tsmagazine
శ్రీధర్‌ రావు దేశపాండే
దేశంలోనే అత్యధిక చెరువులున్న ప్రాంతం తెలంగాణ. తెలంగాణలో చెరువులు లేని గ్రామాలు లేవంటే అతిశయోక్తి కాదు.ఒకటి కంటె ఎక్కువ చెరువులు ఉన్న ఊర్లు ఎన్నో. ఒక ఊరి నుంచి మరో ఊరికి , ఒక చెరువునుంచి మరో చెరువుకి నీరు ప్రవహించే గొలుసు కట్టు చెరువుల నిర్మాణం తెలంగాణలో అనాదిగా ఉన్న వ్యవస్థ. ఇంత పెద్ద సంఖ్యలో చెరువుల నిర్మాణం తెలంగాణలో ఎందుకు సాధ్యమైంది?

తెలంగాణాలో వ్యవసాయ విస్తరణకు చెరువు నిర్మాణం అనివార్యమైంది అని చెప్పాలి. వాగుకు ఎగువన గ్రామాల పొందిక, వాగుపై చెరువు నిర్మాణం, చెరువు కింద వ్యవసాయం, చెరువు చుట్టూ ఒక సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక వికాసం తెలంగాణలో సాధ్యపడింది అంటే దానికి కారణం, తెలంగాణ ప్రాంత భౌగోళిక స్థితిగతులు దోహదం చేసినాయి. దక్కన్‌ పీఠభూమి మధ్యలో తెలంగాణ ఉన్నది. పీఠభూమి కనుక ఎత్తుపల్లాలు, కొండలు, గుట్టలు, వాటి నుంచి వాగులు, వంకలు పుట్టి దిగువకు ప్రవహించి, నదులుగా మారి సముద్రానికి దారిని వెతుక్కున్నాయి. తెలంగాణకు తలాపున గోదావరి, కాళ్ళ కట్టుకు కృష్ణా నదులు ప్రవహిస్తున్నాయి. గోదావరి ఉప నదులు పెన్‌ గంగ , కడం, స్వర్ణ, మానేరు, ప్రాణహిత, వైరా,కిన్నెరసాని, కృష్ణా ఉపనదులు మూసీ, పాలేరు, మున్నేరు, డిండీలు కూడా తెలంగాణా నేలపై ప్రవహిస్తున్నాయి.

అయితే తెలంగాణ బౌగోళికత కారణంగా అవి తక్కువ ఎత్తులో ప్రవహించడం , వ్యవసాయ యోగ్యమైన భూములు సముద్ర మట్టానికి 300 మీటర్ల నుండి 620 మీటర్ల ఎగువన ఉండడంతో గోదావరి, కృష్ణా నదులను వినియోగించుకోవడం ఆనాటికి సాధ్యపడే విషయం కాదు. సముద్రానికి దగ్గరగా సమతల ప్రాంతానికి చేరిన తర్వాత విశాలమై ఒండ్రు మట్టిని మేట వేసి సముద్రంలో కలిసినాయి. అందువలన గోదావరి , కృష్ణానదుల నీటిని తొలుత వినియోగించుకునే వెసులుబాటు కోస్తా తీర ప్రాంత వాసులకు ఎర్పడింది.
tsmagazine

అయితే తెలంగాణదక్కన్‌ భౌగోళికతను వ్యవసాయ విస్తరణకు అనుకూలంగా మలుచుకోవడంలో అద్భుతమైన నిర్మాణ కౌశలాన్ని ప్రదర్శించినారు ఇక్కడి భూమిపుత్రులు. తెలంగాణలో చెరువుల నిర్మాణం శాతవాహనుల కాలం కంటే ముందు నుంచే కొనసాగిస్తున్నట్లు చారిత్రిక ఆధా రాలు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో పురావస్తు శాఖ తవ్వ కాలలో ఈ ఆనవాళ్ళు బయటపడినాయి. ఫణిగిరి కొండ లపై నుంచి చూస్తే ఈ ఆనవాళ్ళు కనిపిస్తాయి. కాకతీయుల కాలంలో అత్యున్నత నిర్మాణ కౌశలంతో సముద్రాలని తలపించే వేలాది చెరువుల నిర్మాణం కొనసాగింది. రామప్ప, పాకాల, లక్నవరం, ఘనపురం, బయ్యారం, కమలాపూర్‌ చెరువుల కోసం ఎంపిక చేసిన స్థలం , చెరువు నిర్మాణం చేసిన పద్దతి, చెరువు నిర్మాణం కోసం తీసుకున్న బిల్డింగ్‌ మెటీరియల్‌ని పరిశీలిస్తే చెరువుల నిర్మాణం ఎంత శాస్త్రీయ పద్దతిలో జరిగిందో తెలుస్తుంది.13 వ శతాబ్దంలో నిర్మాణం అయినా కూడా ఇన్నేండ్ల తర్వాత చెక్కు చెదరకుండా రైతాంగానికి సేవలు అందిస్తున్నాయి.

కాకతీయుల కాలంలో వ్యవసాయ విస్తరణ ఉధతంగా సాగింది. రాజ్య ఖజానాకు వ్యవసాయం ద్వారా ఆదాయం పెరిగింది. రాజ్యం ఆర్ధికంగా బలోపేతం అయ్యింది. శత్రు దుర్భేద్యమైన కోటల నిర్మాణం, శిల్ప సౌందర్యం ఉట్టిపడే ఆలయాల నిర్మాణం సాధ్యపడిందంటే అదంతా చెరువుల కింద సాగిన వ్యవసాయం వల్ల ఉత్పన్నమైన సంపద వల్లనే.

ఈ వారసత్వాన్ని కాకతీయుల అనంతరం దక్కన్‌ని పాలించిన రాజ వంశాలు కొనసాగించినాయి. కుతుబ్‌ షాహీలు , అసఫ్‌ జాహీలు , స్థానిక ప్రభువులు , సంస్థానాధీశులు అందరూ చెరువుల నిర్మాణాన్ని ప్రొత్సహించి కొనసాగించారు. ఆదిలాబాద్‌ జిల్లాలో నిర్మల్‌ పట్టణాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేసిన నిమ్మరాజులు నిర్మల్‌ ప్రాంతంలో 32 చెరువులని కలుపుతూ గొలుసుకట్టు చెరువులను నిర్మించడం ఒక అద్భుతం.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో సంస్థానాధీశులు కూడా సముద్రాలను తలపించే సప్త సముద్రాలను నిర్మించారు. పటాన్‌ చెరువు , హుస్సేన్‌ సాగర్‌, ఇబ్రాహింపట్నం, ఉదయ సముద్రం.. ఇటువంటి చెరువులు తెలంగాణలో వేల సంఖ్యలో ఉన్నాయి. ఏడవ నిజాం ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా ఎదగడానికి తెలంగాణలోని చెరువులే కారణం. ఈ వేలాది చెరువుల కారణంగా హైదరాబాద్‌ రాజ్యం దేశంలోనే సంపన్నరాజ్యంగా ఎదిగింది. మెట్ట ప్రాంతమైనా తెలంగాణలో వేలాది చెరువులు ఉన్న కారణంగా కరువులు అరుదుగానే సంభవించేవి. చెరువులు తెలంగాణలో సాంస్కృతిక వికాసానికి అధరువులుగా ఉన్నాయి.

ప్రపంచంలో ఎక్కడా లేని పూలపండుగ బతుకమ్మ ఆవిర్భావానికి చెరువులే కారణమని ఇప్పటికే బతుకమ్మపై పరిశోధనలు చేసినవారు తేల్చినారు. తెలంగాణకు ఒక ప్రత్యేక భాషా సాంస్కృతిక అస్తిత్వం ఎర్పడడానికి చెరువులే కారణమైనాయి. ఈ రకంగా తెలంగాణ జీవన గతికి చెరువుకి ఇంత అవినాభావ సంబందం ఉన్నది.

హైదరాబాద్‌ రాజ్యం భారత యూనియన్‌ లో విలీనం అయ్యే నాటికి తెలంగాణలో 40,850చిన్నా పెద్ద చెరువులు , కుంటలు ఉండేవని రెవెన్యూ రికార్డులు ద్వారా తెలుస్తున్నది . వీటిలో అత్యధిక చెరువులు గత శతాబ్దాలలో నిర్మించినవి. వీటిలో సుమారు 20,500 ల కుంటలు 10 ఎకరాలకు నీరందించేవి, సుమారు13,200 ల చెరువులు 10 నుండి 50 ఎకరాలకు నీరందించేవి,సుమారు 4,200 ల చెరువులు 50 నుండి 100 ఎకరాలకు నీరందించేవి, సుమారు 2000 చెరువులు 100 నుండి 200 ఎకరాలకు నీరందించేవి, సుమారు 950 చెరువులు 200 ఎకరాలకు పైబడి సాగుకి నీరందించేవి ఉన్నాయి. వీటి కింద 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని రెవెన్యు రికార్డులు చెబుతున్నాయి.

ఈ చెరువులు, కుంటలను నిజాం ప్రభుత్వంలోని అమీర్లు, జాగిర్దార్లు, దేశ్‌ముఖ్‌లు, ఇనాందార్లు నిర్వహించే వారు. భూమి శిస్తు వసూలు చేసేవారు. ఇదంతా జరగడానికి వందల సంవత్సరాల కాలం పట్టింది.

పాలనా సంస్కరణలు-సాగునీటి రంగం:
కుతుబ్‌షాహీల పరిపాలన అంతంఅయి అసఫ్‌ జాహీల పరిపాలన మొదలయ్యే నాటికి హైదరాబాద్‌ రాజ్య భూభాగాలలో తెలంగాణా ఒక ప్రధాన ప్రాంతంగా, అత్య ధిక ఆదాయ వనరులు రాజ్య ఖజానాకు అందించే ప్రాం తంగా ఎదిగింది. అందుకు ప్రధాన చోదక శక్తి ఇంతకు ముందు చెప్పినట్లు తెలంగాణలో నిర్మాణం అయి ఉన్న చెరువులు. ఆరవ నిజాం మీర్‌మహబూబ్‌ అలీ పాలనా కాలంలో హైదరాబాద్‌ రాజ్యంలో సాగునీటి ప్రాజెక్టుల అభివృది వేగవంతమయ్యింది. హైదరాబాద్‌ రాజ్యానికి దీవాన్‌గా నియమితుడైన సర్‌ సాలార్‌ జంగ్‌-1 అనేక పాలనా సంస్క రణలు ప్రవేశపెట్టినాడు. ప్రణాళికాబద్దమైన అభివృద్ది కోసం వివిధ శాఖలను ఏర్పాటు చేసినాడు. పరిపాలనని వికేంద్రీకరించి కొత్త శాఖలను, విభాగాలను ఏర్పరచడం ఈ సంస్కరణల్లో ఒకటి.

హైదరాబాద్‌ రాజ్యంలో 1860 దశకంలో సాగునీటి రంగంలో అభివృద్ధి క్రమం మొదలయ్యిందని చెప్పవచ్చు. ఆనాటికి బ్రిటిష్‌ వారితో నిజాం రాజ్యానికి సైన్య సహకార ఒప్పందం కుదిరింది. బ్రిటిష్‌ వారి ప్రతినిధిగా రెసిడెంట్‌ హైదరాబాద్‌లో మకాం వేసినాడు. బ్రిటిష్‌ పాలనా ప్రాంతాలలో ముఖ్యంగా కోస్తా ఆంధ్రా ప్రాంతంలో కష్ణా, గోదావరీనదులపై, తమిళనాడులోకావేరీ నదిపై ఆనకట్టలు నిర్మించి డేల్టా ప్రాంతాల్లో కాలువల కింద వ్యవసాయాన్ని అభివృద్ధి చేసే క్రమం మొదలయ్యింది. బ్రిటిష్‌ ఇంజనీర్‌ సర్‌ ఆర్థర్‌ కాటన్‌ ఈ ఆనకట్టల నిర్మాణలో ప్రధాన పాత్ర పోషించిన సంగతి మనకు ఎరుకే. వారి నుంచి స్పూర్తిని పొందిన సాలార్‌ జంగ్‌ హైదరాబాద్‌ రాజ్యంలో కూడా సాగునీటి రంగంలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని సాధించాలని ఆశించినాడు. తొలు త 1868 లోరెవెన్యూ శాఖ అదీ óనంలో ఇర్రిగేషన్‌ బోర్డుని ఏర్పాటు చేసినాడు. ఆ తర్వాత 1869లో ప్రజాపనుల శాఖ (పి.డబ్ల్యు.డి) ఏర్పాటు అయ్యింది. ఈ శాఖకు ఒక చీఫ్‌ ఇంజనీర్‌ని నియ మించారు. ప్రజా పనుల శాఖలో ప్రధానంగా ఖర్చు చెరువుల మరమ్మ తులకు, ఫీడర్‌ చానళ్ళ, పంట కాలువల మరమ్మతులకు, ఆనకట్టల మరమ్మతులకే వెచ్చించి నారు. అయితే ఈ పనులని నిర్వహించడానికి హైడ్రా లిక్స్‌లో తర్ఫీదు పొందిన ఇంజ నీర్లను కాకుండా జిల్లా ఇంజనీర్ల పేరిట ఉద్యోగులను నియమించినారు.

హైదరాబాద్‌ రాజ్యంలో సంభవిస్తున్న వరుస కరువులను ఎదుర్కోవాలంటే సాగునీటి కట్టడాల నిర్మాణానికి సంబంధించి తర్ఫీదు పొందిన, నిష్ణాతులైన ఇంజనీర్ల ఆధ్వర్యంలో ఇరిగేషన్‌ బ్రాంచ్‌ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.1886లో ప్రజా పనుల శాఖలో సాగునీటి కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినారు. ఇరిగేషన్‌ బ్రాంచ్‌కి కూడా ఒక చీఫ్‌ ఇంజనీర్‌ ని నియమించినారు. ఇరిగేషన్‌ బ్రాంచ్‌ కోసం ఒక డిపార్ట్‌మెంట్‌ కోడ్‌ని కూడా రూపొందించినారు. ఖర్చు రీత్యా, ఉద్యోగుల సంఖ్య రీత్యా పి.డబ్ల్యు.డి శాఖలో ఇరిగేషన్‌ బ్రాంచ్‌ అతి పెద్ద విభాగంగా ఎదిగింది. పి.డబ్ల్యు.డి శాఖ పెట్టే ఖర్చులో ఇరిగేషన్‌ పనులపై ఖర్చు గణనీయంగా పెరుగుతూ వచ్చింది. 1867-68లో ప్రజా పనుల శాఖ పెట్టిన మొత్తం ఖర్చు రూ. 25,989లో ఇరిగేషన్‌పై ఖర్చు రూ.2,964మాత్రమే. ఇది మొత్తం ఖర్చులో 11.5 శాతం మాత్రమే.1867 నుంచి 1883 వరకు ప్రజా పనుల శాఖ చేసిన మొత్తం ఖర్చు రూ. 6,72,665 లు అయితే సాగునీటి పనులపై పెట్టిన ఖర్చు రూ.3,43,153 లు. అంటే సాగునీటిపై ఖర్చు 51 శాతానికి పెరిగింది. ఇరిగేషన్‌ విభాగం చేపట్టిన పనుల్లో కొత్త నిర్మాణాలు ఉన్నప్పటికీ చెరువుల పునరుద్దరణకు, మరమ్మతులకు అధిక ప్రాధాన్యత లభించింది. 1867-68లో ఇరిగేషన్‌ విభాగం చేపట్టినపనుల్లో మరమ్మతుల పనుల కోసం చేసిన ఖర్చు 40.3 శాతం ఉంటే, కొత్త నిర్మాణాల కోసం వెచ్చించిన సొమ్ము 25.13 శాతం ఉన్నది. ఆయకట్టు రైతుల నుంచి వస్తున్న డిమాండ్లను పరిగణనలోనికి తీసుకొని మరమ్మతులకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లుగా తెలుస్తున్నది.

tsmagazine

వరుస కరువులు రాజ్యంలో సంభవించడం, ప్రజల వలసలు బ్రిటిష్‌ పాలిత ప్రాంతాలకు పెరగడం ప్రభుత్వం గమనించింది. 1876-77లో సంభవించిన తీవ్రమైన కరువు వలన రైతుల డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోక తప్పలేదు. ప్రజల వలసలు ఆగాలంటే గ్రామాల్లోనే ఉపాధి పొందే అవకాశాలు మెరుగుపడాలి. వందల సంవత్సరాల కింద నిర్మాణం అయిన చెరువులు , కుం టలను మరమ్మతులు చేసి నీరు నిలి చేలాగా చేసి గ్రామాల్లో వ్యవసాయాన్ని పుంజుకునేలాగా చెయ్యడం అవసరం అన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. అదే సమయంలో కొత్త నిర్మాణాలని చేపట్టాలని కూడా ప్రభుత్వం భావించింది.
tsmagazine

19వ శతాబ్దం చివరి దశకాల్లో మరమ్మతులకు నోచుకున్న చెరువుల్లో హుస్సేన్‌ సాగర్‌, ఇబ్రాహింపట్నం, మీర్‌ ఆలం చెరువులు ఉన్నాయి. అనేక చెరువు లకు ఫీడర్‌ చానల్స్‌ని పునరుద్ధ్దరించినారు. మూసీ నది నీటిని హుస్సేన్‌ సాగర్‌కు మళ్ళించడానికి బల్కాపూర్‌ ఆనకట్ట నుంచి ఒక ఫీడర్‌ చానల్‌ని తవ్వినారు. మూసీ నది నీటిని ఇబ్రాహీంపట్నం చెరువుకు మళ్ళించడానికి ఫిరంగి నాలాను తవ్వినారు. సర్‌ జార్జ్‌ యూల్‌ అనే బ్రిటిష్‌ ఇంజనీర్‌ ఇబ్రహింపట్నం ఫీడర్‌ చానల్‌ సర్వే, నిర్మాణ పనులను పర్యవేక్షించిన కారణంగా ఈ నాలాను ఫిరంగినాలా అని ప్రజలు పిలిచే వారు. ఆ నాలాకు అదే పేరు ఖరారు అయ్యింది. అయితే ఫిరంగినాలా తవ్వినా కూడా ఇబ్రాహింపట్నం చెరువుకు ఆశించినంత నీరు రాలేదు. ఎగువన వరుస చెరువులు నింపుతూ చివరికి ఇబ్రాహింపట్నం చెరువుకు చేరే నీరు మూడింటిలో ఒక వంతు మాత్రమే. తర్వాతి కాలంలో ఫిరంగి నాలా ఆక్రమణలకు గురి అయి కనుమరుగు అయ్యింది. ఇబ్రాహింపట్నం చెరువు కళ తప్పింది. హైదరాబాద్‌ నగరానికి ఆనాడు తాగునీరు సరఫరా చేసే మీరాలం చెరువు కాలువ మరమ్మతులు చేపట్టి వెడల్పు చేసినారు.

Other Updates