కేంద్ర ప్రభుత్వ గెజిట్ జల హక్కుల ఆక్రమణ!
By: వి. ప్రకాశ్

కేంద్ర ప్రభుత్వం జూలై 15, 2021న కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుల పరిధి నిర్ణయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కృష్ణా, గోదావరి నదులపై, వీటి ఉపనదులపై నిర్మాణమవుతున్న, ఇప్పటికే నిర్మించిన అన్ని మధ్యతరహా, భారీ ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం.

ఇప్పటివరకు అనుమతులు పొందని అన్ని ప్రాజెక్టులకు గెజిట్ ప్రచురించిన తేదీ నుండి ఆరు నెలల లోపు అనుమతులు పొందాల్సి వుంటుంది. ఒకవేళ అనుమతులు పొందక పోతే ఇప్పటికే ప్రాజెక్టులు పూర్తయినా వాటి నిర్వహణ నిలిపివేయాలి. నిర్మాణంలో వున్న ప్రాజెక్టు పనులను గెజిట్ ప్రచురించిన తేదీ నుండి నిలిపివేయాలి. ఆరు నెలల్లోపు వీటికి అనుమతులు పొందలేక పోతే పాక్షికంగా లేదా పూర్తిగా ఇప్పటికే ఈ ప్రాజెక్టులను నిర్వహిస్తున్నట్లయితే ఆరు నెలల గడువు ముగిసిన తర్వాత వీటి నిర్వహణ నిలిచిపోతుంది (Shall cease to operate). ఈ తరహా నిర్మాణంలో వుండి లేదా నిర్మాణం పూర్తయి అనుమతులు పొందని ప్రాజెక్టులు:
1. శ్రీశైలం ఎడమ కాల్వ (ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు) తూములు, టన్నెల్, నక్కలగండి రిజర్వాయర్, 10 టి.ఎం.సిల ఇన్‌టేక్, సంబంధిత పనులు
2. కల్వకుర్తి ఎత్తిపోతలు – రెండు దశలు
3. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు
4. డిండి (నక్కలగండి) ఎత్తిపోతలు
5. భక్త రామదాసు ప్రాజెక్టు
6. తుమ్మిళ్ళ ఎత్తిపోతలు
7. నెట్టెంపాడు ఎత్తిపోతల, రెండోదశ
8. రామప్ప-పాకాల ఎత్తిపోతలు
9. సీతారామ ప్రాజెక్టు మూడవ లిఫ్టు
10. జూట్‌పల్లి ప్రాజెక్టు
11. పి.వి.నరసింహారావు కంతనపల్లి బ్యారేజ్
12. కాళేశ్వరం ప్రాజెక్టు – ఒక్క టి.ఎం.సి అదనపు వినియోగం
13. రామప్ప వద్ద గల పాకాల రెగ్యులేటర్
14. తుపాకుల గూడెం బ్యారేజీ
15. మోదికుంట వాగు ప్రాజెక్టు
16. చౌటపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతలు
17. కందకుర్తి ఎత్తిపోతలు.
18. బి.ఆర్. అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు
19. గూడెం ఎత్తిపోతలు
20. ముక్తేశ్వర ప్రాజెక్టు (చిన్న కాళేశ్వరం ఎత్తిపోతలు)
21. సీతారామ (రాజీవ్-దుమ్ముగూడెం) ఎత్తిపోతలు
కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులకు రెండు నెలలలోపు ఒక్కో రాష్ట్రం నాలుగు వందల కోట్లు చెల్లించాలి.
రెండు రాష్ట్రాల్లోని అన్ని భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల సిబ్బంది, కార్యాలయాలు, ఆఫీసుఫైళ్ళు, వాహనాలు అన్నీ బోర్డుల ఆధీనంలోకి వెళ్తాయి.
బోర్డుల ఆదేశాలను రాష్ట్రాలు ఉల్లంఘిస్తే పెనాల్టీలు చెల్లించాల్సి వుంటుంది.
కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలు బోర్డులు పరిశీలించి అనుమతులివ్వాలో లేదో నిర్ణయిస్తాయి. ఈ నిర్ణయాలపై అపెక్స్ కౌన్సిల్ పునర్విచారణ జరుపుతుంది.
బోర్డుల అధికారాలపై, నిర్ణయాలపై వివాదాలు తలెత్తితే కేంద్ర ప్రభుత్వ నిర్ణయమే అంతిమం.
ఈ గెజిట్ ద్వారా రాష్ట్రాల నీటి పారుదల శాఖలు నిర్వీర్యం చేయబడనున్నాయి. ప్రభుత్వాల అధికారాలు కేవలం చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలకే పరిమితం కానున్నాయి. కాల్వలతో చెరువులు, చెక్ డ్యాంల అనుసంధానానికి వీలుండదు. కాల్వలపై ఎత్తిపోతలకూ బోర్డు అనుమతించకపోవచ్చు సరిగ్గా ఇలాంటి ప్రయత్నమే రెండేళ్ళ క్రితం కేంద్ర ప్రభుత్వం చేసింది. రివర్ బేసిన్ మేనేజ్మెంట్ బిల్లు-2018, డ్యాం సేఫ్టీ బిల్లు-2019 ద్వారా దేశంలోని అన్ని నదులపై, ఉపనదులపై గల సాగునీటి, జల విద్యుత్ ప్రాజెక్టులను తమ అదుపులో పెట్టుకోవాలని నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రయత్నించి విఫలమైంది. ఈ బిల్లులను కొన్ని పార్టీలు వ్యతిరేకించడంతో రాజ్యసభలో వీటికి మెజారిటీ రాదని భావించి కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కానీ, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం – 2014ను సాకుగా తీసుకొని ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను తమ అదుపులో పెట్టుకోవడానికి ఈ గెజిట్ ద్వారా ప్రయత్నిస్తున్నది.
ఏ.పి పునర్విభజన చట్టం-2014లో బోర్డుల పరిధి నిర్ణయించే అధికారం, కేంద్ర ప్రభుత్వానికి వుందని పేర్కొనబడింది. దీన్ని ఆసరాగా చేసుకొని రెండు రాష్ట్రాల్లోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను (తెలంగాణలో 107 ప్రాజెక్టులు), కాల్వలను, బ్యారేజీలను, హెడ్ రెగ్యులేటర్లను, ఎత్తిపోతలను, విద్యుదుత్పత్తి కేంద్రాలను, మొత్తంగా నీటి పారుదల శాఖలనే బోర్డుల పరిధిలోకి తేవడం రాజ్యాంగ స్ఫూర్తికి, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్దం. ఏ.పి. పునర్విభజన చట్టం స్ఫూర్తికి కూడా విరుద్దం. తెలంగాణ రాష్ట్ర జలాల హక్కులపై కేంద్ర ప్రభుత్వ ఆక్రమణగా ఈ గెజిట్‌ను పరిగణించవచ్చును. రెండు ప్రభుత్వాలను ఇరుకున పెట్టడానికి అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశాన్ని గెజిట్‌లో ఉదహరించారే తప్ప గత అక్టోబర్‌లో జరిగిన ఈ సమావేశంలో గెజిట్‌లోని నిబంధనలు, పరిధికి సంబంధించిన ప్రాజెక్టులు చర్చకు రాలేదన్నది పచ్చి నిజం.
కృష్ణా జలాలను పునః పంపిణీ చేయడానికి తమ విన్నపాలను ట్రిబ్యునల్‌కు ఆర్టికల్ 3 ఇంటర్‌స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ క్రింద నివేదించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో జలశక్తి మంత్రిని కోరినారు. సుప్రీం కోర్టులో తెలంగాణ ‘ప్రభుత్వం ఈ ఆంశంపై దాఖలు చేసిన రిట్ పిటీషన్‌ను ఉపసంహరించుకుంటే సానుకూల నిర్ణయం తీసుకుంటామని కేంద్ర జలశక్తి మంత్రి హామీ ఇచ్చారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకోడానికి సుప్రీంకోర్టులో పిటీషన్ కూడా దాఖలు చేసింది.
కొద్దిరోజుల క్రితం కెసిఆర్ ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించి కృష్ణా జలాల పునః పంపిణీ జరిగే దాకా తాత్కాలికంగా రెండు రాష్ట్రాలకు 50ః50 నిష్పత్తిలో కృష్ణా జలాలను పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినారు. గత అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ‘‘కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా నిర్ణయించేదాకా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధి నిర్ణయించరాదని కెసిఆర్ కేంద్రాన్ని కోరినారు. దీనిపై కేంద్ర మంత్రి స్పందిస్తూ ఏ.పి. రీ ఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం బోర్డుల పరిధిని నిర్ణయించే అధికారం తమకుందని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాల పునః పంపిణీకై డిమాండ్ చేయడానికి సహేతుకమైన కారణం వుంది. 1956లో తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయడంతో పూర్వం నిజాం, వెల్లోడి, బూర్గుల రామకృష్ణా రావు ప్రభుత్వాలు నిర్మించ తలపెట్టిన కృష్ణా బేసిన్ ప్రాజెక్టులైన అప్పర్ కృష్ణా, భీమా, తుంగభద్రా లో-లెవెల్ కెనాల్ ప్రాజెక్టులను ఏపి తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి రద్దు చేశారు. ఏలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని క్రిందికి జరిపి నాగార్జునసాగర్ ప్రాజెక్టును నిర్మించడం వలన తెలంగాణ నష్టపోయింది. ఈ ప్రాజెక్టులన్నీ యధాతధంగా పూర్తయ్యి వుంటే తెలంగాణ ప్రాంతానికి మరో 200 టి.ఎం.సి.లకు పైగా నీటిని బచావత్ ట్రిబ్యునల్ కేటాయించి ఉండేది. పాలమూరు జిల్లా సమైక్య రాష్ట్ర ఏర్పాటు వలన ఎలా నష్టపోయిందో స్వయంగా బచావత్ ట్రిబ్యునల్ తమ అవార్డులో పేర్కొన్నది. ఈ కారణం చేతనే జూరాల ప్రాజెక్టుకు 17.84 టి.ఎం.సిలను కేటాయిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ నీటిని మరో ప్రాజెక్టుకు ఎపి ప్రభుత్వం తరలించదనే నమ్మకంతో తామా జూరాలకు కేటాయిస్తున్నట్లు అవార్డులో తెలిపింది.
సీమాంధ్ర పాలకులు 57 ఏళ్ళు పాలమూరు జిల్లాకు చేసిన అన్యాయం కారణంగానే లక్షలాది కుటుంబాలు వలస బాట పట్టడం, ఆకలి చావులు, పేదరికం. సి.ఎం. కెసిఆర్ జలవనరులపై తనకున్న అపారమైన మేధో సంపత్తితో తెలంగాణను పునర్నిర్మాణం వైపు నడిపిస్తున్నారు. ‘‘కోటి ఎకరాల మాగాణం తన స్వప్నం’’ అని ప్రకటించి ఆ దిశలో పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. మరెన్నో ప్రాజెక్టులకు రీ-డిజైనింగ్ చేశారు.
ఏక పక్షంగా కేంద్రప్రభుత్వం జారీ చేసిన ఈ గెజిట్‌తో తెలంగాణ పరిస్థితి మళ్ళీ మొదటికి రానున్నది. ఇక నుంచి బోర్డులే నీటి పారుదల ప్రాజెక్టులపై అన్ని నిర్ణయాలు తీసుకుంటాయి. తమ తమ రాష్ట్రాలలో సాగునీటి నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని ఇరురాష్ట్రాల సి.ఎంలు కోల్పోతున్నారు. ఆమోదం పొందని ప్రాజెక్టులకు రానున్న ఆరు నెలల్లో కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందకపోయినా, బోర్డులు ఆమోదం తెలుపకపోయినా ఆయా ప్రాజెక్టులపై ఇప్పటి దాకా చేసిన ఖర్చు వృధా అవుతుంది. ఒకవేళ ఆంధ్రలో మిగులు జలాల ఆధారంగా నిర్మించిన ప్రాజెక్టులకు బోర్డు నీటి కేటాయింపులు చేస్తే ఆ మేరకు తెలంగాణా కృష్ణా జలాలను నష్టపోతుంది.
తెలంగాణలో కెసిఆర్ తలపెట్టిన రీ-డిజైనింగ్ పనులకూ భవిష్యత్తులో అంతరాయం ఏర్పడవచ్చు. శ్రీరాం సాగర్ పునరుజ్జీవ పథకం, సింగూరు, నిజాంసాగర్ ఆయకట్టు స్థిరీకరణకు గోదావరి నీటిని కాళేశ్వరం నుండి తరలించడానికి అభ్యంతరాలు వ్యక్తం కావచ్చు. కృష్ణా బేసిన్ (తెలంగాణ)లోని ప్రాజెక్టులకు గోదావరి జలాలను తరలించడానికి బోర్డు అనుమతించకపోవచ్చు.
మిషన్ భగీరథకు తెలంగాణ రిజర్వాయర్ల నుండి నీటిని తరలించడానికి బోర్డుల అనుమతి అవసరమవుతుంది.
సమైక్యరాష్ట్రంలో ఏ ప్రాజెక్టు నిర్మించాలనుకున్నా ముందు నిర్మాణం మొదలు పెట్టి ఆ తర్వాత అనుమతులకు దరఖాస్తు చేసుకోవడం సాధ్యపడిరది. కానీ ఇక ముందు అనుమతి పొందకపోతే నిర్మాణం పూర్తి చేసుకున్న ప్రాజెక్టులు కూడా నిలిచిపోతాయి. ఇక ముందుబోర్డు అనుమతి లేకుండా కనీసం ఎత్తిపోతల పథకాలను ప్రకటించడం కుదరదు. సొమ్మొకడిది ` సోకొకడిది అన్నట్లు నీటి పారుదల శాఖ సిబ్బంది వేతనాలు, పెన్షన్లు, నిర్మాణ ఖర్చులు, నిర్వహణ వ్యయం, బోర్డుల ఖర్చు అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి- పెత్తనం, అధికారం మాత్రం బోర్డులు, అపెక్స్ కౌన్సిల్ ముసుగులో కేంద్రం చెలాయిస్తుంది.

ఏ.పి. విభజన చట్టం – 2014లో హామీలైన కోచ్‌ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, పలు రైల్వే ప్రాజెక్టులు, స్టీల్ ఫ్యాక్టరీ ఏవీ నరేంద్ర మోడీ సర్కారుకు గుర్తురావు. ఎన్నిసార్లు కెసిఆర్, మంత్రులు, అధికారులు విజ్ఞప్తి చేసినా వారికి వినిపించవు. కానీ బోర్డుల పరిధి మాత్రం గుర్తుకు వచ్చింది. ఈ సాకుతో అధికార దుర్వినియోగానికి పాల్పడిరది మోడీ ప్రభుత్వం. ఏ.పి. రీ ఆర్గనైజేషన్ యాక్ట్ – 2014 కూడా తెలంగాణ ఉద్యమ నాయకులు, ప్రజాప్రతినిధులతో చర్చించకుండా అప్పటి యు.పి.ఏ ప్రభుత్వం ఏకపక్షంగా రూపొందించింది..
ఈ గెజిట్ ద్వారా కేంద్రం నదుల అనుసంధానానికి పాల్పడి గోదావరి మిగులు జలాలను ఇతర రాష్ట్రాలకు తరలించే ప్రమాదమూ లేకపోలేదు.
ఈ గెజిట్‌ను ఆంధ్రప్రదేశ్ మంత్రులు తొలుత ఆహ్వానించినా ఇప్పుడు తల పట్టుకుంటున్నారు. వివాదం ఉన్న రెండు రాష్ట్రాల జాయింట్ ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకీ తెస్తారనుకుంటే కృష్ణా, గోదావరి బేసిన్లలోని అన్ని ప్రాజెక్టులను మోడీ సర్కారు బోర్డుల ద్వారా తమ గుప్పిట్లో పెట్టుకోవడం వారికి నచ్చలేదు. ఆంధ్ర నేతల పరిస్థితి ‘‘మింగలేని కక్కలేని’’ చందంగా మారింది.
తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా తన వైఖరి వెల్లడించాల్సివుంది. ఈ గెజిట్‌ను కృష్ణా జలాల పునః పంపిణీ జరిగే దాకా కోల్డ్ స్టోరేజీలో పెట్టాలని, కెసిఆర్ కోరినట్లు చెరి 50 శాతం కృష్ణా జలాలను పంచుతూ తాత్కాలిక ఏర్పాటు చేయాలని తెలంగాణ నీటి పారుదల నిపుణులు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సి.ఎం జగన్‌ను కెసిఆర్ ప్రగతి భవన్‌కు రెండు సార్లు ఆహ్వానించి కృష్ణా పై గల ప్రాజెక్టులకు గోదావరి జలాలను అనుసంధానం చేయాలని నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఇరు ప్రాంతాల ఇంజనీర్లు ఐదు ప్రతిపాదనలను (ఇద్దరు సి.ఎంల ఆదేశంపై) రూపొందించారు. ఇవేవీ ఆంధ్ర సి.ఎం.కు నచ్చలేదు. వ్యాప్కోస్ (కేంద్ర ప్రభుత్వ సంస్థ) తో ఆరో ప్రతిపాదన కూడా చేయించారు. వీటిలో ఏ ఒక్క ప్రతిపాదనకు ఆచరణ రూపమిచ్చినా ఈ గెజిట్ వెలుగు చూసేది కాదు. తెలంగాణతో విభేదాలను మరింతగా పెంచేలా, ఏపి సర్కారు రాయలసీమ ఎత్తిపోతలు, రాజోలి బండ కుడి కాల్వ పనులు ప్రారంభించింది. కేంద్ర జల సంఘం, బోర్డు ఆదేశాలనూ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలనూ వై.ఎస్ జగన్ సర్కారు ఖాతరు చేయలేదు. తెలంగాణతో సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన వివాదాలను కేంద్రం కోర్టులోకి నెట్టింది.
‘‘పిట్టపోరు పిట్ట పోరు పిల్లి తీర్చిన’’ చందంగా ఇరు రాష్ట్రాల జల హక్కులపై దురాక్రమణకు దిగింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికైనా వై.ఎస్ జగన్, కెసిఆర్ తో సామరస్యంగా చర్చలు జరిపి ఏకాభిప్రాయానికి వస్తే నదీజలాలపై నిర్ణయం తీసుకునే అధికారం ఇద్దరికీ మిగులుతుంది. దక్షిణాది రాష్ట్రాలకు ఢల్లీి పాలకులు ఏనాడూ న్యాయం చేయలేదు.
రెండు రాష్ట్రాల మధ్య ఏ వివాదమూ లేని గోదావరి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి ఎందుకు చేర్చిందో కేంద్రం స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది.
ఈ గెజిట్ భవిష్యత్తులో రాజ్యాంగ సంక్షోభానికి, ఇరు రాష్ట్రాల మధ్య జల యుద్ధాలకు తెరదీసినా ఆశ్చర్యపోనక్కర లేదు.