|

ఉద్యోగులకు హెల్త్‌ కార్డులు పోలీసులకు వరాలు

kcrముఖ్యమంత్రి కెసిఆర్‌ మరోసారి ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు. దీపావళి పండగ సందర్భంగా ఆయన ఉద్యోగులు, పోలీసుల బాగును కోరుతూ పలు సంక్షేమ పథకాలు ప్రకటించారు. ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగులు తమకు హెల్త్‌ కార్డులు కావాలని కోరుతున్నారు. కెసిఆర్‌ ముఖ్యమంత్రి కాగానే తమది ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉండే ప్రభుత్వమని స్పష్టం చేశారు. అలాగే ఉద్యోగులకు ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న హెల్త్‌ కార్డులను జారీ చేశారు. పోలీసులకు ఎన్నో శాఖాపరమైన వెసులుబాటులు కల్పించారు. రోజు వారి బందోబస్తు భత్యం రూ. 90 నుంచి రూ. 250కి పెంచడంతో పాటు ఎస్‌.ఐ.లకు గెజిడెట్‌ హోదా కల్పించారు. అమరుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను భారీగా పెంచారు. అక్టోబరు 21న పోలీసు అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా సిఎం ఈ మేరకు ప్రకటించారు. అలాగే అదేరోజు సచివాలయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చించిన ఆయన హెల్త్‌ కార్డుల జారీకి సుముఖత వ్యక్తం చేయడంతో పాటు అదేరోజు జారీ ప్రక్రియను ప్రారంభించారు. ఉద్యోగులు ముందస్తుగా ఒక్క పైసా చెల్లించకుండా, ఎలాంటి ప్రీమియం వసూలు చేయకుండా అన్ని కార్పోరేట్‌ ఆసుపత్రుల్లో సీలింగ్‌ లేకుండా వైద్యం చేయించుకోవడానికి ఈ హెల్త్‌ కార్డుల వల్ల అవకాశం లభిస్తుంది. ఇది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు వరంగా చెప్పవచ్చు. వీరంతా ఈ కార్డుల జారీతో ఎంతో లబ్దిపొందనున్నారు. ఇక పోలీసులకు కూడా ఎన్నో వరాలు కురిపించారు. విధి నిర్వహణలో మరణించిన పోలీసు కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని భారీగా పెంపుచేశారు. కానిస్టేబుల్‌ నుంచి ఎఎస్‌ఐ వరకు మరణిస్తే ఇచ్చే రూ. 25 లక్షల పరిహారాన్ని రూ. 40 లక్షలకు పెంచారు. అలాగే ఎస్‌ఐ హోదా ఉన్న అధికారి చనిపోతే ఇచ్చే పరిహారాన్ని రూ. 25 లక్షల నుంచి రూ. 45 లక్షలకు పెంచారు. సీఐ, డీఎస్పీ, అడిషనల్‌ ఎస్పీ హోదా గల అధికారులు మరణిస్తే ఇచ్చే పరిహారాన్ని రూ. 30 లక్షల నుంచి రూ. 50 లక్షలకు పెంచారు. ఎస్పీ స్థాయి లేదా ఐపీఎస్‌ స్థాయి అధికారి మృతి చెందితే ఇచ్చే పరిహారాన్ని రూ. 50 లక్షల నుంచి ఒక కోటి రూపాయలకు పెంచారు. ఇక ఎస్‌.ఐ.లకు గెజిడెట్‌ హోదా కల్పించారు. విధి నిర్వహణలో రోజువారీ భత్యాన్ని రూ. 90 నుంచి రూ. 250గా పెంచారు. ఇలా అటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు, ఇటు పోలీసులకు అన్ని విధాలుగా సంతృప్తి కలిగించే విధంగా సీఎం చేసిన ప్రకటనల పట్ల ఉద్యోగ సంఘాలు, పోలీసు అధికారుల సంఘాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం కేసీఆర్‌ పాలన సాగిస్తున్నారని వారు కొనియాడారు. ఉద్యోగులు, పోలీసుల బాధలు గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రిగా వారు కేసీఆర్‌ను శ్లాఘించారు.