కాళేశ్వరానికి జాతీయహోదా ప్రధానిని కోరిన సి.ఎం కె.సి.ఆర్‌

tsmagazine
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కె.సి.ఆర్‌ రెండవసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారిగా ప్రధానిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిపిన చర్చలలో ముఖ్యంగా తెలంగాణకు జీవనాడిగా మారనున్న, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తిచేశారు. కేంద్రం వద్ద అపరిష్కృతంగా ఉన్న పలు ప్రాజెక్టులు, ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి చర్చించారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తులకు ప్రధాని సానుకూలంగా స్పందించారు.

ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఈ క్రింది అంశాలపై చర్చించారు.

 •  నూతన సచివాలయ నిర్మాణం, రాజీవ్‌ రహదారి విస్తరణకు కావలసిన బైసన్‌ పోలో మైదాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదలీచేయాలి.
 • కరీంనగర్‌ లో ట్రిపుల్‌ ఐటి ఏర్పాటు చేయాలి.
 • హైదరాబాద్‌లో ఐ.ఐ.ఎం ఏర్పాటు
 • కొత్త జిల్లాలలో 21 జవహర్‌ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలి.
 • హైదరాబాద్‌ లో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐ.ఐఎస్‌.ఇ.ఆర్‌) ఏర్పాటుచేయాలి.
 • ఉపరితల రవాణా మంత్రిత్వశాఖ ప్రతిపాదించిన విధంగా ఎన్‌.హెచ్‌.ఓ.ఐ సంయుక్త భాగస్వామ్యంతో ఆదిలాబాద్‌ లోని సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సి.సి.ఐ) పునరుద్ధరణ.
 • జహీరాబాద్‌ లో జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్‌) కి నిధుల విడుదల
 • వరంగల్‌ లో కాకతీయ మెగా టెక్స్‌ టైల్స్‌ పార్కు అభివృద్ధికి రూ.1,000 కోట్ల మంజూరుకు విజ్ఞప్తి.
 • కృష్ణా జలాలపై తెలంగాణ పిటీషన్లు కృష్ణా ట్రిబ్యునల్‌కు బదలీ చేయాలి.
 • కాళేశ్వరానికి జాతీయ హోదా ప్రకటించాలి. లేదా, భారీ ప్రాజెక్టుకింద ప్రత్యేక గ్రాంటు మంజూరుచేయాలి
 • ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ విభజన చట్టంలోని షెడ్యూలు 9, 10 పరిధిలోని సంస్థల విభజన
 • రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పూర్తికి పనులు వేగవంతం చేయాలి
 • షెడ్యూల్డు కులాల వర్గీకరణ
 • వరంగల్‌ జిల్లాలో గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు
 • రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలకు వెనుకబడి ప్రాంతాల అభివృద్ధి నిధులు రూ.450 కోట్లు విడుదల చేయాలి
 • ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన కింద రాష్ట్రంలో రహదారుల నిర్మాణం

హోం మంత్రితో భేటి

ఉమ్మడి హైకోర్టు విభజనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖా మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌లకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానితో సమావేశమైన అనంతరం కేంద్ర హోంశాఖా మంత్రి రాజ్‌నాథ్‌ ను కూడా కె.సి.ఆర్‌ కలుసుకున్నారు.ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టానికి సంబంధించి నోడల్‌ ఏజెన్సీగా హోంశాఖ ఉన్నందున చట్టంలోని మిగతా అంశాలపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి కోరారు. చట్టం ప్రకారం రాష్ట్రంలో నెలకొల్పవలసిన పరిశ్రమలు, సంస్థలు వెంటనే నెలకొల్పేలా చొరవచూపాలని కూడా సి.ఎం కోరారు.