గజ్వేల్‌లో మహా హరితహారం

tsmagazine
నాలుగో విడత హరితహారాన్ని గజ్వేల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. ప్రగతిభవన్‌ నుంచి రోడ్డు మార్గాన గజ్వేల్‌ వెళ్లిన సీఎం.. మార్గమధ్యంలో మేడ్చల్‌ జిల్లా తుర్కపల్లి, సిద్ధిపేట జిల్లా ములుగులో మొక్కలు నాటారు. అలాగే సింగాయపల్లి అడవికి వెళ్లి కలియతిరిగారు. అటవీ రక్షణకు అధికారులు తీసుకుంటున్న చర్యలను చూసి వారిని అభినందించారు. ఆ తర్వాత గజ్వేల్‌లోని బస్టాండ్‌ చౌరస్తాలో సీఎం కదంబ మొక్కను నాటారు. సీఎం కేసీఆర్‌ మెక్కనాట గానే వర్షం కురువడంతో ప్రకృతి పరవశించినట్లయింది. నాటిన తర్వాత మసీదుల్లో సైరన్‌ మోగించారు. సైరన్‌ మోగంగానే గజ్వేల్‌ పరిధిలో ఉన్న ప్రతి ఇంట్లో, అన్ని రోడ్ల వెంట, ఔటర్‌ రింగ్‌ రోడ్డుపైనా, ప్రభుత్వ-ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో, ప్రార్థనా మందిరాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లోని ఖాళీ స్థలాల్లో ప్రజలు మొక్కలు నాటారు. అనంతరం తిరుగు ప్రయాణంలో ప్రజ్ఞాపూర్‌లో కూర నాగరాజు ఇంట్లో కొబ్బరి మొక్కను నాటారు. ప్రజ్ఞాపూర్‌లో ఎంతో కాలంగా నర్సరీ నిర్వహిస్తూ.. మొక్కలను పంపిణీ చేస్తున్న వారిని అభినందించారు. వారితో కలిసి ఫొటో దిగారు. వీధుల్లో మొక్కలు నాటుతున్న స్థానికుల దగ్గరకు వెళ్లి పరిశీలించారు.

tsmagazine

గజ్వేల్‌లో ఘన స్వాగతం
నాలుగో విడుత హరితహారం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గజ్వేల్‌ ప్రజలు ఘన స్వాగతం పలికారు. రోడ్డుకిరువైపులా నిలబడి ముఖ్యమంత్రి వాహనానికి స్వాగతం పలుకుతూ తమ తమ స్థానాల్లో మొక్కలను నాటారు. మహిళలు మంగళ హారతులు, బోనాలతో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా స్వాగతం పలికారు.గజ్వేల్‌ పట్టణంలో ప్రారంభం అయిన హరితహారం.. రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. లక్ష్యానికి మించి ఒకే సారి 1,36,588 మొక్కలు నాటారు ప్రజలు.

గజ్వేల్‌ హరితహారం కోసం వివిధ ప్రాంతాల నర్సరీల నుంచి ఎత్తుగా పెరిగిన ఆరోగ్యవంతమైన మొక్కలను తెప్పించారు అధికారులు. పండ్లు, పూల మొక్కలతో పాటు ఇండ్లలో పెంచడానికి ఇష్టపడే చింత, మామిడి, అల్ల నేరేడు, కరివేపాకు, మునగ మొక్కలను పంపిణీ చేశారు. పట్టణాన్ని 8 క్లస్టర్లుగా విభజించి, ప్రత్యేక అధికారులను నియమించారు. ఒక్కో క్లస్టర్‌ లో 15 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం లక్షా 16 వేల గుంతలను మున్సిపాలిటీ పరిధిలో తవ్వించారు. కొబ్బరి, జామ, దానిమ్మ, మామిడి, అల్లనేరేడు వంటి 75 వేల పండ్ల మొక్కలతో పాటు 16 వేల పూల మొక్కలు, 10 వేల అటవీ జాతులకు చెందిన మొక్కలను సప్లై చేశారు.

పట్టణ ప్రాంతాల్లో నీడను, స్వచ్చమైన గాలిని ఇచ్చే ఆకర్షణీయమైన చెట్లతో పాటు, ప్రతి ఇంటికీ రోజూ ఉపయోగపడే కరివేపాకు, మునగ లాంటి మొక్కలను ఇచ్చారు. ఇళ్ల ముందు, వెనకా ఉన్న ఖాళీ స్థలాల్లో పెంచుకునే పూలు, పండ్ల మొక్కలను ఇంటింటికీ సరఫరా చేసి నాటించారు. మొక్కల రక్షణ కోసం సుమారు 60 వేల ట్రీ గార్డులను కూడా సిద్దం చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, జోగురామన్న, డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.