|

ఇంకుడు గుంతలతో నీటి కరవును జయిద్దాం..

ఎం.దాన కిషోర్‌, ఐ.ఏ.ఎస్‌.

tsmagazine
నీరు…. నీరు…. నీరు…. నీరుంటే కరవు ఉండదు. ఎక్కడ నీరు ఉంటే అక్కడ అంతా పచ్చదనం. నీరుంటే ప్రజలు సుఖ సంతోషాలతో వుంటారు. … నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా ప్రజలు ఆనందంగా పండుగ చేసుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్థుతం ఇదే జరుగుతున్నది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా నీటి కోసం పనులు జరుగుతున్నాయి. ఒక వైపు మిషన్‌ కాకతీయతో 45 వేల చెరువుల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి.

మరోవైపు కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణంతో కోటి ఎకరాలకు నీరందించే విధంగా పనులు జరుగుతున్నాయి. ఇంకోవైపు మిషన్‌ భగీరథతో ఇంటింటికీ మంచినీరును అందించే పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

మరోవైపు .. హైదరాబాద్‌ మహా నగరానికి ఎల్ల వేళలా మంచినీరు అందుబాటులో వుండే విధంగా కొత్త కొత్త రిజర్వాయర్ల నిర్మాణంతో పాటుగా, శామీర్‌పేట్‌ దగ్గర్లోని కేశవపూర్‌ లో 10 టి.ఎం.సి. రిజర్వాయర్‌ నిర్మాణానికి పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ పరంగా ఇవన్నీ చేయడం ఒకఎత్తయితే, ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం వుందని ప్రభుత్వం చెబుతున్నది.

రాష్త్ర పురపాలక శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇటీవల జరిగిన ”మన నగరం” సమావేశంలో మాట్లాడుతూ, ఆఫ్రికా లోని కేప్‌ టౌన్‌ నగరంలో ఏర్పడిన నీటి దుస్థితిని తెలియచేస్తూ, ప్రపంచంలోని మరెన్నో నగరాలు కూడా మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్నాయని రాష్ట్రాల మధ్య, ప్రజల మధ్య కొట్టుకునే పరిస్థితి ఏర్పడిందని, భవిష్యత్‌లో మన తెలంగాణ రాష్ట్రం కానీ, మన హైదరాబాద్‌ నగరం కానీ ఇలాంటి దుస్థితిని ఎదుర్కోకుండా ఉండాలంటే, తప్పనిసరిగా ప్రజలు నీటి పొదుపు చర్యలను పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ”జలం జీవం” నినాదాన్ని ఇచ్చారు. ఇందుకు ప్రజలు తమ ఇళ్లల్లో, తాముంటున్న పరిసరాల్లో, పాఠశాలల్లో, కళాశాలల్లో ఫంక్షన్‌ హాళ్లలో, కమ్యూనిటీ హాళ్లలో, హాస్పిటళ్లలో, సినిమా థియేటర్లలో , ఉద్యానవనాల్లో అన్ని పారిశ్రామిక ప్రాంతాల్లో, ప్రతి అపార్టుమెంట్‌లో, గేటెడ్‌ కమ్యూనిటీల్లో … ఇలా ఒకటని కాదు… అన్ని ప్రాంతాల్లో, అన్ని చోట్లలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకుంటే రాబోయే రోజుల్లో పడే వర్షాల వలన భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని, ఇందుకు ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రజలు ఒక ఉద్యమం లాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని అన్నారు.

జలం జీవం కార్యక్రమాన్ని హైదరాబాద్‌ మహానగర మంచినీటి సరఫరా మరియు మురుగు నీటి పారుదల మండలి (జలమండలి) ఒక సవాలుగా తీసుకున్నది. నిత్యం 430 మిలియన్‌ గ్యాలన్ల మంచినీటిని నగరానికి రెండు వందల కిలోమీటర్ల దూరంలోని కృష్ణా , గోదావరి నదులనుండి తీసుకుని వచ్చి సుమారు ఒక కోటి ఇరవై లక్షల మందికి నీటిని అందిస్తున్న ఈ శాఖకు ప్రజలు నీటికోసం ఇబ్బందులు పడకుండా చూసే బాధ్యత కూడా ఉంది. గతంలో ఎన్నోసార్లు ప్రజలు నీటికోసం జలమండలి వద్ద ధర్నాలు, రాస్తారోకోలు చేసిన సంఘట నలు పునరావృతం కాకుండా ఉండాలంటే, ప్రస్తుతం వున్న నీటి నిల్వలను సక్రమంగా వాడుకుంటూ, భవిష్యత్‌లో నీటి కోసం ఇబ్బందులు రాకుండా ఉండాలంటే, నీటి పొదుపు పై ప్రజలకు వివరించాలని జలమండలి నడుం బిగించింది. ఇందుకోసం ప్రథమంగా వివిధ శాఖల సమన్వయంతో నగరంలో ఒక వేయి ఇంకుడు గుంతలను నిర్మించాలని ప్రతిపాదించినప్పటికీ, అవి అంతకు మూడు నుండి నాలుగు రెట్లు పెరిగే అవకాశం వుంది. మంత్రివర్యుల ఆధ్వర్యంలో జలమండలి కార్యాలయంలో జరిగిన సమావేశంలో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లా కలెక్టర్లతో పాటుగా, హైదరాబాద్‌ మెట్రో రైల్వే, హెచ్‌.ఎం.డి.ఏ, జి.హెచ్‌.ఎం.సి. పాఠశాల విద్యశాఖా అధికారులు పాల్గొన్నారు. వారికి సంబంధించిన ఏరియాల్లో స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో వేలాది ఇంకుడు గుంతల ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.

ఇందుకోసం, హైదరాబాద్‌ జె.ఎన్‌.టి.యూ, భూగర్భ జలశాఖ , జలమండలి ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ , బ్యాంకర్స్‌ , ఎన్‌ .జి.ఓ లతో మొదట్లో సమావేశమై సాధ్యాసాధ్యాలను పరిశీలించింది. నీటిని ఆదా చేయడంలో ప్రజల పూర్తి భాగస్వామ్యం ఉంటే గాని విజయవంతం కాదు. వారిలో ఆ ప్రేరణ రావాలంటే, ప్రచార సాధనాల అవసరం ఏంతో వుంది. జలమే జీవం నినాదంతో వివిధ ప్రచార సాధనాల ద్వారా ప్రజల్లోకి ఈ కార్యక్రమం తీసుకువెళ్ళడానికి పోస్టర్లు, బ్రోచర్లు, స్టిక్కర్లు, ఆడియో , వీడియో, రేడియో పబ్లిసిటీ, ర్యాలీలు, సమావేశాలు, కళారూపాలతో ప్రచారాన్ని రూపొందించడం జరిగింది. అలాగే, ప్రజా ప్రతినిధులైన అందరూ కూడా భూగర్భ జలాలను పెంపొందించడం కోసం ప్రజలకు ఎప్పటికపుడు వివరించాలి. హైటెక్స్‌ లో జరిగిన 5కె.రన్‌ లో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పాల్గొన్నారు. కె.బి.ఆర్‌ పార్క్‌ లో జరిగిన 2కె. వాక్‌ థాన్‌ లో అక్కడి వాకర్స్‌ తో పాటుగా స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి పాల్గొన్నారు. చార్మినార్‌ నుండి బార్కాస్‌ వరకు జరిగిన 5కె రన్‌ లో 4వేల మంది పోలీసు సిబ్బంది, విద్యార్థులు, స్థానిక యువతతో అక్కడి ఎమ్మెల్యే సయ్యద్‌ అహమద్‌ పాషా ఖాద్రి , రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ అఫ్‌ పోలీస్‌ ఎం.మహేందర్‌ రెడ్డి, వివిధ నాయకులూ, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ”ఆపుదాం నీటి వృధా.. తరిమికొడదాం నీటి వ్యధ …” నీటిని ఆదా చేద్దాం… భూగర్భ జలాలను

వృద్ధి చేద్దాం…” భూగర్భ జలాల వృద్ధి … అసలైన అభివృద్ధి …” వాన నీటిని ఒడిసి పట్టు… నీటి కొరతను తరిమి కొట్టు..” ఇంకుడు గుంత వున్న ఇల్లు.. నీటి సంపదతో విలసిల్లు.. ” ఇంకుడు గుంతతో ఇల్లు… కన్నీటి కష్టాలకు చెల్లు..” మొదలైన నినాదాలతో స్థానికులు ప్ల కార్డుల ద్వారా విస్త త ప్రచారాన్ని చేశారు.

సిటీకి రెండు వైపులా ఆర్మీ ప్రాంతాలు వున్నాయి. కంటోన్మెంట్‌, గోల్కొండ ప్రాంతాల్లో వున్న విశాలమైన స్థలాల్లో ఇంకుడు గుంతలు నిర్మిస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి. మిలిటరీ జవాన్లలో కూడా నీటి సంరక్షణలో ఉత్త్తేజం కలిగించే ఉద్దేశ్యంతో గోల్కొండ ఆర్టిలరీసెంటర్‌ లో ప్రపంచ నీటి దినోత్సవం రోజున 10కె మారథాన్‌ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే, హిమాయత్‌ సాగర్‌ బండ్‌ పై యువతతో 2కే స్కేటింగ్‌ ఏర్పాటు చేయడమైనది. ఇవన్నీ ప్రజల్లో , యువతలో, మహిళల్లో ఉత్సాహంతో పాటుగా, వారిలో నీటి పొదుపు చేయాలనే చైతన్యం కూడా వస్తుంది.

వచ్చే వర్షాకాలం నాటికి ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలను నిర్మించుకునే విధంగా జలమండలి ప్రజల్లోకి వెళ్లి పనులు చేయించడం జరుగుతున్నది. ప్రజా ప్రతినిధులను, అధికారులను, విభిన్న వర్గాలకు చెందిన ప్రజలను ఏకతాటిపై తీసుకువచ్చి భవిష్యత్‌ తరం కోసం మన నీటిని నేటి నుండే పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని జలమండలి ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకు రావడానికి కృషి చేస్తున్నది. జలమండలికి సక్రమంగా నెలవారీ బిల్లులు చెల్లిస్తున్న వారికి వారింట్లో లేదా అపార్ట్‌ మెంట్‌ లో నిర్మించుకునే ఇంకుడు గుంతల కోసం జరిగే వ్యయాన్ని బ్యాంక్‌ ద్వారా రుణ సౌకర్యం కల్పించే ఏర్పాటు కూడా చేసింది. ఆ వ్యయాన్ని క్రమంగా బిల్లులో సరిచేస్తారు.

జల సంరక్షణ విషయంలో ప్రజలకు పూర్తిగా అవగాహన కలిగించేందుకు జూబ్లీ హిల్స్‌ లోని బట్టర్‌ ఫ్లై పార్క్‌ ను ఒక థీమ్‌ పార్క్‌ గా అభివృద్ధి చేయడానికి ప్రణాళికల్ని సిద్ధం చేసింది ప్రభుత్వం. ఈ పార్క్‌ లో వర్షపు నీటిని ఎన్ని రకాలుగా సంరక్షించుకోవచ్చునో అన్ని రకాల పద్ధతులను, వాటి మోడల్‌ కట్టడాలను ప్రదర్శించడానికి ప్రతిపాదించడం జరిగింది. రూఫ్‌ వాటర్‌, స్లోప్డ్‌ వాటర్‌ ను ఎలా ఒడిసిపట్టాలో చూపించే కట్టడాలను సైతం ప్రజలకు సులభంగా అర్ధమయ్యేలాగా నిర్మించాలని ప్రతిపాదించడమైనది. ఇలాంటి పార్క్‌ బెంగళూరు లో వుంది. అక్కడి అధికారులతో జలమండలి సంప్రదింపులు జరిపింది. త్వరలోనే ఈ పార్క్‌ నిర్మాణానికి అంకురార్పణ జరిగే అవకాశం వుంది.

ఇవన్నీ ఒక ఎత్తయితే, మరో వైపు 14 స్వచ్ఛంద సంస్థల సహకారంతో జలమండలి ఇంకుడు గుంతల ద్వారా జల సంరక్షణ చర్యలను ప్రారంభించింది. ఇంకుడు గుంతల విస్తత ప్రచారం కోసమే కాకుండా వాటి నిర్మాణాల కోసం కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నారు వీరు. యజమాని ముందుకు వస్తే వీరే అక్కడ ఇంకుడు గుంతల నిర్మాణాన్ని చేయిస్తారు. ఈ విధంగా జలమండలి పరిధిలోని సుమారు 20 డివిజన్లు నగరం మొత్తాన్ని ఎన్‌ జీవోలు కవర్‌ చేస్తున్నాయి. ఈ స్వచ్ఛంద సంస్థలు నగరం మొత్తాన్ని తమ ప్రచారంతో కవర్‌ చేస్తున్నాయి. ఒక కోటి 20 లక్షల మందికి ప్రతిరోజూ మంచినీటిని అందిస్తున్న జలమండలి ఔటర్‌ రింగ్‌ రోడ్‌ లోపలవున్న సుమారు 193 గ్రామాలను సైతం కవర్‌ చేస్తుండటం వలన, అన్ని ప్రాంతాల్లో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవడం జరిగితే, భవిష్యత్‌లో హైదరాబాద్‌ మహానగరం మంచినీటి కోసం ఇబ్బందులు లేని నగరంగా తీర్చిదిద్దవచ్చును అనేది ప్రభుత్వ సంకల్పం.

డబ్బులను బ్యాంకుల్లో పొదుపు చేసుకున్నట్టే, వాన నీటిని కూడా ఇంకుడు గుంతల్లోకి మళ్లించి పొదుపు చేయాలి. పెరిగిపోతున్న జనాలకి భూగర్భ జలాలు తరిగి పోయాయి. జలం జగతి సొత్తు కాబట్టి ప్రతి ప్రాణికి నీటి అవసరం

ఉంటుంది. వర్షపు నీటిని వరదపాలు చేయ కుండా

ఉండాలంటే, ప్రతి మనిషి ఇందుకోసం నడుం బిగించాల్సిన అవసరం వుంది. రేపటి మన పిల్లల కోసం నేడు మనం నీటిని రక్షించుకోవాలి. ఈ విషయంలో ఎవరూ కూడా వెనకడుగు వేయవద్దు. ఇది ప్రజలందరి బాధ్యత.