|

ఇద్దరు మండల విద్యాధికారులకు జాతీయ అవార్డులు

news
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకుంటున్న మంకు రాజయ్య, అంజయ్య

తెలంగాణ రాష్ట్రంలోని ఇద్దరు మండల విద్యాధికారులు విద్యా విషయంగా వారు అందించిన సేవలకు గుర్తింపుగా జాతీయ అవార్డులు అందుకున్నారు. దేశ రాజధాని ఢల్లీిలో 2014, నవంబరు 29న జరిగిన కార్యక్రమంలో కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖా మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును వారు అందుకున్నారు. కరీంనగర్‌ జిల్లా ఎల్లారెడ్డి పేట మండల విద్యాధికారి మంకు రాజయ్య, మెదక్‌ జిల్లా కోహీర్‌ మండల విద్యాధికారిగా పనిచేస్తున్న డి.అంజయ్యకు ఈ అవార్డులు దక్కాయి.

మెదక్‌జిల్లా కోహీర్‌ మండల విద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న అంజయ్య ఐదు సంవత్సరాల పాటు వరుసగా డ్రాపౌట్స్‌ లేని మండలంగా రaరాసంగంను తీర్చిదిద్దడంలో విశేష సేవలందించారు. పాఠశాలలకు రాని పిల్లలను పాఠశాలల్లో చేర్పించడానికి గ్రామగ్రామాన తిరిగి పిల్లల తల్లితండ్రులకు కౌన్సిలింగ్‌ ఇచ్చి వారిని స్కూళ్ళలో చేర్పించారు. 2014, నవంబరు 29న ఢల్లీిలో జరిగిన కార్యక్రమంలో అంజయ్య ఈ అవార్డును కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖా మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా అందుకున్నారు. గతంలో 1990లో ఎన్‌ఎస్‌ఎస్‌ గోల్డ్‌ మెడల్‌, 1993లో అక్షరాస్యత సాధనకు కృషి చేసినందుకు జిల్లా స్థాయి అవార్డును అందుకున్నారు. 1994లో జిల్లా స్థాయి యూత్‌ అవార్డు, 1997లో జన్మభూమి అవార్డు, 2008, 2009లలో బెస్ట్‌ సోషల్‌ వర్కర్‌ అవార్డు అందుకున్నారు. 2010లో రాష్ట్ర స్థాయిలో బెస్ట్‌ టీచర్‌ అవార్డు, 2011లో జిల్లా స్థాయి బెస్ట్‌ హెడ్‌మాస్టర్‌ అవార్డు, 2011`12లో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో బెస్ట్‌ ఎంఈఓ అవార్డులు అందుకున్నారు. వీటితో పాటు ఇప్పటి వరకు అంజయ్యకు 38 అవార్డులు, ప్రశంసాపత్రాలు వచ్చాయి.

కరీంనగర్‌ జిల్లా కోనారావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన మంకు రాజయ్య కాకతీయ, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో ఎమ్మెస్సీ(కెమిస్ట్రి), ఎంఎ(ఇంగ్లీష్‌), ఎంఇడి డిగ్రీలు తీసుకున్నారు. 2005లో ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు. అప్పటి నుంచి పాఠశాలల్లో పిల్లలను చేర్పించడానికి ఎంతో కృషి చేశారు. మనబడికి రండి అనే కార్యక్రమంతో పాఠశాలలకు రాని పిల్లలను పాఠశాలల్లో చేర్పించడానికి కృషి చేశారు. ఉపాధ్యాయులు స్వచ్చందంగా ఎక్కువ సమయాన్ని పాఠశాలలకు కెటాయించే విధంగా కృషి చేశారు. నాణ్యమైన విద్యను అందించడం కోసం విద్యార్థుల జవాబు పత్రాల ఆధారంగా ప్రతినెల తల్లితండ్రులతో సమీక్షలు నిర్వహించేవారు. ఆంగ్ల మీడియం పుస్తకాలను తల్లిదండ్రుల సహకారంతో ప్రాథమిక తరగతులలో ప్రవేశపెట్టారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కోరకు రూ. 30 లక్షలు విరాళాలు సేకరించారు. ఇలాంటి ఎన్నొ కార్యక్రమాల వల్ల ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 1800 విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. మండల పరిధిలోని 9 ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులు లేక మూతపడే పరిస్థితి వచ్చిదంటే రాజయ్య పట్టుదల ఎంతగా ఉందో అర్దం చేసుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటి వరకు కూడా విద్యార్థుల నమోదు యధావిధిగా కొనసాగుతుండడం ఆయన కార్యదీక్షకు, అంకితభావానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.