ఉద్యమ సహచరుణ్ణి కోల్పోయా.. సోలిపేట మృతికి కే.సీ.ఆర్‌ నివాళి

దుబ్బాక శాసన సభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి తన ఉద్యమ సహచరుడని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఘనంగా నివాళులర్పించారు. రామలింగారెడ్డి ఆకస్మిక మృతిపట్ల ముఖ్యమంత్రి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.ఒకే ప్రాంతవాసిగా రామలింగారెడ్డితో తనకు గల అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. సిద్ధిపేట జిల్లా చిట్టాపూర్‌లో రామలింగారెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి, ముఖ్యమంత్రి నివాళులర్పించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తనతో కలిసి పనిచేసిన రోజులు గుర్తుకు తెచ్చుకున్న కే.సీ.ఆర్‌ కన్నీటిపర్యంతమయ్యారు. రామలింగారెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించి, వారికి అండగా నిలుస్తామని భరోసానిచ్చారు.

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో పాటు, మంత్రులు కె.టి.ఆర్‌, హరీశ్‌ రావు, ఈటల రాజేందర్‌, పువ్వాడ అజయ్‌ కుమార్‌, కొప్పుల ఈశ్వర్‌, నిరంజన్‌ రెడ్డి, సత్యవతి రాధోడ్‌, పులువురు శాసన సభ్యులు, ఎంపీలు, తదితర ప్రముఖులు రామలింగారెడ్డి పార్థివదేహంపై పుష్పగుచ్చం ఉంచి ఘనంగా నివాళులర్పించారు. మంత్రి హరీశ్‌ రావు, ఎంపి కొత్త ప్రభాకర రెడ్డి స్వయంగా రామలింగారెడ్డి పాడె మోసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రజలు పెద్దసంఖ్యలో నివాళులర్పించారు.