|

అంచనాలు నిలబెట్టుకోవాలి: సి.ఎం.

anchaపెట్టుబడులకు అవకాశాలు ఉన్న ప్రాంతంగా హైదరాబాద్‌ను, తెలంగాణను ప్రపంచ వ్యాప్తంగా గుర్తిస్తున్నారని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ విధానాలు, ప్రణాళికలు, కార్యాచరణ అందుకు అనుగుణంగా ఉండాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు. క్యాంపు కార్యాలయంలో మార్చి 24న ఫార్మాసిటి, ఐటి, టెక్స్‌ టైల్‌ పార్క్‌, ఓఆర్‌ఆర్‌ల నిర్మాణం, తదితర అంశాలపై సమీక్ష జరిపారు.

ఐటి శాఖ మంత్రి కె.టి. రామారావు, సిఎంఒ ముఖ్యకార్యదర్శి ఎస్‌. నర్సింగ్‌ రావు, అదనపు ముఖ్యకార్యదర్శి శాంతికుమారి, ఐటి శాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌, సిఎం అదనపు కార్యదర్శి స్మితాసభర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో నెలకొల్పాలనుకునే ఫార్మా సిటి విషయంలో ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి ఉందని, దేశవిదేశాలకు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీలతో పాటు చిన్న చిన్న కంపెనీలు కూడా హైదరాబాద్‌లో ఫార్మా పరిశ్రమలు నెలకొల్పడానికి ముందుకు వస్తున్నాయని సిఎం చెప్పారు. ఫార్మాసిటీలో భాగంగానే నివాస ప్రాంతాలు, కామన్‌ ట్రీట్‌ మెంట్‌ ప్లాంట్లు వుండాలన్నారు. ఇతర దేశాలు, రాష్ట్రాల్లో కామన్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు ఎలా పనిచేస్తున్నాయో అధ్యయనం చేయాలని, సాలిడ్‌ వేస్ట్‌ మెనేజ్‌మెంట్‌లో వస్తున్న కొత్త ధోరణులను కూడా పరిశీలించాలని సిఎం చెప్పారు.

మానవాళికి ఔషధాల అవసరం ఎక్కువవుతున్న నేపథ్యంలో ఫార్మ పరిశ్రమ మరింత విస్తరిస్తుందని సిఎం అంచనా వేశారు. ఫార్మా కంపెనీల ఏర్పాటుకు హైదరాబాదే అనువైన ప్రాంతంగా అందరూ గుర్తించారన్నారు. పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణాన్ని తెలంగాణ ప్రభుత్వం సృష్టించిందని ప్రధానమంత్రి స్థాయి వారు కూడా మాట్లాడటం సాధారణ విషయం కాదని సిఎం అన్నారు. పరిశ్రమలు, ఐటి కంపెనీలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, సహకారాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేయాలని సిఎం చెప్పారు.

ఐటి రంగం కూడా తెలంగాణలో బాగా విస్తరిస్తున్నదని, ఐటి పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తరఫున ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని సి.ఎం. చెప్పారు. దేశవ్యాప్తంగా ఐటి పరిశ్రమల ఏర్పాటుకు బెంగళూరు, హైదరాబాద్‌ నగరాలే సరైనవని అందరూ గుర్తిస్తున్నారన్నారు. ఇటీవల సంభవించిన పెను తుఫాను ప్రభావం వల్ల చెన్నై నుంచి కూడా కొన్ని కంపెనీలు వెనక్కి మళ్లుతున్నాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్‌ నగరం తనపై ఉన్న అంచనాలు నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం తరఫున తగు చర్యలు తీసుకోవాలన్నారు.

పెట్టుబడుదారులను ప్రోత్సహించేందుకు అవసరమైన పూర్వరంగాన్ని సిద్ధం చేయాలని, ఆర్థికంగా బలంగా ఉన్న పరిస్థితిని అనుకూలంగా మార్చుకుని ఐటి రంగానికి ప్రోత్సాహం అందించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. హైదరాబాద్‌లోని జినోం వ్యాలీలో వేలకోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, టి-హబ్‌ కూడా మంచి ఫలితాలనిస్తున్నదని ప్రపంచంలోని చాలా కంపెనీలు తమ బ్యాకాఫీసును హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నాయన్నారు.

హైదరాబాద్‌ తరువాత వరంగల్‌లో కూడా ఐటి రంగం విస్తరణకు ఎక్కువ అవకాశాలున్నాయని చెప్పారు. వరంగల్‌లో అతిపెద్ద టెక్స్‌టైల్‌ పార్కు రాబోతున్నదని దీనివల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని సిఎం చెప్పారు. పరిశ్రమలు, ఫార్మా సిటి, ఐటి కంపెనీలు, టెక్స్‌టైల్‌ పార్క్‌ తదితర ఉపాధి కల్పన కార్యకలాపాల వల్ల తెలంగాణ ప్రాంతంలో ట్రాఫిక్‌ రద్దీ కూడా పెరుగుతుందని, హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లో కూడా రవాణా వ్యవస్థపై ప్రభావం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని మెరుగైన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ఎక్కడెక్కడ ఓఆర్‌ఆర్‌లు రావాలో ప్రణాళికను సిద్ధం చేయాలని సిఎం చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో వేలం ఆరు నెలల కాలంలోనే తాము పరిశ్రమ స్థాపించి ఉత్పత్తి ప్రారంభించగలిగామని ఈ ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారం వల్లనే సాధ్యమయిందని మైక్రో మ్యాక్స్‌ కంపెనీ యాజమాన్యం పేర్కొంది. ఈ మేరకు వారు పంపిన సందేశాన్ని ఐటి శాఖ మంత్రి .టి.రామారావు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రభుత్వం తెచ్చిన సరళమైన, పారదర్శకమైన పారిశ్రామిక విధానం వల్ల తాము ఎక్కడా ఒక్కరూపాయి కూడా ఖర్చు చేయకుండానే పనులు చేసుకోగలిగామన్నారు. ఉత్తరాఖండ్‌లో ఫ్లాంట్‌ ప్రారంభించడానికి రెండున్నర ఏళ్లు పడితే తెలంగాణలో కేవలం ఆరు నెలల్లో పూర్తయిందన్నారు.