అన్నపూర్ణగా పాలమూరు..

అన్నపూర్ణగా-పామూరు..పాలమూరు..ఈ పేరు వింటే ఇప్పటిదాకా మనకళ్ళముందు కదలాడేది వెనుకబడిన జిల్లా. కరవుజిల్లా. వలస జిల్లా. కన్నీళ్ళు, కష్టాలు…

పాలమూరులో సాగుకు యోగ్యమైన భూమి, సారవంతమైన భూమి పెద్దమొత్తంలోనే ఉంది. పక్కనే వున్న కృష్ణమ్మ పరవళ్ళతో పచ్చగా కళకళలాడాల్సిన పాలమూరు సమైక్య పాలనలో అడుగడుగునా దగాపడిరది. ఇలా దగాపడిన ఈ ప్రాంత మట్టిబిడ్డలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు నడుంబిగించారు.

వెనుకబడిన ఈ ప్రాంతం కోసం 2002లోనే ఉద్యమ నాయకునిగా కె.సి.ఆర్‌ పాదయాత్ర చేశారు. తమ బాగుకోసం పోరాడాడన్న కృతజ్ఞతతో 2009 ఎన్నికలలో పాలమూరు ప్రజలు కె.సి.ఆర్‌కు హారతిపట్టి పార్లమెంటు సభ్యునిగా గెలిపించుకున్నారు. ఉద్యమానికి ఊపిరులూదారు.

అందుకే, పాలమూరు మట్టిబిడ్డల రుణం తీర్చుకొనేందుకు, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు జూన్‌ 11న మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం కరివెల గ్రామం వద్ద శంకుస్థాపన చేసి, పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టుకు మహబూబ్‌నగర్‌ ప్రజల ఆరాధ్యదైవమైన కురుమూర్తి దేవునిపేరు పెడుతున్నట్టు సి.ఎం ప్రకటించారు.

ఈ రోజు నాకు గుండె నిండా సంతోషంగా వుంది. పుట్టిన తర్వాత జీవితంలో ప్రతికూల, అనుకూతలు వుంటాయి. మంచిపనులు చేసే అవకాశం, ప్రజల దుఃఖం పంచుకొనే అవకాశం జీవితంలో కొద్దిమందికే దక్కుతుంది. పాలమూరు బొట్టుబొట్టు కోసం పరితపిస్తున్న సమయంలోనే ఉద్యమం తొలిదశలో జోగులాంబ సన్నిధి నుంచి గద్వాల వరకూ పాదయాత్ర చేసి సమస్యలు తెలుసుకున్న. అందుకే, పాలమూరుని చేపట్టి ఈ జిల్లాను సస్యశ్యామలం చేయాని ఆనాడే అనుకున్న.’’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తన మనసులోని మాటను వెల్లడించారు.

ఈ పథకం శంకుస్థాపన అనంతరం భూత్పూరు మండల కేంద్రంలో జరిగిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.

‘‘మనవైపే ధర్మం వుంది. మన హక్కులు కాపాడుకుంటున్నం. మన నిధులు మనమే ఖర్చు చేసుకుంటున్నం. వలస జిల్లా పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు 35,250 కోట్ల రూపాయలతో ఈ పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టినం. తల తాకట్టు పెట్టైనా సరే ఈ ప్రాజెక్టుని నాలుగేళ్ళలో పూర్తి చేస్తం. చరిత్రలో ఎక్కడా లేనివిధంగా అనుకున్నది అనుకున్నట్టు జరిగేలా ఈ పథకాన్ని పూర్తి చేసేందుకు నేను శ్రమిస్తాను. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఇక్కడే కుర్చీ వేసుకొని పూర్తిచేస్తా. కృష్ణమ్మనీరు తెచ్చి పాలమూరు ప్రజల కాళ్ళు కడిగేందుకు క్యాబినెట్‌లో నిర్ణయించి ఈ రోజు పాలమూరు పథకానికి శంకుస్థాపన చేశా’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు కలిపి 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. కృష్ణానదిలో మనకున్న వాటాను బాజాప్తా తీసుకుంటం అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు స్పష్టంచేశారు. ‘‘దేశంలో ఎక్కడికెళ్ళినా కనిపించే కూలీల్లో పాలమూరు బిడ్డలే వుంటారు. ఉద్యమ కాలంలో ఇక్కడి కష్టాలు కళ్ళారా చూశాను. వెనుకబడిన మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు ఈ ఎత్తిపోత పథకం వరదాయిని వంటిది.’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల అతితక్కువ ముంపు ఉండాలని ఆలోచించి, రాత్రింబవళ్ళు పనిచేసి ప్రాజెక్టు ప్రణాళిక రూపొందించినట్టు కె.సి.ఆర్‌ వెల్లడించారు. బట్టుపల్లితోపాటు మూడు తండాలు ముంపునకు గురవుతాయని, ముంపు ప్రాంతాలలో ప్రతి ఇంటికో ఉద్యోగం ఇస్తాం. ఎన్ని లక్షలు ఖర్చయినా సరే ప్రాజెక్టు కింద రైతు భూములు కొనుగోలు చేసి ఇస్తాం. ప్రాజెక్టు పనులు ప్రారంభం అయ్యే లోపే ఉద్యోగాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నిర్వాసితులందరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు.

గట్టు కాల్వకు 20 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్టు, పాలెంలో వ్యవసాయ డిగ్రీకళాశాల ఏర్పాటుచేస్తామని కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. పాలమూరు ఎత్తిపోతలకు ఓ.ఎస్‌.డి.గా మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన రంగారెడ్డిని నియమిస్తున్నట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్‌ రావు, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, మహేందర్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. సభ అనంతరం ముఖ్యమంత్రి హెలికాఫ్టర్లో ప్రతిపాదిత ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించారు.

13 లక్షల ఎకరాలకు సాగునీరు

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు శంకుస్థాపన చేసిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకాల ద్వారా 13 లక్షల ఎకరాల భూమి సాగులోకి వస్తుంది. పాలమూరు జిల్లా ప్రజలకు తాగునీరు, సాగునీటిని అందించేందుకు పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 35,250 కోట్ల రూపాయ వ్యయంతోనూ, ఫ్లోరైడ్‌ పీడిత నల్లగొండ జిల్లాకు శాశ్వత పరిష్కారం చూపేలా 6,190 కోట్ల రూపాయల వ్యయంతో డిండి ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. శ్రీశైలం రిజర్వాయరు నుంచి పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలకు 70 టి.ఎం.సి.లు, డిండి ప్రాజెక్టుకు 30 టి.ఎం.సి.లు, అదనంగా హైదరాబాద్‌ నగరానికి 20 టి.ఎం.సి.ల నీటిని తరలిస్తారు.

రెండున్నరేళ్లలో డిండి ప్రాజెక్టు పూర్తి

డిండి ఎత్తిపోతల పథకానికి నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలం శివన్నగూడెంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు జూలై 12న శంకుస్థాపన చేశారు. మంత్రులు హరీష్‌ రావు, జగదీశ్‌ రెడ్డిలతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. జోరుగా కురుస్తున్న వర్షాన్ని సయితం లెక్కచేయకుండా రోడ్డు మార్గంలో వచ్చి ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనం పునాది మొదలు పెట్టగానే అక్షింతలు వేసినట్టుగా చినుకులు పడ్డాయని ముఖ్యమంత్రి సభికులను ఉత్తేజపరిచారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో సి.ఎం కె.సి.ఆర్‌ మాట్లాడుతూ, ఏది ఏమైనా, ఎంత కష్టమైనా నూటికి నూరుశాతం ఈ ప్రాజెక్టును రాగల రెండున్నరేళ్లలోనే పూర్తి చేస్తామన్నారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలైన దేవరకొండ, మునుగోడు ప్రాంతాలకు తాగునీరు, సాగునీరు అందిస్తామన్నారు. మునుగోడు, దేవరకొండ ప్రాంతాలు భయంకరమైన ఫ్లోరైడు ప్రభావితమై, లక్షమంది పైచిలుకు ప్రజలు నడుములు కుంగిపోయి, బొక్కలు వంగిపోయి, జీవితాలే నాశనమైన పరిస్థితుల్లో కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఏమీ జరగలేదని, ప్రధాని దృష్టికి తీసుకొని వెళ్ళినా ప్రయోజనం లేకుండా పోయిందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తంచేశారు.

ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల భూమి కోల్పోయిన వారికి రూపాయికి 5 రూపాయలు పరిహారం చెల్లిస్తామని, కడుపులో పెట్టుకొని చూసుకుంటామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. భూమి కోల్పోయిన వారికి, దొరికితే ఇదే ప్రాజెక్టుకింద భూమి కొని ఇస్తామన్నారు. ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగమిస్తామని, ఒకే కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు చదువుకున్నవారు వున్నా వారికి కూడా ఉద్యోగావకాశం కల్పిస్తామని చెప్పారు. ‘‘ఇది మన రాష్ట్రం. మన బతుకు..40, 50 ఊళ్లు బాగుపడేటప్పుడు, నీళ్లొచ్చేటప్పుడు 3, 4 ఊళ్లు మునిగిపోతే ఆ బిడ్డలను కడుపులో పెట్టుకోవడం మన బాధ్యత. కాబట్టి ప్రభుత్వం ఎంతచేసినా తక్కువే. అందువల్ల కుటుంబంలో ఎందరున్నా, అవసరమైతే మీ గురించి రెండువేల ఉద్యోగాలు సృష్టించయినా సరే, స్పెషల్‌ రిక్రూట్మెంట్‌ పెట్టి మీకు ఉద్యోగాలు ఇచ్చి, ఆర్డరు ఇచ్చిన తరువాతే ఈ ప్రాజెక్టు పని మొదలైతది’’ అని ముఖ్యమంత్రి అభయమిచ్చారు. నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లుకూడా కట్టించి ఇస్తామన్నారు.

ఈ సభలో జిల్లా మంత్రి జగదీష్‌ రెడ్డి మాట్లాడుతూ, తరాల తరబడి వేధిస్తున్న ఫ్లోరోసిస్‌ పీడ విరగడచేయడానికి డిండి ఎత్తిపోతల పథకం రూపొందించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌.కు ఘన స్వాగతం పలికారు.