| |

అండగా ఉంటాం.. ఆత్మహత్యలు వద్దు..

అండగా ఉంటాం.. ఆత్మహత్యులు వద్దు..a‘అన్నదాతలెవరూ ఉసురుతీసుకోవద్దు. తెలంగాణను తెచ్చుకొంది ఆత్మహత్యలు చూడ్డానికి కాదు. మీకు అన్ని విధాల అండగా ఉంటాం. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతీయ వివక్ష, 58 ఏళ్ళుగా జరిగిన అన్యాయాలే ఆత్మహత్యలకు కారణం. ఆత్మహత్యలు దేశమంతటా జరుగుతున్నాయి. వీటి నివారణకు దీర్ఘకాలిక చర్యలు అవసరం. సమస్య మూలాల్లోకి వెళ్ళాలంటూ రైతు ఆత్మహత్యలపై రాష్ట్ర హైకోర్టు చక్కటి సలహా ఇచ్చింది. దానిని స్వాగతిస్తున్నాం. రైతు రుణాలను ఒకేసారి మాఫీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. వడ్డీ వ్యాపారుల నియంత్రణ చట్టం తెస్తాం. ఏటా 25వేల కోట్ల రూపాయల చొప్పున వచ్చే మూడేళ్ళు నీటి పారుదల రంగం అభివృద్ధికి నిధులు వెచ్చిస్తాం”. అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శాసనసభలో ప్రకటించారు.

‘రుతుపవనాల వైఫల్యం-రైతుల సంక్షేమం’ పై శాసనసభలో రెండు రోజులపాటు జరిగిన సుదీర్ఘ చర్చకు సెప్టెంబరు 29న ఆయన సమాధానమిస్తూ, ప్రతిపక్షాలు లేవనెత్తిన పలు ప్రశ్నలకు సుదీర్ఘ జవాబు చెప్పారు. రైతు సమస్యల నివారణకు స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక పరిష్కార చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాల నుంచి నిర్మాణాత్మకమైన సలహాలు వస్తాయని ఆశించానని, కానీ తనకు నిరాశే మిగిలిందని అన్నారు.

ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రసంగిస్తూ…

రైతుల ఆత్మహత్యలపై ఒకరు హైకోర్టులో పిల్‌ వేస్తే, కోర్టు ఉపశమన చర్యలు కాదని మూలాల్లోకి వెళ్ళి ఏం చేస్తారో తెలియచేయాలని ఆదేశించింది. మనం తాత్కాలిక పరిష్కార మార్గాలు వెదకకుండా శాశ్వత పరిష్కార మార్గాలు వెతకాలి. తెలంగాణ ఏర్పడిందే నిధులు, నీళ్ళు, నియామకాలపై. ఈ మూడింటిలో జరిగిన అన్యాయాల మూలంగానే తెలంగాణ ప్రజలు ఉద్యమించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేవలం 16నెలలు మాత్రమే అయ్యింది. ఈ సమస్యలు గత 58 సంవత్సరాలుగా ఉమ్మడి పాలనలో పేరుకుపోయి ఉన్నాయి. ప్రాజెక్టుల నిర్మాణంలో నత్తనడక, భూగర్భజలాలు పడిపోవడం, వ్యవసాయరంగంలో పరిశోధనలు లేక మేలురకం వంగడాల రాకపోవడం, విద్యుత్‌ సరిగా రాకపోవడంతోనే రైతులకు సమస్యలు తలెత్తాయి.

ఇలా దశాబ్దాల తరబడి జరిగిన దగానే ఈరోజు రైతుల మారణకాండకు దారితీసాయి. వీటికి తోడు గ్రామాలలో నీటి వనరులైన చెరువులను ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు ధ్వంసం చేశారు. ఇన్ని జరిగితే ఇప్పుడు వెంటనే రైతుల ఆత్మహత్యలు నివారించాలంటే జరిగేపనేనా? ఇన్ని దశాబ్దాలుగా దగాపడ్డ రైతన్నకు అండగా ఉంటూ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నది. తెలంగాణను విత్తన భాండాగారంగా తయారుచేయడానికి విత్తన కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో 364 విత్తన కంపెనీలు ఉన్నాయి, ఆయా విత్తన కంపెనీల యజమానులతో మాట్లాడాము. ప్రస్తుతం ఒక్కో సమస్యనే అధిగమిస్తూ ముందుకు వెళుతున్నాము.

మొదట విద్యుత్‌ సమస్యను అధిగమించాము. నాణ్యమైన 9 గంటల విద్యుత్‌ను ఏప్రిల్‌ నుంచి రైతులకు అందిస్తాము. 2018 వరకు 3ఫేస్‌ విద్యుత్‌ 24 గంటలు అందిస్తాం. 91,500 కోట్ల రూపాయల పెట్టుబడులతో పలు విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల ద్వారా మిగులు విద్యుత్‌ను సాధిస్తాం. దేశంలో విద్యుత్‌ ఉత్పత్తి ఉన్నా, రాష్ట్రాలు వాడుకోవడంలేదు. 2.5 లక్షల మెగావాట్ల స్థాపిత విద్యుత్‌ ఉండగా అందులో 1.5 మాత్రమే వాడుకుంటున్నాము. రాష్ట్రాలకు సరైన ప్రణాళికలు లేక విద్యుత్‌ మిగిలిపోతున్నది. దీనివల్ల రాష్ట్రాలలో విద్యుత్‌ సమస్యలు ఏర్పడుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్‌ మోటార్లు కాలిపోకుండా, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నాము. విద్యుత్‌ కొరత రాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నాం. సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ వద్ద 2వేల మెగావాట్ల స్లాట్‌ బుక్‌చేసి పెట్టాం. నిరంతర విద్యుత్‌ సరఫరాతో పాటు, విత్తన భాండాగారంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం. సాగునీటి వనరుల విషయంలో మిషన్‌ కాకతీయ పేరుతో రాష్ట్రంలో చెరువులను పునరుద్దరిస్తున్నాం. 46,500 చెరువులు రాష్ట్రంలో ఉంటే అందులో మొదటి సంవత్సరం 9వేల చెరువులు తీసుకున్నాము. వీటిలో 6వేల చెరువుల్లో పనులు జరిగాయి. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి.

రైతుల రుణమాఫీ విషయంలో మొత్తం 36లక్షల మంది ఖాతాలకు గాను, 24లక్షల మందికి బ్యాంకులోన్‌ తీరినట్లు తహసిల్‌దారులతో సర్టిఫికెట్లు ఇప్పించాం. సగం రుణం ఇప్పుడు తీర్చాల్సి ఉంది, దాన్ని కూడా ఒకేసారి తీర్చడానికి నిధులు వెసులుబాటుకు ప్రయత్నిస్తున్నాం. వాణిజ్యపన్నుల బకాయిలు రూ.4500 కోట్లు, ఎఫ్‌.ఆర్‌.బి.ఎం. రుణపరిమితి ద్వారా మరో 3వేల కోట్ల రూపాయలు వస్తుందని భావిస్తున్నాం. జిహెచ్‌ఎంసిలో భూముల రెగ్యులరైజేషన్‌ ద్వారా మరో వెయ్యికోట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలా మొత్తంగా నిధులు వెసులుబాటు చూసుకుని, రుణాన్ని ఒక్కసారే మాఫీచేసే ప్రయత్నాలు చేస్తున్నాము. ఈసారి విత్తనాలు, ఎరువులు కొరతలేకుండా సరఫరా చేశాం. మండల కేంద్రాల్లో గోదాములు నిర్మిస్తున్నాం, మైక్రోఇరిగేషన్‌ను ప్రోత్సహించడానికి ఎస్సీ,ఎస్టీలకు వందశాతం, బిసిలకు 90శాతం, ఓసిలకు 80శాతం సబ్సిడీలు ఇస్తున్నాము. సిసిఐ ద్వారా ఈ ఒక్క సంవత్సరమే గత అయిదు సంవత్సరాలలో సేకరించనంతగా కోటి 80లక్షల క్వింటాళ్ళ పత్తిని కొనుగోలుచేయడం జరిగింది.

ఇన్ని చేసినా ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. ముఖ్యంగా వ్యవసాయరంగంలో పరిశోధనలు పెంచి కొత్త వంగడాలను సృష్టించాల్సిఉంది. సాగునీటి వనరులు పెరగాల్సి ఉంది. అందుకై రాబోయే 3 సంవత్సరాలలో రూ. 25000 కోట్లతో ప్రాజెక్టులు పూర్తిచేసి ప్రతి నియోజకవర్గానికి సాగునీరు అందించడానికి కట్టుబడి ఉన్నాము. ఇలా నాణ్యమైన విద్యుత్తు, మేలురకం వంగడాలు, చాలినన్ని ఎరువులు, విత్తనాలు, పుష్కలంగా సాగునీరు, చిన్న కమతాలన్నీ ఒకచోటకు చేర్చే విధంగా కమతాల ఏకీకరణ, మైక్రో ఇరిగేషన్‌కు ప్రోత్సాహమిచ్చి రైతులకు వ్యవసాయం లాభసాటి చేసి వారి బతుకుల్లో వెలుగులు నింపుతాము. రైతులెవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు.

సంక్షేమ పథకాల అమలులో మనమే ఫస్ట్‌

సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, సంక్షేమానికి రూ. 33,986 కోట్లు కేటాయించిన ఘనత మనదేనని, గత ప్రభుత్వాల కాలంలో 2013-14 సంవత్సరానికి గాను కేవలం రూ. 13,572 కోట్ల రూపాయలు సంక్షేమానికి ఖర్చు చేస్తే, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ. 33,982 కోట్లు కేటాయించిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలిపారు. అక్టోబరు 7న శాసనసభ నిరవధిక వాయిదా పడే ముందు ముఖ్యమంత్రి సంక్షేమ పథకాల అమలు గురించి సుదీర్ఘంగా ప్రసంగించారు.

ఆయన ప్రసంగం ఇలా సాగింది…

తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు మూడు విధానాలతో ముందుకు సాగుతున్నాము. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక పరిష్కారం దిశగా మేము ప్రణాళికలు రూపొందిస్తున్నా ము. ప్రస్తుతం తలెత్తుతున్న సమస్యలు 58 సంవత్సరాల ఉమ్మడి పాలనలో వచ్చినవే. వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాము.

ఇన్ని సంవత్సరాల వారి పాలనను తాము ప్రశ్నించాల్సింది పోయి వారే తమను ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీలో ఎవరి తప్పొ ప్పులు ఏంటో చర్చిద్దామంటే సభను జరగనివ్వకుండా అడ్డుకుని వారే గెంటేయించుకున్నారు. స్తుము పాలన ప్రారంభించిన 16 నెలల కాలంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించాం, రైతులకు మేలు చేయడానికి ఎన్నో ప్రణాళికలు తయారుచేస్తున్నాం. సాగునీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తికా వడానికి కృతనిశ్చయంతో ఉన్నాము. ప్రతి ఎకరాకు నీళ్ళు పక డ్బందీగా తెస్తాం. ఎవ్వరూ ఆగం కావద్దు. తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే విషయంలో మా చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన పనిలేదు. రైతులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, మైనారిటీల సంక్షేమానికి తమ ప్రభుత్వం అంత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.

గత ప్రభుత్వాల కంటే ఈ సంవత్సరం సంక్షేమానికి రూ. 20,410 కోట్లు ఎక్కువ కేటాయించాం. 16 నెలల కాలంలో తమ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు కళ్ళారా చూసిండ్రు. ఇక రైతుల బాధలు ఎలా తీర్చాలా అని తీవ్రంగా ఆలోచిస్తున్నాం. వారికి సాగునీరు అందించి పంటలు బాగా పండించుకోవడానికి మూడు సంవత్సరాల కాలంలోనే ఎక్కువ ప్రాజెక్టులు పూర్తయ్యే విధంగా అధికారులు, కాంట్రాక్టర్లపై వత్తిడి తెస్తున్నాం. ఇంత చేసినా ప్రతిపక్ష సభ్యులు తేలికగా మాట్లాడుతున్నారు. రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు, పేదలకు రెండు పడకగదుల గృహ నిర్మాణం, పించన్లు, హాస్టళ్ళలో సన్నబియ్యం, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ యువతులు పెళ్ళిళ్ళ కోసం కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు ప్రవేశపెట్టాము. ఇలా ఎన్నో చేస్తున్నాం.

మైనారిటీలకు 12శాతం రిజర్వేషన్ల కల్పనకు కట్టుబడి ఉన్నాము. ఏసీబీ డీజీ ఎ.కె.ఖాన్‌ నేతృత్వంలో ముస్లింల సమస్యలపై కమిటీ వేసాము. ఇలా ప్రతి వర్గానికి మేలు చేసే విధంగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినం. న్యాయవాదుల సంక్షేమానికి రూ. 100 కోట్లు, జర్నలిస్టుల సంక్షేమానికి రూ. 10 కోట్లు కేటాయించాము.

ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్‌ విపులంగా వివరించారు. మొత్తంగా అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమాన్ని కాంక్షించి తాము చేస్తున్న పాలనను ప్రజలు సంపూర్ణంగా అర్దం చేసుకున్నారని ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.