కంటోన్మెంట్‌ రోడ్లకు దారి ఏది?


దేశంలో అతిపెద్ద జనావాసాలు ఉన్న మిలటరీ ఏరియాగా సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ను చెప్పుకోవచ్చు. అలాగే ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కూడిన కంటోన్మెంట్‌ బోర్డు కూడా ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లా నుండి సికింద్రాబాద్‌, హైదరాబాదుకు వచ్చే ప్రధాన రహదారులు కంటోన్మెంట్‌ ఏరియా నుండే రావాలి. అలాగే హైదరాబాదులో పశ్చిమ ప్రాంతం నుండి తూర్పు ప్రాంతానికి వెళ్లాలంటే తప్పనిసరి సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ‘వైతరణి’ నది దాటాల్సిందే.

సుమారు అయిదారు లక్షల మంది శాశ్వత నివాసులుగా ఉన్న కంటోన్మెంట్‌ ఏరియా నుండి సామాన్య ప్రజలు ప్రతిరోజు ఉపయోగించే ప్రధాన అంతర్గత రహదారులను ఎప్పటికప్పుడు మూసివేత ఉత్తర్వులను ఇస్తూ కంటోన్మెంట్‌ బోర్డు ప్రజలను అష్టకష్టాలపాలు చేస్తోంది. కంటోన్మెంటు మిలటరీ ప్రాంతం కనుక కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే మళ్లీ ఆ రహదారులను తాత్కాలికంగా తెరుస్తున్నారు. ఈ ప్రక్రియ ఎలా ఉంటుందంటే ప్రజలకు ఎలాంటి సమాచారం లేకుండా ఒక్కొక్కసారి రహదారులకు అడ్డంగా తెల్లారేకల్లా గోడ కట్టి పారేస్తారు. నిన్నటిదాకా తాము ప్రయాణం సాగించిన రహదారి ఒక్కసారిగా మూసుకుపోవడంతో ప్రజలకు దిక్కుతోచడం లేదు. అలా రోడ్డు మూసేయడం వల్ల ఒక్కోసారి పది, పదిహేను కిలోమీటర్ల దూరం అదనంగా చుట్టూ తిరిగి ప్రజలు ప్రయాణం చేయాల్సి వస్తోంది. మరికొన్నిసార్లు కంటోన్మెంట్‌ బోర్డు ప్రజలకు, ‘ఈ రోడ్డు మూసి వేస్తున్నాము’ అని చెప్పి పత్రికల్లో ప్రకటన ఇస్తుంది. ఆ ప్రకటన చూడగానే ప్రజలు, ప్రజా సంఘాలు ప్రజలందరూ కలిసి రోడ్లు మూసేయొద్దు మొర్రో అంటూ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులకు, మంత్రులకు విజ్ఞప్తులు చేసుకోవాల్సి వస్తోంది. వాళ్లు దయతలచి తమ రాజకీయ ప్రయోజనాల కోసం కరుణిస్తే మళ్లీ రోడ్డు తెరుస్తున్నారు. లేకపోతే అంతే సంగతులు. ఇప్పటికే కంటోన్మెంట్‌ లోపలికి వెళ్లే కొన్ని రోడ్లు శాశ్వతంగా మూసివేశారు. తమ సొంత ఇళ్లకు పోవడానికి తాము పర్మిషన్‌ అడుక్కోవాల్సిన దుస్థితి కంటోన్మెంట్‌ ప్రజలది. దీనికి శాశ్వత పరిష్కారాలు చూపమని ఎన్నో రోజులుగా ప్రజలు కోరుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాత్కాలిక చర్యలతో సరిపెట్టుతున్నాయి.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ కేంద్ర హోం శాఖ మంత్రికి రోడ్ల మూసివేతపై లేఖ రాయడంతో ఈ సమస్య మరొక్కసారి తెరకెక్కింది. దీని పూర్వాపరాలు పరిశీలిస్తే మనకు చాలా సంగతులు అవగతమవుతాయి. హైదరాబాద్‌ స్టేట్‌ నిజాం పరిపాలనలో ప్రత్యేక దేశంగా ఉన్నప్పుడే బ్రిటిష్‌ వారు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మన దగ్గర ఈ మిలటరీ ఏరియాలు ఏర్పడ్డాయి. ఇప్పటి కోఠిలోని ‘‘రెసిడెన్సి’’ భవనం అప్పటిదే. ఆ తర్వాత భారత స్వాతంత్రానంతరం పోలీస్‌ యాక్షన్‌ ద్వారా హైదరాబాద్‌ రాష్ట్రం దేశంలో విలీనం అయిపోయింది. పోలీస్‌ యాక్షన్‌ సమయంలో హైదరాబాద్‌ నగరానికి నాలుగు దిక్కుల నుండి భారత సైన్యం దాడి చేసింది. అలా వచ్చిన సైన్యం ఎక్కడికక్కడే హైదరాబాదుకు నలుదిక్కుల కంటోన్మెంట్‌ ఏరియాగా స్థిరపడిపోయింది. ఇందులో మరొక వాస్తవం మనం గమనించాలి. అప్పటికే ప్రస్తుత సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఏరియాలో జనావాసాలు ఉన్నాయి. జనావాసాల మధ్యలోకే కంటోన్మెంట్‌ వచ్చింది కానీ, కంటోన్మెంట్‌ ఏరియాలోకి జనావాసాలు రాలేదు. ఇది గమనిస్తే రోడ్ల మూసివేత ప్రజల సహజ హక్కుకు భంగం కలిగించడమే అవుతుంది. ఇది భారత పౌర స్మృతి ప్రకారం ‘‘ఈజ్‌ మెంట్‌ రైట్స్‌’’ కి భంగమే అని చెప్పవచ్చు. సామాన్య పౌరులు కట్టుకుంటే కూడా ఈ కంటోన్మెంట్‌ ఏరియాలో కంటోన్మెంట్‌ బోర్డు మాత్రమే పర్మిషన్‌ ఇవ్వాలి. ఇప్పటికీ అదే విధానం అమలఅవుతోంది. అప్పటి హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ మున్సిపాలిటీతో కానీ, ప్రస్తుత జిహెచ్‌ఎంసితో కానీ, కంటోన్మెంట్‌కు ఎలాంటి సంబంధం లేదు. కంటోన్మెంట్‌ ఏరియాలో రోడ్ల మురుగు కాలువ నిర్వహణ కూడా కంటోన్మెంట్‌ బోర్డు చూస్తుంది. పౌర ఆవాసాలో సౌకర్యాలు కల్పించడంతోపాటు వారికి వారి ఆవాసాలకు వెళ్ళడానికి సరియైన రహదారి కల్పించాల్సిన అవసరం కూడా కంటోన్మెంట్‌ బోర్డుదే. కానీ తన సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఎప్పటికప్పుడు రోడ్లను మూసి వేస్తున్నారు. దీంతో సామాన్య ప్రజలు ఇబ్బందులపాలు అవుతున్నారు. దీనికి ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం లభించాలి.

దశాబ్దాల తరబడి రగులుతున్న ఈ సమస్య పై ఐదేళ్ల క్రితమే అప్పటి మున్సిపల్‌ శాఖ మంత్రి కె. తారకరామారావు కేంద్రానికి రెండు ప్రతిపాదనలు పంపించారు. అవి ఏమిటంటే, ప్రస్తుతం కంటోన్మెంట్‌ గా ఉన్న మొత్తం స్థలాన్ని ఖాళీ చేసి హైదరాబాద్‌ కు నలభై యాభై కిలోమీటర్ల దూరంలోకి మార్చాలి. ఇక రెండో ప్రతిపాదన హైదరాబాద్‌ కు నూట యాభై కిలోమీటర్ల దూరానికి పైన రైల్వే లైను అందుబాటులో ఉన్న కరీంనగర్‌, వరంగల్‌ జిల్లా సరిహద్దుల్లో కానీ, కంటోన్మెంట్‌ ను పూర్తిగా షిఫ్ట్‌ చేసే ఆలోచన చేశారు. కంటోన్మెంట్‌లో మిలటరీ వారి ఆధీనములో ప్రస్తుతం ఉన్న భూమికి రెండింతల భూమిని కొత్త ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చే ఆలోచన కూడా చేశారు. అప్పుడు ప్రస్తుతం చెట్లు చేమతో ఉన్న కంటోన్మెంట్‌ ప్రాంతంలోని వేల ఎకరాలు సికింద్రాబాద్‌ ప్రజలకు ‘‘బ్రీతింగ్‌ ఏరియాగా’’ఆక్సిజన్‌ పార్కులుగా పనికి వస్తాయి అన్నది అప్పటి ఆలోచన. అలాగే సికింద్రాబాద్‌ నుండి అటు నిజామాబాద్‌, అదిలాబాద్‌, ఢల్లీ నగరం ద్వారా శ్రీనగర్‌ వెళ్లే 44వ నెంబరు జాతీయ రహదారి, సంగారెడ్డి మీదుగా పూణే వెళ్ళే 65వ నెంబరు జాతీయ రహదారి ఇటు కరీంనగర్‌, రామగుండం రాజీవ్‌ రహదారి విస్తరణకు ఇది పనికి వస్తుంది. ఇప్పటికీ డిపిఆర్‌ పూర్తి చేసుకొని ఉన్న ఈ రెండు రహదారులపై ప్రతిపాదించిన ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం కంటోన్మెంట్‌ మిలిటరీ భూముల కేటాయింపు చేయకపోవడం వల్ల ఆగిపోయింది. ఇప్పటికైనా ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారంగా కంటోన్మెంటు ఖాళీ చేయించి హైదరాబాద్‌కు దూరంగా అన్ని సౌకర్యాలతో కొత్త కంటోన్మెంట్‌ ఏరియా అభివృద్ధి చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఈ ప్రతిపాదనతో ముందుకెళ్లాలి. అప్పుడే ప్రజల రోడ్ల కష్టాలు తీరుతాయి.

ప్రస్తుత సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఏరియాలో జనావాసాలు ఉన్నాయి. జనావాసాల మధ్యలోకే కంటోన్మెంట్‌ వచ్చింది కానీ, కంటోన్మెంట్‌ ఏరియాలోకి జనావాసాలు రాలేదు. ఇది గమనిస్తే రోడ్ల మూసివేతతో ప్రజల సహజ హక్కుకు భంగం కలిగించడమే అవుతుంది. ఇది భారత పౌర స్మృతి ప్రకారం ‘‘ఈజ్‌ మెంట్‌ రైట్స్‌’’ కి భంగమే అని చెప్పవచ్చు.

– బండారు రామ్మోహనరావు