కోటి లింగాల

By: డా॥ సంగనభట్ల నరసయ్య

కోటిలింగాల ఆంధ్రదేశపు అత్యంత ప్రాచీనమైన రాజధాని నగరం. ఇది గోదావరి తీరాన కరీంనగర్‌ జిల్లాలో, వెల్గొండ సమీపాన, పెదవాగు సంగమించే చోట ఉంది. మూడు పక్కల ప్రవాహంతో కోటిలింగాల ద్వీపకల్పం వలె ప్రాకృతికంగా జలదుర్గమైంది. ఇంతటి ప్రాచీనమైన రాజధాని నగరం తెలంగాణలో మరొకటి లేదు. నాలుగు బురుజుల (నేటి మట్టిదిబ్బల)తో 110 ఎకరాల కోట ఆవరణతో, తీరం వెంబడి బౌద్ధ స్థూపం మిట్ట ఉంది. 

కోటిలింగాల శాతవాహనుల తొలి రాజధాని నగరం. కేవలం శాసనాల్లో నామమాత్రంగా లభించిన శ్రీముఖుని నాణెములు ఇక్కడ పదులకొద్ది లభించాయి. నాణెములు అధికంగా లభించిన ఈ ప్రాంతంలో పురావస్తుశాఖ 1979-84 మధ్య జరిపిన తవ్వకాలవల్ల ప్రాచీన నగరం బయటపడింది. ప్రాచీన నిర్మాణాల్లో విశేషించి బావులు, పారిశుధ్యపు నిర్మాణాలు, విశేషమైన ఇటుకలు లభించాయి. జనావాసాలు, మట్టి పెంకులు, సౌందర్య సాధకాలైన ఆభరణాలు, పూసలు ఇక్కడి పొలాల నిండా లభించాయి. ఇది ఆంధ్రదేశంలో అతిపెద్ద చారిత్రక ఉజ్జనన క్షేత్రం 1055మీ. (తూర్పు) x 333మీ. (ఉత్తరం)గా గుర్తించబడిన ఈ చోట: 

  • గుండ్రని పెద్ద బావులు ఇటుకతో కట్టినవి. 
  • వ్యవస్థీకృత మురుగునీటి పారుదల కట్టడాలు. 
  • ఇండ్ల స్థలాలు. 
  • రక్షణ వలయాలు మట్టితో, ఇటుకకోటలు కనుగొనబడ్డాయి. 
  • బంగారు గుండ్లు, పూసలు, పూలు తక్కువ విలువగల రాళ్లతో పొదిగినవి అనేకంగా లభించిన కారణాన బహుశ నిర్మాణకేంద్రం అయి ఉంటుంది. 
  • రాగి, వెండి నాణెములు లభించాయి. 
  • ఆంధ్రదేశపు శాతవాహన కాలపు క్షేత్రాలన్నిటిలోకెల్ల ఇది అతి ప్రాచీనమైనది. 
  • కోటిలింగాల కోట గోడలు ధూళికట్ట, పెద్దబంకూ రులవలె మట్టితోగాక ఇటుకలతో చాలా విశాలంగా నిర్మించారు. 

రోమన్‌ నాణెములు సమీప ప్రాంతాలలో లభించడం వల్ల ఇది విదేశీవర్తక వ్యాపార కేంద్రమని స్పష్టమైంది. ఇక్కడ రోమన్ల శిల్పీకృత ఘటములు (Rouletted Pots) లభించాయి. శ్రీవనిజ బౌద్ధజాతక కథలో పేర్కొన్న ఉత్తర భారతదేశ వ్యాపారి తెలివాహననదిని దాటి ఆంధ్ర నగరంలో ప్రవేశించాడన్న విషయం గోదావరి దాటి ఈ నగరంలో ప్రవేశించినట్టుగా భావించడమైనది. సువిఖ్యాత చరిత్రకారులు పి.వి. పరబ్రహ్మ శాస్త్రి దీనిని విదర్భ-ఆంధ్ర రాజపథంగా పేర్కొన్నారు. 

2500 సంవత్సరాల క్రిందటి ప్రాచీన (గర్భ) నగరం తవ్వకాలలో 2.5 మీటర్ల లోతులో అవాస తలములు బయట పడటమేగాక అమూల్యమైన నాణెములు లభించాయి. ఇక్కడ లభించినన్ని నాణెములు, వైవిధ్యం, విశిష్టతలు భారతదేశంలో ఏ ప్రాంతంలో లభించలేదంటే అతిశయోక్తి కాదు. పొలాల్లో కుప్పలు తెప్పలుగా వర్షం పడ్డాక దొరికేవి. (1) 2.5 మీటర్ల లోతులో రాజ్ఞగోబద పేరుతో నాణెములు, (2) 1.78 మీటర్ల లోతులో రాజ్ఞ సామగోప నాణెములు, (3) 1. 90మీ. లోతులో శ్రీ శాతవాహన నాణెములు, (4) 1.22 మీ. లోతుల్లో శ్రీ శాతకర్ణి నాణెములు, (5) 0.38 మీ. లోతులో శ్రీముఖుని (చిముకుని) నాణెములు లభించినాయి. (6) ఒకటవ పులోమావి, మహాసేనాపతి సగమన, కంవాయ సిరి నాణెములు, మహాతల వర, సిరినారన నాణెములు ఉపరితలంలో లభించాయి. ఇవికాక పంచ్‌మార్క్‌డ్‌, నాణెములు (విదా నాణెములు), రాతలేని పక్కలు గల నాణెములు, మహారథి, మహాగ్రామిక, శివ సేబక, సాధకన పేర్లుగల నాణెములు కూడా దొరికాయి. తయారు స్థితిలోవి, పునర్ముద్రితాలు, సగం తయారైన నాణెములు, లభించడం వల్ల ఇక్కడ కోశాగారం, నాణెముల ముద్రణాలయం ఉండేదన్నది స్పష్టం. ప్రభుత్వానికి లభించినవేగాక గ్రామ ప్రజల చేతిలో ఇంకా ఉన్నవి, కరగవేసినవి, బంగారు, రాగి, సీసముతో చేసినవి కలిపి వెయ్యికి పైగా నాణెములు లభించాయి. 

కేవలం అనంతరికులైన తన వంశస్థులచేత నానేఘాటు శాసనంలో పేర్కొనబడ్డ శ్రీముఖుడు ఇక్కడ రాజ్యస్థాపన చేసి పరిపాలించినట్టు ఆయన నాణెముల వల్ల బయటపడింది. నిజానికి ఇక్కడ లభించిన నాణెములలో శ్రీముఖుడే అర్వాచీనుడు. అతనికి ముందు రాజన్యుల నామములతో నాణెములు లభించుటచే అవికూడ భూమి లోతులో కింది పొరలలో లభించుటచే వీటి మీద విశేష పరిశోధన సాగి తొలి శాతవాహన రాజ్యం రాజధాని నగరం ఇక్కడేనని నిర్ధారితమైంది. నాణెములపై రాజుల పేర్లు లభించిన వారిలో గోభద్రుడు ప్రాచీనతముడు. అతని నాణెములు ఇక్కడ మాత్రమే లభించుట విశేషము. శాతవాహనులు ఆంధ్రభృత్యులమని చెప్పు కొనుటచే అతనికి పూర్వపు కోటిలింగాల రాజన్యుల చేతిలో నుండిన ఆంధ్ర రాజ్యము, ఆ పిదప శ్రీముఖుని వశమైనదని, అతడే ఈ కోటి లింగాలలో శాతవాహన సామ్రాజ్యమును స్థాపించెనని తెలుస్తోంది. 

శాతవాహన, శాతకర్ణి, శ్రీముఖ శాతవాహన నాణెములు మాత్రమే తొలి రాజన్యులవి కోటిలింగాలలో దొరుకుట గమనించాలి. ఈ చారిత్రక ప్రాంతము పురాణ రచనా కాలము నాటికి పూర్వముండినది. మహాభారత కాలము నాటికి ‘‘ఆంధ్రకః కృష్ణాగోదావర్యోః మధ్యే విద్యమానే దేశః’’ అని రాయబడి ఉండుటను బట్టి గోదావరి తీరము నుండి కృష్ణా తీరానికి ఆంధ్రరాజ్యం తరువాత విస్తరించినట్టు భావించవచ్చును. 

ధూళికట్ట, కోటిలింగాల, మల్లాపూర్‌, రణంకోట (కరీంనగర్‌ లోనివి), పోదన (నేటి బోధన్‌ – నిజామాబాద్‌ జిల్లా) వంటి చోట్ల కోటలు, ప్రాచీన జనజీవన సంబంధి పాత్రలు, ఆభరణాలు లభించడంతో, ప్రాచీన బౌద్ద స్థూపములుండడంతో క్రీ.పూ. 3వ శతాబ్ది నాటి మెగస్థనీసు, 2వ శతాబ్ది నాటి ప్లినీ రాసిన ముప్పది దుర్గములు, లక్ష కాల్బలము వంటివి ఈ ప్రాంతము గురించేనని భావించవచ్చును. సంస్కృత మహాభారతంలో భీష్మపర్వంలో ‘‘ఆంధ్రాశ్చ బహవోరాజన్‌…’’ అని చెప్పినది. బహుళ సంఖ్యలో కోటలు గల వారాంధ్రులన్నది క్రీ.పూ. 6వ శతాబ్ది నాటి అశ్మక, ముల్లక జనపదములకు భిన్నమైన తెలంగాణ కోటలని, ఇదే ఆంధ్రరాజ్యమనడం  నిస్సంశయమైనది. ఈ ప్రాంతాన్నేలిన కోటిలింగాల రాజులు గోభద్ర, సామగోపాదులు ఆంధ్ర రాజులని, అనంతర శాతవాహనులు ఆంధ్రభృతులని భావించడం సబబైనది.  

కోటిలింగాల గ్రామానికి అగ్నేయ భాగంలో పెదవాగు గోదావరిలో సంగమించే చోట బౌద్ధస్థూపమున్నది. దీనికి వాడిన ఇటుక శాతవాహనులకు ప్రత్యేకము. నేటి ఇటుకకు వైశాల్యములో 3 రెట్లున్నది. 50’ x 30 x 7’ లేదా 26 సెం.మీ. x 12 సెం.మీ. ఘనపు కొలతలు గల ఇటుక లివి.  ఈ ఇటుకలు గర్భనగర నిర్మాణానికే కాక, బౌద్ధ స్థూపము నిర్మాణానికి కూడా వాడబడినవి. 30 హెక్టా రుల వైశాల్యం గల ఈ ప్రాచీన రాజధాని నగరం లోని పొలములో ఈ బౌద్ధ స్థూపము యొక్క రాతి ఫలకములు 20 సెం.మీ. మందంగలవి లభ్యమైనాయి. వాటిమీద లఘు శాసనములున్నవి. ఇవి లిపినిబట్టి ‘పూర్వ బ్రాహ్మీలిపి’ శాసనాలు. ఇవి అశోకునికంటే ముందువి. మౌర్య బ్రహ్మీలిపికి, భట్టిప్రోలు బ్రాహ్మీలిపికి పూర్వలిపిగా గుర్తించబడినవి. వీటిమీద బౌద్ధ ధర్మపు రాతలున్నాయి. దీన్నిబట్టి ఈ ప్రాంతంలో అశోకునికి ముందే బౌద్ధమతం వ్యాప్తిలో ఉందని తెలుస్తోంది. అశోకుని 13వ ధర్మలిపి శాసనంలో ‘‘నిచచోడ… ఆంధ్రపులిదేషు సవ్రత దేవనం పియస ధమనుశస్తి’’ అని ఆంధ్రులు బౌద్ధ ధర్మాన్ని అనుసరించారని రాసింది ఈ ప్రాంతం గురించే. కోటి లింగాలకు 3 కి.మీ. దూరంలోని పాశాయిగాం గ్రామం వెలుపల మరో బౌద్ధ స్థూపం ఉంది. ఆచార్య దిజ్నాగుడు ఈ గ్రామంవాడేనని వి.వి.కృష్ణశాస్త్రి తెలిపారు.

కరీంనగర్‌ జిల్లాలోని కోటిలింగాల, పాశాయిగాం, ధూళికట్ట, మీర్జంపేట (ఓదెల మండలం) వంటివి తొలినాళ్ల స్థూపాలు. బుద్ధుని అవశేషాలు లేనివి. ఘంటసాల, అమరావతి, గోలి, జగ్గయ్యపేట వంటివి అవశేషాలు నిక్షిప్తం చేసిన మలిదశ చైత్యాలు. బుద్ధుని శిష్యుడు బావరి కవిటవనద్వీప నివాసి అని బుద్ధ ఘోషుని పరమార్థ జ్యోతిక గ్రంథమూ, ఇతడు పోతలి రాజ్య పౌరుడని సుత్తని పాతమూ చెప్పడంతో పోతలి (బోధన్‌-నిజామాబాద్‌ జిల్లా) రాజ్యంలోనిదిగా కవిటవనద్వీపం- గోదావరి మధ్యస్థ బాదనకుర్తి ద్వీపముగా కరీంనగర్‌ తప్ప మరొకటి లేదు. బావరికుర్తి నేటి బాదనకుర్తిగా మారి ఉండవచ్చు. బుద్ధుని సమకాలికులు (బావరి, శరభంగ పాలుడు, కొండన్న మొదలగువారు) నివసించిన ఈ కరీంనగర్‌, నిజామాబాద్‌ ప్రాంతాలలో (అశ్మక, అంధక జనపదములు) బౌద్ధం ఉత్తరం నుండి గోదావరి తీరస్థ తెలంగాణ ప్రాంతాలలో ప్రవేశించి, దక్షిణాన కృష్ణా తీరంవైపు విస్తరించినదని భావించవచ్చు. 

చరిత్రాధారములను బట్టి, కోటిలింగాల రేవులో గోదావరినదీ ప్రవాహములో చిన్నపడవలతో ప్రారంభించి బంగాళాఖాతములో పెద్దపడవల ద్వారా సుదూర తీరములకు ప్రాకింది అని భావించవచ్చు. ఇందుకు కోటిలింగాల సమీప ప్రాంతాలలో లభించిన రోమన్‌ నాణెములు సాక్ష్యాలు. కరీంనగర్‌ జిల్లాలోని నుస్తులాపూర్‌ లో 1952లో జరిగిన తవ్వకాలలో ఒకటవ శతాబ్దానికి చెందిన 39 రోమన్‌ నాణెములు వెండివి లభించాయి. ఇవి నీరో, అగస్టస్‌ చక్రవర్తుల కాలపువి. పేదబంకూర్లో పురాతన ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గరకూడా ఇటీవలి కాలంవరకు దిబ్బలమీద రోమన్‌ నాణెములు దొరికాయి. అంతేకాదు, ఇదేచోట గోదావరి దక్షిణతీరము వెంబడి ఎగువ ప్రాంతమున రాజపట్టణము రేవు, ధర్మపురి రేవు, వేంపల్లి వెంకట్రావుపేట రేవు, పోతలి ప్రాంతములు కూడా వ్యాపార తీరములే. హాలుని వివాహము వేంపల్లి వెంకట్రావుపేట తీరమున భీమేశ్వరుని సన్నిధిలో జరిగినది. నేటికిని భీమేశ్వరాలయ శిథిలాలు శాతవాహనుల కాలపు ఇటుకలతో నిర్మాణం జరిగినవి. ఈ తీరాన పుష్కలంగా ఇనుము చిట్టెం లభించినది. కుతూహలుడనే కవి రాసిన ‘లీలావతీ’ అనే ప్రాకృత కావ్యములో సింహళ రాజకన్యను భీమేశ్వర సన్నిధిలో సప్తగోదావరి తీరమున హాలుడు వివాహమాడి నట్లున్నది. ఇక్కడ గోదావరి నది ఏడుపాయలుగా చీలి ఎనమిది రేవులను సృష్టించినది. గోదావరినది లేని దాక్షారామం (తూ.గో.జిల్లా) హాలుని వివాహస్థలమని పలువురు చారిత్రకులు పొరబడినారు. 

ఈ నగరాలను రక్షిస్తూ నిలబడ్డ కోటగోడలు ఇప్పటికీ ఉన్నాయి. రెండువేల సంవత్సరాల తరువాత ఈ గోడలు ఉండడం మాటలు కాదు. కోటిలింగాల కోట గోడలలో ఇటుక బాగా వాడినారు. శాతవాహనుల కాలపు ఇటుక చాలా విశాలమైంది. చాటలంత ఇటుకలు, ఇటుకలమధ్య మట్టి వాడినారు. కోటిలింగాలలో నాలుగు దిశల బురుజు దిబ్బలున్నాయి. ఈ నగరం చుట్టూ 3 వైపుల గోదావరి, పెద్దవాగు జలాలున్నాయి. ఒకవైపు మాత్రం ఇది పడమర-పాశిగాం నుండి ప్రవేశం ఉండేది. నేటి మార్గాలు గోడలు కూలినాక ఏర్పడ్డవి. 

రణంకోట నగరానికి రెండువైపుల కొండలు (ఉత్తర దక్షిణాలు) తూర్పు, పడమరలే గోడలు కట్టి దుర్భేద్య ‘గిరిస్థల’ దుర్గం చేసికొన్నారు. 

కోట గోడలు చాలా విశాలమైన పునాదులతో ఉండే వని ధూళికట్ట నగరంలోని నేటి కోట అడుగులు (ఆర్కియాలజీ తవ్వకాలలో బయటపడ్డవి) చెప్తున్నాయి. 

బురుజులు, విలుకాళ్లు ప్రధాన సైనిక వనరులు. వివిధ ఆయుధాలతోబాటు విచిత్రాయుధాలుండేవి. జాతకకథల్లో కొన్ని, గాథాసప్తశతిలో గ్రామీణ జీవితం నేటి తెలంగాణలో ఇంకా సజీవంగా ఉంది. కోటిలింగాల తవ్వకాలలో ముళ్లబంతి (ఇనుపది) లభించింది. సైనిక వ్యవస్థలో సైన్యాధిపతి స్వయంగా తాను వేయించిన నాణెములు జీతంగా ఇచ్చేవాడు. కోటిలింగాలలో ‘‘మహాసేనాపతిని’ అనే అక్షరాలున్న నాణెములు లభించాయి అన్నది ఇందుకు సాక్ష్యం. 

(బాధాకరమైన విషయం ఏమంటే ఎల్లంపల్లి (శ్రీపాద) ప్రాజెక్టు గోదావరి నదిపై నిర్మిస్తుండడం వల్ల కోటిలింగాల గ్రామం ప్రాజెక్టు నిలువ నీటిలో మునిగిపోబోతోంది. బౌద్ధస్థూపం, శివాలయం, నాణెములు, ఆనాటి కట్టడములు, విశిష్టమైన ఇటుకలు, లభించని ఇంకెన్నో అపూర్వ చరిత్రాంశాధారాలు గోదావరి నది ఒడిలో చేరకముందే వాటిని సుదూర ప్రాంతంలోకి తరలించవలసి ఉందని, ఫిల్ములద్వారా చిత్రీకరించి, భద్రపరచవలసిన అవసరం ఉందని భావిస్తున్నాను.)