అందములేని బొట్టు.. ముడికందని జుట్టు

మన తెలంగాణాలోని శతకాల్లో లభించినవాటికన్నా నష్టమైనవి, అలభ్యాలు, అముద్రితాలే అధికం. ఒకప్పుడు ప్రతి పల్లెల్లోవున్న మామూలు కవియైనా శతకాన్ని రచించడం, ఎన్నో శతకాల పద్యాలను వినిపించడం ఒక ఆచారంగా వుండేది. ఇప్పటి మన గ్రామాల్లో పరిశోధనాత్మకంగా చూస్తే ఎన్నో శతకాలు, చాటుపద్యాలు, కీర్తనలు, యక్షగానాలు లభిస్తాయి. ఇవన్నీ మన సాహిత్యానికి పెన్నిధులు. నా పరిశీలన, పరిశోధనలో ఈవిధమైన సాహిత్యం కొంత లభించింది.

ప్రస్తుతానికి నల్లగొండ జిల్లా అహల్యా మండలంలోని ఇబ్రహీంపేటలో వున్న మహాకవి గోవర్థనం వెంకటనరసింహాచార్య (1846-1936) అముద్రిత, అజ్ఞాత రచనల్లో కొన్ని శతకాలు ూడా ఉన్నాయి. వెంకట నరసింహాచార్య కవి బహువిధ గ్రంథకర్త, ఎన్నో చాటు పద్యాలను ూడా చెప్పినాడు, ఆ రోజుల్లో అనేకులైన జమీందారులు, పెద్దలు ప్రఖ్యాతి చెందారు. వారిలో నడిగూడెం, బేతవోలు జమీందారులు. రాజా బహద్దర్‌ వెంకటరామారెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, ఇనుగుర్తి ఒద్దిరాజు సోదరులు, నల్లగొండలోని సబ్నవీసువారు ఇట్లా ఎందరితోనో ఈ కవికి సాన్నిహిత్యమున్నట్లు చాటువుల ద్వారా తెలుస్తున్నది.

వీరి సారంగశైల సీతారామశతకాన్ని (1920లో) లక్ష్మీనృసింహపుహరిని (1925లో) నీలగిరి పత్రికాధిపతులు ప్రచురిస్తే, ఆచార్యులవారు ఉద్ధరించి పరిష్కరించిన కుముదవల్లీ విలాసమనే ఒక ప్రబంధాన్ని ఒద్దిరాజువారు 1923లో ప్రకటించినారు. కవి ప్రబంధాలు, మరికొన్ని శతకాలు, చాటువులు, యక్షగానాలు మొదలైనవి అముద్రితాలే. ప్రాతనైన కాగితాల్లో మగ్గిమగ్గిన వీటిని అవసాన దశలో సంపాదించి అధికభాగం తిరుగవ్రాసి యుంచినాను. కవి జీవితం, సాహిత్యం గూర్చి ఎవరైనా పరిశోధన చేస్తే విలువైన సాహిత్యం వెలుగులోనికి వస్తుంది. ఇవిూడా అముద్రితాలే.

ఆనాడు మారుమూల పల్లెలో-నిరంతర సంసార బాధలతో వుండేవీరు గ్రంథ ముద్రణం-ప్రచారాలనుగూర్చి ఆలోచించలేదు. లిఖిత గ్రంథాలు పరహస్తగతమై ఎక్కడెక్కడో చేరినాయి. వీటిలో కొన్నిటినైనా సంపాదించటానికి చాలా శ్రమ పడవలసి వచ్చింది. మన తెలంగాణలో 1860 ప్రాంతంవర ఎన్నో యక్షగానాలను వ్రాసి ప్రదర్శింపచేసిన వెంకటనరసింహాచార్యుల వారి విషయం ఎందరికి తెలుసు? ఇదంతా ఒక భాగం-

కవి శతకాలు-ప్రౌఢశైలిలో వున్నాయి. అన్నీ వివిధ దేవతలగూర్చి చెప్పినవే కాబట్టి వాటికి మోక్షం ప్రాప్తించి వెలుగు చూడలేదనిపిస్తుంది. వీరి శతక సాహిత్యంలో సారంగశైలి.. శతకం ఒక్కటే ముద్రితం. మాధవా శతకం (ఆము) ఈ రెండు మాత్రమే పూర్తిగా లభించినవి. మిగిలినవాటిలో-

1. ప్రతాపగిరీట్‌ నృసేరీ శతకం (46 పద్యాలు)
2. గోపాలపుర వేణుగోపాల శతకం (5 పద్యాలు)
3. గుండాల శ్రీహరీ శతకం (5 పద్యాలు)
4. గట్టు వేంకటరమణ శతకం (14 పద్యాలు)
5. మట్టపల్లీ నృసింహ శతకం (15 పద్యాలు)
6. తిరుమల వేంకటేశ్వర శతకం (6 పద్యాలు)
7. వేంకటేశ్వర శతకం (5 పద్యాలు)
8. దాశరథీ శతకం (10 పద్యాలు)
9. సిర్సెనగండ్ల నృసేరీ శతకం (నిరోష్ఠ్యం-18 పద్యాలు)
ఇవి లభించినవి, వీటితోపాటు

1. శనైశ్చరస్తుతి నవరత్నాలు 2. హయగ్రీవస్తుతి నవరత్నాలు 3. అర్వపల్లీ నృసింహ పంచరత్నాలు 4. పంచముఖీ హనుమత్‌ పంచరత్నాలు 5. యాదగిరీ నృసింహ-పంచరత్నాలు అనేవి కలవు. ఇవి లఘురచనలైనా కవితా విషయంలో ప్రౌఢాలు. అసమగ్ర రచనల్లో కొన్ని పద్యాలను పరిశీలిస్తే…

అందములేని బొట్టు-ముడికందని జుట్టు. మ¬గ్రరోషమున్‌
చెందని తిట్టు. వేదవిధి చేయని సద్విజరాట్టు, సత్యమిం
పొందని పట్టు వస్తువులనుల్లస మొందని కొట్టు భూ స్థలిన్‌
పొందకనుండు సత్యగుణ పూర్ణ ప్రతాపగిరీట్‌ నృసేరీ,

శ్రీలలినావిలోలు గుణశీలు విశాల కృపాలవాలు గో
పాలికజాల జీవపరిపాలు నిజాస్యకళా విధూత గో
పాలు మహేంద్రనేలు మధుపాలక సంయుతుచారు ఫాలుగో
పాలపురీవరాంతర నృపాలు మునీశ్వరఖేలు వేణుగో
పాలు మదిన్‌ భజింతు భవబంధములన్‌ విడద్రోలి యేలగన్‌ (ఏక ప్రాస శతకం)

చండార్కేండు మాన చక్రధర భాస్వత్‌ స్థూల సౌందర్యదో
ర్దండా ఖండల వైరి మండల మ¬ద్దండాపహార క్రియా
ఖండాస్త్రావళి మండితాండ జతురంగాభంగ నీలాంగశ్రీ
గుండాలాఖ్య పురీవరాధి సహరీరమ్యద్రిపు శ్రీహరీ (ఏకప్రాస)

పట్టగు మందరంబుగొని వాసుకిత్రాడుగచేసి వార్ధిలో
బెట్టి సురాసురావళులు వేశమెబట్టి మధింప
పర్వతంబట్టెమునుంగ ూర్మమయి హాళిగవీపుననెత్తితివౌధరిత్రినో
గట్టుపతీ సుదర్శన విఖండిత శత్రుతతీమ¬న్నతిన్‌ (ఏకప్రాస)

నిరోష్ఠ్య నృసేరీశతకం
అక్షరరుక్షనాయుక! యహస్కరలోచన శత్రులోక సం
దుక్షితయాతనా! చటుల దోర్యుగళాంచి తశార్జికాండ గో
రక్షణ దక్షదాసజన రంజన కృష్ణహితారిలోక సం
శిక్షణ రాక్షసాంతఘన సిర్సెనగండ్ల హరీ! నృసేరీ!
ఇట్లా శతకపద్యాలు, స్తోత్రాలు, చాటువులు ఉన్నాయి. ముందు ముందు ఇవన్నీ పాఠకులకు చేరువ కాగలవని ఆశిద్దాం.

శ్రీరంగాచార్య