tsmagazine
ఇగోనుల్ల! ఒక్కముచ్చట ఇనుండ్రి.
ఈ నడుమ మన గంగవ్వ నోట్లెకెల్లి రామసక్కటి మాట ఊశిపడ్డది. ”తల్లి కడుపుల పొద్దువడుతందని” పని బంజేసినం అని. ఎంత నిజానంగ ఉన్నది ఈ మాట. అంటె, పొద్దుగాల కడుపుల కెల్లి బైటవడ్డ పొద్దు పిల్ల తిరిగి తిరిగి మల్ల తల్లి కడుపుల జొచ్చిందన్నట్టు. ఇగ ”పొద్దులువడ్డయి” అంటెగూడ మీకు దెలుసుగద. పొట్టతోని ఉన్న స్త్రీమూర్తి కొద్ది రోజులలో కాన్పు (పసిద్ద అని గూడ అంటరు, ప్రసూతి నుండి వచ్చింది) కానుంది అని. ఒక రకంగ జెప్తే ”పొద్దులువడ్డయి” అంటె కౌంట్‌ డౌన్‌ అన్న మాట.

పొద్దు సుట్టు ఎన్ని ముచ్చట్లున్నయో సూడుండ్రి తెలంగాణల. పొద్దు అంటే రోజు. ”మాగిపొద్దు” జెల్దిన్నే మాయమైంది. ”పొద్దు గూట్లె వడ్డది” దీపం ముట్టియ్యిండ్రి. ”పొద్దు నెత్తిమీదికచ్చింది” లెవ్వు కొడుకా!. ”పొద్దెక్కింది”, ”పొద్దువోతంది”పాండ్రి. ”పొద్దు వొడిశినంక” వోయి గిప్పుడా అచ్చేది. ”ఆల్ల పొద్దుగాల” ఇంటికి వోవాలె. ”పొద్దుగూకింది” పొల్ల ఇంక రాకపాయే.

యాల్ల అంటే వేళ దాని సుట్టు గూడ ఎన్ని ముచ్చట్లున్నయి ఇనుండ్రి. ”మస్కుల”(మసక వేళ) నే లేశి తంగేడు పువ్వు తెంప వోవాలె. ”ఎసర్లాల్ల” అయింది ఇంక తానమే జెయ్యలేదా!, ”ఎండుగులాల్ల” కు రాపో!,”గైర్యాల్ల” వచ్చినవ్‌ నేనేం బెట్టాలే. ”అంబటాల్ల”య్యింది పోరడు ఇంక ఇంటికి రాకపాయే. ”గోజల యాల్ల”, ”పసులాల్ల” ఎటు తిరుగవోకు పిలగా…

అట్లనే తెల్లారుడు అనేదానికి గూడ ఎన్ని మాటలున్నయో ఇనుండ్రి….

తెల్లారంగ, ఎగిలివారంగ, సుక్కపొద్దువొడువంగ, గోరుకొయ్యలు వొడువంగ, మస్కుల, మబ్బుల,పొద్దుంజాముల, ఆల్ల పొద్దుగాల, మాయిల్లమే, ఎల్లెమే… తెల్లవారుడు అంటే ఎరికే గద పొద్దు గూట్లె కెళ్ళి బైటి కచ్చి తెల్లటి కిరణాలు భూమి మీద ఉన్న అన్నిటి మీద పారుడు. ఈ పారుడు ఎన్నో మాటలల్ల ఉన్నదే. పొగవారుడు, నీళ్ళు వారిచ్చుడు, పారిపోవుడు గిట్ల.

ఇగ ఎగిలివారంగ ఎంత పాన మసొంటి ముచ్చట. ఎలుగు పారంగ అనేది ఎగిలివారంగ అయింది. పారువం అనేది పావురం ఐనట్టు, పలుగుడు అనేది పగులుడు అయినట్టు. ఎలుగు పారుడు అంటెనే మనుసంత కలికలి ఐతలేదా!

సుక్కపొద్దు పొడువంగ గూడ గట్లనే అసలు పొద్దు కంటె ముందుగాల పొడిసేటిది సుక్క పొద్దు. ఇది ఆ పొడుసుడు గాదు. నెలపొడుపు, పొద్దు పొడుపు లెక్క. ఇగ సుక్క అంటే తెలుసుగద. మొగులు మీద ధ్రువ నక్షత్రం అని ఉంటది గద. గది తెల్లారంగ తేటగ కనవడుతది. అప్పటికి ఇంక సూర్యుడు రాడు. అది సుక్కపొడుపు అన్న మాట.గోరు కొయ్యలు అంటే గొర్రు కొయ్య ఆకారంల కనవడే మూడు సుక్కలు. ఇవ్వి గూడ తెల్లారక ముందే కనవడుతయి. ఇగ పొడుసుడంటే యాదికచ్చింది గద.మస్కుల అంటే మసక వేళ. అంటే ఇంక శీకటి పురాగ పోక ముందే. కండ్లు

మసుకు మసుకు అనిపిస్తున్నయ్‌ అంటే గదే గద. మబ్బుల అంటే మబ్బు మొకం బెట్టకుండ్రి. తెలంగాణల ఒక్కలు గూడ మేఘాలు అనరు. ఆకాశాన్ని మొగులు అంటరు. మేఘాలను మబ్బులు అంటరు. మబ్బులనే అంటే పొద్దుగాల లేస్తే ఏం గనిపిస్తయి గా మబ్బులే గద. ఈనికి మబ్బు బాగున్నది అంటే గదే గద. ఈని పెయ్యి ఇంక ఎలుగుతలేదు, దమాక్‌ చలనంలకు రాలేదు అనే గద.

పొద్దుంజాము అంటే పొద్దున జాము, మాపటి జాము, రాత్రి జాము గూడ ఉన్నది గద. శాస్త్ర ప్రకారం ఉదయం 6 నుంచి 10 దాక పూర్వాహ్ణం అదేనుల్ల పొద్దటిజాము. 10 నుంచి 2 దాక మధ్యాహ్నం అదే పగటి జాము. 2 నుంచి 6 దాక అపరాహ్ణం అదే మూడో జాము. ఇవ్వే రాత్రి పూట గూడ నడుస్తయి. వీడు జాము(జాం) మనిషి అంటే కూసున్న కాన్నుంచి నాలుగు గంటలు కదులడన్న మాట. ఆల్ల పొద్దుగాల్ల అంటే శీకటి వడకముందే అని. బహుశా ఆవుల పొద్దు వేళ గావచ్చుఅంటే గోజలు ఇంటికి అచ్చె యాల్లకు అన్నమాట. మా యిల్లమే అనే ముచ్చట సినారె సారు గూడ రాసిండు. ఇది మహా వైళమె అట. వైళము అనగా సమయమని, వెంటనే అని అర్థాలున్నయి. మాయిల్లమే అంటే తొందరగనే, జెల్దిన్నే (జల్ది ఉర్దూ), ఎల్లెమే అనే దాన్ల మా ఎగిరి పోయింది. ఎల్లెమే అంటే తొందరగ అనే కద. మా వచ్చినవ్‌ తియ్‌, మా సూశినవ్‌ తియ్‌, మా శెప్పినవ్‌ తియ్‌ అంటే మహా అనేదే మాగా మారింది గద.

ఇట్ల తెలంగాణల కాలమానం మస్తున్నది. శాన అందంగ ఉన్నది. నిండారుగ ఉన్నది.

బూర్ల వెంకటేశ్వర్లు

Other Updates