|

ఇటువంటి వారిపై దయ చూపకండి

మంగారి రాజేందర్‌
(వ్యాసకర్త గతంలో జిల్లా జడ్జిగా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యునిగా పనిచేశారు.)

తెలంగాణ ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా శంఖం పూరించింది. అవినీతి ఒక్క రెవెన్యూ శాఖలోనే కాదు చాలా శాఖల్లో విస్తరించి వున్నది. రోజుకొక ఉద్యోగి రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికి పోతున్న వార్తలు ఇటీవల కాలంలో ఎక్కువగా కన్పిస్తున్నాయి. దీని ప్రభావం మిగతా ఉద్యోగుల మీద తప్పక వుంటుందని అన్పిస్తుంది.

అవినీతి ఎంత శాతం ఉన్నదన్నదిపెద్ద విషయం కాదు. అది ఏ శాతంలో వున్నా దాన్ని సహించకూడదు. దయచూపే విధంగా చర్యలు వుండకూడదు. ఈ విషయాన్నే సుప్రీంకోర్టు

ఉత్తర ప్రదేశ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు కార్పోరేషన్‌ మరి ఇతరులు వర్సెస్‌ గోపాల్‌ శుక్లా మరి ఒకరు, సివిల్‌ అప్పీలు నుం. 2038/2012 కేసులో అభిప్రాయపడింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా, ప్రఫుల్లా సి. పంత్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ క్రమశిక్షణ అథారిటీ తీసుకున్న చర్యలను పునరుద్దరించింది. లేబర్‌ కోర్టు, హైకోర్టులు ఇచ్చిన ఒకే రకమైన ఉత్తర్వులని తప్పుపట్టింది. నేరస్తుడు అవినీతికి పాల్పడినాడని రుజువైన తరువాత అతన్ని ఉద్యోగం నుంచి తొలగించడం కన్నా తక్కువ శిక్షని విధించకూడదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.

కేసు విషయాలు:

ప్రతివాది బస్సు కండక్టర్‌. ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగి. టికెట్టు లేకుండా 25 మంది ప్రయాణీకులు ప్రయాణం చేసే విధంగా అతను అనుమతించాడు. దాని మీద పై అధికారులు విచారణ జరిపి అతన్ని

ఉద్యోగం నుంచి తొలగించారు. అతను వ్యక్తిగతంగా లబ్దిపొందడానికి

ఉపయోగించుకున్నట్టు అన్పించడంలేదని లేబర్‌ కోర్టు అభిప్రాయపడి అతన్ని ఉద్యోగంలోకి తీసుకోవాలని ఆదేశించింది. హైకోర్టు కూడా అదే అభిప్రాయాన్ని అప్పీలులో వెలిబుచ్చింది. రోడ్డు రవాణా సంస్థ సుప్రీంకోర్టులో అప్పీలుని దాఖలు చేసింది.

సుప్రీం కోర్టు తీర్పులోని ముఖ్యాంశం

”బస్సు కండక్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తి సంస్థ అతని మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. క్రమశిక్షణతో పవిత్రంగా

ఉండాలి. ప్రశ్నార్థకంగా అతని నడవడి కన్పించే విధంగా అతని ప్రవర్తన వుండకూడదు. అతని మీద మూడు నేర అభియోగాలు రుజువైనాయని లేబర్‌ కోర్టు, హైకోర్టు భావించి కూడా అతని మీద దయచూపి ఉద్యోగంలోకి తీసుకోవాలని ఆదేశించడం ఎంత మాత్రం సరైంది కాదు’ అని కోర్టు అభిప్రాయపడింది.

సుప్రీం కోర్టు ఇంకా ఇలా అభిప్రాయపడింది

యాజమాన్యం అతని మీద ఉంచిన నమ్మకాన్ని అతను పటాపంచలు చేశాడు. అందుకని అతని మీద ఎలాంటి జాలీ, కరుణా చూపించాల్సిన అవసరం లేదు. ఉద్యోగి మీద వున్న బాధ్యతని అతను నిర్లక్ష్యం చేశాడు. అతని దగ్గరి నుంచి డబ్బుని జప్తు చేయనందున అతనికి వ్యక్తిగత ప్రయోజనం అందలేదని అనుకోవడానికి వీల్లేదు. అతని నడవడిక వల్ల అతనికి వ్యక్తిగత ప్రయోజనం వుందని స్పష్టమవుతోంది. 25 మంది ప్రయాణీకులు ఎలాంటి టికెట్‌ లేకుండా ప్రయాణం చేయడానికి అనుమతించి సంస్థకి ఆర్థిక నష్టం కలుగజేశాడు. వేబిల్‌ పోయిందని దుర్బుద్దితో ప్రథమ సమాచారాన్ని పోలీసులకి అందించాడు ప్రతివాది. దీని వల్ల అతనికి ఆర్థిక ప్రయోజనం వుందని స్పష్టమవుతోంది. తన అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు.

సుప్రీం కోర్టు ఈ విషయం చెబుతూ అవినీతి ఎంత అన్నది అప్రధానమైన విషయం. అవినీతి అనేది క్యాన్సర్‌ వ్యాధిలా పెరిగి పోతుంది. దీన్ని ఇలాగే అనుమతిస్తే ఆక్టోపస్‌లా విస్తరించి, ఎలాంటి శస్త్ర చికిత్స పనిచేయని విధంగా మారే అవకాశం వుంది.

అతని చర్యలు అభిశంసనీయమైనవి. అందుకని ఎలాంటి దయని చూపించాల్సిన అవసరం లేదు. ఊహాజనిత కారణాలతో లేబర్‌ కోర్టు అతని మీద దయచూపింది. హైకోర్టు బలపరచిందని సుప్రీంకోర్టు వాఖ్యానించింది.

అవినీతి ఎంత మేర అన్నది అప్రస్తుతం అవినీతికి పాల్పడిన వ్యక్తులని ఉపేక్షించే పరిస్థితి లేదు.