| |

ఒలింపిక్స్‌ నిర్వహించే స్థాయికి నగరాన్ని చేరుస్తాం: కేటీఆర్‌

ktrఒలింపిక్స్‌ నిర్వహించే స్థాయికి నగరాన్ని తీర్చిదిద్దుతామని పంచాయతీరాజ్‌, ఐటీ శాఖామంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. డిసెంబరు 29న హైదరాబాద్‌లోని మాదాపూర్‌ శిల్పారామం రాక్‌హైట్స్‌లో జరిగిన నగర ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలు అడిగిన పలు సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. మొదట కేటీఆర్‌ 40 నిమిషాల పాటు ప్రజలకు నగర అభివృద్ధిపై పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. నగరాన్ని తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్‌ నాయకత్వంలో ఎలా అభివృద్ధిపరచాలనుకుంటుందో కళ్ళకు కట్టినట్లుగా ప్రదర్శించారు. సిటిజన్‌ చార్టర్‌ను అమలులోకి తెస్తామని తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు 72 కిలోమీటర్ల మేర మెట్రోరైలు మార్గాన్ని మూడు నెలలలో అందుబాటులోకి తెస్తామన్నారు. అలాగే మెట్రో మార్గాన్ని మరింత విస్తరించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. అలాగే ట్రాఫిక్‌ సమస్యను తొలగించడానికి 100 కిలోమీటర్ల మేర స్కైవేలతో పాటు గ్రేడ్‌ సపరేటర్లు, మల్టీలెవెల్‌ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించి సిగ్నల్‌ఫ్రీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సంకల్పించినట్లు తెలిపారు. అతి పొడవైన ఆకాశ రహదారి మూసీనది పొడవునా వస్తుందని తెలిపారు. మంచినీటి సరఫరాను మెరుగుపరచడానికి గోదావరి జలాలను నగరానికి తీసుకువచ్చినట్లు తెలిపారు. నగర సమీపంలో 30 టీఎంసీల సామర్థ్యంతో రెండు రిజర్వాయర్లు నిర్మాణం చేసి నగరానికి మంచినీటి కొరత లేకుండా చేస్తామన్నారు. ఇక హుస్సేన్‌సాగర్‌ శుద్దిచేసి నగరానికే కళ తెస్తామన్నారు. పరిశుభ్రతపై కూడా దృష్టి పెట్టామన్నారు. బహిరంగ మూత్ర విసర్జన లేకుండా ప్రతి కిలోమీటర్‌కు ఒకటి చొప్పున గ్రీన్‌ టాయిలెట్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే బంజారాహిల్స్‌లో అత్యాధునిక సమాచార వ్యవస్థతో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను (ట్విన్‌ టవర్స్‌) ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. షీటీమ్స్‌ ఏర్పాటు చేసి యువతులు, మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని కల్పించినట్లు తెలిపారు. ఆసియాలోనే రెండో అతిపెద్ద క్యాంపస్‌ను నగరంలో ఏర్పాటు చేయడానికి గూగుల్‌ ముందుకు వచ్చిందన్నారు. వెయ్యి కోట్లతో కంపెనీ ముందుకు వచ్చిందన్నారు. ఐటీ కంపెనీలను ఆకర్షించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. టీహబ్‌ పేరుతో దేశంలోనే అతిపెద్ద ఐటీ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసిన ఘనత మనకే దక్కిందన్నారు. మెదక్‌ జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని కర్కపట్లలో జినోమ్‌వ్యాలీలో రూ. 340 కోట్లతో జీవ వైద్య పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇలా నగరాభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న పథకాలను కూలంకషంగా వివరించారు.