ఆయిల్‌ పామ్‌ సాగుపై రైతులకు అవగాహన యాత్ర

భారత వంట నూనె పరిశ్రమ, అమెరికా, చైనా, బ్రెజిల్‌ తరువాత నాలుగవ అతి పెద్ద పరిశ్రమ. అందులో పామాయిల్‌ ఒకటి. మలేషియా, ఇండోనేషియా దేశాలు కలిపి 85శాతం క్రూడ్‌ పామాయిల్‌ ను పండిస్తున్నాయి. ఇందులో ఎక్కువ శాతం ఎగుమతి అవుతున్నాయి. బహుళ వార్షిక పంటల్లోకెల్ల పామాయిల్‌ ఎక్కువ దిగుబడినిస్తూ (హెక్టారుకు 18-20 టన్నులు), 30 సంవత్సరాల వరకు నిరంతర ఆదాయాన్నిస్తూ రైతుకు, పర్యావరణానికి మేలు కలిగించేదిగా పేరుగాంచింది.


ఒక ఎకరా వరి సాగుకు అవసరమైన నీటితో 3 ఎకరాల పామ్‌ ఆయిల్‌ పంటను సాగు చేయవచ్చు. అంతర పంటల సాగుతో, కంచె వెంబడి వెదురు, శ్రీగంధం మొక్కలు పెంచటం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. ఈ పంటకు, చీడ పీడలు, కోతులు, రాళ్ళ వాన, దొంగల బెడద తక్కువగా వుండటం, రైతులు పండించిన పంటకు పామాయిల్‌ కంపెనీల ద్వారా కొనుగోలు జరుపబడుతూ ప్రతి నెల లాభదాయకమైన ఆదాయం పొందవచ్చు.

భారత దేశంలో నూనె పంటల సాగు
వంట నూనెల విభాగంలో అత్యంత తక్కువ ధరకు లభించడం వలన, భారత దేశంలో పామాయిల్‌ వాడకం ఎక్కువగావున్నది. భారత దేశంలో, నూనె గింజల ఉత్పత్తి 25-26 మిలియన్‌ టన్నులు కాగా, అందులో వంట నూనెల ఉత్పత్తి 7 మిలియన్‌ టన్నుల కన్నా తక్కువగా ఉన్నది. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో ఉత్పాదకత చాలా తక్కువ (1/3). మన దేశ జనాభాకి 21 మిలియన్‌ టన్నుల వంట నూనెల అవసరం కాగా, కేవలం 7 మిలియన్‌ టన్నులు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాం. మిగిలిన 15 మిలియన్‌ టన్నుల నూనెను రూ.75000 కోట్లు వెచ్చించి దిగుమతి చేసుకుంటున్నాం. ఈ మొత్తం దిగుమతులలో పామాయిల్‌ 60శాతంగా ఉంది.

అనగా, 8.4 మిలియన్‌ టన్నుల పామాయిల్‌ నూనెను సుమారు రూ.40,000 కోట్లు వెచ్చించి దిగుమతి చేసుకుంటున్నాము. దీనిని అదనంగా 28 లక్షల హెక్టార్ల పామాయిల్‌ సాగుతో అధిగమించవచ్చు. 2017-18 సంవత్సరం గణాంకాల ప్రకారం ఆయిల్‌ పామ్‌ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, తెలంగాణ, మిజోరాం, ఒరిస్సా రాష్ట్రాలలో సుమారు 3.04 లక్షల హెక్టార్లలో సాగవుతూ, 2.65 లక్షల టన్నుల పామ్‌ ఆయిల్‌ దిగుబడి లభిస్తున్నది. పామ్‌ ఆయిల్‌ దిగుమతులను పూర్తిగా తగ్గించుకుని ఇప్పుడు వెచ్చిస్తున్న రూ.40000 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయాలంటే, ఆయిల్‌ పామ్‌ సాగును పెద్ద యెత్తున ప్రోత్సహించాల్సిన అవసరం వుంది.

తెలంగాణ లో ఆయిల్‌ పామ్‌ ప్రస్తుత సాగు
పప్పు దినుసులు, నూనె గింజల టెక్నాలజి మిషన్‌ ద్వారా, 1992లో కేంద్ర ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి, ఆయిల్‌ పామ్‌ అభివృద్ధి పథకాన్ని మంజూరు చేసింది. భారత దేశంలో పామాయిల్‌కు అనువైన రాష్ట్రాలలో, తెలంగాణ ఒకటి. మన రాష్ట్రంలో ఇప్పటివరకు సరాసరి 50,000 ఎకరాలలో సాగులో ఉన్నది (37శాతం). ఖమ్మం, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో సాగు చేయబడుతోంది. తెలంగాణలో పామాయిల్‌ దిగుబడి హెక్టారుకి 15 టన్నుల వరకు ఉంటూ, అత్యధికంగా 20-25 టన్నులు కూడా లభిస్తుంది.

సగటున 16 కేజీల తలసరి ఆయిల్‌ వినియోగంతో, తెలంగాణ లోని 4 కోట్ల జనాభాకు 6.4 లక్షల మెట్రిక్‌ టన్నుల నూనె అవసరం. రాష్ట్ర అవసరాలకన్నా వంట నూనె ఉత్పత్తి 3.00 లక్షల టన్నులు తక్కువగావుంది. దీనిలో పామాయిల్‌ వాటా 1.80 లక్షల టన్నుల వరకు వుండవచ్చు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో పామ్‌ ఆయిల్‌ సాగు 50,000 ఎకరాల సాగులో ఉండి, కేవలం 80,000 టన్నులు ఉత్పత్తి ఉంది. పామాయిల్‌ సాగును అదనంగా ఒక లక్ష ఎకరాల వరకు విస్తరింపచేయడం వల్ల 60 శాతం వరకు దిగుమతులను అధిగమించవచ్చు. ఇందుకు రాష్ట్రంలో ఆయిల్‌ పామ్‌ పంట విస్తీర్ణత పెంచుటకు అనువైన అవకాశాలు ఎక్కువగా వున్నాయి.

పామాయిల్‌ సాగు విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, మొట్టమొదటిగా ప్రభుత్వం అశ్వరావు పేటలోని ఆయిల్‌ ఫెడ్‌ ప్రొసెసింగ్‌ మిల్లు సామర్ధ్యం గంటకు 15 టన్నులుగా ఉన్నదాన్ని 30 టన్నులకు పెంచింది. దమ్మపేట మండలం, అప్పరావు పేట గ్రామంలో గంటకు 30 టన్నుల ప్రొసెసింగ్‌ సామర్ధ్యంగల కొత్త మిల్లును రూ. 10 కోట్లతో అభివృద్ధి చేసింది. సూక్ష్మ సేద్యానికి గాను, రాష్ట్ర ప్రభుత్వము దేశంలో ఎక్కడా లేని విధంగా షెడ్యూల్డ్‌ కులాలు, తెగల రైతులకు 100శాతం, బి.సి, చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం, ఇతరులకు 80శాతం రాయితీ అందిస్తోంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలకంగా ఉండి, కోటి ఎకరాలకు సాగు నీరు అందించాలనే ధృడ సంకల్పంతో పెద్ద ఎత్తున సాగు నీటి ప్రాజెక్టులను చేపట్టింది. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు, ఎకరానికి రూ.10,000 పెట్టుబడి కొరకు రైతు బంధు వంటి పథకాలను అమలు పరుస్తూ, రైతుకు చేయూతనిస్తోంది. అందులో భాగంగాగానే, ప్రస్తుతం ఉన్న 4 జిల్లాలు కాకుండా, ఆయిల్‌ పామ్‌ సాగును ఇతర జిల్లాలకు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేస్తోంది.

ఆయిల్‌ పామ్‌ తోటల పెంపకంపై రైతు అవగాహన యాత్ర
దేశంలోని అన్ని రాష్ట్రాలలోకెల్లా, పామ్‌ ఆయిల్‌ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం రెండవ స్థానంలో వుంది (మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వుంది). నూనె రికవరీ శాతంలో మొదటి స్థానంలో వుంది. రాష్ట్రంలో ఆయిల్‌ పామ్‌ సాగుకు అనువైన జిల్లాలను సర్వే చేయించటం జరిగింది. ఈ సర్వే ద్వారా, కొత్తగా 18 జిల్లాలోని 206 మండలాలలో 2.78 లక్షల హెక్టారులు ఆయిల్‌ పామ్‌ సాగుకు అనువుగా వున్నట్టు ప్రతిపాదించటం జరిగింది. ఇవేకాక, ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాల్లోని 24 మండలాలు కూడా ఆయిల్‌ పామ్‌ సాగుకు రైతులు ముందుకు వచ్చారు.


కొత్తగా ప్రతిపాదించిన జిల్లాలలో ఆయిల్‌ పామ్‌ సాగుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర వ్యవసాయ మంత్రి ప్రతిపాదనలు పంపించారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వ అధికారులు, శాస్త్రవేత్తలతో కూడిన ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ మన రాష్ట్రంలో అన్ని అనుకూలమైన జిల్లాల్లో 3 రోజులపాటు పర్యటించింది.

ఈ కమిటీ, కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ద్వారా, అతి త్వరలో తెలంగాణ రాష్ట్రం లో ఆయిల్‌ పామ్‌ సాగును ఇతర జిల్లాలకు విస్తరించటం జరుగుతుంది. పామ్‌ ఆయిల్‌ తోటల పెంపంకంపై అవగాహన కల్పించేందుకు, చెన్నూరు లోని 2000 మంది అభ్యుదయ రైతులకు అవగాహన సదస్సు నిర్వహించటం జరిగింది. ఈ సదస్సులో, చెన్నూరు నియోజకవర్గ శాసన సభ్యులు, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ ఆయిల్‌ పామ్‌ సాగుపై క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించటం కొరకు రైతులను కొత్తగూడెం జిల్లాకు తీసుకువెళ్లాలని సూచించారు. దీనిలో భాగంగా, శాసనసభ్యులు బాల్క సుమన్‌ అధ్యక్షతన ఆసక్తి గల 1268 మంది అభ్యుదయ రైతులకు కొత్తగూడెం జిల్లాలో అవగాహన యాత్ర నిర్వహించారు. వీరికి పామ్‌ ఆయిల్‌ తోటలను చూపించి, సంబంధిత రైతులతో నేరుగా చర్చించడం ద్వారా పామ్‌ ఆయిల్‌ తోటల సాగు, దిగుబడులు, ఆదాయ వ్యయాల గురించి అవగాహన కల్పించటం జరిగింది. ఈ కార్యక్రమానికి, ఆయిల్‌ ఫెడ్‌ ఛైర్మన్‌ కంచర్ల రామకష్ణ రెడ్డి, ఉద్యానశాఖ సంచాలకులు ఎల్‌. వెంకట్రామ్‌ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరై రైతులకి విలువైన సలహాలు, సూచనలు ఇవ్వటం జరిగింది.