|

అద్వితీయంగా జ్యోతిష ద్వితీయ మహాసభలు

tsmagazine
తెలంగాణ రాష్ట్ర జ్యోతిష ద్వితీయ మహాసభలు అద్వితీయంగా, అంగరంగవైభవంగా జరిగాయి. దేశంలోనే తొలిసారిగా జ్యోతిష, ఆగమ, ధర్మశాస్త్ర సదస్సులు జరుగుట విశేషం. ఇందులో రాష్ట్రంలోని 31 జిల్లాల సిద్ధాంతులు, జ్యోతిష పండితులు, వేద, ఆగమ, శాస్త్ర పండితులు, అర్చకులు, పురోహితులేగాక ప్రధానాలయాల స్థానాచార్యులు, ప్రధాన అర్చకులు, ప్రధాన పురోహితులు, ధర్మకర్తల మండలి అధ్యక్షులు పాల్గొన్నారు. అంతేగాక పొరుగురాష్ట్రంలోని వైజాగ్‌, తిరుపతి, ఏలూరు, విజయవాడ నుండి కూడా పండితులు అధిక సంఖ్యలో హాజరైనారు. తెలంగాణ విద్వత్సభ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ సంయుక్త సహకారంతో హైదరాబాద్‌ రవీంద్రభారతి ప్రధాన మందిరం ‘శ్రీ పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి ప్రాంగణం’లో అత్యద్భుతంగా జరిగాయి.

రెండు రోజుల మహాసభల ప్రారంభోత్సవ కార్యక్రమం పుష్పగిరి పీఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ విద్యాశంకర భారతీ స్వామివారి కరకమలములచే జ్యోతి ప్రజ్వలనతో సభలు ప్రారంభమైనవి. వేదపండితులచే వైదిక ప్రార్థన జరిగింది. ఈ కార్యక్రమాన్ని ‘దర్శనమ్‌’ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక సంపాదకులు

మరుమాముల వేంకటరమణశర్మ పరిచయం చేశారు. ఈ మధ్య బ్రహ్మైక్యం చెందిన తెలంగాణ ప్రాంతంలోని జ్ఞాన వయోవృద్ధ పండితులు కీ.శే. శ్రీ పాలకుర్తి నృసింహరామశర్మ సిద్ధాంతి గారి ప్రాంగణంగా నిర్ణయించబడింది. ఈ సభలో వారి దివ్యాశీస్సులకై 2 నిముషాలు సభ మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించింది.
tsmagazine

తెలంగాణ విద్వత్సభ అధ్యక్షులు శ్రీ యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి స్వాగతోపన్యాసం చేశారు. కేవలం ధర్మాచరణ నిమిత్తం, సమాజ శ్రేయస్సుకై రాబోవు సంవత్సరం పండుగల నిర్ణయాలపై ఏకాభిప్రాయం సాధించుట కొరకు జ్యోతిష మహాసభలు నిర్వహించబడుచున్నవని స్వాగతోపన్యాసంలో పేర్కొన్నారు.
tsmagazine

ఈ ప్రారంభోత్సవ సభకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి అధ్యక్షత వహించారు.

జ్యోతిష మహాసభలు సమాజ శ్రేయస్సుకై, తెలంగాణ రాష్ట్ర సంక్షేమానికి ఎంతగానో తోడ్పడతాయని, మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధార్మిక చింతన వల్ల మనం ఇంత గొప్ప సభలు నిర్వహించుకునే అవకాశం లభించిందని, ఈ నిర్వాహకులందరికి ధన్యవాదాలు తెలుపుతున్నామని ముఖ్య అతిథులుగా విచ్చేసిన మంత్రులు ఎ. ఇంద్రకరణ్‌రెడ్డి, జి. జగదీశ్వర్‌రెడ్డిలు తమ ప్రసంగంలో తెలియజేశారు. గత సంవత్సరం శ్రీ గాయత్రీపీఠం, జ్యోతిర్మయ మహాపీఠం, ‘దర్శనమ్‌’ ఆధ్యాత్మిక మాసపత్రిక సంయుక్తాధ్వర్యంలో జరిగిన ‘తెలంగాణ రాష్ట్ర జ్యోతిష మహాసభలు – 2017’ విశిష్ట సంచికను శ్రీశ్రీశ్రీ అభినవోద్ధండ విద్యాశంకర భారతీస్వామి ఆవిష్కరించి, తొలి ప్రతిని శ్రీ గాయత్రీ పీఠం తత్త్వానంద ఋషికి అందజేశారు.

ఈ కార్యక్రమాలనుద్దేశించి చాతుర్మాస్య దీక్షలోనున్న శ్రీ గురు మదనానంద శారదాపీఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీస్వామి వారి దివ్యానుగ్రహభాషణాన్ని సభలో ప్రదర్శించుట జరిగింది.
tsmagazine

మొదటిరోజు జరుగవలసిన మొదటి సదస్సు జ్యోతిశ్శాస్త్ర సదస్సు (పంచాంగ విభాగం)కు యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి అధ్యక్షత వహించారు. ఇందులోని నాలుగు అంశాలపై ఆకెళ్ళ జయకృష్ణ శర్మ సిద్ధాంతి, కవేలి అనంతాచార్యులు, సంపత్కుమార కృష్ణమాచార్య సిద్ధాంతి, టి.జి.టి. అంతర్వేది కృష్ణమాచార్యులు తమ ప్రసంగ పత్రాలను సమర్పించారు.

మనం ఆచరించే సకల శుభకార్యాలకు ముహూర్తం తప్పనిసరి అవసరం. ఇది నిత్యసత్యం. ముహూర్త నిర్ణయానికి పంచాంగమే ఆధారం. పంచాంగంలో ఎలాంటి దోషాలు లేని, శాస్త్ర ప్రమాణమైన ముహూర్తాలనే సూచించుట జరుగుతుంది. దేశ, కాల, పరిస్థితుల ననుసరించి ఆపత్కాల ముహూర్తాలను నిర్ణయించే అధికారం పురోహితుల కుంటుందని ఆకెళ్ళ జయకృష్ణ సిద్ధాంతి తమ ప్రసంగంలో తెలిపారు.

ప్రస్తుత కాలంలో కాలసర్ప, పితృదోషాలు గూర్చి ఆందోళన చెందడం, వాటి నివారణకై అనేక ప్రయత్నాలు చేస్తుండటం చూస్తున్నాం. కాని దోష నిర్ధారణ శాస్త్రప్రకారం అనుభవజ్ఞులైన దైవజ్ఞులచే జరిగినా, నివారణ విషయంలో పొరపాట్లు జరుగుచుండుట వాస్తవం. ఇలాంటి పొరపాట్లు జరుగకుండా, ప్రజలు, పండితులు జాగ్రత్త పడాల్సిన అవసరముందని శ్రీ కవేలి అనంతాచార్యులు రెండవ అంశ ప్రసంగంలో సూచించారు.
tsmagazine

మూడవ అంశంపై సంపత్కుమార కృష్ణమాచార్య సిద్ధాంతి ప్రసంగిస్తూ – వివాహ పొంతన విషయంలో తమ పురోహితుణ్ణి ఒకరినే సంప్రదిస్తే ఏ సమస్యలుండవు. ఇరువురిని సంప్రదించుటవల్ల భిన్నాభిప్రాయాలకు కారణ

మవుతుంది. ఎవరైనా అష్టకూటాలనే శాస్త్ర ప్రకారం పరిగణనలోకి తీసుకోవాలి. కాని చివరకు పనికిరాదని చెప్పడం శాస్త్ర సమ్మతం కాదు. అలాగే నామ నక్షత్ర విషయంలో కూడా నక్షత్రం ప్రకారం నామకరణం చేయుట శాస్త్ర సమ్మతం గాదన్నారు.

అంతర్వేది కృష్ణమాచార్యులు నాల్గవ అంశం కుజదోష ప్రభావం గూర్చి వివరించారు. కుజదోష నిర్ణయంతోపాటు, నివారణ విషయంలో అనేక సవరణలు శాస్త్రంలోనే పేర్కొనబడ్డాయి. ఇవన్ని క్షుణ్ణంగా పరిశీలించిన మీదట నిర్ణయం తీసుకోవాలి తప్ప, తొందరపడి కుజదోషముందని తీర్మానించకూడ దన్నారు.

రాబోవు శ్రీవికారి నామ సంవత్సరం పండుగల నిర్ణయం కోసం ఏర్పరచిన విద్వత్సమ్మేళన కార్యక్రమంలో రాష్ట్రంలోని 50 మంది సిద్ధాంతులు, 50 మంది జ్యోతిష పండితులు, ఒకే వేదికపై చేరి, శ్రీ అహోబిల మఠ రామానుజ జీయర్‌స్వామి సమక్షంలో వారి మంగళాశాసనాలతో పండుగల నిర్ణయాలు ఏకగ్రీవంగా ఆమోదించి, తీర్మానం చేశారు.

రెండవరోజు కార్యక్రమంలో వేదానికి ధర్మం ఏవిధంగా మూలమో, ఆగమశాస్త్రానికి, ధర్మాచరణకు జ్యోతిశ్శాస్త్రమే మూలమైనందున ఈ జ్యోతిష మహాసభల్లో ఆగమశాస్త్ర సదస్సుల్లో, ధర్మశాస్త్ర సదస్సును ఏర్పాటు చేయడమైంది. ఈ సభలో రాష్ట్రంలోని ధర్మశాస్త్ర పండితులు, ఆగమశాస్త్ర పండితులు, ప్రఖ్యాతి గాంచిన పౌరాణికులు, సంస్కృత పండితులు పాల్గొన్నారు.

శ్రీజగన్నాథ మఠాధిపతి, శ్రీశ్రీశ్రీ వ్రతధర శ్రీనివాస రామానుజ జీయర్‌ స్వామి జ్యోతి ప్రకాశనంతో సభ ప్రారంభమైంది. సభాధ్యక్షులుగా సరస్వతీ క్షేత్ర వ్యవస్థాపకులు అష్టకాల నరసింహరామశర్మ అవధాని, గౌరవ అతిథులుగా జ్యోతిష పండితులు వావిలాల దామోదరశర్మ, కొండగడప శ్రీధరశర్మ, వఝల నరహరి శర్మ విచ్చేశారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖామాత్యులు అజ్మీర చందూలాల్‌ పాల్గొన్నారు.

ఇక చివరగా సమాపనోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ అధ్యక్షులు డాక్టర్‌ కె.వి. రమణాచారికి తొలిరోజు సాయంత్రం ఏకగ్రీవంగా తీర్మానించిన రాబోవు వికారి నామ సంవత్సర పండుగల నిర్ణయాలతో పాటు, తెలంగాణ విద్వత్సభ ఆమోదించిన తొమ్మిది తీర్మానములను అందజేశారు. ఈ తీర్మానాలను సావధానంగా పరిశీంచి, రాబోవు సంవత్సరంలో జరుగబోవు రెండు రోజుల తెలంగాణ రాష్ట్ర జ్యోతిష మహాసభలు 2019 జులై 27,28గా నిర్ణయించినందులకు ఆయన సంతోషం వ్యక్తం జేశారు.