|

గ్రామాలలో ఈ- పంచాయతీ సేవలు

గ్రామాలలో   ఈ- పంచాయతీ  సేవలుమహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా పయనిద్దామని ఎప్పటినుంచో అనడమే కాని ఆ దిశగా అడుగులు పడలేదు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత పరిపాలనా వికేంద్రీకరణ జరగాలని పట్టుదలతో కృషి చేసిన పంచాయతీరాజ్‌ శాఖ ఆ వైపుగా అడుగులు వేసి చూపింది

అక్టోబరు 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని నిజామాబాద్‌ జిల్లా, దోమకొండ మండలం బీబీపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో, ప్రభుత్వం వినూత్నంగా అమలు చేస్తున్న ఈ- పంచాయతీ కార్యక్రమాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్‌, ఐటి శాఖల మంత్రి కె. తారకరామారావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రసంగించిన కెటిఆర్‌, తెలంగాణ రాష్ట్రంలో వున్న 3.60 కోట్ల మంది జనాభాలో దాదాపు 60 శాతం జనాభా గ్రామాల్లోనే నివసిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో గల 8770 గ్రామ పంచాయతీల పరిధిలో 25 వేల జనావాసాలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం అందజేసే పౌరసేవలన్నీ గ్రామ పంచాయతీలలోనే లభించాలనే సదుద్దేశంతో, మన జాతిపిత గాంధీజీ జయంతిని పురస్కరించుకుని తొలివిడతగా రాష్ట్ర వ్యాప్తంగా 104 గ్రామ పంచాయతీలలో ఈ- పంచాయతీని ప్రారంభించినట్లు తెలియజేశారు. దీన్ని త్వరలో 700 గ్రామ పంచాయతీలకు విస్తరిస్తామని అన్నారు. ప్రస్తుతం మీ సేవా కేంద్రాలలో లభిస్తున్న 320 రకాల పౌరసేవలలో గ్రామీణ ప్రజలకు ఎక్కువగా అవసరమయ్యే 60 రకాల సేవలను ఇక ముందు ఈ- పంచాయతీల ద్వారా అందించబోతున్నట్లు పేర్కొన్నారు. గ్రామాలన్నింటికీ ఇంటర్నెట్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నామని ఈ – పంచాయతీల ద్వారా విద్యావంతులైన 10 వేల మంది మహిళలకు ఉపాధి లభిస్తుందని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పెన్షన్లు, సంక్షేమ పథకాలలోని ఆర్థిక ప్రయోజనాలతో పాటు, బ్యాంకు సేవలు కూడా ఇకముందు ఈ – పంచాయతీల ద్వారానే అందుబాటులోకి వస్తాయని అన్నారు.

బంగారు తెలంగాణ నిర్మాణానికి ప్రభుత్వం పట్టుదలగా చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. త్రాగునీరు, సాగునీరు వంటి వారసత్వ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కృషి జరుగుతున్నదని అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో గల రోడ్ల అభివృద్ధికి రూ.27 కోట్లు, రోడ్ల మరమ్మతులకు రూ.36.50 కోట్ల నిధులను మంజూరు చేశామని తెలియజేశారు. దోమకొండ యంపిపి నూతన భవనానికి కోటి రూపాయలు, బీబీపేట గ్రామ పంచాయతీ భవనానికి 20 లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటితో పాటు అసంపూర్తిగా వున్న కామారెడ్డి యంపిపి భవనాన్ని పూర్తి చేయడానికి కూడా నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అమరవీరుల త్యాగాలను తమ ప్రభుత్వం గుర్తుంచుకున్నదని అంటూ, ఆ సభలో పంపిణీ చేసిన ఏడు ట్రాక్టర్లలో ఒకటి కార్గిల్‌ అమరవీరుల కుటుంబానికి, ఇంకోటి తెలంగాణ అమరవీరుల కుటుంబానికి పంపిణీ చేయడం జరిగిందని అన్నారు.

ఈ ప్రాంతంలోని రైతుల సంక్షేమం కోసం కాకతీయులు నిర్మించిన వేలాది చెరువులు, గత పాలకుల నిర్లక్ష్యంతో నిరాదరణకు గురయ్యాయని, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా గత సంవత్సరం 700 చెరువులను 250 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పునరుద్ధరణ చేసుకున్నామన్నారు. గత పాలకులు రూపొందించిన ప్రాజెక్టుల డిజైన్‌ ప్రకారం వెళితె మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు తెలుపుతున్నదని, కాబట్టి ప్రాజెక్టు నిర్మించే అవకాశం లేదని తెలియజేశారు. గత పాలకులు కేవలం ప్రజలను మభ్య పెట్టడం కోసం ప్రాణహిత – చేవెళ్ళ ప్రాజెక్టు పేరిట కాలువలను నిర్మించడానికే రూ.9,500 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశారని అన్నారు. ప్రాణహిత, ఇంద్రావతి నదులు గోదావరిలో కలిసే దగ్గర రోజుకు సుమారు 45 టిఎంసీల నీరు కిందికి పోతున్నదని అంటూ, నీరు ఎక్కువగా వుండే చోట ప్రాజెక్టులను నిర్మించాలనేదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి వివరించారు.

ఈ కార్యక్రమంలో 10 రకాల కూరగాయల విత్తనాలను కేవలం పది రూపాయలకే అందజేశారు. జిల్లాలోని మొత్తం 13 వేల మందికి విత్తనాలను అందజేశారు. 20 కోట్ల బ్యాంకు లింకేజిని మహిళా సంఘాల కోసం మంత్రి కేటీఆర్‌ అందజేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ గాడిలింగం, జడ్పీ ఛైర్మన్‌ ధపేదార్‌ రాజు, ఎంపి బీబీపాటిల్‌, రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ రేమండ్‌ పీటర్‌, ఐటి సెక్రెటరీ జయేష్‌ రంజన్‌, గ్రామీణాభివృద్ధి కమీషనర్‌ అనితా రామచంద్రన్‌, స్త్రీనిధి ఎండి విద్యాసాగర్‌ రెడ్డి, పంచాయతీ రాజ్‌ డిప్యూటీ కమీషనర్‌ పి.రామారావు, జిల్లా కలెక్టర్‌ డా|| యోగితా రాణా, జాయింట్‌ కలెక్టర్‌ రవీందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.