అడవిదున్న దాడిలో గాయపడిన వ్యక్తికి ప్రభుత్వాసుపత్రిలో ఉత్తమ వైద్యం

ప్రభుత్వ ఆస్పత్రులు కూడా చికిత్స అందించడంలో కార్పొరేట్‌ ఆస్పత్రులతో పోటీ పడుతున్నాయని, వాటికి ఏమాత్రం తీసిపోని చికిత్సలు అందిస్తున్నాయనడానికి ఇది ఒక నిదర్శనం మాత్రమే. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు నాయతక్వంలో వైద్యరంగంలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పారనడానికి ఇది ఓ ఉదాహరణ.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం రేగులగూడెం గ్రామానికి చెందిన మొక్కటి సమ్మయ్య (58) అక్టోబర్‌ 26న పశువులను మేతకోసం అడవికి తీసుకొని వెళ్ళాడు. అదే సమయంలో అడవిదున్న ఒకటి అకస్మాత్తుగా అతనిపై దాడి చేసింది. ఈ దాడిలో సమ్మయ్య తీవ్రంగా గాయపడ్డాడు. దాడిలో సమ్మయ్య ముక్కు ఛిద్రమై, ముక్కు పక్కటెముకలు విరిగిపోయి, ముఖభాగం బాగా దెబ్బతింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సమ్మయ్య ను వైద్యచికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇ.ఎన్‌.టి వైద్యాధికారి డాక్టర్‌ రవిబాబు బృందం సమ్మయ్యకు ఫేషియల్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ సర్జరీ చేసి అతని ప్రాణాలను కాపాడటమేగాక, అతని ముఖ ఆకృతిని కూడా సరిచేయ గలిగారు.18 రోజులపాటు ఆస్పత్రిలో చికిత్సపొందిన సమ్మయ్య సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రినుంచి ఇంటికి చేరుకున్నాడు. ఇదే చికిత్స ప్రయివేటు ఆస్పత్రులలో నిర్వహిస్తే సుమారు 10 లక్షల రూపాయలకుపైగా ఖర్చవుతుందని, ఈ చికిత్సను ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా, రోగికి ఒక్క రూపాయికూడా ఖర్చులేకుండా విజయ వంతంగా అందించ గలిగినందుకు చాలా సంతోషంగా ఉన్నదని వైద్యాధికారి డాక్టర్‌ రవిబాబు తెలిపారు.

సమ్మయ్య విషయం ట్విట్టర్‌ ద్వారా తెలుసుకున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి టి.హరీష్‌ రావు వైద్యాధికారి రవిబాబు, అతని బృందాన్ని అభినందించారు.మారుమూల ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉత్తమ వైద్యసేవలు అందించడాన్ని మంత్రి ప్రశంసించారు. జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ కూడా వైద్యబృందాన్ని అభినందించారు.