|

అంబరాన్నంటిన యాదాద్రి నర్సన్న బ్రహ్మోత్సవం

tsmagazineమామిడాల మంజుల
ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం …

అని స్వామి వారిని స్మరించినంతనే అపమృత్యు దోషాలన్ని తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. పంచనారసింహ క్షేత్రమైన యాదాద్రి పుణ్యక్షేత్రంలో ప్రతీ సంవత్సరం పాల్గుణ మాసం శుద్ధ పాడ్యమి మొదలు 11రోజుల పాటు స్వామి వారి బ్రహ్మూెత్సవాలు ఘనంగా జరుగుతాయి. అయితే ఈ సారి ఒక ప్రత్యేకత ఉంది. యాదాద్రి అభివృద్ధి పనులలో భాగంగా ప్రధాన ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నందున బాలాలయంలోనే ఈ సారి బ్రహ్మూెత్సవాలను నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్‌ స్వామి యాదగిరిగుట్టను యాదాద్రిగా నామకరణం చేశాక జరుగుతున్న మూడవ బ్రహ్మూెత్సవా లుగా చెప్పవచ్చు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు బాలా లయంలో స్వామి వారి దర్శనంతో పాటు ప్రక్కనే ఉన్న ఆలయ మండపంలో స్వామి వారి సేవలను తిలకించే భాగ్యం కూడా లభించింది. బ్రహ్మూెత్సవకాలంలో యాదాద్రికి వచ్చిన భక్తు లు యాదగిరీశుని ఉత్సవ శోభను చూసి మైమరచి పోయారు.

ఫిబ్రవరి 17 తేదీ నుండి 27వ తేదీ వరకు బ్రహ్మూెత్సవాలు అంగరంగవైభవంగా నిర్వహించారు. పాంచరాత్ర ఆగమం ప్రకారం యాదగిరీశుని బ్రహ్మూెత్స వాలు జరిగాయి. మొదటి రోజు విష్వక్సేనారాధన, స్వస్తివాచనం, అంకురారోపణంతో బ్రహ్మూెత్సవాలు మొదలయ్యాయి. బ్రహ్మూెత్సవ తోలిరోజునే పోచంపల్లికి చెందిన చేనేత కార్మికులు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్స వానికి పట్టు వస్త్రాలను కానుకగా అందజేశారు. రెండవ రోజు ధ్వజస్థంభంపై ధ్వజపటాన్ని ఎగురవేశారు. ముక్కోటి దేవతలను బ్రహ్మూెత్సవాలకు ఆహ్వానిస్తూ విష్వక్సేనుల వారితో కబురు పంపారు. దేవతాహ్వానాన్ని స్వాగతించిన ముల్లోకాల్లోని దేవతలు యాదాద్రికి తరలివచ్చి బ్రహ్మూెత్సవాలను జరిపించారా అన్నట్టుగా ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ధ్వజారోహణం మొదలు ఏడు రోజుల పాటు స్వామి వారు వివిధ అవతారాలలో భక్తులకు దర్శనభాగ్యం కలిగించారు. ఒక్కొక్క అవతార సేవకు ఒక్కో విశిష్టత ఉంది. స్వామివారికి ప్రతీ రోజు నిర్వహించిన అలంకారసేవలకు సాయంకాలం నిర్వహించిన వాహనసేవలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. భక్తులను రక్షించడానికి స్వామి వారు ఏ ఏ రూపాలను ధరించారో తెలియజేస్తూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అలంకారసేవలను నిర్వహిం చారు. యాగశాలలో వేదమంత్రాలతో హోమాది పూజలతో పాటు విష్ణు సహస్ర నామ పారాయణం నిర్వహించారు. మరో వైపు యాదాద్రి బ్రహ్మూెత్సవాల ప్రత్యేకత అయిన ధార్మిక సాహిత్య మహసభలను ఐదు రోజులపాటు వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి సంగీత, నృత్య, జానపద కళాకా రులు, కవులు వచ్చి ఇక్కడ ప్రదర్శనలు ఇచ్చారు.

అశ్వవాహన సేవలో స్వామి వారు పల్లకిపై అమ్మవారిని ఊరేగింపుగా తీసుకుని వచ్చి భక్తజనుల నడుమ స్వామి వారి ఎదుర్కోలు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టువస్త్రాలతో, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించిన కల్యాణమూర్తులను ఎదురెదుగా నిల్చుండబెట్టి శాస్త్రోక్తంగా ఎదుర్కోలు మహోత్సవాన్ని నిర్వహించి కల్యాణ గడియలను నిర్ణయించారు.

అంగరంగ వైభవంగా
శ్రీ లక్ష్మీనారసింహస్వామి కళ్యాణం
tsmagazine

భక్తజన పరిపాలకుడు ఆశ్రిత జన రక్షకుడు అయిన శ్రీ శ్రీ లక్ష్మీనారసింహస్వామి కళ్యాణం జగత్‌ కళ్యాణము అని అనేక పురాణములు పేర్కొన్నవి. హిరణ్యకశ్యపుని వధించిన తర్వాత ఉగ్రరూపంలో ఉన్న నారసింహుని శాంతింపచేయడానికి ప్రహ్లాదుడు లక్ష్మీ అమ్మవారితో నారసింహస్వామి కళ్యాణం జరిపించాడని నృసింహపురాణంలో చెప్పబడినది. బ్రహ్మూెత్సవములలో లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం చూచిన వారికి ఇహపర సౌఖ్యములు కలుగుతాయని, నసింహ అనుగ్రహము కలిగినచో సమస్త దేవతల అనుగ్రహం లభిస్తుందని వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు పేర్కొన్నాయి.

యాదగిరీశుని పరిణయ సంబురాన్ని తిల కించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం బాలాలయంలో స్వామివారి కల్యాణం జరిపించారు. రాత్రి స్వామివారు భక్తజనకోటికి దర్శనభాగ్యంకల్పించడం కోసం కొండ క్రింద యాద గిరిగుట్ట జెడ్‌ పి హైస్కూల్‌ ప్రాంగణంలో కల్యాణాన్ని జరిపించారు. విద్యుత్‌ దీపాలతో, పుష్పశోభితంగా అలం కరించిన కల్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను వేంచే యింపచేసి వేదపండితుల వేదమంత్రోచ్చారణల నడుమ కల్యాణ క్రతువును నిర్వహించారు. బాజాభజంత్రీలు ఒక వైపు మిరుమిట్లుగొలిపే బాణాసంచా కాంతులు మరొకవైపు భక్తులను మంత్రముగ్ధ్దులను చేశాయి. ప్రభుత్వం తరపున రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. మంత్రులు నాయని నర్సింహారెడ్డి, జగదీశ్వర్‌ రెడ్డి, యంపి బూర నర్సయ్యగౌడ్‌, శాసన సభ్యులు చీఫ్‌ విప్‌ సునీతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కల్యాణోత్సవాన్ని ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించే మహద్భాగ్యం కల్పిస్తూ దూరదర్శన్‌, శ్రీ వేంకటేశ్వరా భక్తి ఛానె ల్‌తో పాటు పలు ఛానెల్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఈ కల్యాణోత్సవంలో వైటిడిఏ అధికారులు కిషన్‌ రావు, ఆర్కిటెక్ట్‌ ఆనంద్‌ సాయి, ఇవో గీత, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

వైనతేయవాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమివ్వగా గుట్ట క్రింద దివ్యవిమాన రథోత్సవం కన్నుల పండు గగా సాగింది. వివిధ పుష్పమా లికలతో శోభాయ మానంగా అలంకరించిన రథంపై స్వామి వారు తరలిరాగా స్థానిక మహిళలు మంగళహారతులను పట్టారు. మరుసటిరోజు విష్ణుపుష్కరిణిలో చక్రతీర్థం ఉత్సవం, చివరగా బ్రహ్మూెత్సవాలలో అలసిసొలసిన స్వామి అమ్మవార్లకు శతఘటాభిషేకం, అనంతరం శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు ముగిశాయి. యాదాద్రి ఇవో గీత ఉత్సవాలను వైభవంగా నిర్వహిం చడానికి ఏర్పాట్లుచేయగా, రాచకొండ కమిషనరేట్‌ సిపి మహేష్‌ భగవత్‌ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తగు బందోబస్తు చర్యలు తీసుకున్నారు.