|

గీత కార్మికులకు చెట్లపన్నురద్దు

శాసనసభలో సి.ఎం. కె.సి.ఆర్‌. ప్రకటన

tsmagazineతెలంగాణా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు ప్రభుత్వం బహుముఖాలుగా కృషి చేస్తున్నది. ప్రధానంగా వ్యవసాయ అభివృద్ధి, నీటి వనరుల అభివృద్ధి, కుల వృత్తులకు ప్రోత్సాహం వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నది. గ్రామీణ వనరులను ఆశ్రయించి ఎన్నో కులాలకు జీవిక లభిస్తున్నది. వారి జీవికను కాపాడడం, మెరుగుపరచడంకోసం ప్రభుత్వం అనేకరకాల పథకాలను అమలు చేస్తున్నది. కుల వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న వారిలో గౌడ సామాజికవర్గం ప్రధానమైనది. కల్లుగీత వృత్తిగా జీవించే గౌడ కులస్తులు సమైక్య రాష్ట్రంలో తీవ్ర నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురయ్యారు.

తెలంగాణ గ్రామీణ జీవితంపై అవగాహన, పట్టింపులేని సమైక్య పాలకుల చర్యలమూలంగా కల్లు గీత వృత్తి మనుగడనే ప్రశ్నార్థకంగా మారింది. సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వంనుండి గీత కార్మికులకు ఎలాంటి అండదండ లభించలేదు. కనీసం వారి మానానవారు బతికే అవకాశాన్ని కూడా లేకుండా చేశారు. లిక్కర్‌ లాబీల ప్రలోభాలకు, వత్తిడికి తలొగ్గి, హైదరాబాద్‌లో కల్లు దుకాణాలను నిర్ధాక్షిణ్యంగా మూసేశారు. సమైక్య పాలకులు చేసిన ఈ దుర్మార్గాన్ని తెలంగాణ నాయకులు అడ్డుకోకపోగా, వంత పాడడం దౌర్భాగ్యం. మరోవైపు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గుడుంబా మహమ్మారి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంటే వీళ్ళే కండ్లప్పగించి వేడుక చూశారు. సమైక్య పాలకులు సృష్టించిన ఈ సామాజిక విధ్వంసంవల్ల అటు ప్రజల ఆరోగ్యం పాడైపోయింది. ఇటు కల్లు గీత వృత్తి కల్లోలంలో పడింది.

తెలంగాణ ఉద్యమ సందర్భంలో గౌడ కులస్తులకు జరుగుతున్న అన్యాయం గురించి పదే పదే ప్రస్తావించాం. తెలంగాణ ఏర్పడి, మేము అధికారంలోకి వస్తే మూసేసిన కల్లు దుకాణాలను తెరిపిస్తామని ఉద్యమ నేతగా ఆనాడు నాకు నేనుగా ప్రకటించాను. ప్రజా ఉద్యమం ఫలించి, తెలంగాణ ఏర్పడింది. ప్రకటించిన విధంగానే హైదరాబాద్‌లో కల్లు దుకాణాలను తిరిగి తెరిపించాము. గౌడ కులస్తులకు జరిగిన అన్యాయాన్ని పరిష్కరించాం. గౌడ కులస్తుల సంక్షేమంకోసం మరెన్నో చర్యలు తీసుకున్నాం.

కల్లు గీసే సమయంలో చెట్టుపైనుంచి పడి మరణించిన లేదా శాశ్వత అంగ వైకల్యం పొందిన గీత కార్మికులకు పరిహారం చెల్లించడంలో గత ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసింది. తెలంగాణ ఏర్పడే నాటికున్న మూడేళ్ల బకాయిలు మొత్తం 6.38 కోట్ల రూపాయలను మేము అధికారంలోకి రాగానే వెంటనే ఏకకాలంలో చెల్లించాము.

అంతేకాకుండా అప్పటిదాకా అరకొరగా ఇస్తున్న పరిహారాన్ని మానవీయ దృక్పథంతో పెంచినం. గతంలో చెట్టుపైనుంచి పడి మరణించిన వారికి రెండు లక్షలు, అంగవైకల్యం పాలైన వారికి 50వేలు మాత్రమే ఇచ్చేవారు. తెలంగాణ ప్రభుత్వం ప్రమాదవశాత్తూ మరణించిన, శాశ్వత అంగవైకల్యం పొందిన గీత కార్మికులకు ఇచ్చే పరిహారాన్ని రూ. 5లక్షలకు పెంచింది.

ఈ రోజు మీ అందరి సమక్షంలో గౌడ కులస్తుల సంక్షేమంకోసం ప్రభుత్వం తీసుకున్న మరికొన్ని మానవీయ నిర్ణయాలను ప్రకటిస్తున్నాను.

గీత కార్మికులకిచ్చే పెన్షన్‌ను 200 నుంచి 1000 రూపాయలకు పెంచాం. ఇప్పటివరకూ కల్లు గీత సొసైటీ సభ్యులకు మాత్రమే పెన్షన్‌ లభిస్తున్నది. ఇకనుంచి టి.ఎఫ్‌.టి. కార్మికులకు కూడా పెన్షన్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంవల్ల రాష్ట్రంలోని 30వేల కుటుంబాలకు ఆసరా లభిస్తుంది. టి.ఎఫ్‌.టి.నుంచి టి.సి.ఎస్‌.లోకి మారాలని దరఖాస్తు చేసుకున్న వారికి పది రోజుల్లో బదలాయింపు జరపాలని అధికారులను ఆదేశించాం.

లైసెన్సుల రెన్యూవల్‌ గడువును ఐదేళ్ళనుంచి పదేళ్ళకు పెంచుతున్నాం.

తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈత, ఖర్జూర మొక్కలను పెద్ద ఎత్తున నాటే కార్యక్రమం చేపట్టాం. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కోటి 70 లక్షల మొక్కలు నాటాం. ఎక్సైజ్‌, అటవీశాఖల సమన్వయంతో రాబోయే రోజుల్లో చెరువుకట్టలమీద, చెరువు శిఖం వెంబడి, వాగులు వెంట, వొర్రెల వెంట, నదీ ప్రవాహానికి ఇరువైపులా ఈత, ఖర్జూర మొక్కలను విరివిగా నాటే కార్యక్రమం కొనసాగుతుంది.

వీటన్నింటితోపాటు గౌడ కులస్తులకు మరొక తీపి కబురును ఈ రోజు ప్రకటిస్తున్నాను.

ఇప్పటివరకూ గీత కార్మికులకు ఉన్న చెట్ల పన్ను బకాయీలను పూర్తిగా మాఫీ చేస్తున్నాం. అంతేకాకుండా ఈనాటినుంచి తెలంగాణ రాష్ట్రంలో చెట్లపైన పన్ను వేసే విధానాన్నే రద్దు చేస్తున్నాం. దీనివల్ల ప్రభుత్వంపై ఏటా 16 కోట్ల రూపాయల భారం పడుతున్నా గీత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చెట్ల పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నాం.

హైదరాబాద్‌ నగరంలో గౌడ కులస్తుల అస్తిత్వాన్ని సమున్నతంగా చాటే విధంగా రాష్ట్రస్థాయి గౌడ భవనం నిర్మాణంకోసం 5 ఎకరాల భూమిని, 5 కోట్ల రూపయాలను మంజూరు చేస్తున్నాం. ఈ భవనం గౌడ కులస్తుల సామాజిక, ఆర్థిక, రాజకీయ వికాస కేంద్రంగా వెలుగొందాలని ఆశిస్తున్నాను.