|

అన్ని మారుతున్నయి!

అన్నవరం దేవేందర్‌

ఇదివరకున్న పిల్లబాట కొన్ని రోజులు తొవ్వ అయ్యింది. ఆ తర్వాత అదే దారి అయ్యింది. ఇప్పుడంతా రోడ్‌ అయి కూసున్నది. పోవుడు అటే నడక మారవచ్చు గని తొవ్వపోయి రోడ్‌ అవుడు ఒక మార్పు. మార్పు ఎప్పుడు మంచికే అనుకుంటం గని మన సంస్కృతి భాష మారిపోవడం జరంత మంచిగ లేదు.

యారాలు పోయి తోటికోడలు అయ్యె. సడ్డకుడు పొయ్యి తొడల్లుడు అవుడు మంచికేనా? జరంత క్లాస్‌ భాష అనుకుందామా! తాతల తండ్రుల కాలంల నీ బిడ్డను ఏ ఊరికి ఇచ్చినవు అనేది ఇప్పుడు నీ కూతురు అత్తగారు ఏ ఊరు అంటున్నరు. రామ సక్కదనమైన మాట బిడ్డ పోయి కూతురు అయింది. తానం చేసుడు పోయి స్నానం అయి తర్వాత బాతింగ్‌ అయ్యింది. బువ్వ తినుడు మరిచిపోయి అన్నం అంటు తర్వాత రైస్‌ తింటన్నం. గడ్క మరిచే పోతున్న కాలం. భాషతో పాటు సంస్కృతి, వేషం సుత మారుడు, కొన్ని సౌలతులకు మారుతె మానాయెగని ఒగల్ని సూసి ఒగలు ఫ్యాషన్‌లల్ల పోతన్నరు. పూర్వకాలంల కట్టిన దోతులు, లుంగీలు పోయి పైంట్లు చేరినయి. ఇంకో పది ఇరవై ఎండ్లు పోతే దోతి కట్టిన మానవుడే కన్పియ్యడు. అట్లనే లుంగీలు కూడా కట్టడం అల్కగ ఉంటుండె రాను రాను ఊర్లల్ల సుత లుంగీలు పోయి ఇరవైనాలుగు గంటలు పైంట్లు ఏస్తున్నరు. పైంట్లు ఏస్తే గాలి పోదు రాదు. ఒక్క మగోల్లే కాదు ఆడోల్లు కూడా చీరల కట్టులో మార్పులు వచ్చినయి. పాతయి మోటె అయి, కొత్తయి శానత్తం అయితన్నయి.

మార్పు ఆధునికతను అందుకోవాల్సిందే గని మన సంస్కృతిని ఇడిశిపెట్టి పరాయి సంస్కృతిని పట్టుకోవడం ఎక్కువ అవుతున్నది. భాష, కట్టు బొట్టు నుంచి పండుగలు సుత అట్లనే అయితన్నయి. బతుకమ్మ పండుగ తెలంగాణ పల్లెలకు పెద్ద పండుగ. ఇది ఆడవాల్లు ఎక్కువ ఇష్టపడే పండుగ. సంబురమైన పండుగ. యాభై అరువై ఏండ్లుగ కొంత మరుగున పడ్డా తెలంగాణ ఉద్యమం వల్ల మల్ల తేజోమానం అయ్యింది. బతుకమ్మ పండుగల మహిళలు, సుట్టు తిరుగుకుంట చప్పట్లు కొట్టుకుంట బతుకమ్మ పాటలు ఒగలు చెప్పుతాంటె మరొకలు కోరస్‌ పాడుతరు. అయితే ఈ రెండు మూడేండ్లల్ల బతుకమ్మ ఆడే మైదానంల కోలాటం ఏస్తున్నరు. సుట్టు తిరిగే పద్ధతి పోయి మరాఠా కల్చర్‌ వచ్చింది. అందరు కోలలు తెచ్చుకొని యువతీ యువకులు ఆడుతున్నరు. అయితె కోలలతో ఆడవద్దని కాదు. అది మంచిగలేదని కాదు. నిజానికి బతుకమ్మ రాగయుక్తంగా ఒక కథాంశంతో పాట నడిస్తే కోలాటం జోష్‌ లోనే అడుతరు. ఆ కోలాటం వచ్చి బతుకమ్మను డామినేట్‌ చేస్తుంది. అయితే అదీ ఇది ఆడవచ్చు గని మన కల్చర్‌ పురాగ కరిగిపోతుంది.

అట్లనే మనం ఎనుకట గుడాలు బుక్కేది జొన్న రొట్టెలు చేసికునేది. సర్వపిండి పెట్టుకునేది. ఉప్పుడు పిండి పోసుకునేది. ఇప్పుడు అవ్వన్నీ పోయి కొత్తయి చేరినయి. ఇంతెందుకు ఎన్కట ఊర్లల్ల బరండి షాపులు లేనే లేవు. కల్లు మాత్రమే తాగేది. ఇప్పుడు కల్లు దొరుకుతంది గని ఆ కల్లు గీసే యువతరం లేదు. కల్లు సేవనంను మరొకటి ఆవహించింది. చాలా సంస్కృతులు మారడం కన్పిస్తున్నది.

ఇండ్లల్ల జరిగే చిన్న చిన్న పండుగలు పబోజనాలు జరిగేది. ఎవలన్న పుష్యవతి అయితే ఇంటి ఆడబిడ్డలు, మ్యానత్తలు, అమ్మమ్మలు గల్సి కొత్త చీరకట్టిచ్చేది. కొంత రహస్యంగానే ఉండేది. ఇప్పుడు అన్ని బహిరంగమే. పెద్ద పెద్ద ఫంక్షన్‌ హాల్లు తీసుకొని ఫోటోలు వీడియోలు డి.జె. సౌండ్‌లతో ఫంక్షన్‌ నిర్వహిస్తున్నరు. పైసలు ఉన్నవాల్లు అయితే ఏం లేదు కని లేనోల్ల సంగతి ఎట్ల. ఇదొక అవసరంగా మారిపోయింది. పెండ్లిల్లు కూడా ఊర్లల్ల ఇప్పుడు ఇంటి ముందల చేస్తలేరు. ఫంక్షన్‌ హాల్లల్లనే అయితన్నయి. భాష సంస్కృతి ఏషం తినే తిండి తాగే నీళ్ళు కూడా పురాగ మారిపోయినయి. ఇరవై ఏండ్ల కింద శాద బాయిల నీళ్ళు తాగితె ఎవ్వలకు ఏం కాలేదు. మెల్లగ మెల్లగ నల్ల నీళ్ళు వచ్చినయి ఆవి కూడా అందరం కల్సి తాగినం. తర్వాత తర్వాత మినరల్‌ వాటర్‌ అలవాటు అయినయి. అవి నీళ్లే. ఇవి నీళ్ళే. కని మంచి నీల్లుగ మారిపోయినయి. ఏ పల్లెటూల్ల సుత మినరల్‌ వాటర్‌లే తాగుతున్నరు.

ఒకందుకు మంచిదే కావచ్చు. అంటురోగాలు రాకుండా అరికట్టుతాయనుకుంటే కొన్ని చోట్ల మినరల్‌ వాటర్‌ తాగితే మోకాల్లు నొస్తున్నయి అంటున్నరు. అన్ని మారుతున్నయి. మారడం అవసరమే కావచ్చు గాని మన బతుకమ్మ ఆట ఇతర ఏ రాష్ట్రంల ఆడుతలేరు. తోటి తెలుగువాల్లు కూడా ఆడరు. పక్కన కూడ ఎక్కడ ఆడరు. మనం మాత్రం అక్కడి కోలాటం మస్తుగ ఆడుతున్నం.