|

అఖిల భారత తస్కర మహాసభ

– డా|| శ్రీరంగాచార్య
పానుగంటివారి ‘సాక్షి’లో ‘అఖిలాంధ్రదేశ మశక మత్కుణ మహాసభ’ శీర్షిక ఉంది. ఉపన్యాస ప్రభావం కావచ్చు-శేషభట్టరు వెంకటరామానుజాచార్యులు (1900-1944) ‘అఖిలభారత తస్కర మహాసభ’ పేరున ఒక గొప్ప రచన చేసి ఆయన బహుభాషా నైపుణ్యం, అనేక విషయ పరిశీలనాశక్తి మొదలైన వాటిని నిరూపించారు. ఆచార్యులవారు ఆనాడు ప్రసిద్ధ న్యాయవాది. బహువిధ గ్రంథకర్త, ‘నీలగిరి’, ‘తెలుగు’ పత్రికల్లోనేగాక ఆనాటి ఉర్దూ, ఇంగ్లీషు పత్రికల్లోనూ చాలా విషయాలగూర్చి వ్యాసాలు వ్రాసేవారు.

ఆనాడు ప్రసిద్ధులైన ఎందరో జమీందారులేగాక, సురవరం, మాడపాటి, పులిజాల, రావు బహదూర్‌రెడ్డి వంటి ఎందరో పెద్దలకు రామానుజాచార్యులు ఆత్మీయుడుగావుండేవారు. నేటి యాదాద్రి జిల్లా దత్తప్పగూడెంలో జన్మించి, చాలా కష్టంతో విద్యాభ్యాసం చేసిన ఈయన వరంగల్లు, నల్లగొండ జిల్లాల్లోనూ, హైదరాబాదులోనూ వకీలు వృత్తి నిర్వహించినాడు. బహుభాషావేత్త, హాస్యచతురుడుగా ప్రసిద్ధిపొందిన వీరి ‘ఆంధ్రనామ సంగ్రహం’ (ప్యారడీ) గోలకొండకవుల సంచికలో లోకజ్ఞునిపేర ముద్రణమయింది. వీరి ‘నల్లగొండ చరిత్ర (1925), ప్రాకృత దాంపత్యం (1920), రుక్మిణి. దస్తావేజులు వ్రాసే విధానం, కర్మస్థలం, ఆంధ్రవీర ప్రబోధం, హిందూ దేశ చరిత్ర (నాటకం) మొదలైన రచనలు వీరి పాండితీ ప్రతిభలను వెల్లడిచేస్తాయి.

‘లోకజ్ఞుడు’పేరు సార్థకమయ్యేవిధంగా అనేకానేక విషయాలతో దాదాపు 400 పుటలు (ఫుల్‌స్కేపు) కవిగారి లేఖనంతో ‘అఖిలభారత తస్కర మహాసభ’ అముద్రితంగా జీర్ణదశలో వుంది. ఇంత పెద్ద రచనలో ఒక్కపాత్ర పేరు కూడా లేదు. ‘అధ్యక్షోపన్యాసం’ అనే ఆరంభించి 12 ప్రకరణాలను రచించినారు. ప్రతి ప్రకరణం ‘అధ్యక్షభాషణం’, ‘ఉపన్యాసం’ ఇట్లా శీర్షికలుంటాయి. దేశంలో అన్ని వృత్తులకన్న ‘చోరవృత్తి’ గొప్పనైనది. అందుకే దీన్ని చతుష్షష్ఠికళల్లో చేర్చి గౌరవించినారు-కాబట్టి ఈ వృత్తి ధర్మాన్ని వదలి వేరే వృత్తిని స్వీకరించవద్దు-‘అనే ఉద్బోధతో మొదటి ప్రకరణం ప్రారంభించబడింది. రచన మొత్తం సులభశైలి గ్రాంథికంలో వుండటమేకాక-ఎన్నో పద్యాలు, శ్లోకాలు, భగవద్గీత, పురాణాలు, ప్రబంధాలలోని రచనలను సందర్భోచితంగా చెబుతూ-ద్రవిడ ప్రబంధాలు, వేదాలు, ఉపనిషత్తుల విషయాలను వెల్లడిచేస్తూ రాజకీయాల్లోని లక్షణాలను, న్యాయవాదులు, కోర్టులు, పోలీసులు, వ్యాపారులు, పీఠాధిపతులు, ఇట్లా ఎన్నో విషయాలను, ఎన్నో సందర్భాలను చోరత్వానికి తగిన రీతిలో తెలిపి-కవిగారి ‘లోకజ్ఞ’త్వాన్ని నిరూపించినారు.

కొన్ని పేరాల్లో సంస్కృత భాషణ, కొన్ని పేజీల ఉర్దూ ప్రసంగం, కొంత ఇంగ్లీషు, కన్నడం-ఇట్లా ఆయా దేశస్థులైన చోరశిఖామణుల కవసరమయ్యే విషయ వివేచనతోచేసిన ప్రసంగాల నైపుణ్యం ఆశ్చర్యం కలిగిస్తుంది. లోకంలో భిక్షుక వృత్తి శ్రమ కలిగిస్తుంది. కాబట్టి దాన్ని స్వీకరించకుండా విలక్షణమైన ‘చోర వృత్తి’నే మనం నిల్పుకొని అభివృద్ధి పరుస్తూ మన సంఖ్యను ఎంతో పెంచవలసిన అగత్యం కలదని దృష్టాంతాలతో చెప్పి ఆనాటి సమాజ స్థితిగతులను కూడా వర్ణిస్తాడు-

ఇంకా మనం వాడుకునే ‘దొంగ’ పదం వారికి తక్కువ కాబట్టి. ఐకాగారికుడు, దస్యుడు, చోరుడు, పాటచ్చరుడు, ముసల్యుడు అనే నామాంతరాలతో చోరుణ్ణి చెప్పుతారు-వీరు ఏర్పాటు చేసిన సభకు వచ్చిన వివిధరీతుల, వివిధ జాతుల స్త్రీ పురుషుల గూర్చి చెప్పటానికే ఒక ప్రకరణం దాదాపు 30 పేజీలు (వ్రాతలో) ఉన్నది. ఇది వీరి ‘లోకజ్ఞత’ సభకు విచ్చేసిన పట్టణవాసులు, గొల్లపల్లెల వారు, మాలపాలెములవారు, చిన్న గుడిసెలవారు, తండాలవారున్నారు. ఇంకా కుచ్చుటోపీలవారు, బొచ్చు టోపీలవారు, తలపాగాలవారు-తట్టురుమాళ్లవారు, బరితలలవారు, బట్టతలలవారు, ముందరి జుట్లవారు, వెనుక జుట్లవారు, నడిమి జుట్లవారు, ప్రక్క జుట్లవారు, ఏకశిఖులు, ద్విశిఖులు, త్రిశిఖులు, పంచశిఖులు, పరిత్యక్త శిఖులు, పూర్ణశిఖులు, అర్థశిఖులు. గోష్పాదులు, మార్జాలపాదులు, మక్షికాపాదులు, వక్రపాదులు, దృఢపాదులున్నారు.

అట్లే రకరకాల బొట్లు, పలురకాల క్రాఫింగులు, గడ్డాలు, మీసాలు, కంఠమాలికలు గలవారి జాబితా ఆద్యంతం హాస్యంతో పానుగంటివారికే పాఠాలు నేర్పుతుంది. అధ్యక్ష ప్రసంగంలో-దొంగల వరుసయందు చేరిన వారిని చెబుతూ.. మొదట కవులు దొంగలని వారుచేసే పూర్వపూర్వ కవుల శబ్ధార్థ భావాల చోరత్వాన్ని తెల్పటం. వకీళ్లు దొంగలు, పోలీసులు దొంగలు, పీఠాధిపతులు, ఆచార్యులు-దేవుళ్లు, దైవభక్తులు అంతా గొప్ప చోర శిఖామణులేయని సోదాహరణంగా తెలుపటం ఒక కళ, శ్రీవైష్ణవులు పూజించే తిరుమంగయాళ్వారు పెద్ద దొంగ, ఆయన చోరత్వాన్ని ప్రశంసిస్తూ, విష్ణు సన్నిధి ఉత్సవాల్లో ‘దోపు’ ఉత్సవం జరుపటం, విప్రనారాయణుని దస్యునిగా తయారుచేయటం, శ్రీమద్రామానుజులవారు తన శిష్యులతో ధనుర్దాసు భార్యపైగల బంగారు ఆభరణాలను హరింపజేయడం, శ్రీకృష్ణుడు గొప్పగొప్ప చోరకళను ప్రదర్శించి మనకు ఆదర్శంగా నిలిచినాడని, ప్రతి పని, ప్రతి రచన, ప్రతి గ్రంథం, సంఘంలోని ప్రతివ్యక్తీ, ఏదో ఒక చోరకళలో ఆరితేరినవారేనని దీనిలో నిరూపించడం, చారుదత్త నాటకంలో మన చోరకళ ఆశ్చర్యం కలిగించింది కదా! అనేక రచనల్లో అనేక వృత్తుల్లో మన ధస్యుత్వం ప్రథమ స్థానంలోనే వున్నది. కాబట్టి దీని గొప్పతనాన్ని అభివృద్ధిచేసి ఎవరినీ బాధించని, హింసించని-చోరకళనే మన జీవరక్ష. పెద్దపెద్ద రాజులు వారి పేరున విజయం పొందినా దోచింది వారి సైన్యం కదా! రాజకీయ నాయకులు గెలువటానికి ఎందరు కార్యకర్తలు ఎన్నివిధాల దొంగతనం చేస్తే – ఓటింగ్‌ పేర వీరు గెలిచి ఎగురుచున్నారు కదా!

ఈ విధంగా అఖిల భారతదేశంలో అత్యద్భుత చోరకళా నిష్ణాతుల హస్త లాఘవం, మస్తకశక్తి, సమస్త జనాదరణ మొదలైన అనేకానేక విషయాలను అంత్యప్రాస, అనుప్రాసలు, పర్యాయపదాలు. వివిధ దేశాలు, వివిధ నామాలు. వివిధ ప్రాంతాలు-కవిగారి వ్రాతలో ఆశువుగా వచ్చి నిలిచినాయి. ఈ పుస్తకాన్ని చదివి ఆనందించవలసిందేగాని ఎంత సంక్షిప్తంగానైనా ఎంతని చెబుతాం, చాలా కాలం నాడే ‘సాక్షి’ని మించి ఏకవస్తు నిష్పంగా వచ్చిందే ‘అఖిలభారత తస్కర మహాసభ’.