soudeeనూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం.. విద్య, వైద్య తదితర రంగాల్లో సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు పోతున్నదని, ముఖ్యంగా మైనార్టీల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధను తీసుకుంటున్నదని తెలుసుకోవడం తమకు సంతోషంగా వున్నదని సౌది అరేబియా అంబాసిడర్‌ డా.సౌద్‌ మహమ్మద్‌ అల్సతి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తెలిపారు. నూతన తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో తామూ భాగస్వామ్యం పంచుకుంటామని అందుకు సంబంధించి పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధమని సౌదీ అంబాసిడర్‌ ముఖ్యమంత్రికి వివరించారు.

సౌదీ ప్రభుత్వ సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక వ్యవహారాల ప్రతినిధులతో కలిసి డిప్యుటి సీఎం మహమూద్‌ అలి ఆధ్వర్యంలో అక్టోబర్‌ 22న క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో సౌదీ అంబాసిడర్‌ మహ్మద్‌ అల్‌ సతి భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సీఎం కేసిఆర్‌ మాట్లాడుతూ… హైదరాబాదీ సాంస్కృతిక వారసత్వం సౌదీ అరేబియా సంస్కృతితో ముడిపడి వున్నదన్నారు. తెలంగాణ నుంచి వెళ్లే హజ్‌ యాత్రికుల సౌకర్యార్దం అప్పటి ఆరో నిజాం మహబూబ్‌ అలీ పాషా సౌదీలోని కాబా కు సమీపంలో.. రుబాత్‌ (వసతి గృహం)ను నిర్మించిన విషయాన్ని సీఎం వారికి గుర్తు చేశారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన హజ్‌ యాత్రికులను సౌదీ వారు ”అల్లా అతిథులు” అని పిలుస్తారని, అట్లా పిలవడం తెలంగాణకు సౌదీ ప్రజలిచ్చే గౌరవంగా భావిస్తున్నామని సీఎం తెలిపారు. ఇది ప్రపపంచంలో మరెవరికీ దక్కని గౌరవమని అన్నారు. సౌదీతో నాటి నిజాం కాలం నుంచి తెలంగాణ ప్రజలకు సత్సంబంధాలున్నాయన్నారు.

హైదరాబాద్‌ కేంద్రంగా సౌదీ అరేబియా కాన్సులేట్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారు. అయితే హైదారాబాద్‌ లో తమ కాన్సులేట్‌ బాగుంటుందని తామూ భావిస్తున్నట్టు సౌదీ అంబాసిడర్‌ సీఎంకు తెలిపారు. ఆమేరకు తమ ప్రయత్నాలు కొనసాగుతున్నయన్నారు.

తెలంగాణ జిల్లాలనుంచి దాదాపు మూడు లక్షలకు పైగా సౌదీలో నివసిస్తున్నారని ఈ సందర్భంగా సీఎం అన్నారు. గత హైదరాబాద్‌ స్టేట్‌కు సంబంధించిన వివిధ ప్రాంతాలనుంచి కూడా సౌదీలో నివసిస్తున్నారని, హైదరాబాద్‌ కేంద్రంగా వారి రాకపోకలు సాగుతున్నందున వారందరికి కాన్సులేట్‌ అందుబాటులో వుంటుందని అన్నారు. సౌదీలో నివసిస్తున్న తెలంగాణ వాసులు అకస్మాత్తుగా మరణిస్తే పార్థివ దేహాలను అంతిమ సంస్కారాల కోసం తీసుకురావడానికి ఇబ్బందిగా మారిందని ఈ విషయంలో తక్షణ చర్యలు చేపట్టాల్సి ఉందని సీఎం అన్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసిఆర్‌ సౌదీ అంబాసిడర్‌ అల్సతీకి వివరించారు.

అనాదిగా సాగుతున్న పాత దోస్తాన్‌ను పునరుజ్జీవింప చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా వుందని తెలిపిన సీఎం, సౌదీతో తెలంగాణకు సంబంధాలు మరింతగా బలపడేందుకు వ్యాపార రంగంలో పెట్టుబడులు ఎంతగానో ఉపకరిస్తాయని తెలిపారు.

అనతి కాలంలోనే మానవాభివృద్ధి రంగంలో తెలంగాణ దూసుకుపోతున్నదనే విషయం తమకు అర్థమయిందని అల్సతీ సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే అంశం పై ప్రభుత్వ, ప్రయివేటు కమర్షియల్‌ రంగ నిపుణులతో సిఐఐలో సమావేశమయిన తాము తెలంగాణ ఆర్ధికాభివద్ధి గురించి తెలుసుకున్నామని అన్నారు. తమ ప్రభుత్వం ఇప్పటికే తమ ఫైనాన్స్‌, కమర్షియల్‌ మంత్రిత్వ శాఖల అధికారులను తెలంగాణలో పెట్టుబడులు పెట్టే దిశగా కసరత్తు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసిందని సీఎంకు సౌదీ అంబాసిడర్‌ తెలిపారు.

తెలంగాణ ఇండస్ట్రియల్‌ పాలసీని సౌదీ ప్రతినిధులకు ఈ సందర్భంగా వివరించిన ముఖ్యమంత్రి, తెలంగాణ అనుసరిస్తున్న పారిశ్రామిక విధానం ప్రపంచంలోనే అత్యుత్తమయిందిగా తెలిపారు. రాష్ట్రంలో మైనారిటీల కోసం ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను సౌదీ అంబాసిడర్‌కు సీఎం వివరించారు. ఈ మేరకు సంతృప్తి వ్యక్తం చేసిన అల్సతి…తమ దేశం కూడా భారత యువత విద్యాభ్యాసం కోసం 460 స్కాలర్‌ షిప్పులను మతానికి అతీతంగా అందిస్తున్నదని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ తో పాటు టిఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు, ఎసిబి డిజి ఎ.కె.ఖాన్‌, ఎమ్మెల్సీ సలీం, మైనారిటీ వెల్ఫేర్‌ సెక్రటరీ ఉమర్‌ జలీల్‌, సౌదీ అరేబియా ప్రభుత్వ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Other Updates