ఇచ్చారా? తెచ్చారా? వచ్చిందా? తెలంగాణ సాధన సాధ్యమైంది ఎలా!

Untitled-2కాసిన చెట్టును నాటింది తానేనని కావలికి వచ్చే వారు ఎందరో!
ఈనిన బర్రెను సాకింది తానేనని పాల ముంత తెచ్చేవారు ఎందరో!
కోతకొచ్చిన చేను దిగుబడిపై కోతలు కోసేవారు ఎందరో!
వేటను కొట్టుకొచ్చింది తానేనని ప్రగల్భాలు పలికేది ఎందరో!

ఓటమి ఒంటరిది. విజయం విచిత్రమైనది. పరాజయ పరాభావాన్ని పరామర్శించేవారు ఎవరూ ఉండరు. విజయ విలాసాన్ని వెతుక్కుంటూ వచ్చేవారే అందరూ.
అందని ద్రాక్ష పుల్లన అనుకుంటూ
ఆమడ దూరం పారిపోయిన వారే,
గెలుపు వాకిట వాటాలు వేసుకోవడానికి తగుదునమ్మా అని తయారై వస్తారు.
తెలంగాణ సాధన చరిత్ర కూడా సరిగ్గా ఇదే. తెలంగాణ ఇచ్చింది తామేనని కొందరు! తెలంగాణ తెచ్చింది తామేనని ఇంకొందరు! ఇంతకీ తెలంగాణ ఇచ్చారా? ఇవ్వబడిందా? తెలంగాణ తెచ్చారా? తేబడిందా? అసలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎలా వచ్చింది?

దేశంలో ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంటు ఉభయ సభల్లో ప్రవేశపెట్టి, సాధారణ మెజారిటీతో ఆమోదింపజేసుకోవడం ద్వారా కొత్తగా ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చని రాజ్యాంగం నిర్దేశించింది. అంటే ఏనాటికైనా పార్లమెంటులో సాధారణ మెజారిటీ కలిగి ఉన్న పార్టీ లేదా కూటమి (ప్రభుత్వం) మాత్రమే కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయగలదు. తెలంగాణలో ఉన్నవి 19 లోక్‌సభ సీట్లే కనుక, ఆ సీట్లతో ఇక్కడి పార్టీ ఏదీ, ఎన్నడూ, సొంతంగా కేంద్రంలో అధికారంలోకి రాలేదు. అందువల్ల ఎప్పటికైనా ఏదో ఒక జాతీయ పార్టీయే తెలంగాణరాష్ట్రాన్ని ఇవ్వక తప్పదు. అంతమాత్రాన ఆ పార్టీకే రాష్ట్రమిచ్చిన ఖ్యాతి దక్కాలా? లేక కొత్త రాష్ట్రం ఇవ్వక తప్పని పరిస్థితి కల్పించిన ప్రజలకు, ఆ ప్రజలకు ప్రతినిధిగా నిలిచిన ప్రాంతీయ పక్షాలకు ఆ ఖ్యాతి దక్కాలా?
కేంద్రంలో సోనియా-మన్మోహన్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణను ఇచ్చింది కనుక, ఇచ్చిన క్రెడిట్‌ కాంగ్రెస్‌కే దక్కాలన్నది ఆ పార్టీ నేతల వాదన. బిల్లు సమయంలో కాంగ్రెస్‌కు పార్లమెంటులో మెజారిటీ లేదని, తాము ఒత్తిడి తేవడం, మద్దతివ్వడం వల్లే బిల్లు ఆమోదం పొందిందని, అందువల్ల తెలంగాణ తెచ్చిన ఖ్యాతి తమకే దక్కుతుందన్నది బీజేపీ వాదన. ఇది ఎలా ఉందంటే, కోర్టు ఆదేశం మేరకు, తప్పనిసరి పరిస్థితిలో, తన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా, ఒక ప్రభుత్వం చేతులు కట్టుకుని ఒక చట్టం చేయాల్సి వస్తే, ఆ చట్టం చేసిన ఘనత తమదేనని చెప్పుకోవడంలా ఉంది.

తర్కం కోసం ఈ రెండు పార్టీలే తెలంగాణ తెచ్చాయని కాసేపు అనుకుందాం. మరి తెలంగాణ డిమాండ్‌ ఇప్పటిది కాదే! ఆంధ్రతో విలీనమే వద్దన్న నెహ్రూ శకం నాటి నుంచి, తెలంగాణకే చెందిన పీవీ నరసింహారావు హయాం దాకా కేంద్రంలో కాంగ్రెస్‌ దశాబ్దాల పాటు అధికారంలో ఉంది. 1969లో చెన్నారెడ్డి చేపట్టిన ప్రజా ఉద్యమం మొదలుకొని, వైఎస్‌ హయాంలో చిన్నారెడ్డి చేసిన సంతకాల ఉద్యమం దాకా అనేక ఉద్యమాలను చూసింది. మరి తెలంగాణ ఇవ్వడమే దాని ఎజెండాలో ఉంటే అప్పుడు, ఎప్పుడో ఒకప్పుడు ఎందుకు ఇవ్వలేదు? పదవో పరకో ఇచ్చి కొనుగోలు చేసో, ప్రలోభాల ఎర వేసో, శాంతి భద్రతల సాకుచూపో, సమయం కాదనిదాటవేసో పబ్బం గడుపుకొన్న సందర్భాలు మనకు తెలుసుగానీ, తెలంగాణ ఇవ్వాలన్న చిత్తశుద్ధితో కాంగ్రెస్‌ ఏనాడైనా పని చేసిందా? ఇక బీజేపీ సంగతి. ఒక ఓటు రెండు రాష్ట్రాలన్ని చెప్పి కూడా, తర్వాత ఒట్టు తీసి గట్టుమీద పెట్టిన ఘనత ఆ పార్టీది. రాజధాని ఉన్న ప్రాంతం రాష్ట్రాన్ని అడగడం చరిత్రలో లేదంటూ, తెలుగుదేశం పార్టీ ఒత్తిడికి తలొగ్గి మాట మార్చిన చరిత్ర బీజేపీది.

రెండు సీట్ల టీఆర్‌ఎస్‌ వల్ల తెలంగాణ వచ్చిందా అన్న వారు గుర్తుంచుకోవలసిన విషయం, ఇప్పుడు పూర్తి మెజారిటీతో దేశాన్ని పాలిస్తున్న బీజేపీకి కూడా ఒకప్పుడు లోక్‌సభలో ఉన్నవి రెండు సీట్లే. ఈ రెండు సీట్ల టీఆర్‌ఎస్‌ మైత్రి కోసమే పేరుగొప్ప జాతీయ కాంగ్రెస్‌ చివరిదాకా పాకులాడిరది. అసలు సంగతి ఏమిటంటే ఇక్కడ ఏ పార్టీ అన్నది కాదు, ఎవరికి ఎన్ని సీట్లు ఉన్నాయన్నది కాదు. తెలంగాణ డిమాండ్‌లోని న్యాయబద్ధతే, పార్టీలను ఇక్కడిదాకా రప్పించింది. రాష్ట్రాన్ని తెప్పించింది. అందువల్ల రెండు జాతీయ ‘మాటల పార్టీల’ను, పార్లమెంటు వేదికపై మారు మాట్లాడనివ్వకుండా చేసి, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ఘనత తెలంగాణ ప్రజలది. వారికి ప్రతినిధిగా నిలిచిన టీఆర్‌ఎస్‌ది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం దశాబ్దాలుగా వినిపిస్తున్న ధర్మబద్ధమైన డిమాండు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండె చప్పుడు. దాన్ని బలంగా, క్రమపద్ధతిలో వ్యక్తీకరించేలా కేసీఆర్‌ ఉద్యమాన్ని నిర్మించారు. పార్లమెంటులో తెలంగాణకు సంఖ్యాపరమైన ప్రాతినిధ్యం పరిమితమని తెలిసీ, తాను కొండను ఢీకొట్టవలసి ఉంటుందని గుర్తించీ, సంకీర్ణ రాజకీయ శకాన్ని ఒడుపుగా వాడుకోవడం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ పదవిని వదులుకుని ఉద్యమం మొదలుపెట్టిన కేసీఆర్‌ది ఆది నుంచి తుది దాకా, తెలంగాణ కోసం పదవులు వదులుకున్న చరిత్ర కాగా, పదవుల కోసం మాత్రమే తెలంగాణ నినాదాన్ని పఠించిన చరిత ఇతర పార్టీలది. ఈ రాజకీయ వ్యూహానికి దన్నుగా తెలంగాణలోని వేలవేల ప్రజాసంఘాలు, ఉద్యోగులు, కళాకారులు, రచయితలు, ప్రజలు బలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించారు.

ఎన్నికల ద్వారా రాజకీయ మార్గంలో తెలంగాణ సాధించే అవకాశం ఉందని గమనించి, అందుకు అనుగుణంగా వ్యూహరచన చేసింది కేసీఆర్‌. దీంతో కాంగ్రెస్‌, బీజేపీలేమిటి –  ప్రతి ఒక్క పార్టీ జై తెలంగాణ అనక తప్పని పరిస్థితి ఏర్పడింది. అందువల్లే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయక తప్పని అనివార్య స్థితి కాంగ్రెస్‌కు, దానికి మద్దతివ్వక తప్పని ఆవశ్యకత బీజేపీకి ఏర్పడ్డాయి. అందువల్లే తప్పనిసరి పరిస్థితిలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. తప్పించుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్‌, బీజేపీలు అందుకు అనుగుణంగా అడుగులు వేశాయి.
అయితే ఒక్కటి మాత్రం నిజం. పెప్పర్‌ స్ప్రే మిత్రులు ఎన్ని అవరోధాలు సృష్టించినా, తెరవెనక ఎన్ని మాయోపాయాలు పన్నినా, మాయా జాలాలు జరిగినా, పార్లమెంటులో బిల్లును ఆమోదించడంలో, దేశ అధికార కేంద్రమైన ఢల్లీి పట్టును, ఔన్నత్యాన్ని నిలపడంలో ఆ రెండు జాతీయ పార్టీలు చూపించిన నిబద్ధతను, సోనియా మాటకు కట్టుబడే తత్వాన్ని మాత్రం అభినందించకుండా ఉండలేం. జై తెలంగాణ!