t-hubప్రపంచవ్యాప్తంగా పలు దేశాల భద్రతాదళాలు, భారత్‌, అమెరికాలతో సహా అపాచీ హెలికాప్టర్‌లను ఉపయోగిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా రక్షణ రంగంలో వీటికి ఎంతో ప్రాధాన్యం ఉంది. రక్షణ రంగంలో ఇంతటి ప్రబల ప్రాధాన్యాన్ని సంతరించుకున్న అపాచీ హెలికాప్టర్లకు సంబంధించిన ప్రధాన విడిభాగాల తయారీ కేంద్రానికి హైదరాబాద్‌ను ఆనుకొని ఉన్న ఆదిభట్లలో పునాది పడింది. ఈ తయారీ కేంద్రం అందుబాటులోకి వస్తే ప్రపంచంలో ఎహెచ్‌ – 64 అపాచీ హెలికాప్టర్ల ఫ్యూస్‌లేజ్‌లను తయారు చేసే ఏకైక యూనిట్‌ ఇదే అవుతుంది.

తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తం చేయగల ఏరోస్పేస్‌ పార్క్‌కు రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ జూన్‌ 18న శంకుస్థాపన చేశారు. ఈ పార్కును టాటా – బోయింగ్‌ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్నాయి. ఈ సందర్భంగా మంత్రి పారికర్‌ మాట్లాడుతూ… ఏరోస్పేస్‌, రక్షణ ఉత్పత్తుల తయారీలో మన దేశ సామర్థ్యం మరింతగా వృద్ధి చెందడానికి టీబీఏఎల్‌ అత్యంత కీలకమలుపు అవుతుందని అన్నారు. రక్షణ రంగంలో మేకిన్‌ ఇండియా పురోగతికి ఇదో ఉదాహరణ. అపాచీ హెలికాప్టర్లకు సంబంధించిన ప్రధాన విడిభాగాల తయారీ కేంద్రం ద్వారా నైపుణ్యాలు పెరగడంతో పాటు ఎన్నో ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐటి, భారీ పరిశ్రమలశాఖా మంత్రి కేటిఆర్‌ మాట్లాడుతూ… టాటా-బోయింగ్‌ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. విమానాలు, హెలికాప్లర్ల విడిభాగాల తయారీ కేంద్రంగా హైదరాబాద్‌ ఉండడం వల్ల తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తం అవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకే టిఎస్‌ఐపాస్‌ను రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిందని, అపాచీ హెలీకాప్టర్ల విడిభాగాలను తెలంగాణలో తయారుచేసి ప్రపంచానికి అందించడం గర్వంగా ఉందని అన్నారు. హైదరాబాద్‌ నగరంలో డిఫెన్స్‌ రంగానికి చెందిన ఎన్నో సంస్థలు వున్నాయని అన్నారు.250కి పైగా ఇంజనీరింగ్‌ యూనిట్లతో పాటు వాటికి సహకారాలందించే అనేక యూనిట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. వీటితో పాటు 358 ఇంజనీరింగ్‌ కాలేజీలు, 500 పైగా పాలిటెక్నిక్‌ కాలేజీలు వున్నాయని తెలిపారు. స్కిల్డ్‌ మ్యాన్‌ ఫోర్స్‌ భారీ స్థాయిలో నిక్షిప్తమై ఉందని తెలియజేశారు.

అనేక సంస్థలు ఇక్కడ విస్తరణ చేయడానికి ముందుకొస్తున్నాయని, అందుకోసం కావల్సిన అన్ని సౌకర్యాలను అందుబాటులో వుంచామని వివరించారు. పరిశ్రమలు త్వరితగతిన నెలకొల్పాలనే ఉద్దేశంతోనే టిఎస్‌ఐపాస్‌ను రూపొందించామని, గడచిన 10 నెలల్లోనే 2130 సంస్థలకు అనుమతులిచ్చామని తెలియజేశారు.

అమెరికా వెళ్ళి బోయింగ్‌తో మాట్లాడి ఈ ప్రాజెక్టు ఇక్కడికి రావడానికి కేటీఆర్‌ చేసిన కృషి అభినందనీయమని బోయింగ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ ప్రత్యూష్‌ కుమార్‌ తెలిపారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత రక్షణ మంత్రి పారికర్‌ టి – హబ్‌ను సందర్శించారు.

టి హబ్‌ సందర్శన : ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావుతో కలిసి గచ్చిబౌలిలోని టి-హబ్‌ ని సందర్శించిన మంత్రి పారికర్‌ తెలంగాణ ప్రభుత్వం మీద ప్రశంసల జల్లు కురింపించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను, పాలసీలను ప్రశంసించారు. తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌ అలోచనలను ఆయన మెచ్చుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఐటి, పరిశ్రమల పాలసీలలోని విధానాలను, అదర్శవంతమైనవిగా పేర్కొన్నారు. టి-హబ్‌ లో పర్యటించిన పారికర్‌ అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. టి-హబ్‌ లోని స్టార్ట్‌అప్‌ కంపెనీలతో ముచ్చటించారు. ముఖ్యంగా డిఫెన్స్‌ రంగంలో పనిచేస్తున్న స్టార్ట్‌ అప్స్‌ తో మాట్లాడిన ఆయన వారికి పలు సలహాలు ఇచ్చారు.

తర్వాత టి-హబ్‌ లోని స్టార్ట్స్‌, నిపుణులను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టి హబ్‌ కార్యక్రమం అద్భుతమైనదిగా తెలిపారు. మంత్రి కెటిఆర్‌ అలోచనల మేరకి ఈ కార్యక్రమం చేపట్టిన తీరు అయన నాయకత్వ ప్రతిభకి అద్దం పడుతుందన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం క్లారీటితో ముందుకు పోతుందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధానాలు పెట్టుబడులను అకర్షించేవిగా ఉన్నాయన్నారు. తాను అకర్షనీయమైన మాటలు చెప్పడం సుళువని కానీ వాటిని అచరణలో చూపడం కష్టం అన్నారు. అన్నం ఉడికిందో లేదో తెలసుకునేందుకు ఒక్క మెతుకు ముట్టి చూసిన తీరుగా తెలంగాణకి వస్తున్న పెట్టుబడులు చూస్తే ప్రభు త్వ పాలసీలు విజయవంతం అయినట్టుగా చెప్పవచ్చన్నారు.

టిహబ్‌ కారక్యక్రమాన్ని మెచ్చుకున్న మంత్రి ఇక్కడ ఉత్సాహం, సృజనాత్మకత కలిగిన యువకులున్నారని, ఇలాంటి అలోచనలకి ఊతం ఇవ్వడం మంచి పరిణామం అన్నారు. ప్రతి ఒక్కరు కలలు కనేందుకు మంచిగా నిద్రపోతారని కానీ, ఆ కలలను నిజం చేసేకునేందుకు ఉదయాన్నే లేచి అచరణ కోసం పని ప్రారంభించేవారు తక్కువగా ఉంటారని , అలాంటి వ్యక్తులు మంత్రి కెటిఆర్‌ టీంలో ఉన్నారని మెచ్చుకున్నారు. టెక్నాలజీ వల్ల ప్రజల జీవితాల్లో వెలుగులు వస్తాయన్నది తన నమ్మకమని, అయితే అలాంటి టెక్నాలజీని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో ఐటి శాఖ జయేష్‌ రంజన్‌, టిహబ్‌ సియివో జే క్రిష్ణన్‌, ఇతర ప్రభుత్వాధికారులున్నారు.

Other Updates