ఇదే చివరి అస్త్రం!

– మంగారి రాజేందర్‌


రాజ్యాంగ సంబంధమైన కేసులని, అంశాలని పరిష్కరించే కోర్టుగా సుప్రీం కోర్టు ఉండాలని మన రాజ్యాంగ నిర్మాతలు భావించారు. కానీ సుప్రీంకోర్టు మిగతా కేసుల సంఖ్యే ఎక్కువగా వుంది. రాజ్యాంగ సంబంధమైన కేసులు 7శాతం మాత్రమే వున్నాయని ఒక అంచనా. వివిధ హైకోర్టుల తీర్పులపై దాఖలైన అప్పీలు చాలా ఎక్కువగా వున్నాయి. అదే విధంగా ట్రిబ్యునళ్ళ తీర్పులపై, కమిషన్‌ల తీర్పులపై వచ్చిన తీర్పులు అనేకం. దీనికి కారణం – రాజ్యాంగంలో వున్న అధికరణ 136. ఈ అధికరణ ప్రకారం – ప్రత్యేక అనుమతితో సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసుకోవడానికి అవకాశం వుంది. ఈ అధికరణ వల్ల సుప్రీంకోర్టు ముందు చాలా అప్పీళ్ళు దాఖలవుతున్నాయి. ఈ అప్పీళ్ళ వల్ల సుప్రీంకోర్టు మీద పని భారం పెరిగిపోతోంది.

ఈ అప్పీళ్ళకి తోడు రివ్యూ దరఖాస్తులు, క్లేశ నివారణ దరఖాస్తులు (క్యూరేటివ్‌ దరఖాస్తులు) వల్ల సుప్రీం కోర్టు పనిభారం రెట్టింపు అయిపోతోంది. సుప్రీంకోర్టు తీర్పు తరువాత మరో రెండు దశల ద్వారా ఆ నిర్ణయాన్ని సవాలు చేసే అవకాశం ఏర్పడింది. సుప్రీంకోర్టు తీర్పులో ఏవైనా తప్పిదాలు వున్నాయని స్పష్టంగా కన్పించినప్పుడు, అవి న్యాయమూర్తుల దృష్టికి రాలేదని అన్పించినప్పుడు ఈ రెండు రకాలైన దరఖాస్తులని వేయడానికి అవకాశం వుంది. అయితే లబ్ధి పొందడానికి న్యాయవాదులు ఈ దరఖాస్తులని ఎక్కువగా

ఉపయోగిస్తున్నారు. న్యాయమూర్తులు తమ తీర్పులని అజాగ్రత్తగా చెబుతున్నారని న్యాయవాదులు పెట్టే పరీక్షలే ఈ రెండు దరఖాస్తులు. సుప్రీంకోర్టు తీర్పు తరువాత వచ్చే ఈ రెండు దరఖాస్తుల వల్ల సుప్రీం కోర్టుకి ఊపిరి ఆడకుండా అవుతోంది. ఈ దరఖాస్తుల సంఖ్యే ప్రతి వారం 30 పేజీల దాకా వుంటుందని సుప్రీం కోర్టు న్యాయవాదులు చెబుతూ వున్నారు.

సుప్రీం కోర్టులో తమ అప్పీలు పోయిన తరువాత అదే తమ ప్రారబ్ధం అని పార్టీలు భావిస్తూ వుంటారు. పార్టీల దగ్గర డబ్బులు వున్నాయని న్యాయవాదులు భావిస్తే ఆ తీర్పుని సవాలు చేద్దామని న్యాయవాదులు వాళ్ళకి సలహా ఇస్తుంటారు. తీర్పులో కొంత అర్థం కావడం లేదనీ, కొన్ని విషయాలకు వివరణ కావాలని, సందిగ్ధత వుందని వివరణ దరఖాస్తుని దాఖలు చేస్తున్నారు. ఆ తరువాత పునఃసమీక్ష (రివ్యూ దరఖాస్తులు), క్లేశనివారణ దరఖాస్తులు (క్యూరేటివ్‌ దరఖాస్తులు)ని దాఖలు చేస్తున్నారు.

తమ తీర్పులో ఏదైనా విషయాన్ని ఉపేక్షించినట్టు కనిపించినప్పుడు, తప్పిదం జరిగినట్టు స్పష్టంగా కన్పించినప్పుడు, తీవ్రమైన లోపం వుందని సుప్రీంకోర్టు భావించినప్పుడు ఆ తీర్పుని సుప్రీంకోర్టు పునః సమీక్షిస్తుంది. ఈ దరఖాస్తుని భోజన విరామ సమయంలో న్యాయమూర్తులు తమ ఛాంబర్లలో పరిశీలిస్తారు. ఏవో కొన్ని దరఖాస్తులే రివ్యూకి నోచుకుంటాయి. ఆ విధంగా రివ్యూకి నోచుకోని దరఖాస్తుల విషయంలో పార్టీల దగ్గర డబ్బులు వుంటే క్యూరేటివ్‌ దరఖాస్తులు వేయాలని న్యాయవాదులు సలహా ఇస్తూ వుంటారు. ఇది చివరి అస్త్రం.

ఈ రివ్యూ దరఖాస్తులని బహిరంగ కోర్టులో కాకుండా న్యాయమూర్తుల చాంబర్లలో తొలుత విచారిస్తారు. ఇలా విచారించడం 1996 సుప్రీంకోర్టు ఏర్పరచిన నియమానికి విరుద్ధమని న్యాయవాదులు సుప్రీం కోర్టులో సవాలు చేశారు. సుప్రీం కోర్టు ఆ డిమాండుని సెసా స్టెరిలైట్‌ వర్సెస్‌ సుప్రీం కోర్టు కేసులో త్రోసిపుచ్చింది. ఈ నిర్ణయాన్ని చాలా మంది న్యాయవాదులు స్వాగతించారు. ఎందుకంటే బహిరంగ కోర్టులో విచారణ మొదలైతే వీటికి ఓ అంతు వుండదు. ప్రమాణ పత్రాలు, జవాబు పత్రాలు, వాయిదాలు ఇలా అవి అంతులేకుండా కొనసాగుతాయి. దాని వల్ల న్యాయవాదులకి, న్యాయమూర్తులకి, పార్టీలకు అసౌకర్యం గానే వుండేది. ఇప్పుడు ఈ రివ్యూ దరఖాస్తులు భోజన విరామ సమయంలో పరిష్కరిస్తున్నారు. మరో రకంగా చెప్పాలంటే చాలా వాటిని త్రోసిపుచ్చుతున్నారు.

తమ బాధ నివారణకి మన దేశంలో వున్న చివరి అస్త్రం క్యూరేటివ్‌ దరఖాస్తు. ఈ దరఖాస్తులని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు తమ చాంబర్లలో విచారిస్తారు. అరుదైన వాటిలో అరుదైన దరఖాస్తుని బహిరంగ కోర్టులో విచారిస్తారు.

“తమ తీర్పులో ఏదైనా విషయాన్నిఉపేక్షించినట్టు కనిపించినప్పుడు, తప్పిదం జరిగినట్టు స్పష్టంగా కన్పించినప్పుడు, తీవ్రమైన లోపం వుందని సుప్రీంకోర్టు భావించినప్పుడు ఆ తీర్పుని సుప్రీంకోర్టు పునః సమీక్షిస్తుంది. ఈ దరఖాస్తుని భోజన విరామ సమయంలో న్యాయమూర్తులు తమ ఛాంబర్లలో పరిశీలిస్తారు. ఏవో కొన్ని దరఖాస్తులే రివ్యూకి నోచుకుంటాయి.”

2003వ సంవత్సరంలో ఈ క్యూరేటివ్‌ దరఖాస్తుల విషయానికి సుప్రీం కోర్టు తెరలేపింది. బాధితులకి సంపూర్ణ న్యాయం అందించడం కోసం పూర్తిగా విచారించిన కేసులని తిరిగి వినడానికి సుప్రీం కోర్టు అవకాశం ఏర్పరచింది. రివ్యూ దరఖాస్తుల్లో ఉపశమనం లభించని వ్యక్తులు క్యూరేటివ్‌ దరఖాస్తుల ద్వారా సుప్రీం కోర్టుని ఆశ్రయించే అవకాశం 2003వ సంవత్సరం నుంచి ఏర్పడింది.

రూపా అశోక్‌ హుర్రా వర్సెస్‌ అశోక్‌ హుర్రా కేసు ద్వారా ఈ క్యూరేటివ్‌ దరఖాస్తులకి సుప్రీంకోర్టు అవకాశం ఏర్పరిచింది. రివ్యూ దరఖాస్తు డిస్మిస్‌ అయిన తరువాత బాధిత వ్యక్తి మళ్ళీ సుప్రీంకోర్టు ముందు సవాలు చేయవచ్చానన్నది ఈ కేసులో ప్రధానమైన ప్రశ్న.

న్యాయ ప్రక్రియ దుర్వినియోగం కాకుండా వుండటానికి, న్యాయానికి అన్యాయం జరుగకుండా వుండటానికి తమ తీర్పులని రివ్యూ దరఖాస్తు తరువాత కూడా, సుప్రీంకోర్టుకి వున్న స్వయం సిద్ధ అధికారం ఉపయోగించి మళ్ళీ పరిశీలించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ దరఖాస్తులకి క్యూరేటివ్‌ దరఖాస్తులని నామకరణం చేసింది.

ఈ క్యూరేటివ్‌ పిటీషన్‌తో బాటూ ఓ సీనియర్‌ న్యాయవాది సిఫారసుని కూడా జతచేయాల్సి వుంటుంది. తీర్పులో సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘన జరిగిందని అతను తన సిఫారసులో స్పష్టంగా చెప్పాలి. అంతే కాదు అందుకని తీర్పుని పునః సమీక్షించాల్సిన అవసరం వుందని కూడా పేర్కొనాలి.

ఈ క్యూరేటివ్‌ దరఖాస్తు మొదట ముగ్గురు సీనియర్‌ న్యాయమూర్తులకి సర్క్యులే షన్‌ ద్వారా పంపిస్తారు. తిరిగి కేసుని సమీక్షించా ల్సిన అవసరం వుందని మెజారిటీ న్యాయమూర్తులు అభిప్రాయపడితే ఆ కేసుని తిరిగి సమీక్షిస్తారు. మొదట ఆ కేసుని ముందుగా ఎవరైతే పరిష్కరించారో ఆ న్యాయమూర్తుల దగ్గరికే ఆ కేసుని పరిశీలన కోసం పరిష్కారం కోసం పంపిస్తారు.

హుర్రా కేసుని విచారించిన బెంచ్‌ ఈ క్యూరేటివ్‌ పిటీషన్‌ అనే పద్ధతి వల్ల విజయం లభించని పార్టీలకి ద్వారం తెరిచినట్టు అవుతుందని తమ భయాందోళన వెలిబుచ్చింది. సరిగ్గా అదే జరిగింది. కఠిన నిబంధనని ఈ విషయంలో ఏర్పరచినా ఈ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు సుమర్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ యుపి కేసులో వ్యక్తం చేసింది.

ఇది వాస్తవమే కానీ, ఇటీవల ఓ క్రిమినల్‌ కేసులో ముద్దాయిలకి సుప్రీం కోర్టు డివిజన్‌ బెంచ్‌ మరణ శిక్షని ఖరారు చేసింది. రివ్యూ దరఖాస్తులో వాళ్ళు విడుదలయ్యారు. మార్చి 2019లో ఈ కేసు పరిష్కారం అయ్యింది. అందుకని ఈ రివ్యూ, క్యూరేటింగ్‌ దరఖాస్తులని వద్దని అనలేం. అయితే ఈ అంతులేని విచారణలు ఎలా సత్వరం పరిష్కరించాలి? ఇదీ ప్రశ్న.