ఇక్కడ చెరువుల కింద.. అక్కడ కొండలపైన !

శ్రీధర్‌ రావు దేశ్‌ పాండే

ఇండోనేషియాలోని బాలి ద్వీపం కొండ ప్రాంతం. తెలంగాణ ప్రాంతంలో చెరువు కింద వరి పంట పండించినట్లే బాలిలో కూడా ప్రధాన పంట వరి. అయితే, సాగు చేసే విధానంలో సారూప్యత ఉన్నా, మనలాగా అక్కడ చెరువులు లేవు. సంవత్సరం పొడవునా వర్షాలు కురుస్తూ ఉంటాయి. అందువల్ల కొండ ప్రాంతానికి అనువైన వ్యవసాయ విధానాన్ని వారు అనాదిగా పాటిస్తున్నారు. దీనినే సుబాక్‌ వ్యవసాయ విధానం అంటారు. సుబాక్‌ వ్యవసాయ విధానానికి, మనం చెరువుల కింద సాగు చేసే విధానానికి కొన్ని దగ్గరి పోలికలుఉన్నాయి. ఈ రెండు విధానాలు ప్రాచీనమైనవే. కాకపోతే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం మిషన్‌ కాకతీయ, తదితర కార్యక్రమాలతో మనం చెరువులను పునరుద్ధరించుకుంటే, బాలిలో మాత్రం సుబాక్‌ వ్యవసాయ విధానం అంతరించి పోయి ప్రమాదం వాటిల్లిందని పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలిలో కూడా సుబాక్‌ వ్యవసాయ విధానాన్ని అక్కడి ప్రత్యేక సంస్కృతిని పరిరక్షించడానికి మన ‘మిషన్‌ కాకతీయ’ వంటి ప్రత్యేక కార్యక్రమం అమలు చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు.

తెలంగాణాలో గొలుసుకట్టు చెరువులు

తెలంగాణలో శాతవాహనుల కాలం నుంచే గొలుసు కట్టు చెరువుల కింద వ్యవసాయం సాగుతున్నది. తెలం గాణాలో వెయ్యేళ్ళుగా గొలుసుకట్టు చెరువుల కింద సాగే వ్యవసాయం, బాలిలో కొండ ప్రాంతంలో కొనసాగుతున్న అంచెల వారీ (టెర్రాస్డ్‌) వరి మడుల్లో సాగుతున్న వ్యవసా యాన్ని తులనాత్మకంగా పరిశీలిస్తే, ఆయా ప్రాంతాల్లో

ఉన్న భౌగోళిక స్థితిగతులే వ్యవసాయ పద్ధతులని నిర్దేశిస్తాయని అర్థం అయ్యింది. దేశంలోనే అత్యధిక చెరువులున్న ప్రాంతం తెలంగాణ. తెలంగాణలో చెరువులు లేని గ్రామాలు లేవంటే అతిశయోక్తి కాదు. ఒకటి కంటె ఎక్కువ చెరువులు ఉన్న ఊర్లు ఎన్నో. ఒక ఊరి నుంచి మరో ఊరికి, ఒక చెరువు నుంచి మరో చెరువుకి నీరు ప్రవహించే గొలుసు కట్టు చెరువుల నిర్మాణం తెలంగాణలో అనాదిగా ఉన్న వ్యవస్థ.

ఇంత పెద్ద సంఖ్యలో చెరువుల నిర్మాణం తెలంగాణలో ఎందుకు సాధ్యమైంది? వాగుకు ఎగువన గ్రామాల పొందిక, వాగుపై చెరువు నిర్మాణం, చెరువు కింద వ్యవసాయం, చెరువు చుట్టూ ఒక సామాజిక, ఆర్థిక, సాంస్కతిక వికాసం తెలంగాణలో సాధ్యపడింది, అంటే దానికి తెలంగాణ ప్రాంతం యొక్క భౌగోళిక స్థితిగతులు దోహదం చేసినాయి. దక్కన్‌ పీఠభూమి మధ్యలో తెలంగాణ ఉన్నది. పీఠభూమి కనుక ఎత్తుపల్లాలు, కొండలు, గుట్టలు, వాటి నుంచి వాగులు, వంకలు పుట్టి దిగువకు ప్రవహించి, నదులుగా మారి సముద్రానికి దారిని వెతుక్కున్నాయి. తెలంగాణకు తలాపున గోదావరి, కాళ్ళ కట్టుకు కష్ణా నదులు ప్రవహిస్తున్నాయి. అయితే తెలంగాణ బౌగోళికత కారణంగా అవి తక్కువ ఎత్తులో ప్రవహించడం, వ్యవసాయ యోగ్యమైన భూములు సముద్ర మట్టానికి 100 మీటర్ల నుండి 650 మీటర్ల ఎగువన ఉండడంతో గోదావరి, కష్ణా నదులను వినియోగించుకోవడం ఆనాటికి సాధ్యపడే విషయం కాదు.

సముద్రానికి దగ్గరగా సమతల ప్రాంతానికి చేరిన తర్వాత విశాలమై ఒండ్రు మట్టిని మేట వేసి గోదావరి కష్ణా నదులు సముద్రంలో కలిసినాయి. అందువల్ల కోస్తా తీర ప్రాంత వాసులకు గోదావరి, కష్ణా నదుల నీటిని తొలుత వినియోగించుకునే వెసులుబాటు ఏర్పడింది. అయితే తెలంగాణ దక్కన్‌

భౌగోళికతను వ్యవసాయ విస్తరణకు అనుకూలంగా మలుచుకోవడంలో అధ్భుతమైన నిర్మాణ కౌశలాన్ని ప్రదర్శించినారు ఇక్కడి భూమిపుత్రులు. తెలంగాణలో వ్యవసాయ విస్తరణకు చెరువుల నిర్మాణం అనివార్యం అయ్యింది. తెలంగాణలో చెరువుల నిర్మాణం శాతవాహనుల కాలం కంటే ముందు నుంచే కొనసాగిస్తున్నట్లు చారిత్రిక ఆధారాలు ఉన్నాయి. కాకతీయుల కాలంలో అత్యున్నత నిర్మాణ కౌశలంతో సముద్రాలని తలపించే వేలాది చెరువుల నిర్మాణం కొనసాగింది. రామప్ప, పాకాల, లక్నవరం, ఘనపురం, బయ్యారం, కమలపూర్‌ చెరువుల కోసం ఎంపిక చేసిన స్థలం, చెరువు నిర్మాణం చేసిన పద్ధతి, చెరువు నిర్మాణం కోసం తీసుకున్న బిల్డింగ్‌ మెటీరియల్‌ని పరిశీలిస్తే చెరువుల నిర్మాణం ఎంత శాస్త్రీయ పద్ధతిలో జరిగిందో తెలుస్తుంది.

కాకతీయుల కాలంలో వ్యవసాయ విస్తరణ ఉధతంగా సాగింది. రాజ్య ఖజానాకు వ్యవసాయం ద్వారా ఆదాయం పెరిగింది. రాజ్యం ఆర్థికంగా బలోపేతం అయ్యింది. శత్రు దుర్భేద్యమైన కోటల నిర్మాణం, శిల్ప సౌందర్యం ఉట్టిపడే ఆలయాల నిర్మాణం సాధ్యపడిందంటె అదంతా చెరువుల కింద సాగిన వ్యవసాయం వల్లనే. ఈ వారసత్వాన్ని కాకతీయుల అనంతరం దక్కన్‌ని పాలించిన రాజ వంశాలు కొనసాగించినాయి. కుతుబ్‌ షాహీలు, అసఫ్‌ జాహీలు, స్థానిక ప్రభువులు, సంస్థానాధీశులు అందరూ చెరువుల నిర్మాణాన్ని ప్రొత్సహించి కొనసాగించినారు. ఈ వేలాది చెరువుల కారణంగా హైదరాబాద్‌ రాజ్యం దేశంలోనే సంపన్నరాజ్యంగా ఎదిగింది. మెట్ట ప్రాంతమైనా తెలంగాణలో చెరువులు ఉన్న కారణంగా కరువులు అరుదుగానే సంభవించేవి. చెరువులు తెలంగాణలో సాంస్కృతిక వికాసానికి అధరువులుగా ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేని పూల పండుగ బతుకమ్మ ఆవిర్భావానికి చెరువులే కారణమని ఇప్పటికే బతుకమ్మపై పరిశోధనలు చేసినవారు తేల్చినారు. తెలంగాణకు ఒక ప్రత్యేక భాషా సాంస్క తిక అస్తిత్వం ఏర్పడడానికి చెరువులే కారణమైనాయి. ఈ రకంగా తెలంగాణ జీవన గతికి చెరువుకి ఇంత అవినాభావ సంబంధం ఉన్నది.

బాలిలో సుబాక్‌ వ్యవసాయ విధానం

బాలి ద్వీపం ఇండోనేషియాలో భాగం. కొండ ప్రాంతం. ప్రాచీన కాలం నుంచి భారత దేశంతో సంబంధాలు కలిగి ఉన్నది. బాలిలో నివసిస్తున్న వారిలో 80 శాతం హిందువులే. భారతదేశం నుంచే హిందూ మతం బాలికి వ్యాపించింది. బాలిలో 5 వేలకు పైగా దేవాలయాలు ఉన్నాయి. తెలంగాణలో చెరువుల కింద వరి పండించినట్టే బాలిలో కూడా వరి ప్రధానమైన పంట. బాలిలో వర్షపాతం 800 మి.మి.ల నుంచి 4000 మి.మి ఉంటుంది. సంవత్సరం పొడుగునా వర్షాలు కురుస్తాయి.

కొండ ప్రాంతానికి అనువైన వ్యవసాయ విధానాన్ని రూపొందించుకునే అవసరం అక్కడి ప్రజలకు ఏర్పడింది. అంచెల వారీగా ఎత్తు నుంచి కిందకి వరి మడులను ఏర్పాటు చేస్తారు. పై నుంచి నీటి సరఫరా కాలువల ద్వారా, పైపుల ద్వారా నీటిని కింది మడులకు మళ్ళిస్తారు. తెలంగాణలో ఉన్నట్టే వరి పండించే సాంప్రదాయం బాలిలో కూడా ప్రాచీన కాలం నుంచి అమలులో ఉన్నది. అదే సుబాక్‌ వ్యవసాయ విధానంగా పేరుగాంచింది. తెలంగాణలో వర్షాలు జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు నాలుగు నెలలు కురుస్తాయి. ఈ నాలుగు నెలల్లో వాగుల్లో లభ్యమయ్యే నీటిని ఒడిసిపట్టుకుని నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఉన్న కారణంగా తెలంగాణలో విస్తతంగా చెరువులను నిర్మించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. బాలిలో సంవత్సరం పొడుగునా వర్షాలు కురుస్తాయి కనుక వారికి నీటిని నిల్వ చేసుకునే అవసరం లేదు. కొండ ప్రాంతాల్లో సహజంగా ఏర్పడే నీటి బుగ్గలను (ూజూతీఱఅస్త్రర) వినియోగించుకునే సాంకేతికతను వారు అభివద్ధి చేసుకున్నారు.

నీటి బుగ్గల్లో విస్తారంగా లభ్యమయ్యే నీటిని అంచెల వారీ వరి మడుల్లోకి మళ్ళించే సాంకేతికత అద్భుతంగా ఉన్నది. నీటిని కాలువలలోకి మళ్ళించడానికి అక్కడక్కడా చెక్‌ డ్యాంలు, ఆనకట్టలు కూడా నిర్మించుకున్నారు. బాలిలో ప్రజా పనుల విభాగం ద్వారా కాలువలు, చెక్‌ డ్యాంలు, ఆనకట్టలు నిర్మాణం అవుతున్నాయి. అయితే సుబాక్‌ వ్యవసాయం నీటి బుగ్గల ద్వారా లభ్యమయ్యే నీటి ఆధారంగానే జరుగుతున్నట్టుగా గమనించాము. ఈ నీటిని మళ్ళించడానికి అవసరమైన కాలువలు, చెక్‌ డ్యాంలు, ఇతర కట్టడాలను ప్రజా పనుల శాఖ నిర్మిస్తున్నది.

బాలి సుబాక్‌ వ్యవసాయ విధానాన్ని అధ్యయనం చేసిన తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే.. ఇది రైతులే సహకార పద్ధతిలో నిర్వహించుకునే వ్యవసాయ పద్ధతి. అయితే వ్యవసాయాన్ని దైవ సంబందిత ఆచరణతో (తీఱ్‌బaశ్రీర) ముడి పెట్టడం జరిగింది. ఇది సుబాక్‌ సహకార వ్యవసాయం వందల సంవత్సరాలుగా నిలకడగా పని చేయడానికి దోహదం చేసిందని చెప్పవచ్చు. ప్రతీ సుబాక్‌కి ఒక ఆలయం ఉంటుంది. ఒక సహకార సంఘం ఉంటుంది. నీటి బుగ్గ ఉద్భవించే ఎత్తైన ప్రాంతంలో ఈ ఆలయాలు నిర్మించారు. నీరు ఆలయంలో నిర్మించిన చిన్న సిస్టేర్న్‌ లో నిల్వ అవుతాయి. ఇక్కడి నుంచి కాలువలు, పైపుల ద్వారా నీరు వరి మడుల్లోకి పై నుంచి కిందకి ప్రవహిస్తాయి.

ఆలయం అంటే దేవుడి విగ్రహాలు వైగైరా ఏమీ ఉండవు. నీరు విష్ణువుకి, భూమి ద్వారా వచ్చే వరి పంట విష్ణు భార్య దేవిశ్రీ కి ప్రతీకగా భావిస్తారు. దైవ సంబంధిత ఆచరణ ముడిపడి ఉన్న కారణంగా ఆ సుబాక్‌ లో సభ్యులుగా ఉన్న రైతులు నియమాలను ఉల్లంఘించే ప్రశ్న ఉత్పన్నం కాదు. నీరు అన్ని మడుల్లోకి తప్పని సరిగా చేరుతుందన్న నమ్మకం వలన ఎక్కడా నియమాల

ఉల్లంఘన జరగదు. త్రి హిత కరణ అనే మూడు సూత్రాలు సుబాక్‌ సభ్యులను నియంత్రిస్తాయి. మొదటిది రైతుకి, దేవుడికి అంటే నీటికి మధ్యన సంబంధాన్ని నియంత్రిస్తుంది. రెండోది రైతుకి సుబాక్‌ సహకార సంఘానికి మధ్య సంబంధాన్ని, మూడోది రైతుకి ప్రకతికి మధ్యన సంబంధాన్ని నియంత్రిస్తాయి. ఈ మూడు రకాల ఆచరణలు అంచెలవారీ వ్యవసాయ విధానాన్ని శాసిస్తున్నాయి. నియమోల్లంఘన జరగకుండా న్యాయ బద్ధంగా నీటి సరఫరాకు దోహదం చేస్తున్నాయి. సుబాక్‌ లు త్రి హిత కరణ తాత్వికతను అమలు పరచడానికి రూపొందించిన వ్యవస్థగా పరిశోధకులు భావిస్తున్నారు. నియమోల్లంఘన సుబాక్‌ సభ్యుల మనసుకు అందని విషయం.

ఈ దైవ ఆచరణ రైతులు వ్యక్తిగతంగా పంటకు నీటిని తీసుకునే దశ నుంచి మొదలై పంట చేతికి వచ్చేదాకా కొనసాగుతుంది. ఇవి 16 రకాలు. దానితో పాటూ సుబాక్‌ సహకార సంఘం నిర్వహించే ఉత్సవాలు కూడా

ఉంటాయి. ఈ ఉత్సవాల్లో సుబాక్‌ సభ్యులైన ప్రతీ రైతు విధిగా పాల్గొంటాడు. ఇటువంటి సుబాక్‌లు సామూహికంగా చేసుకునే ఉత్సవాలు కూడా ఉంటాయి. ఈ ఉత్సవాల వలన సుబాక్‌ సభ్యుల మధ్య సంబంధాలు, ఇతర సుబాక్‌ల మధ్య సంబంధాలు నిలకడగా కొనసాగుతాయి. ఉత్సవాలు ఆలయాల వద్దనే జరుగుతాయని వేరే చెప్పనవసరం లేదు. ఈ దైవ సంబందిత త్రి హిత కరణ ఆచరణ, ఉత్సవాలు బాలికి ప్రత్యేక సంస్క తిక అస్తిత్వం ఏర్పడడానికి దోహదం చేసింది. వెయ్యి సంవత్సరాలుగా నిలకడగా కొనసాగుతున్న బాలి సుబాక్‌ వ్యవసాయ క్షేత్రాలను యునెస్కో ప్రపంచ సాంస్కతిక వారసత్వ సంపదగా (ఔశీతీశ్రీస జబశ్ర్‌ీబతీaశ్రీ నవతీఱ్‌aస్త్రవ ూఱ్‌వర) గుర్తించడం విశేషం. 29 జూన్‌, 2012న రష్యా పీటర్స్‌ బర్గ్‌ నగరంలో జరిగిన యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటి 36 వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని ఇండోనేషియా ప్రభుత్వం స్వాగతించింది. బాలి ప్రావిన్స్‌లో 5 జిల్లాల్లో విస్తరించి ఉన్న 20 వేల హెక్టార్ల 5 సుబాక్‌ లకు ఈ గుర్తింపు లభించింది.

బాలి ప్రభుత్వం సుబాక్‌లను స్వతంత్ర ప్రత్పత్తి కలిగిన స్థానిక సంస్థలుగా గుర్తిచింది. ఈ సుబాక్‌ లకు తమ నిర్ణయాలను అమలుచేసుకునే స్వేచ్ఛ ఉన్నది. అంతర్గతంగా సుబాక్‌ల నిర్వహణ, సుబాక్‌ల మధ్య సంబంధాలను నిర్వహించుకునే స్వేచ్ఛ కలిగి ఉన్నాయి. వీటిపై ప్రభుత్వ నియంత్రణ పరిమితమైనది. అయితే సుబాక్‌ సభ్యులు ప్రభుత్వ నియంత్రణలో ఉండే బాలి రెవెన్యూ గ్రామాల ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉంటాయి. సుబాక్‌ సభ్యులు కూడా ఆ గ్రామాల్లోనే నివసిస్తారు. సుబాక్‌ వ్యవసాయ విధానం నీటి బుగ్గల్లో లభ్యమయ్యే నీటి ఆధారంగా నడిచే సహకార వ్యవస్థ. సభ్యుల పంట ఆదాయంలో నుంచి అందే చందాల మీదనే సుబాక్‌ల నిర్వహణ ప్రధానంగా ఆధారపడి ఉన్నది. సుబాక్‌లో నిర్ణయాధికారం అంతా సభ్యులు ఎన్నుకునే సుబాక్‌ బోర్డు, ఆలయ పూజారి లదే. ఎప్పుడైనా సభ్యులు నియమోల్లంఘనకు పాల్పడితే సుబాక్‌ సభ్యులంతా కలిసి నిర్ణయించిన మేరకు శిక్షలు / అదనపు రుసుము విధిస్తారు. సుబాక్‌ సమావేశాలు నెలకు ఒకసారి జరుగుతాయి.

బాలిని పరిపాలించిన రాజ వంశాలు సుబాక్‌ వ్యవసాయాన్ని ప్రోత్సహించి కాపాడినారు. మన చెరువుల వ్యవస్థ కాకతీయుల కాలంలో ఎట్లాగైతే ఉచ్ఛ స్థితిలో వర్ధిల్లిందో అట్లనే బాలిలో ఉదయన వర్మదేవ( ఈయన పేరు మీద బాలిలో ఒక విశ్వవిద్యాలయం కూడా ఉన్నది) పరిపాలనలో ఉచ్ఛ స్థితికి చేరిందని పరిశోధకులు నిర్ధారించారు. ఈయన పరిపాలనా కాలంలో సుబాక్‌ వ్యవసాయ విధానం కొత్త ప్రాంతాలకు విస్తరించింది. సుబాక్‌ ల కింద భూ విస్తీర్ణం పెరిగింది. ఈయన కాలంలో పకేరిసన్‌ నదీ ఎగువన టంపాక్సిరింగ్‌ ప్రాంతంలో నిర్మించబడిన పులగాన్‌ సుబాక్‌ ను యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించింది. ఆ తర్వాత కూడా బాలి రాజులు సుబాక్‌ లను ప్రోత్సహించినట్టు చరిత్ర పరిశోధకులు పేర్కొన్నారు. కాల గమనంలో ఇండోనేషియా ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మారిన తర్వాత ప్రభుత్వ జోక్యం క్రమేణా పెరిగి పోతున్నట్టుగా తెలుస్తున్నది.

సంక్షోభంలో సుబాక్‌లు :

ఇండోనేషియాకు టూరిజం ప్రధాన ఆదాయ వనరు. ఇండోనేసియా అధీనంలో సుమారు 17 వేలకు పైగా చిన్నా పెద్దా దీవులు ఉన్నాయి. 5 వేలకు పైగా దీవుల్లో మనుషులు జీవిస్తున్నారు. ఇండోనేసియా లో భాగంగా ఉన్న బాలి, జావా, సుమత్రా దీవులకు ప్రపంచ వ్యాప్తంగా వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఇండోనేషియాలో ముఖ్యంగా బాలిలో పెరుగుతున్న పర్యాటక రంగం అభివద్ధి సుబాక్‌ వ్యవసాయ విధానం మీద ఒత్తిడిని పెంచుతున్నట్టుగా పరిశోధకులు భావిస్తున్నారు. సుబాక్‌ల మీద ఒత్తిడి అంటే బాలి సంస్క తి ఒత్తిడికి గురి అవుతున్నదని వారి భావన. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండోనేసియా ప్రతీ ఏటా జరిపే ఆర్థిక సర్వేలో ఈ విషయాలు వెల్లడి అవుతున్నాయి. 2011లో బాలిలో వ్యవసాభివృద్ధి రేటు 2.22 శాతం ఉంటే అది 2014లో 0.02 శాతంకు పడిపోయింది. అదే సమయంలో పర్యాటక రంగంలో 2011లో 8.69 శాతం 2014లో 8.43 శాతం వద్ది రేటు నమోదు అయ్యింది. వ్యవసాయ రంగంతో పోల్చినప్పుడు పర్యాటక రంగానికి ఇండోనేసియా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తున్నది. 2014లో బాలిలో పేదరికం 0.04 శాతం పెరిగినట్టుగా తెలుస్తున్నది. వ్యవసాయ రంగంలో వద్ధి రేటు గణనీయంగా పడిపోతున్న కారణంగానే బాలిలో పేదరికం పెరుగుతున్నట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. పర్యాటక రంగం అభివద్ధి వలన బాలిలో పేదరిక నిర్మూలన జరగడం లేదని విశ్లేషిస్తున్నారు. పైగా వ్యవసాయ భూములపై పర్యాటక రంగం వద్ధి ఒత్తిడిని పెంచుతున్నది.

పర్యాటకుల రాక పెరగడంతో బాలికి వలసలు పెరుగుతున్నాయి. పర్యాటకులకు వసతి, ఇతర సౌకర్యాల కల్పన కోసం, వలస ప్రజలకు ఇండ్ల నిర్మాణం కోసం వ్యవసాయ భూములను వినియోగించు కోవాల్సిన పరిస్థితి తలెత్తింది. వీటి కారణంగా సుబాక్‌ వ్యవసాయ విధానంపై తీవ్ర పరిణామాలు కలుగుతున్నాయని, బాలి సంస్కతి కనుమరుగు అయ్యే స్థితి నెలకొందని బాలి స్థానిక మేధావులు వాపోతున్నారు. ఏడాదికి సగటున 750 – 1000 హెక్టార్ల సుబాక్‌ వరి భూములు పర్యాటక రంగానికి బదిలీ అవుతున్నాయని తేల్చారు. వేయి ఎండ్లుగా కొనసాగుతున్న బాలి సుబాక్‌ సహకార వ్యవసాయ విధానం, దాని ఆధారంగా నిర్మాణం అయిన బాలి సంస్కతి పరిరక్షణ జరగాలంటే ఇండోనేషియా ప్రభుత్వం వ్యవసాయ రంగం పై దష్టి పెట్టవలసిన అవసరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మిషన్‌ కాకతీయ గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ

తెలంగాణా ఏర్పాటుకు ముందు తెలంగాణా పరిస్థితి కూడా ఇటువంటిదే. తెలంగాణాకు ప్రాణాధారమైన గొలుసుకట్టు వ్యవస్థ ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం కారణంగా కునారిల్లిపోయింది. స్వయం పోషక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోయింది. గ్రామీణ ప్రాంతాల నుంచి వేలాదిగా బతుకు తెరువు కోసం బొంబాయి, భివాండి, సూరత్‌, అహమ్మదాబాద్‌ లాంటి సుదూర ప్రాంతాలకు వలస పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. చెరువు చుట్టూ అల్లుకున్న తెలంగాణా సంస్క తి, బతుకమ్మ సంక్షోభంలో పడింది. బతుకమ్మ పేర్చడానికి పూలు దొరకని స్థితి. బతుకమ్మ నిమజ్జనానికి చెరువుల్లో నీరు లేని స్థితి. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం వెంటనే అమలు చేసిన కార్యక్రమం మిషన్‌ కాకతీయ చెరువుల పునరుద్ధరణ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో చెరువుల పునరుద్ధరణ జరిగింది. నాలుగు దశల్లో సుమారు 23 వేల చెరువులు జలకళను సంతరించుకున్నాయి. చెరువుల కింద వ్యవసాయం 51 శాతం పెరిగిందని ఇటీవల నీతి ఆయోగ్‌ ప్రకటించడం గమనార్హం. తెలంగాణలో గొలుసు కట్టు చెరువుల వ్యవస్థ సంక్షోభం నుంచి గట్టెక్కింది. చెరువుల్లో నికరంగా నీటి లభ్యత పెరగడానికి ప్రాజెక్టులతో అనుసంధానం కూడా ప్రభుత్వం చేపట్టింది. తెలంగాణా సంస్క తికి ప్రతీక బతుకమ్మ తిరిగి గ్రామాల్లో ప్రాణం పోసుకున్నది. బతుకమ్మ ఘాట్లు ప్రతీ చెరువుల వద్ద నిర్మాణం అయినాయి.

బాలి ప్రజలు కూడా ఇండోనేషియా ప్రభుత్వం నుంచి సుబాక్‌ వ్యవసాయ విధానాన్ని, తద్వారా బాలి ప్రత్యేక సంస్కతిని పరిరక్షించడానికి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాలని కోరుకుంటున్నారు.

ఇంటర్నేషనల్‌ కమీషన్‌ ఆన్‌ ఇరిగేషన్‌, డ్రైనేజ్‌ వారి 70 వ అంతర్జాతీయ సదస్సు ఇండోనేషియా, బాలిలో సెప్టెంబర్‌ 1 నుంచి 4 వరకు జరిగినాయి. ఈ అంతర్జాతీయ సదస్సులో ప్రతినిధులుగా పాల్గొని పత్రాలు సమర్పించే అరుదైన అవకాశం నాతో పాటు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ చీఫ్‌ ఇంజనీర్‌ శంకర్‌, నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ చీఫ్‌ ఇంజనీర్‌ నరసింహ, మైనర్‌ ఇర్రిగేషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ హమీద్‌ ఖాన్‌, శ్రీరాం సాగర్‌ ప్రాజెక్ట్‌ ఎగ్జిగ్యుటివ్‌ ఇంజనీర్‌ నాగభూషణ్‌ రావులకు దక్కింది. ఇండోనేసియా ప్రజా పనుల శాఖా మంత్రి బాసుకి సదస్సు ప్రారంభోపన్యాసంలో బాలి ద్వీపంలో వెయ్యి సంవత్సరాలుగా సాంప్రదాయిక వ్యవసాయ పద్దతి ”సుబాక్‌” ఇప్పటికీ అమలులో ఉన్నదని అన్నారు. ఈ వ్యవసాయ క్షేత్రాలను యునెస్కో వారు ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించిందని తెలిపారు. ఆ తర్వాత అనేక మంది ప్రతినిధులు ఈ సుబాక్‌ వ్యవసాయ పద్దతిని తమ ఉపన్యాసాలలో ప్రస్తావించినారు. ప్రాచీన ”సుబాక్‌” వ్యవసాయ పద్దతిపై మొదటి రోజు నుంచే ఆసక్తిని రేకెత్తించినారు. ఆ తర్వాత సదస్సులో భాగంగా సెప్టెంబర్‌ 5న ”సుబాక్‌” వ్యవసాయ క్షేత్రాల సందర్శనకు తీసుకుపోయారు. సదస్సులో వక్తలు ప్రస్తావించిన ఈ వ్యవసాయ క్షేత్రాలను ప్రత్యక్షంగా వీక్షించి అధ్యయనం చేసే అవకాశం చిక్కింది. తెలంగాణాలో గొలుసు కట్టు చెరువుల వ్యవస్థను, బాలి సుబాక్‌ వ్యవసాయ విధానాన్ని తులనాత్మకంగా పరిశీలించడమే ఈ వ్యాసం లక్ష్యం.

నాలుగు రోజుల పాటు జరిగిన సదస్సులో వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు పత్రాలను ప్రవేశపెట్టినారు. ఆ పత్రాలపై చర్చ జరిగింది. భారత దేశం నుండి ఇతర రాష్ట్రాల ప్రతినిధులు, కేంద్ర జల సంఘం ప్రతినిధులు ప్రవేశపెట్టిన పత్రాల్లో మన రాష్ట్రంలో అమలు అవుతున్న కార్యక్రమాల ప్రస్తావన ఉండడం విశేషం. గ్రామీణ ప్రాంతాల్లో నీటి భద్రత, ఆహార భద్రత సాధించడానికి, గ్రామీణ ప్రజలకు స్థానికంగా ఉపాధి కల్పనకు, పట్టణాలకు వలసల నివారణకు తెలంగాణా రాష్ట్రం అమలుపరుస్తున్న చెరువుల పునరుద్దరణ కార్యక్రమం మిషన్‌ కాకతీయ మిగతా రాష్ట్రాలకు ఆదర్శం అని కొనియాడారు. కాలువల ద్వారా నీటి సరఫరాలో చివరి భూములకు నీరు అందివ్వడంలో విఫలం అవుతున్నామని, ఈ వైఫల్యాన్ని అధిగమించడానికి తెలంగాణలో శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టులో జయప్రదంగా అమలు చేసిన మొదటి ఆయకట్టు నుంచి చివరి ఆయకట్టు వరకు(టెయిల్‌ టు హెడ్‌) నీటి నిర్వహణ పద్దతి అనుసరనీయమని వక్తలు కొనియాడారు. నదుల మీద నిర్మించే జలాశయాలకు పూడిక అనేది ఒక ప్రధాన సమస్యగా ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా జలాశయాలకు ఈ సమస్య ఉన్నది. ఈ సమస్యను అధిగమించడానికి వారు ఆఫ్‌ లైన్‌ జలాశయాలను నిర్మించాలని సూచించినారు. ఈ సూచన తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటికే కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, డిండీ తదితర ఎత్తిపోతల పథకాల్లో అమలు అవుతుండడం విశేషం. సదస్సు చివరి రోజున మిషన్‌ కాకతీయ అమలు తీరు తెన్నులు, ఫలితాలపై నీటి పారుదల ఓ ఎస్‌ డి శ్రీధర్‌ రావు దేశ్‌ పాండే పత్రాన్ని సమర్పించారు.