|

ఏదైనా ఇవ్వడంలో ఉన్న తృప్తి వేరుకదా !

అన్నవరం దేవేందర్‌

అంతా సమానమైన అవకాశాలు, సమానమైన జీవనం అన్నీ అనుకూలాలు ఎక్కడా ఉండయి. హెచ్చు తగ్గులు, ఉన్నోల్లు, లేనోల్లు, రెక్కల కష్టం నమ్ముకున్నోల్లు, కూసోని తినేటోల్లు లోకం అంతటా ఉంటరు. అదే సమయంలో లేనోల్లకు సహాయం చేసే వాల్లు సుత ఆదుకోవడం సమాజ పరంగా వ్యక్తుల పరంగ ఇట్లా కొనసాగే సందర్భాలు ఈ రోజుల్లో తక్కువనే ఉండవచ్చు. గాని మంచిని ఆదరించే తనం కొనసాగుతున్నది. ఊరికి బడికోసం జాగ ఇయ్యడం స్మశాన వాటిక కోసం స్థలం ఇవ్వడం ఇట్లా ఊరందరి అవసరాలను ఆదుకోవడం ఎంతైనా అవసరం ఉన్నది. వచ్చినప్పుడు తెచ్చింది లేదు. పోయినప్పుడు వెంట తీసుకపోయేది ఏమి ఉండదు. నడుమ బతికిన రోజులల్ల, ఫలానా వాడు మంచోడురా అన్నట్టు మెదలడమే జీవితం. తరతరాలు తరగని ఆస్తి ఉంటది. కని పిల్లికి సుత బిచ్చం పెట్టనోల్లు ఉంటరు.
చిన్నచిన్న సహాయాలు చేస్తే ఎల్లకాలం వాల్ల జీవితం నిలబడుతది. ఊర్ల్లల్ల సర్కారకు బడి పిల్లలకు స్కూల్‌ తర్వాత స్టడీ సమయంలో స్నాక్స్‌ పెట్టె కల్చర్‌ వచ్చింది. బడి పిల్లలకు అవసరమైన వస్తువులు ఇవ్వడం, ఎవలకైనా ఫీజు కట్టలేకుంటే సీటు పోతందంటే కట్టి ఆదుకునే వాల్లు మస్తుమంది కన్పిస్తరు. డాక్టర్‌ కోర్స్‌ల సీటు సంపాదించుకున్న అత్యంత పేద పిల్లలను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నరు. ప్రభుత్వం చేసేది చేస్తది కని, బయట సహాయం చేసేవాల్లు సుత కన్పిస్తున్నరు. అంతా స్వార్ధ చింతన, నాకే కావాలే, నేనే తినాలె అనే తత్త్వం పల్లెల్లో ఇంకా కొనసాగుతున్నది. అంటే సిటీల లేదా? అంటే, లేదని కాదు. పట్నంల ఒగలకు ఒగలు తెల్వది. ఎవ్వల ఐసియత్‌ ఎంతనో, ఎవలు లేనోల్లో తెల్వది. అదే ఊర్ల్లల్ల నైతే ఎవలకన్న ఐఐటిల సీటు వచ్చిందనుకో సదివిచ్చుడు కష్టం అయితే ఎవలో ఒకలు ఆదుకుంటరు. ఆ పిల్లవాండ్లు ఊరందరికి తెల్సిన వాల్లు అయ్యుంటరు. కొన్ని చోట్ల తల్లి తండ్రి లేని పిల్లలను ఆదుకునే శరణాలయాలు నడుస్తున్నాయి. సిరిసిల్ల నగరంలో రంగినేని ట్రస్ట్‌లో ఇలా ఎంతో మంది పిల్లలు గత కొన్నేల్లుగా చదువుకొని వృద్ధిలోకి వస్తున్నరు. చిన్నప్పుడు అందులో చేరి, ఇప్పుడు ఉద్యోగాలకు కూడా ఎంపికవుతున్నరు. నా అన్న వాల్లు ఎవరూ లేని వాల్లను ఆదుకొని ఆశ్రయం ఇచ్చి విద్యాబుద్ధులు నేర్పించి

ఉద్యోగులను తయారు చేయడం మహా శ్రమ. అదీ ఏమి ఆశించకుండా పని చేయడం, అలాంటి ట్రస్ట్‌ నడపడం పట్టుదల అంకిత భావం ఉండటం వల్లనే సాధ్యం. అది రంగినేని ట్రస్ట్‌ అధినేత మోహన రావు గొప్పతనం. దానికి ఆయన కుటుంబం సహకరించడం మరీ గొప్పతనం. ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే, ఎవరూలేని పిల్లలకు అదొక గొప్ప అవకాశం. ఇట్లాంటివి సమాజంలో స్వచ్ఛంద సంస్థల నిర్వహణలో ఉంటాయి. సహాయం చేసే సంస్కృతి సమాజంలో పెరగాలి. ఒకరికి తొడ్పడం అనేది గొప్ప విషయం.

ఇవ్వడంలో ఉన్న తృప్తి ఎందులో ఉండదు. పొందడంలో కన్న ఇతరులకు ఇవ్వడంలో ఆనందం గొప్పగానే ఉంటుంది. ఆకలి గొన్న వాల్లకు అన్నం, దాహం వేసిన వాల్లకు మంచి నీళ్ళు పొయ్యడం, పీజు కట్టలేని వాళ్ళకు డబ్బులు కట్టడం, వాల్లను ఉన్నతులుగా చేయడం అనే ఆలోచనలు సమాజంలో విస్తరించాల్సి ఉంది. ఎవరి దగ్గరనైనా సంపద ఎక్కువగా ఉన్నదంటే అది సమాజం నుంచి వచ్చిందే, లేదా పూర్వం నుంచి ఉన్నా! అదీ ఆనాటి సమాజం అందించిందే. రకరకాల కారణాల వల్ల కొందరికి ఉంటది కొందరికి ఉండది. ఈ హెచ్చు తగ్గుల వల్లనే లొల్లులు కొట్లాటలు జరుగుతుంటయి. ఏది ఏమైనా సమాజంలో ఆనాటి నుంచి ఈ నాటి వరకు ఒకరికి ఏదైనా ఇవ్వడం అనేది జరగాలి. ఇదంతా కుటుంబంలో నుంచే రావాలి. పిల్లల పెంపకం నుంచే సమాజానికి, బయటి వాల్లకు మనం ఏమైనా ఇయ్యగలమా! చెయ్యగలమా అనే వాతావరణం మొదలు కావాలి. అప్పుడే సమాజంలో మనుషుల పట్ల పేదల పట్ల అనురాగాలు ప్రేమలు పెరుగుతయి. లేని వాల్లకు ఉన్నవాల్లు ఇయ్యడం అనేది వితరణ శీలత, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నదే. లేకుంటేనే మరొక సమస్యకు అంకురార్పణ జరుగుతది. ఇది ఇంటి నుంచి చిన్నపిల్లలు ఇతరులకు చాక్‌లెట్లు ఇచ్చుడు నుంచి మొదలు కావాలి. ఇల్లు, వాడ, ఊరు నుంచి ఇచ్చి పుచ్చుకునుడు కొనసాగాల్సిన అవసరం ఉన్నది.