|

ఇసుక మైనింగ్‌ కొత్త పాలసీ

ఇసుక-మైనింగ్‌-కొత్త-పాలసీపేద ప్రజలకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఇసుక మైనింగ్‌ పాలసీని ప్రవేశపెట్టింది. కొత్త ఇసుక మైనింగ్‌ పాలసీ`2014 పేరుతో జీవో నెంబరు 38ని డిసెంబరు 12న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పరిశ్రమల ప్రోత్సాహక శాఖ కమిషనర్‌ ప్రదీప్‌ చంద్ర ఈ జీవోను విడుదల చేశారు.
అందుబాటు ధరల్లో నాణ్యమైన ఇసుకను రాష్ట్ర ప్రజలకు అందించేందుకే ఈ కొత్త పాలసీని తెచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. కొత్త పాలసీ ప్రకారం ఇసుక తవ్వకాలను ఐదు క్యాటగిరీలుగా గుర్తించారు. ముందుగా నదులు, కాలువలు, తరువాత రిజర్వాయర్లలో పూడిక తీత, పట్టా భూముల్లో తవ్వకాల ద్వారా లభ్యమయ్యే ఇసుకను నదులు, కాలువలలో ఇసుక నిలువ సామర్ధ్యాన్ని బట్టి ఐదు క్యాటగిరీలుగా గుర్తించారు. వాగులు, చిన్న చిన్న కాలువలలో ఉండే ఇసుక మొదటి కేటగిరీ కాగా, ఆయా స్థాయిలను బట్టి మిగతా కేటగిరీలను నిర్ణయించారు.
చివరిగా 5వ కేటగిరీని కృష్ణా, గోదావరి నదులలోని ఇసుకను గుర్తించారు. ఒకటి, రెండు కేటగిరీలలో లభించే ఇసుక తవ్వకాలకు ఎటువంటి రుసుము వసూలు చేయరు. వీటిని స్థానికంగా ఉండే అవసరాలకు అంటే గ్రామస్థుల స్వంత అవసరాలు, గృహ నిర్మాణ పథకం తదితర ఉపయోగాలకు వినియోగిస్తారు. టెండర్‌లో తీసుకున్న ప్రభుత్వ భవన నిర్మాణాలు, ఇతర నిర్మాణాలకు మాత్రం సీవరేజ్‌ ఫీజు వసూలు చేస్తారు. ఈ ఇసుకను వాహనాలపై ఇతర ప్రాంతాలకు తరలించే వీలులేదు. అక్కడి స్థానిక అవసరాలకు మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.
మూడు, నాలుగు, ఐదు కేటగిరీల్లో ఉపయోగించే ఇసుకను మాత్రం వాల్టా నిబంధనలకు అనుగుణంగా మాత్రమే తవ్వకాలు జరపాల్సి ఉంటుందని జీవోలో స్పష్టం చేశారు. ఈ కేటగిరీలో ప్రాథమిక స్థాయిలో గుర్తించే ప్రక్రియను నీటిపారుదల, రెవెన్యూ, భూగర్భ జలాల విభాగాలను సంప్రదించిన మీదట గనులశాఖ ఈ క్యాటగిరీలపై నిర్దారణకు వస్తుంది. తుంగభద్ర, కృష్ణా, గోదావరి బ్యాక్‌ వాటర్‌ పూడిక తీత కూడా ఈ కేటగిరీల కిందకే వస్తుంది. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ చైర్మన్‌గా వ్యవహరించే జిల్లా స్థాయి కమిటీ నివేదికను స్టేట్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌కు సమర్పిస్తారు. అనంతరం అన్ని శాఖలు క్లియరెన్స్‌లు తీసుకున్నాక ఓపెన్‌ మార్కెట్‌లో బిడ్డింగ్‌ విధానం ద్వారా సంబంధిత వనరుల్లో ఇసుక తవ్వకాలకు కాంట్రాక్టర్లను టీఎస్‌ఎండిసి ఎంపిక చేస్తుంది.
రాక్‌సాండ్‌కు ప్రోత్సాహం
ఇసుకకు ప్రత్యామ్నాయంగా రాక్‌సాండ్‌ను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాక్‌సాండ్‌ పరిశ్రమకు విద్యుత్‌, వ్యాట్‌ సబ్సిడీని అందచేస్తామని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ నిర్మాణాలలో 50 శాతం రాక్‌సాండ్‌ వాడకాన్ని తప్పనిసరి చేస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాక్‌సాండ్‌ వాడకం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని అందుకే ఈ దిశగా ప్రోత్సాహాన్ని ఇస్తున్నట్లు పేర్కొంది.