|

ఐటీఐల పనితీరు బాగుంది :

కేంద్రమంత్రి అనంతకుమార్‌ హెగ్డే

తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక శిక్షణా సంస్థల (ఐటీఐ) పనితీరు బాగుందని కేంద్ర నైపుణ్యాభివృద్ధిశాఖామంత్రి అనంతకుమార్‌ హెగ్డే ప్రశంసించారు. హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలోని నోవాటెల్‌ హోటల్‌లో రాష్ట్ర హోం, కార్మిక శాఖామంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఇతర అధికారులతో కేంద్రమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ విద్యార్థులతో పోల్చుకుంటే ఐటీఐలు పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగం లభించిన శాతం మెరుగ్గా ఉందని అభిప్రాయపడ్డారు. ఐటీఐ కళాశాలలను మరింత సమర్ధవంతంగా తీర్చిదిద్దినట్లయితే విద్యార్థుల భవిష్యత్తు మరింత మెరుగ్గా ఉంటుందన్నారు. ఐటీఐ కోర్సులను అభ్యసించే విద్యార్థినులకు విదేశాల్లో శిక్షణ ఇప్పించే అవకాశముందని, ఆ విధంగా ఐటీఐలను తీర్చిదిద్దాల్సి ఉందన్నారు.

ఈ సందర్భంగా మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ అప్రెంటీస్‌ యాక్ట్‌-1961 అనుసరించి ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థినీ విద్యార్థులకు అప్రెంటీస్‌ శిక్షణ ఇస్తున్నామని, కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐ సీట్లు 73,378 ఉండగా వాటిలో 32 ట్రేడ్‌లు ఉన్నాయన్నారు. సీట్ల భర్తీకి ఆన్‌లైన్‌ ద్వారా చేపడుతున్నామని, ప్రతి ప్రభుత్వ ఐటీఐలలో ప్లేస్‌మెంట్‌ సెల్‌ను ఏర్పాటు చేశామని తెలియజేశారు. రాష్ట్రంలోని పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకోవటం ద్వారా బీడీఎల్‌, మిధాని, హెచ్‌ఏఎల్‌, టాటా ఏరోస్పేస్‌, టయోటా, మారుతి సుజుకీ, హ్యుందాయ్‌, ఫోర్డ్‌ ఇండియాలో ఉద్యోగ సంబంధ శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన పథకం కింద రిజిస్ట్రేషన్‌, అక్రెడేషన్‌ 40 నుంచి 60 రోజుల సమయం తీసుకుంటోందని, ఈ సమయాన్ని తగ్గించాలని మంత్రి నాయిని కేంద్రమంత్రిని కోరారు. కేంద్రమంత్రి స్పందిస్తూ, ఈ విషయంపై త్వరలోనే మార్గదర్శకాలను పంపుతామని, సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్సీకోసం నిధులను అందజేస్తామని తెలిపారు. కార్మిక,

ఉపాధికల్పనాశాఖ ముఖ్య కార్యదర్శి శశాంక గోయల్‌, ఉపాధికల్పన డైరెక్టర్‌ వైబీ నాయక్‌ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.