| |

అలరించిన బాలల చిత్రోత్సవం

children-festvelశ్రీ టి. ఉడయవర్లు

” దుర్మార్గానికే, దు:ఖాలకే ఇవతల గట్టున తొంగి తొంగి చూస్తున్న లోకం బాల్యం-ఈ లోకం ఎత్తిన వెన్నెల బావుటాలు బతుకులో చల్లదనాన్ని రెపరెపలాడిస్తాయి” అన్నాడు మహాకవి దాశరథి.

అందుకే దేశం మొత్తం మీద ఉన్న కోట్లాది మంది బాలలను అన్యాయాలకు, ఆరాటాలకు, ఆక్రందనలకు, ఆర్భాటాలకు, దాపరికాలకు, దొంగవేషాలకు దూరంగా ఉంచడానికి, వినిర్మలానంద పథాల మీద, నీడలు లేని మెత్తని వెన్నెల్లో, ముళ్ళులేని పూవుతీగల ప్రక్కగా బాల్యావస్థ నుంచి యుక్త వయస్కులుగా తీర్చిదిద్దడానికి అవసరమైన చలన చిత్రాలు నిర్మించవలసిన బాధ్యత చలన చిత్ర ప్రముఖులపై ఎంతైనా ఉన్నది. సంఖ్యాపరంగా ఇతర దేశాలతో పోల్చి చూస్తే ఎక్కువ కథా చిత్రాలు నిర్మిస్తున్నప్పటికి భారతదేశంలో బాలల చిత్రాల సంఖ్య మాత్రం వీళ్ళమీద లెక్కించవచ్చు. నిర్మాణమవుతున్న చిత్రాలలో బాలల చిత్రాలు రెండు లేదా మూడు శాతం మాత్రమే.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బాలల కోసం ప్రత్యేకంగా చలన చిత్రాలు నిర్మించడానికి, బాలల చిత్రాలను పంపిణీ చేయడానికి ఒక ప్రత్యేక సంస్థను ” చిల్డ్రన్స్‌ ఫిలి సొసైటీ ఆఫ్‌ ఇండియా” 1955లో ఏర్పాటు చేసింది.

చలన చిత్రాల ద్వారా బాలల్లో సృజనాత్మక శక్తిని, వ్యక్తిగత వికాసాన్ని పెంపొందించడానికి వీలుగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని బాలల చిత్రాల నిర్మాణానికి డబ్బింగ్‌, పంపిణీ, ప్రదర్శన రంగాలలో సేవ చేస్తున్నది. 1979వ సంవత్సరం బాబాయిలో తొలిసారి అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం పారిస్‌లోని అంతర్జాతీయ చలనచిత్ర నిర్మాతల సంఘం చేత బాలల కథా చిత్రాల, లఘు చిత్రాల ప్రత్యేక పోటీ ఉత్సవంగా గుర్తింపు పొందింది. అంతేకాదు పారిస్‌లోని ‘ది ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఫిల్మ్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ అండ్‌ ఎంగ్‌ పీపుల్‌’ దీన్ని ‘ఎ’ శ్రేణి చలన చిత్రోత్సవంగా వర్గీకరించింది. పారిస్‌, లాస్‌ ఏంజిల్స్‌, మాస్కో ఇత్యాదిచోట్ల జరిగే చలన చిత్రోత్సవాలతో సరిసమానమైన మేటి ఉత్సవంగా వీటిని పరిగణిస్తారు.

బాలల దినోత్సవంగా దేశమంతా వేడుకలు జరిపే తొలి ప్రధాని పండిత జవహర్‌లాల్‌ నెహ్రూ జన్మదినమైన నవంబర్‌ 14వ తేదీ నుంచి పది రోజులపాటు ఈ బాలల వెండితెర పండుగను రంగరంగవైభవంగా రెండేండ్ల కొకసారి నిర్వహి స్తున్నారు. బొంబాయిలో జరిగిన ఈ బాలల చలన చిత్రోత్స వాన్ని దేశంలోని మహానగరాల్లో నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్‌లో మొట్టమొదటిసారి 1995లో తొమ్మిదవ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం ఘనంగా జరిపారు. ఆ తర్వాత 1977లో పదవ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం కూడా వైభవంగా జరిపిన పిదప హైదరాబాద్‌ నగరమే ఈ బాలల అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు నిర్వహించే శాశ్వత వేదికైంది.

తాజాగా నిర్వహించిన ఈ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవానికి అత్యధికంగా ఎనభై దేశాలకు చెందిన 1204 ఎంట్రీలు రాగా 200 చిత్రాలను నాలుగు విభాగాలకు ఎంపిక చేసి ప్రదర్శించారు.

ఈ యేడాది బుల్లి దర్శకుల పోటీ విభాగం ఏర్పాటు చేసి బాల దర్శకులకు అవకాశం కల్పించడం జరిగింది. దీనివల్ల బుల్లి దర్శకుల చిత్రాలు విదేశాలలో ప్రదర్శించే అవకాశం లభించడంతోపాటు, వాటితో కొన్నింటిని ఎంపికచేసి దేశంలోని ఇతర ప్రాంతాల్లో ప్రదర్శించేందుకు సిఎఫ్‌ఎస్‌ఐ కార్యాచరణ చేపడుతుంది.

చిత్రోత్సవాలను నవంబర్‌ 14వ తేదీన శిల్పకళా వేదికలో కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి కల్నల్‌ రాజవర్ధన్‌ రాథోర్‌ ”జ్యోతి” వెలిగించి ప్రారంభించారు. రాష్ట్ర వాణిజ్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. తిరిగి అక్కడే జరిగిన ఉత్సవ సమాపనోత్సవంలో రాష్ట్ర గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని, విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసం గిస్తూ బాల దర్శకులను ” మిలమిల మెరిసే చిన్నారి తారలు” గా అభివర్ణించారు. ముగింపు ఉత్సవంలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్‌ కె.వి. రమణాచారి ప్రసంగిస్తూ ఎప్పుడో హైదరాబాద్‌లో శంకుస్థాన చేసిన ” బాలల ఫిలిం కాంప్లెక్స్‌” నిర్మాణం త్వరలో ప్రారంభించి 2017 నాటికి పూర్తిచేసి 20వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం అందరికీ విజయవంతంగా నిర్వహించాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

చిత్రోత్సవ ప్రధాన థియేటర్‌ – ప్రసాద్‌ ఐమాక్స్‌లో మొట్టమొదటి ఓపెన్‌ ఫోరమ్‌లో సిఎఫ్‌ఎస్‌ఐ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు ముఖేష్‌ ఖన్నా మాట్లాడుతూ బాలల్లో నైతిక విలువలను పెంచే పాత్రలు గల గొప్ప స్థానిక కథ ఆధారంగా బాలల చిత్రాలు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.

మరొక రోజు ఓపెన్‌ ఫోరమ్‌లో రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి జయేష్‌ రాజన్‌ మాట్లాడుతూ కొత్త గ్రాడ్యుయేటర్లకు చోటిచ్చే విధంగా సామర్థ్యం పెంచడంతోపాటుగా అన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని ”డిడెకేటెడ్‌ క్లస్టర్లు” సమకూర్చే విధంగా తెలంగాణ యానిమేషన్‌ విధానం ప్రతిపాదించినట్టు చెప్పారు.

చిన్ని దర్శకుల జ్యూరీ అధ్యక్షుడు అల్లాణి శ్రీధర్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఐదేండ్ల ప్రాయం నుంచి పదహారేండ్ల బాలలు నిర్మించిన సృజనాత్మక చలన చిత్రాలు తిలకించడం తమకు లభించిన అధ్భుత అవకాశమన్నారు. వాటిలో ఎవరు తీసింది గొప్ప చిత్రమో ఎంపిక చేయడం కష్టసాధ్యంగా ఉందన్నారు. అన్ని విభాగాల జ్యూరీలు దాదాపు ఇదే అభిప్రాయం వెల్లడించడం వల్ల రాసే కాకుండా వాసిలో చిత్రాలు నాణ్యమైనవి స్ఫురిస్తున్నది. ఈ చిత్రోత్సవం వివిధ జ్యూరీలో తెలంగాణకు చెందిన నలుగురు ప్రముఖులు అల్లాణి శ్రీధర్‌, నాగబాల సురేష్‌కుమార్‌, ఎం. వేదకుమార్‌, ఆచార్య చక్రవర్తుల యానిమేషన్‌ బాలల జ్యూరీ అధ్యక్షుడుగా టిఎన్‌ఆర్‌ మోహిత్‌ ప్రాతినథ్యం వహించడం విశేషం. వివిధ జ్యూరీల్లోని తెలంగాణ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ భావిభారత పౌరులైన బాలల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సృజనాత్మకంగా సాంస్కృతికంగా వారి సమగ్ర అభివృద్ధికి దోహదం చేసే ‘డిస్నీల్యాండ్‌’ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించవలసిందిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు స్థానిక దర్శకనిర్మాతలు విజ్ఞాపన పత్రం సమర్పించనున్నట్లు తెలిపారు.

దేశ విదేశాలకు చెందిన సృజనాత్మక దర్శకులు నిర్మించిన బాలల చలన చిత్రాలు ఒకే ఛత్రం క్రింద ప్రదర్శించడం వల్ల ఆయా దేశాల దేషభాషలు, సంప్రదాయాలు, కథా విన్యాసాలు, నీతులు, రేతులు ఒక్క మాటలో సంస్కృతిని బాలలు అవగాహన చేసుకునే అవకాశం లభించింది. ఇలాంటి అవకాశాన్ని బాలలు సద్వినియోగం చేసుకోవాలనీ, దర్శకనిర్మాతలు కేవలం చిత్రోత్సవాలను మాత్రమే దృష్టిలో ఉంచుకొని బాలల చిత్రాలు నిర్మించకుండా ఇకముందు మాపేటోను కూడా దృష్టిలో ఉంచుకొని తీయాలని ముఖేష్‌ఖన్నా అభిప్రాయపడ్డారు.

ఈ చిత్రోత్సవంలో ప్రదర్శించిన ”అబ్దుల్‌” చిత్ర నిర్మాత రవిశంకర్‌ కంఠమనేని మీడియాతో మాట్లాడుతూ సృజనాత్మక రీతిలో లఘు చిత్రాలు నిర్మించే దర్శకులకు, స్వల్ప నిడివి బాలల చిత్రాలు తీసేవారికి తెలుగువన్‌ డాట్‌ కామ్‌ పక్షాన అవసరమైన సహాయం ఉచితంగా చేస్తున్నామనీ, ఇకముందు కొనసాగిస్తామని తెలిపారు.

ప్రముఖ దర్శకుడు లక్ష్మణరేఖ గోపాలకృష్ణ రచించిన ” గాన స్వర మాంత్రికులు” అనే గ్రంథాన్ని ప్రసాద్‌ ఐమాక్స్‌లోని సమాచార శాఖ ఏర్పాటు చేసిన మీడియాసెంటర్‌లో సమాచార శాఖ కమిషనర్‌ నవీన్‌మిత్తల్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ భారతీయ చలన చిత్రాలలో సంగీతం, నృత్యాలది ప్రధాన భూమిక అని ఆయన వివరిస్తున్న సినీ సంగీత కారులపై గోపాలకృష్ణ ఈ గ్రంథం వెలువరించినందుకు అభినందించారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ డైరెక్టర్‌ సుభాష్‌ కూడా పాల్గొన్నారు.

ఈ ఉత్సవాల్లో చలన చిత్ర ప్రక్రియకు సంబంధించిన పలు ప్రక్రియలలో బాలలకు వర్క్‌ షాపులు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వికలాంగ బాలలకు ప్రత్యేక షోలు ప్రదర్శించారు.

తాజాగా నిర్వహించిన ఈ 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంతో కలుపుకొని పదకొండు పర్యాయాలు అంతే గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఈ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలను హైదరాబాద్‌ నిర్వహిస్తున్నాము. హైదరాబాద్‌ ఈ ఉత్సవాల చిరునామా అయినందున రెండు దశాబ్దాల క్రితమే అప్పటి ముఖ్యమంత్రి అప్పటి చిల్డ్రన్స్‌ ఫిలిం సొసైటీ ఆఫ్‌ ఇండియాకు హామీ ఇచ్చిన మేరకు జూబ్లీహిల్స్‌లో స్థలం కేటాయించగా, అనంతర సంవత్సరం కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రిగా ఉన్న ఎస్‌. జైపాల్‌రెడ్డి ” బాలల ఫిలిం కాంప్లెక్స్‌”కు శంకుస్థాపన కూడా చేశాడు. తదుపరి అంత ర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం ఈ కాంప్లెక్స్‌లోనే నిర్వహిస్తా మనే హామీ కూడా ఇచ్చారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులు అక్కడికి వెళ్ళడానికి వెనకాముందూ చేస్తున్నట్టుగానే, హైదరాబాద్‌లో సిఎఫ్‌ఎస్‌ఐ కార్యాలయం వస్తే ముంబైలో స్థిరపడిన ఆ ఉద్యోగులు హైదరాబాద్‌ రావలసివస్తుంది కనుక ఏవో కుంటి సాకులు చూపుతూ ” బాలల ఫిలిం కాంప్లెక్స్‌” నిర్మాణం జరగకుండా ఎప్పుడో కేంద్రం ప్రకటించిన ఈ చలన చిత్రోత్సవాల శాశ్వత వేదిక హైదరాబాద్‌ అనే విషయాన్ని ఎప్పటికప్పుడు కొత్తగా వహిస్తున్న ప్రభుత్వాలను తప్పు త్రోవపట్టిస్తూ వస్తున్నారు.

ఏది ఏమైనా హైదరాబాద్‌లో జరిగిన వారం రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం మాత్రం సుమారు మూడు లక్షల మంది బాలలు తమ ఇష్టానుసారంగా నచ్చిన చిత్రాలు చూసి ఆనందోత్సాహాలతో తమ తమ ఇండ్లకు వెళ్ళారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించి, ఈసారి తొలి పర్యాయం తెలంగాణ జిల్లా కేంద్రాలన్నింటిలో బాలల చిత్రాలు విజయవంతంగా ప్రదర్శించింది. హైదరాబాద్‌ – సికింద్రాబాద్‌ జంటనగరాల్లో 15 థియేటర్లలో బాలల చిత్రాలు ప్రదర్శించారు. ఎప్పుడూ నగర బాలలకే పరిమితమైన ఈ చలన చిత్రోత్సవం ఈ సారి గ్రామీణ బాలల కోసం అన్ని జిల్లాలకు విస్తరించారు.

ఈ చలన చిత్రోత్సవంలో పాల్గొనడానికి దేశవిదేశాల నుంచి పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులందరికీ ఒకే ఫైవ్‌స్టార్‌ హోటెల్‌లో తొలిసారి అన్ని వసతులుగల బస కల్పించారు. పాఠశాల విద్యార్థులను థియేటర్లకు చేరవేయడానికి అరవై బస్సులు ఏర్పాటు చేశారు. వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి చిత్రాల గురించి వివరించేందుకు శిక్షణ ఇచ్చి నియామకం చేశారు. ఈ చిత్రాలు ప్రదర్శించే థియేటర్ల వద్దనే కాకుండా జంటనగరాల్లోని ముఖ్య కూడళ్ళలో హోర్డింగ్‌లు పెట్టి చక్కని పోస్టర్లు, విద్యుద్దీపాలతో అలంకరించి పండుగ వాతావరణం కల్పించారు.

ఈ సారి రాష్ట్ర ప్రభుత్వం ఏఏ అంశాలు నిర్వహించాలి, సిఎఫ్‌ఎస్‌ఐ ఏ అంశాలు నిర్వహించాలి అనేవి ముందుగానే నిర్ణయించుకొని తాము చేయవలసిన పనులన్నీ చేశామని 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం ప్రత్యేక అధికారి జి.కిషన్‌రావు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ ఉత్సవాలకు ఒఎస్‌డిగా సమాచార శాఖ పూర్వ డైరెక్టర్‌ సుభాష్‌ గౌడ్‌ వ్యవహరించారు.

అయితే చాలా మంది ప్రతినిధులు ఆన్‌లైన్‌లో ముందుగా రిజిస్ట్రర్‌ చేసుకున్నా ఉత్సవం అయిపోయే వరకు తమకు గుర్తింపు కార్డులు రాలేదని ఫిర్యాదు చేశారు. అట్లాగే ఈ చిత్రానికి ఏఏ విభాగం క్రింద ఏఏ చిత్రాలు ఎంపిక చేశారో, వాటి కథాంశాలు, ఛాయా చిత్రాలతో ఏ చిన్న చలన చిత్రోత్సవంలోనైనా ప్రచురించే ” క్యాటలాగ్‌ను ప్రచురించడంలో సిఎఫ్‌ఎస్‌ఐ ఈ ఏడాది విఫలం కావడం వల్ల మొత్తం గందరగోళ పరిస్థితి ఏర్పడింది. బహుశా, ‘క్యాటలాగ్‌’ లేకుండా అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం నిర్వహించం ప్రపంచంలోనే ఈసారి సిఎఫ్‌ఎస్‌ఐ రికార్డు సృష్టించింది.