|

ఆకతాయిల ఆటకట్టు

she-teamsకొద్ది సంవత్సరాల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో అత్యాచారానికి గురైన యువతికి సంబంధించిన ‘నిర్భయ’ ఘటనతో దేశ ప్రజలంతా ఉలిక్కిపడిన విషయం తెలిసిందే. 2014 సంవత్సరంలో నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలను నిర్మూలించడానికి, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపులను అంతమొదించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు తన ముందుచూపుతో మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా ‘షీ’ బృందాలను అక్టోబరు 24,2014 లో ఏర్పాటు చేయడం జరిగింది. గత నెల అక్టోబరు 24, 2016 నాటికి రెండేళ్లు పూర్తిచేసుకున్న ‘షీ’ బృందాల అద్భుత పనితీరు కారణంగా మహిళలపై జరుగుతున్న నేరాలు, వేధింపులు తగ్గుముఖం పట్టాయి. షీ టీమ్స్‌ కల్పిస్తున్న భద్రత, భరోసాతో మహిళల్లో మానసిక ధైర్యం పెరగింది. హైదరాబాద్‌ నగరంలో షీ టీమ్స్‌ ఏర్పాటైన నాటి నుంచి ఐపీఎస్‌ అధికారిణి, అడిషనల్‌ సీపీ స్వాతి లక్రా ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.

షీ టీమ్స్‌ ఏర్పాటై రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో షీ టీమ్స్‌ ఇన్‌ఛార్జి స్వాతి లక్రా మాట్లాడుతూ షీ టీమ్స్‌ మహిళలకు అండగా నిలిచిందని.. ఈవ్‌ టీజర్ల సంఖ్య తగ్గిందని.. యువతులు ఫిర్యాదు చేయడానికి ధైర్యంగా ముందుకు వస్తున్నారని తెలిపారు. బస్టాప్‌లు, రైల్వేస్టేషన్లు, కళాశాలల ప్రాంగణాల్లో షీ టీం పోలీసులు మఫ్టీలో నిఘా వేసి ఆకతాయిల ఆటకట్టించారని అన్నారు. నిందితుల్లో మైనర్లు ఉంటే అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారిలో మార్పు తీసుకొచ్చామన్నారు. ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నదని కొనియాడారు. రాష్ట్రంలో షీ టీమ్స్‌ ద్వారా వచ్చిన ఫలితాలతో మహారాష్ట్ర, ఒరిస్సా, ఏపీ, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. మహారాష్ట్ర అధికారులు షీ టీమ్స్‌ గురించి తెలుసుకుని ప్రశంసించారని తెలిపారు. షీ టీమ్స్‌పై ప్రజల్లో అవగాహన ఎలా ఉందనే అంశంపై సర్వే చేయించగా నగర వ్యాప్తంగా 76 శాతం మందికి అవగాహన ఉందని తేలిందన్నారు. దానిని 100 శాతం తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఇంటర్‌ రెండో సంవత్సరం సివిక్స్‌ సిలబస్‌లో షీ టీమ్స్‌ను ఒక పాఠ్యాంశంగా ప్రభుత్వం చేర్చిందన్నారు.

షీటీమ్స్‌ పని భేష్‌

నేను లక్డీకాపూల్‌ బస్టాప్‌లో నిల్చున్నా, నా స్నేహితురాలిని ఇద్దరు పోకిరీలు వేధిస్తున్నారు. మేం భయంతో వణికిపోయాం. ఇంతలో ఇద్దరు వ్యక్తులు వచ్చిన ఆ పోకిరీలను పట్టుకున్నారు. ఆ సమయంలో షీ టీమ్స్‌ అక్కడుంటాయని మేం ఊహించలేదు. దేవుడు పంపించినట్లే షీ టీమ్స్‌ వచ్చి మాకు అండగా ఉన్నాయి. షీ టీమ్స్‌ పనితీరుకు హాట్సాప్‌.

– అనురాధ (విద్యార్థిని)

స్పందన బాగుంది

ఫేస్‌బుక్‌ అకౌంట్‌ హ్యాక్‌ చేసి మా స్నేహితురాలిని ఒకడు వేధించాడు. వేధింపులపై ఎవరికి చెప్పాలా అని ఆందోళనలో ఉన్నాం. షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేశాం. అదే రోజు సాయంత్రం వరకు ఫేస్‌బుక్‌ ఖాతాను తిరిగి మాకు అప్పగించడంతో పాటు మరుసటి రోజు హ్యాక్‌ చేసిన వాడిని పట్టుకున్నారు. షీ టీమ్స్‌ స్పందించిన తీరు బాగుంది.

– నవ్య, (విద్యార్థిని)

ధైర్యంగా ఉంటున్నా..

నేను సివిల్‌ సర్వీసెస్‌ కోచింగ్‌కు గుంటూరు నుంచి హైదరాబాద్‌కు ఒంటరిగా రావాలంటే భయపడ్డాను. అయితే హైదరాబాద్‌లో మహిళలకు చాలా భద్రత ఉందని, అక్కడ షీ టీమ్స్‌ పనిచేస్తున్నాయని మా వారు ధైర్యం చెప్పారు. షీ టీమ్స్‌ నాలో నేను ఒంటరి అనే భయాన్ని తొలగించాయి. ధైర్యంగా హైదరాబాద్‌లో ఉంటున్నాను.

– స్వాతి (విద్యార్థిని)

షీ టీమ్స్‌.. భవిష్యత్తు ప్రణాళికలు

మహిళల భద్రత, సురక్షిత చర్యల కోసం మహిళలకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. వివిధ రకాల పోస్టర్లు, బ్యానర్లు, కరపత్రాలు, సినిమా సై ్లడ్స్‌, షార్ట్‌ ఫిలింస్‌,

జానపద గేయాలతో ప్రతి ఒక్కరికి మహిళల రక్షణపై తీసుకుంటున్న చర్యలపై అర్ధమయ్యేలా ప్రచారం చేస్తాం. సినిమా థియేటర్లు, టెలివిజన్లలో మహిళల భద్రతపై అవగాహన కల్పిస్తాం.

కాలేజీల్లో విద్యార్థులు, లెక్చరర్స్‌తో బృందాలను తయారు చేసి ఆ గ్రూప్‌లతో షీ టీమ్స్‌కు కమ్యూనికేట్‌ చేసుకునే వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. దీంతో సమస్యలను షీ టీమ్స్‌ దృష్టికి తీసుకు వచ్చి, ఆ గ్రూప్‌లోని తోటి విద్యార్థులు ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నాలు చేసే అవకాశాలుంటాయి.

సమాజంలోని వివిధ వృత్తుల వారితో బృందాలను ఏర్పాటు చేస్తాం. వైద్యులు, న్యాయవాదులు, విద్యార్థులు, గృహిణులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్స్‌, వ్యాపారులు ఇలా ఆయా వృత్తుల వారితో వాలంటరీ గ్రూప్స్‌ తయారు చేస్తాం. ఆ గ్రూప్‌లకు షీ టీమ్స్‌ కమ్యూనికేట్‌ చేసే వ్యవస్థను ఏర్పాటుచేస్తాం. దీంతో మహిళలపై వేధింపులు షీ టీమ్స్‌ దృష్టికి తీసుకురావడంతో సమస్యను పరిష్కరించే వీలుంటుంది.

ఆర్టీసీ బస్సు డ్రైవర్లు, మహిళా కండక్టర్లకు అవగాహనకల్పిస్తాం. బస్సులలో ఈవ్‌ టీజింగ్‌ చేసేవారిపై ప్రత్యేక దృష్టి సారిస్తాం.

అన్ని వర్గాల సహకారంతో అన్ని వర్గాలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతూ మహిళల భద్రత కోసం హైదరాబాద్‌లో షీ టీమ్స్‌ 24 గంటలు స్పందిస్తాయి. 100% మందికి చేరే విధంగా కార్యక్రమాలు చేపడతాం.

చుక్కా వేణుగోపాల్‌