అవధానం-తెలంగాణం కొప్పరపు కవుల అనుబంధం

మాశర్మ


‘‘అవధానం’’ కేవలం తెలుగు భాషలోనే పరమాద్భుతంగా వికాసం చెందిన పరమ విశిష్ట సాహిత్య ప్రక్రియ. ఈ కళను అనుసరించడానికి, అనుకరించడానికి హిందీ, తమిళ, కన్నడ భాషీయులు ఎంత కృషిచేసినా, సాధించలేకపోయారు. కన్నడంలో కొంత నడుస్తోంది. తెలుగు అవధానాల స్థాయికి ఎవ్వరూ చేరలేకపోయారు. దుర్భేద్యమైన తెలుగు పద్య ఛందో, వ్యాకరణాల పునాదులపై నిర్మాణమైన మహా సాహిత్య సౌధం ‘‘అవధానం’’. అష్టావధానాలు, శతావధానాలు, సహస్రావధానాలుగా, అవధానవిద్య పద్యపుష్ప పరీమళార్చనా కళాశీలమై అనంతఖ్యాతితో విరాజిల్లుతోంది. ఇంతటి సాంస్కృతిక వైభవాన్ని సంతరించుకున్న అవధానవిద్యకు తెలంగాణలో బలమైన మూలాలు దాగివున్నాయి.

తెలంగాణకు – అవధానానికి, ఆశుకవిత్వానికి ఉన్న బంధం చారిత్రకం. ఈ నేలతో కొప్పరపువారు పెనవేసుకున్న కవితాబంధం సుమనోహర సుగంధం. ప్రఖ్యాత పురావస్తు పరిశోధకులైన శేషాద్రి రమణకవులు శతావధాన విద్యా వికాసం గురించి చెబుతూ, ‘‘చరిగొండ ధర్ముడను సత్కవిచంద్రుడు నవకంపు మొక్కను నాటినాడు’’ అంటారు. చరిగొండ ధర్మన్నకు ‘నవఘంట సురత్రాణ’, ‘శత లేఖినీ అవధాన పద్య రచనా సంధాన, శత ఘంట సురత్రాణ’ మొదలైన బిరుదులు ఉన్నాయి. దీన్ని బట్టి, గంటకు నూరు పద్యాలు ఆశువుగా అల్లే ప్రజ్ఞ, శతావధాన నిర్వహణా ప్రతిభలు చరిగొండ ధర్మన్నకు ఉన్నాయని అర్ధమవుతోంది. ఈయన పాలమూరు ప్రాంతానికి చెందిన కవి. చరిగొండ సీమగా చెప్పుకొనే కల్వకుర్తి మండలంలో ఉన్న చరిగొండ ఈ కవి స్వగ్రామం. ఈయన చిత్రభారతమనే కావ్యాన్ని రాశాడు. దీని ద్వారా కూడా ఈయన ప్రసిద్ధుడయ్యాడు. కరీంనగర్‌ ప్రాంతంలోని ధర్మపురికి చెందిన పెద్దనమంత్రికి ఈ కావ్యం అంకితం ఇవ్వడం వల్ల, ఈ కవిని కరీంనగర్‌ జిల్లా కవిగానూ పరిగణిస్తారు. కొంగ్రొత్త సొగసుతో, పరిమళాలతో సరికొత్త శతావధానమనే మొక్కను నాటినవాడు చరిగొండ ధర్మన్న. క్రీ.శ.1480 -1580 మధ్య కాలం వాడుగా తెలుస్తోంది.

శేషాద్రి రమణకవులు స్వయంగా అవధానాలు కూడా చేశారు. వీరు తెలంగాణ ప్రాంతంలో అంగుళం అంగుళం తిరిగి ఎన్నో శాసనాలు సేక రించారు. వీరు కో అని పిలిస్తే శాసనాలు ఓ అని పలుకుతాయని ఐతిహ్యం. వీరి అసలు పేర్లు దూపాటి శేషాచార్యులు, వేంకటరమణాచార్యులు. వీరికి శేషాద్రి రమణకవులు అని నామకరణం చేసినవారు కొప్పరపు సోదరకవులు. శతావధానాలు చరిత్రలో చరిగొండ ధర్మన్న స్థానం శిఖర సదృశమని వీరు చెప్పడం చారిత్రక విశేషం. కోలాచ మల్లినాథసూరి అనే ఒక మహనీయుడు ఉన్నాడు. ‘‘కొచెల్మాన్వయాబ్ధీన్ద్రుర్మల్లినాథో మహా యశాః శతావధాన విఖ్యాతో వీర రుద్రాభివర్షితః ‘‘అనే ఒక శ్లోకం అవధానాల చరిత్రలో ప్రసిద్ధం. మల్లినాథుడు శతావధానిగా విఖ్యాతుడని ఈ శ్లోకం చెబుతోంది. ఈ కవి సంస్కృత సంప్రదాయం నుండి వచ్చినవాడు. బహుశా! సంస్కృతంలో శతావధానం చేసి ఉండవచ్చు. ఇది వేదావధానమా, సాహిత్యావధానమా ఇంకా తేలాల్సి వుంది. వీరి కాలాదు స్పష్టంగా తెలియరావడం లేదు. ఈ మల్లినాథుడి మనవడి పేరు కూడా మల్లినాథుడు. సంస్కృత పంచకావ్యాలతో పాటు, మహాకవి కాళిదాసు కావ్యాలకు ఈయన చేసిన వ్యాఖ్య జగత్‌ ప్రసిద్ధం. సంజీవని పేరుతో మేఘ సందేశానికి మల్లినాథుడు చేసిన భాష్యం చాలా ప్రసిద్ధం. కోలాచ మల్లినాథసూరి 13-14 శతాబ్దాలకు చెందిన పండితుడుగా తెలుస్తోంది.

శతావధానిగా విఖ్యాతి చెందిన వీరి తాతగారు మల్లినాథుడు, ఈయన కంటే కొన్ని దశాబ్దాల ముందువాడు. ఈ ఇంటి పేరు కొచ – కొలాచే – కొలిచా – కొలిచెమ, ఇలా రకరకాలుగా చెబుతారు. మెదక్‌ జిల్లా కేంద్రంకు 17 కిలోమీటర్ల దూరంలో కొల్చారం (కొలిచెమ) అనే ఒక గ్రామం ఉంది. ఈ ఇద్దరు మల్లినాథ సూరుది ఈ గ్రామమే అయి ఉంటుంది. జక్కన తాత పెద్దయామాత్యుడు అనే ఒక మహాకవి ఉన్నాడు. క్రీ.శ 1285 ప్రాంతంలో కాకతీయు ఆస్థానంలో తొలి శతావధానం చేసినట్లు చరిత్రలో నమోదైంది. ఇదే తొలి తెలుగు శతావధానంగా భావించవచ్చు. ఈ కవి సంస్కృతం, ప్రాకృతంలోనూ మహాపండితుడు. మహాకవి. ఘడియకు (24 నిముషాలు) ఒక శతకం ఆశువుగా చెప్పే కవితాశక్తి పెద్దయామాత్యుని సొత్తు. వేములవాడ భీమకవి తొలితరం తెలుగుకవిగా అభివర్ణిస్తారు. వేములవాడ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధమైన క్షేత్రం. శాపానుగ్రహ శక్తి సంపన్నుడుగా వేములవాడ భీమకవి చరిత్రలో సుప్రసిద్ధుడు. చాటువుల వలన ఈ విషయాలు తెలుస్తున్నాయి.

తెలుగు సాహిత్య చరిత్రలో ఆశుకవిత్వానికి ఆద్యులలో వేములవాడ భీమకవి ప్రథమ శ్రేణీయుడు. ‘‘వచియింతు వేములవాడ భీమన భంగిన్‌ ఉద్దండలీన్‌ ఒక్కొక్కమాటు’’ అని మహాకవి శ్రీనాథుడు పూర్వకవి స్తుతి చేశాడు. శ్రీనాథుడంతటి వాడు స్తుతి చేశాడంటే, భీమకవి ఎంతటి గొప్పవాడో అర్ధం చేసుకోవచ్చు. శ్రీనాథుడు కూడా ఆశుకవిత్వాన్ని పండిరచిన మహాకవి. వేములవాడ భీమకవి కాలం నన్నయ్య కాలానికి కాస్త అటుఇటుగా ఉంటుంది. 1660 ప్రాంతంలో చింతపల్లి వీరరాఘవకవి అవధానాలు చేసినట్లుగా తెలుస్తోంది. పాలమూరు అవధానాల చరిత్రలో వీరిపేరు ఉంది. మరింగంటి సింగనార్యుడు ‘దశరథ రాజనందన చరిత్రలో ‘‘శత ఘంటావధాన ప్రసిద్ధ, సాహిత్య సారస్వత ఆశుకవితా అష్టభాషా విశేషుడ’’, అని చెప్పుకున్నాడు. దీన్నిబట్టి, వీరు శతావధానాలు, ఎనిమిది భాషల్లో ఆశుకవిత్వం చెప్పినట్లుగా తెలుస్తోంది. వీరి తాతగారు మరింగంటి జగన్నాథసూరికి వినుత శతఘంట బిరుదాంక విజయుడైన, సరస శత పద్య లేఖినీ విరచనోక్తి, అని ప్రసిద్ధి ఉంది. ఇలా తాత, మనవడు ఇద్దరూ శతావధానాలు చేసినట్లు చరిత్రలో ఉంది. వీరు
15-16 శతాబ్దాలకు చెందినవారు. ఈ విధంగా, తెలంగాణ ప్రాంతంలో వేములవాడ భీమకవి, కొలాచ మల్లినాథుడు, పెద్దయామాత్యుడు, చరిగొండ ధర్మన, మరింగంటి జగన్నాథసూరి, మరింగంటి సింగనార్యుడు, చింతపల్లి వీరరాఘవకవి మొదలైనవారు క్రీ.శ 10 వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకూ అవధాన కళకు, ఆశుకవితాల ప్రదర్శనకు ఆలవాలమై నిలిచి సారస్వత మాగాణంలో సరస కవిత్వపు మణి మాణిక్యాల పందించారు. ఇదే నేలపై, కొండవీటి ప్రాంతానికి చెందిన కొప్పరపు కవులకు పరమాద్భుతమైన ఆదరణ లభించింది. ఈ మహనీయులందరినీ మనస్సులో నిలుపుకొని, కొప్పరపు కవులు పద్యసరస్వతికి కప్పురపు ఆరతుందించారు.

గంటకు ఐదు వందల పద్యాల వేగంతో ఆశువుగా పద్యాలు చెప్పి, గంటకొక ప్రబంధం ఆశువుగా నిర్మించి, రోజుకొక మహాశతావధానం చేసి అవధాన, ఆశుకవిత్వ సామ్రాజ్యంలో ఆగ్రగణ్యుగా అఖండ యశస్సు ఆర్జించిన కొప్పరపు సోదర కవులు వైభవంలో, కవితా ప్రస్థానంలో తెలంగాణతో అనిర్వచనీయమైన, అపురూపమైన అనుబంధం ఉంది. 1900 దశకం ప్రారంభం నుండి 1928 వరకూ దాదాపు మూడు దశాబ్దాల పాటు కొప్పరపు సోదరకవు ఇటు గద్వాల్‌-అటు చెన్నపట్నం వరకూ అవధాన, ఆశుకవితా సామ్రాజ్యంలో సార్వభౌములుగా వెలిగారు. కొప్పరపు సోదరకవులు (కొప్పరపు వేంకట సుబ్బరాయకవి-1885-1932-వేంకటరమణకవి-1887-1942). కొప్పరపువారిది కొండవీటి సీమ. గుంటూరు జిల్లా నరసరావుపేట దగ్గర కొప్పరం వీరి స్వగ్రామం. నరసరావుపేట ఒకప్పుడు వెమదొర సంస్థానం. అట్లూరుగా ఉండే ఈ గ్రామం నరసరావుపేటగా మారడానికి కారణభూతులు మరాజు వంశపు రాజు. వీరు అట్లూరు గ్రామాన్ని కొనుక్కున్నారు. కోటను నిర్మించారు. పట్టణంగా అభివృద్ధి చేశారు. ఈ గ్రామాన్ని నరసారాయనిపేటగా నామ కరణం చేశారు. తమ పరిపాలనా రాజధానిని వినుకొండ నుండి నరసరావుపేటకు మార్చారు. మరాజు వేంకట నరసారాయని పేరు మీద ఏర్పడిన ఈ పట్టణం, తదనంతరం వ్యావహారికంగా నరసరావుపేటగా పిలవబడుతోంది. ‘‘మలరాడ్వేంకట నారసింహ నరర్మాణిక్య సంస్థాన వర్తులు, నిస్తుల్య దిగంత విస్తృత సుకీర్తుల్‌’’ అని కొప్పరపువారు, వారి గురించి సాధ్వీ మాహాత్మ్యం (కుశలవ) కావ్యం అవతారిక పద్యాల్లో చెప్పుకున్నారు.

కొప్పరపు కవులకు ‘‘బాసరస్వతి’’ అనే బిరుదు కూడా ప్రదానం చేశారు. అంటే, ఈ కవులు అప్పుడు బాలురు అని అర్ధమవుతోంది. ఇది కొప్పరపు కవులు తమ కవితా జీవితంలో పొందిన మొట్టమొదటి బిరుద సత్కారం. దీనికి తెలంగాణసీమ భూమిక కావడం చారిత్రక విశేషం. ఇవి 1900 దశకం ప్రారంభం రోజులు అని తెలుస్తోంది. ‘‘ఏ యంబ బిరుదంబు నిప్పించె తొలుదొల్త, మణికొండ భూపామౌళి చేత’’, అని కొప్పరపు కవులు ఈ తొలి బిరుద సత్కార ఘట్టాన్ని అపురూపంగా అక్షరబద్ధం చేశారు. మణికొండ/మడికొండ వరంగల్‌ ప్రాంతంలో ఉంది. ఇది జరిగిన కొన్నాళ్ళకు హైదరాబాద్‌ లో సభ చేయమని వీరికి ఆహ్వానం వచ్చింది. హైదరాబాద్‌ సమీపంలోని అలవాల లష్కరు ప్రాంతంలో వీరు ఆశుకవిత్వ ప్రదర్శనం చేశారు. ఆదిరాజు తిరుమరావుగారి భవనంలో ఈ సభ జరిగింది. తిరుమరావుగారు ఈ సభను ఏర్పాటుచేశారు. కొప్పరపు కవులు చేసిన మొట్టమొదటి ఆశుకవిత్వ మహాసభ ఇదే. కొన్ని వేలమంది ఈ సభకు హాజరయ్యారు.

కొప్పరపువారి ఆశుకవితా వేగానికి, పద్యనిర్మాణ ప్రతిభకు అచ్చెరువు చెందిన రసజ్ఞ కవిపండిత మండలి ‘‘ముంగాలి బిరుదు’’ బహూకరించి, ఘన సత్కారం చేసింది. ముంగాలి బిరుదు అంటే, పాదములకు తొడిగే అందె. గండపెండెరం వంటింది. ఇంతటి మహాసభ నిర్వహణకు, సత్కార సౌందర్య సౌభాగ్యానికి మళ్ళీ తెలంగాణ ప్రాంతమే కొప్పరపు కవుల దీప్తికి వేదికగా నిలిచింది. ‘‘మహబూబ్‌ నగర్‌ జిల్లా-సంస్థానా ఖిల్లా’’ అంటారు. గద్వాల్‌ సంస్థానంలో ఉన్నత అధికారి, కవి ఆదిపూడి ప్రభాకరరావుగారు కొప్పరపుకవులకు ఆత్మీయుడు. గద్వాల్‌, ఆత్మకూరు, వనపర్తి, జటప్రోలు మొదలు అన్ని సంస్థానాల్లోనూ కొప్పరపు కవుల అవధాన, ఆశుకవిత్వ సభలు లెక్కకు మించి జరిగాయి. తెలంగాణసీమలో గజారోహణ, గండపెండేరాది ఘన గౌరవాలు ఎన్నో పొందారు. సుప్రసిద్ద వద్దిరాజు సోదరులు కొప్పరపు కవుల సభలు ఎక్కడ జరిగితే అక్కడకు వెళ్లేవారు. ఆ విశేషాలు శిష్యులు, ఆత్మీయులతో పంచుకునేవారు.

కొప్పరపువారి ప్రజ్ఞా ప్రదర్శన గురించి మాకు కథలు కథలుగా గురుదేవులు వద్దిరాజు సోదరులు చెప్పేవారని బిరుదురాజు రామరాజు స్వయంగా నాకు చెప్పారు. ప్రఖ్యాత కొమర్రాజు లక్ష్మణరావుగారి మేనల్లుడు కానూరి వీరభద్రరావు వివాహం 1913లో హైదరాబాద్‌లో జరిగింది. వీరభద్రరావు సుప్రసిధ్ధ ఇంజనీర్‌ డాక్టర్‌ కె.ఎల్‌. రావుగారికి సొంత అన్నయ్య. ఈ వివాహ సందర్భంగా కొప్పరపు కవులు ఆశుకవిత్వ మహాసభ జరిగింది. దేశవ్యాప్తంగా, కవులు, పండితులు, స్వాతంత్య్ర సమరయోధులు, అగ్రనాయకులెందరో ఈ సభలో పాల్గొన్నారు. ఈ మహామహుల సమక్షంలో కొప్పరపు వారికి ఘన సన్మానం జరిగింది. ఈ విశేషాలు ప్రముఖ పాత్రికేయ గురువులు, భాషా శాస్త్రవేత్త బూదరాజు రాధాకృష్ణ రాసిన కొమర్రాజు లక్ష్మణరావు గారి గ్రంథంలో ఉన్నాయి.

హైదరాబాద్‌ నగరంలోనూ కొప్పరపు కవులు అనేక సార్లు అవధానాలు చేశారు. దేవులపల్లి రామానుజ రావు, దేవులపల్లి వెంకటేశ్వరరావుగార్లకు సమీప బంధువు నెల్లుట్ల రామకృష్ణామాత్య. నెల్లుట్లవారు పూర్వీకుల అసఫ్‌ జాహీ సంస్థానంలో మంత్రులుగా పనిచేసేవారు. రామకృష్ణామాత్యకు పూర్వ ప్రధాన మంత్రి పివి నరసింహారావుతోనూ స్నేహం ఉంది. నెల్లుట్లవారు కొప్పరపువారికి వీరాభిమాని. బమ్మెర పోతన్న వంశానికి-నెల్లుట్లవారి వంశానికి దగ్గర సంబంధం కూడా ఉంది. తిరుపతి వేంకటకవుల-కొప్పరపు కవుల సాహిత్య సంగ్రామ నేపథ్యంలో, నెల్లుట్ల రామకృష్ణకవి ‘‘భావార్ణవం’’ అనే పద్య సంకనం రాశారు. ఇది రెండు భాగాలుగా వచ్చింది. ఈ గ్రంథాలకు పీఠికు కూడా దేవులపల్లి రామానుజరావు, వెంకటేశ్వరరావుగారు రాశారు. ఈ గ్రంథస్వామ్యం కొప్పరపువారికి ఇవ్వబడింది. ఇందులో పద్యాలు ధారాశుద్ధి బంధురంగా ఉంటాయి. ఈ పద్యాలు చూసిన చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారు ‘‘మమ్మల్ని తిడితే తిట్టావుకానీ, పద్యాలు అద్భుతంగా ఉన్నవి’’, అని రామకృష్ణకవిని ప్రశంసించారు. 1985 లో జరిగిన కొప్పరపు కవుల శతజయంతికి, 2005లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కొప్పరపు కవులకు నీరాజనంగా నిర్వహించిన అవధాన సప్తాహానికి మళ్ళీ హైదరాబాద్‌, తద్వారా, తెలంగాణ ప్రాంతం వేదికై నిలిచింది. 2004లో పివి నరసింహారావుగారు ఢల్లీ నుండి ప్రత్యేకంగా హైదరాబాద్‌ వచ్చి, కొప్పరపు కవులపై మొట్టమొదటగా ప్రచురించిన కవితా సంకనాన్ని ఆవిష్కరించారు. అవధానానికి-ఆశుకవిత్వానికి `తెలంగాణ నేలకు ఉన్న బంధం చాలా ప్రాచీనమైంది. వంద ఏళ్ళ క్రితమే, తెలంగాణలో పద్యం పరుగులెత్తి ప్రవహించింది. పద్యం మన ఆస్తి. అవధానం మన సంతకం. జయహో తెలుగు పద్యం.

కొప్పరపు కవులు ఈ మరాజువారి సంస్థానంలో ఆస్థానకవి పదవులను పొందారని ఈ పద్యపాద సారాంశం. 1897 ప్రాంతంలో, 12వ ఏట ఈ కవిజంట మొట్టమొదటి అష్టావధానం నరసరావుపేట పాతూరు ఆంజనేయస్వామి దేవాలయంలో నిర్వహించి, అవధాన విద్యా ప్రదర్శనకు శ్రీకారం చుట్టారు. కొన్నాళ్లపాటు అష్టావధానాలు చేసి, 16వ ఏట, 1901 ప్రాంతంలో తొలి శతావధానం నిర్వహించారు. అది కూడా ఈ ఆంజనేయస్వామి సన్నిధిలోనే కావడం విశేషం. ఇలా కొండవీడు, పలనాటి సీమల్లో అవధానాలు, ఆశుకవిత్వం ప్రారంభించారు. అంతటితో ఆగక, దేశమంతా కవితా జైత్రయాత్రలు చెయ్యాలని సంకల్పం చేసుకున్నారు. ఈ కవితా ప్రస్థానంలో భాగంగా, తెలంగాణలో అడుగుపెట్టారు. మణికొండ/మడికొండలో తొలి ఆశుకవిత్వ ప్రదర్శన చేశారు. జమిందార్‌ తాటిరెడ్డి గోపారెడ్డి ఈ సభ ఏర్పాటు చేశారు. కవిపండితుల సమక్షంలో అద్భుతంగా జరిగిన ఈ కవితా ప్రదర్శనకు అందరూ తన్మయులై, ఈ కవులను బహుధా ప్రశంసించారు.

హైదరాబాద్‌ నగరంలోనూ కొప్పరపు కవులు అనేక సార్లు అవధానాలు చేశారు. దేవులపల్లి రామానుజ రావు, దేవులపల్లి వెంకటేశ్వరరావుగార్లకు సమీప బంధువు నెల్లుట్ల రామకృష్ణామాత్య. నెల్లుట్లవారి పూర్వీకులు అసఫ్‌ జాహీ సంస్థానంలో మంత్రులుగా పనిచేసేవారు. రామకృష్ణామాత్యకు పూర్వ ప్రధాన మంత్రి పివి నరసింహారావుగారితోనూ స్నేహం ఉంది.