస్కృతికమైన అణచివేతకు నిశ్శబ్దమైన ప్రతిఘటన కొనసాగింది. శైవము, వైష్ణవము, అచల సంప్రదాయము తమ గురువుల ద్వారా గ్రామగ్రామాలకు విస్తరించాయి. అంతర్గతంగా అస్తిత్వానికి చేటు రాకుండా, సామాన్య ప్రజలలో ధార్మిక విశ్వాసాలను నిలబెట్టడం జరిగింది.. ఈ మూడు ధర్మాలు అన్ని తరగతుల వారిలోకి వెళ్లి ధర్మ ప్రబోధం చేయటం గమనించాలి. శైవ వైష్ణవాలు వైదిక మార్గానికి అతీతంగా కులభేదాలను తిరస్కరించి సమాజంలో ఏకతను స్థాపించాయి. అచల సంప్రదాయము విగ్రహారాధనలతో నిమిత్తం లేని రాజయోగ సంప్రదాయాన్ని వ్యాప్తిలోకి తెచ్చాయి. ఈ మూడు సంప్రదాయాలు సంకీర్తనల ద్వారా, భజనల ద్వారా తత్త్వాల ద్వారా సామాన్య ప్రజలలోనికి చొచ్చుకొనిపోయి, సమాజ చట్రాన్ని చెక్కు చెదరకుండా నిలబెట్టాయి. జంగాలు, సాతానులు, అచల గురువులు ఇక్కడ అగ్రవర్ణాల వారు కాకపోవటం గమనించాల్సిన విషయం. యోగ సాధన బాహ్యాడంబరాల ప్రసక్తి లేకపోవటం వల్ల శత్రువుకు కూలగొట్టవలసింది ఏమీ మిగలలేదు. కనిపించలేదు. అచల గీతాలు, కందార్థాలు, తత్త్వాలు, తిరునామాలు ఇవన్నీ పామర భాషలో గూఢమైన సంతాేలను ప్రజల్లోకి మూల తత్త్వాన్ని వ్యాప్తి చేశాయి.

(మిగతా వచ్చేసంచికలో)

Other Updates