|

చరిత్రపుటల్లో సారస్వత పరిషత్తు

హైదరాబాదు రాష్ట్రంలో అసఫ్‌ జాహీల పాలన సాగిన సుమారు 200 సంవత్సరాల కాలం తెలుగు భాషా సంస్కతులకు క్షీణయుగం వంటిది. అదే కాలం బ్రిటిషువారి ప్రత్యక్షపాలనలో వున్న ఇతర తెలుగు ప్రాంతాల్లో భాషాసాంస్కతిక వికాసం ఎటు వంటి విఘాతం లేకుండా వర్ధిల్లింది. ఏడవ నిజాము మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ పాలన సాగించిన కాలంలో తెలుగు భాషపై తీవ్రమైన నిర్బంధం కొనసాగింది. ఉర్దూను అధికారభాషగా గౌరవించి మిగతా భాషలను అణగదొక్కారు. అప్పటికి నిజాము రాష్ట్రంలో దక్షిణాన రాయచూరు, పడమట ఔరంగాబాదు వంటి అనేక కన్నడ, మరాఠ్వాడ ప్రాంతాలు ఉండేవి. మరాఠా, కన్నడ జిల్లాలు 8, తెలంగాణ జిల్లాలు 8 మొత్తం 16 జిల్లాల హైదరాబాద్‌ సంస్థానంలో ఉర్దూ, మరాఠీ, కన్నడల సరసన స్థానికుల్లో తెలుగుకు ఎంతో నిరాదరణ ఎదురయ్యేది. 1921లో వివేకవర్ధని పాఠశాలలో కార్వే పండితుని ఆధ్వర్యంలో జరిగిన సంస్కారసభల్లో కన్నడ, మరాఠీ భాషల్లో పెద్దలు ప్రసంగించినపుడు లేని వ్యతిరేకత తెలుగులో ప్రసంగించడానికి ప్రముఖ న్యాయవాదిగా వున్న ఆలంపల్లి వెంకటరామారావు లేచినప్పుడు ఎదురైంది. తెలుగులో మాట్లాడకుండా అడ్డుపడి అవహేళన చేశారు.

దీనికి తీవ్రంగా బాధపడిన తెలుగు ప్రముఖులు ‘ఆంధ్రజన సంఘము’ను నెలకొల్పారు. ఆనతికాలంలోనే తెలంగాణ మంతా శాఖోపశాఖలుగా విస్తరించింది. 1923లో ఈ శాఖలన్నిటికీ కలిపి ”ఆంధ్రజన కేంద్ర సంఘము” ఏర్పాటైంది. ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు కార్యదర్శిగా ఉండి దేశీయుల్లో స్వభాషాభిమానాన్ని పెంపొందించే కషి సాగించారు.

నిజాము నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రారంభమైన ప్రజాఉద్యమం కావడం వల్ల, ఆంధ్రోద్యమం క్రమక్రమంగా రాజకీయపరమైన అంశాలకు ప్రాధాన్యమిస్తూండడంతో సాంస్క తిక అభ్యున్నతి కొంత వెనుకబడింది.

1942లో ఓరుగల్లు సమీపం లోని ధర్మవరం వద్ద నవమాంధ్ర మహాసభ జరుగుతున్నప్పుడు కొందరు యువకులు ప్రత్యేక సంస్థను స్థాపించే అంశం ప్రస్తావన చేశారు. కాని రాజకీయాంశాల ప్రాధాన్యం వల్ల వారి ప్రయత్నానికి ప్రోత్సాహం లభించలేదు. 1943లో హైదరాబాద్‌ నగరంలో దశమాంధ్ర సభలు జరుగుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి సారస్వతాభి మానులైన యువకులు నూతన వేదిక సంస్థాపన ప్రయత్నాలు చేశారు. బూర్గుల రంగనాథరావు, భాస్కరభట్ల కష్ణారావు సమావేశకర్తలుగా 26 మే 1943 బుధవారం రెడ్డి హాస్టల్‌ గ్రంథాలయంలో ప్రథమ సమావేశం జరిగింది. నాటి ప్రముఖ పండితులు, భాషాభిమానులు, కవి రచయితలు పాల్గొన్నారు. లోకనంది శంకర నారాయణరావు అధ్యక్షత వహించారు. అన్ని విషయాలను క్షుణ్ణంగా చర్చించారు. మాతభాషపట్ల జరుగుతున్న నిరాదరణను గురించి తమ అభిప్రాయాలను వ్యక్తీకరించారు. తెలుగు భాషా సంస్క తుల ప్రచారం ప్రధాన లక్ష్యంగా ఒక సంస్థను స్థాపించాలని చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. సంస్థ పేరుపై తర్జనభర్జనలు జరిగాయి. రాయప్రోలు సుబ్బారావు, ఆయన సహచరులు స్థాపించిన హైదరాబాదు ఆంధ్ర సాహిత్య పరిషత్తు గురించి ప్రస్తావన వచ్చింది. ఆ బందంపై వున్న అభిప్రాయాలతో పాటు రాష్ట్రేతరులతో కలిసి ఎలాంటి

ఉద్యమం సాగించరాదనే ప్రభుత్వ ఆంక్షలున్నందున ఈ సంస్థకు ‘నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తు’ అని నామకరణం చేశారు.

తెలుగు పరీక్షలు
పరిషత్తు చేపట్టిన ప్రచారం, వ్యాప్తి లక్ష్యాన్ని అంచనాలకు మించి సాధించడంలో పరీక్షలు నిర్వహించిన పాత్ర అనితరసాధ్యమైనది. తెలుగులో ప్రాథమిక, ప్రవేశ, విశారద పూర్వ ఉత్తర భాగాలు అనే స్థాయుల్లో పాఠ్యాంశాలను నిర్దేశించి పరీక్షలు నిర్వహించే పనిని ఒక ఉద్యమంలా చేపట్టినది పరిషత్తు.

1944 జూలై 18, 19 తేదీల్లో మొట్టమొదటి సారి హైదరాబాద్‌, అలియాబాద్‌ దర్వాజా, వరంగల్లు, ఖమ్మం, కరీంనగర్‌, శంకరంపేట, చిన పెండ్యాల, మహబూబాబాద్‌ కేంద్రాల్లో పరిషత్తు తెలుగు ప్రవేశ పరీక్ష జరిగింది. 1945 అక్టోబర్‌ 4, 5, 6 తేదీల్లో ప్రాథమిక, ప్రవేశ పరీక్షలు జరిగాయి. పరిషత్తు శాఖలు, పరీక్ష కేంద్రాలు విస్తరించాయి. అధిక సంఖ్యలో బాలురు, వయోజనులు, స్త్రీలు పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారు.

ఉదాత్తమైన లక్ష్యాలతో ఏర్పాటైన పరిషత్తు చాలా ఒడిదుడుకుల మధ్య పని చేయవలసి వచ్చింది. అడుగడుగున ప్రభుత్వ నిరంకుశ శాసనాలు పరిషత్తు కషికి అవరోధం కలిగించాయి. గ్రామాలలో రాత్రి పాఠశాలలు, పరీక్షాకేంద్రాలు నడుపుతున్న కార్యకర్తలను పోలీసుల అనుమాన దృష్టితో చూస్తూ బెదిరిస్తూ ఉండేవారు. ఎన్నో అవాంతరాలు ఎదుర్కొంటూ పరిషత్తు కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడం మనవారికి చాలా కష్టంగానే వుండేది. అయినా వెనుదీయక ముందుకు సాగారు.

పరిషత్తు ద్వితీయ మహాసభ ఓరుగల్లులో 1944 డిసెంబర్‌ 28, 29, 30 తేదీల్లో వైభవంగా జరిగింది. ఉదయ రాజు రాజేశ్వరరావు ఆహ్వాన సంఘానికి అధ్యక్షులు కాగా, కాళోజీ నారాయణరావు కార్యదర్శిగా ఉన్నారు. మహాసభను రాజాబహద్దూర్‌ వెంకట రామారెడ్డి ప్రారంభించారు. సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షత వహించారు. 29వ తేదీన కవి సమ్మేళనం జరగవలసివుండగా రాత్రికి రాత్రి దుండగులు పందిళ్ళను దగ్ధం చేశారు. అయినప్పటికీ మనవారు మాత్రం జంకక ఆ స్థలంలోనే కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. దాశరథి కృష్ణమాచార్య ఆ వేదికమీద కవితను చదవడం ద్వారా అభినందనలు అందుకున్నారు. అనంతరకాలంలో పరిషత్తుకు తమ శక్తియుక్తులన్నీ ధారపోసి ఐదు దశాబ్దాలు అనితర సాధ్యమైన రీతిలో సేవలందించిన దేవులపల్లి రామానుజరావు కూడా ఓరుగల్లు సభలో చురుగ్గా పాల్గొన్నారు. నాటి కవి సమ్మేళనానికి ముసిపట్ల పట్టాభిరామారావు అధ్యక్షత వహించారు. పరిషత్తు పరీక్షల్లో కతార్థులైన విద్యార్థులకు బూర్గుల రామకష్ణారావు విజయపత్రాలు అందజేసి స్నాతకోపన్యాసం చేశారు.

1946 మార్చి 15, 16, 17 తేదీల్లో తృతీయ మహాసభలు జరిగాయి. లోకనంది శంకరనారాయణ రావు సభలకు అధ్యక్షత వహించారు. రాజా బహదూర్‌ వెంకట రామారెడ్డి సభలను ప్రారంభించారు.

 • పరిషత్తు వార్షికోత్సవ రాష్ట్ర మహాసభలు కొనసాగుతుండగానే, జిల్లా సభలు కూడా నిర్వహించాలన్న నిర్ణయం జరిగింది.

 • ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాలలో జిల్లా మహాసభలు 1946 ఫిబ్రవరి 1 న జరిగాయి. రాజా మురళీ మనోహరరావు (నస్పూరు) అధ్యక్షులుగా, కె.వి. కేశవులు కార్యదర్శిగా ఆహ్వాన సంఘం ఏర్పడి, సభలకు ఏర్పాట్లు చేసింది. అప్పుడు పరిషత్తుకు సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షులుగా వున్నారు. వానమామలై వరదాచార్యులకు సన్మానం చేశారు.

  అలంపూర్‌ తాలూకా క్యాతూరులో 26వ ఆంధ్ర దేశ గ్రంథాలయ మహాసభలు జరుగుతున్నప్పుడు 1946 మార్చి 2న మహబూబ్‌నగర్‌ జిల్లా మహాసభలు జరిగాయి. సభల నిర్వహణకు సురవరం రంగారెడ్డి ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా, గడియారం రామకృష్ణశర్మ కార్యదర్శిగా ఏర్పాట్లు చేశారు.

 • వరంగలు జిల్లా మహాసభలు 1946 జూన్‌ 14, 15 తేదీల్లో ఖమ్మంలో జరిగాయి. అప్పటికి ఖమ్మం ప్రత్యేక జిల్లాగా ఏర్పడలేదు. నల్లగొండ జిల్లా మహాసభలు 1946 నవంబర్‌ 5న స్థానిక రామకష్ణ వసతి గహంలో జరిగాయి. పొట్లపల్లి రామారావు సభకు అధ్యక్షత వహించారు. జిల్లాలోని 25 మంది కవి పండితులు సభల్లో పాల్గొన్నారు.
 • 1947 మార్చి 5, 6, 7 తేదీల్లో అప్పుడు మహబూబ్‌ నగర్‌ జిల్లా కలెక్టర్‌గా వున్న ఇల్లిందల రామచంద్రరావు తోడ్పాటుతో మహబూబ్‌నగర్‌లో చతుర్థ మహాసభలు జరిగాయి. ఇత్తెహాదుల్‌ ముసల్మీన్‌ అరాచకాల వల్ల నెలకొన్న స్తబ్ధతను పోగొట్టేందుకు ఈ సభల నిర్వహణ దోహదం చేసింది. నిత్యనిర్బంధాలను ఎదుర్కొంటూ పరిషత్తు నిలబడింది.

  1948లో హైదరాబాదుపై పోలీసు చర్య జరిగి నిజాం నిరంకుశ పాలన అంతరించింది. తాత్కాలికంగా సైనిక ప్రభుత్వం ఏర్పడింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికంటే నిజాము నుంచి రాష్ట్రం విముక్తమైన ఘడియలు ఇక్కడ ప్రజలకు అమితమైన ఆనందాన్ని కలిగించాయి. భాషా సేవను ఇనుమడించిన ఉత్సాహంతో కొనసాగించేందుకు కార్యకర్తలు కంకణ బద్ధులయ్యారు.

 • దేవులపల్లి రామానుజరావు, పులిజాల హనుమంతరావు, కాండూరి నరసింహాచార్యుల నుండి పరిషత్తు రికార్డులను తీసుకున్నారు.

 • స్వేచ్ఛాపూరిత వాతావరణంలో ఉడుకు రక్తం పొంగులు వారుతున్నయువనాయకత్వంలో పరిషత్తు కార్యక్రమాలు ద్విగుణీకతోత్సాహంతో ప్రారంభమయ్యాయి. అంతవరకు తెలంగాణము వరకే పరిమితమైన పరిషత్తు కార్యకలాపాలు సకలాంధ్రదేశంలో విస్తరించడానికి అవకాశం కలిగింది.

 • చారిత్రక సభలు
  1949 ఫిబ్రవరి 4, 5, 6 తేదీల్లో అప్పటి హైదరాబాదు జిల్లా తూప్రాన్‌లో పరిషత్తు ఐదవ మహాసభలు గొప్పగా జరిగాయి. కొత్తూరు సీతయ్య గుప్త అధ్యక్షులుగా, రాయపరాజు వెంకటరామారావు కార్యదర్శిగా ఆహ్వాన సంఘం మహాసభలకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేసింది. వనపర్తి రాజా రామేశ్వరరావు మహాసభలను ప్రారంభించారు. ఇల్లిందల రామచంద్రరావు అధ్యక్షత వహించారు. సుప్రసిద్ధ చరిత్రపరిశోధకులు మల్లంపల్లి సోమశేఖరశర్మ, ప్రముఖ రచయిత మునిమాణిక్యం నరసింహారావు మొదలైన పెద్దలు పాల్గొన్నారు. తూప్రాన్‌ మహాసభలు పరిషత్తు చరిత్రలోనే కాకుండా, తెలుగు భాషా చరిత్రలోనూ అపూర్వమని చెప్పకతప్పదు. అన్నింటి కంటే ముందే చెప్పుకోవలసిన ముఖ్య సంఘటన. నిజాము ఏలుబడిలో అప్పటి వరకు ‘నిజాము రాష్ట్రాంధ్ర సారస్వత పరిషత్తు’గా చలామణి అయిన పరిషత్తు ఈ సభల్లోనే ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’గా ఆవిర్భవించింది. పరిషత్తు నియమావళిని కూడా కాలానుగుణంగా మార్పు చేయడం, ఆమోదించడం జరిగింది. తెలంగాణలోనే గాకుండా రాయలసీమ, సర్కారు, ఆంధ్రప్రాంతాల్లో కూడా పరిషత్తు శాఖలు, కేంద్రాలు నెలకొల్పేందుకు నిర్ణయం జరిగింది. మెట్రిక్యులేషన్‌ వరకు మాతభాషలోనే విద్యా బోధన జరగాలని, విశ్వవిద్యాలయ స్థాయిలో ఇంటర్‌ డిగ్రీ తరగతుల్లో మాతభాష (తెలుగు, కన్నడ, మరాఠీ) అధ్యయన భాషగా ఉండాలని, పరిపాలనలో ప్రజల భాషకు సముచిత స్థానం ఇవ్వాలని తీర్మానించారు. ఈ తీర్మానాలను ప్రభుత్వం దష్టికీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారుల దష్టికి తెచ్చి అవి అమలు జరిపేలా కషిచేసేందుకు ఆచార్య తణికెళ్ల వీరభద్రుడు నేతత్వంలో ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీకి దేవులపల్లి రామానుజరావు కార్యదర్శిగా, మాడపాటి హనుమంతరావు, నూకల నరోత్తమరెడ్డి సభ్యులుగా వున్నారు. పరిషత్తు తరఫున ఆ సంఘం అప్పుడు విద్యాశాఖమంత్రిగా వున్న ధోండే రాజ్‌ బహద్దూర్‌ ను కలుసుకొని జరిపిన చర్చల ఫలితంగా, మెట్రిక్యులేషన్‌ వరకూ మాతృభాషలో విద్యాబోధన జరిపేందుకు ప్రభుత్వం అంగీకరించి, తదనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది.అయితే మెట్రిక్‌ తరగతుల వరకు మాతభాషలో బోధన సాగించేందుకు ఉపాధ్యాయుల కొరత ఉంది. కాని అప్పటికే పరిషత్తు నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు ఎంతోమంది ఉన్నారు. మాతభాషలో విద్యాబోధనకు పరిషత్తు తగినంత మందిని తయారుచేసి ఉండకపోతే, పరిషత్తు తూప్రాన్‌ సభల తీర్మానం నిష్ఫలం అయిపోయేది. ప్రవేశ పరీక్ష ఉత్తీర్ణులైనవారిని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగానూ, విశారద ఉత్తీర్ణులైన వారిని ఉన్నత పాఠశాలల్లో తెలుగు ఉపాధ్యాయులుగానూ నియమించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ‘సూర్యుని వెలుతురు సోకని గ్రామం లేదన్నట్లు పల్లెపల్లెకు పరిషత్తు తెలుగు వెలుగును తీసుకువెళ్ళింద’ని బూర్గుల రామకష్ణారావు అన్న మాటలు అక్షరసత్యాలయ్యాయి. అంత పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు లభించడం వల్ల ఆ తర్వాతి తరాలు కూడా విద్యావంతులయ్యారు.

  తెలుగు నేలకంతటికీ విస్తరించిన పరిషత్తు
  ఆదిలాబాద్‌ నుండి శ్రీకాకుళం వరకు, దక్షిణాన చిత్తూరు నుంచి మిగతా తెలుగు ప్రాంతాలన్నింటికీ, బొంబాయి, మద్రాసు, బెంగళూరు, మారిషస్‌ వంటి ఇతర రాష్ట్రాలు, విదేశాలకు సారస్వత పరిషత్తు కేంద్రాలు విస్తరించాయి. సంవత్సరానికి రెండుసార్లు పరీక్షలు నిర్వహిస్తే ప్రతిసారీ 5000 మందికి పైగా పరీక్షలు రాసేవారు.

  చరిత్రలో నిలిచిపోయిన అలంపూరు సభలు
  1953 జనవరి 11, 12, 13, 14 తేదీల్లో అలంపురంలో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తు సప్తమ వార్షిక మహాసభలు చారిత్రకమైనవి. చల్లా వెంకట రామారెడ్డి అధ్యక్షులుగా, గన్నమరాజు రామేశ్వరరావు, గడియారం రామకృష్ణ శర్మ కార్యదర్శులుగా ఆహ్వానసంఘం ఏర్పడింది. భారత ఉపరాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ప్రత్యేకంగా దిల్లీ నుంచి విచ్చేసి మహాసభలను ప్రారంభించారు.

  డా. దేవులపల్లి రామానుజరావు అధ్యక్షత వహించారు. ఆస్థానకవి శ్రీపాద కష్ణమూర్తి శాస్త్రి ఆశీస్సులందించారు. ఆంధ్ర దేశమంతటి నుంచీ ప్రసిద్ధ రచయితలు, విద్వాంసులు పాల్గొన్నారు. సభలకు సుమారు 30 వేల మందికి పైగా తరలివచ్చారు. హైదరాబాదు నుంచి మహాసభలకు వెళ్ళేవారి కోసం ప్రత్యేక రైలు వేశారు. జాతీయ స్థాయి పత్రికా ప్రతినిధులు పాల్గొని మహాసభలు జరిగిన తీరుకు ఆశ్చర్యం ప్రకటించారు. వివిధ భాషల్లో – ముఖ్యంగా ఆంగ్ల పత్రికల్లో – ప్రత్యేక కథనాలు ప్రచురించారు. విశ్వనాథ సత్యనారాయణ పరిషత్తు పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు విజయపత్రాలు ప్రదానం చేసి స్నాతకోపన్యాసం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకష్ణారావు, వారి మంత్రివర్గ సహచరులు పాల్గొన్నారు. కాళోజి నారాయణరావు రచించిన ‘నా గొడవ’ను శ్రీశ్రీ అక్కడే ఆవిష్కరించారు. గడియారం రామకృష్ణ శర్మ నాటి పరిషత్తు కార్యదర్శిగా గొంతెత్తి గంభీర స్వరంతో గానం చేసిన స్వాగత పద్యాలు సదస్యులను ఆకట్టుకున్నాయి. గడియారం వెంకట శేషశాస్త్రి, సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి, పుట్టపర్తి నారాయణాచార్యులు మొదలైన మహామహులు అలంపురం మహాసభల్లో ఉపన్యాసాలు చేశారు.

  ప్రచురణ కార్యక్రమం
  తెలుగు భాషా సాహిత్య వికాసమే పరమ ధ్యేయంగా ఏర్పడిన సారస్వత పరిషత్తు, తన ఆశయ సాధనకు ఉపకరించే ఉత్తమ గ్రంథాలను ముద్రించి పాఠకలోకానికి అందించేందుకు ప్రచురణల విభాగాన్ని ప్రారంభించింది. ఇప్పటి వరకు సుమారు 300 గ్రంథాలు ప్రచురించింది.

  గ్రంథాలయం
  పరిషత్తుకు చక్కని గ్రంథాలయం వుంది. తెలుగు, సంస్కృత, ఆంగ్ల, ఉర్దూ, ఫారశీ, హిందీ, కన్నడ భాషలకు చెందిన ఎంతో విలువైన 16000 లకు పైగా గ్రంథాలు ఉన్నాయి. వారికి ఉపయుక్తంగా వున్నాయి.

  పండిత శిక్షణ కళాశాల
  ఉత్తమశ్రేణి తెలుగు ఉపాధ్యాయులను తీర్చిదిద్దే ఆశయంతో పరిషత్తు 1964 అక్టోబర్‌ 22న తెలుగు పండిత శిక్షణ కళాశాలను ప్రారంభించింది. అప్పటి విద్యాశాఖ సంచాలకుడు బుల్లయ్య అధ్యక్షతన విద్యాశాఖ కార్యదర్శి ఎల్‌.ఎన్‌. గుప్త కళాశాలను ప్రారంభించారు.

  రజతోత్సవాలు
  1973 ఫిబ్రవరి 2 నుంచి 7 వ తేదీ వరకు పరిషత్తు రజతోత్సవాలు ఘనంగా జరిగాయి. గడియారం రామకృష్ణశర్మ స్వాగత కవిత అనంతరం కార్యదర్శిగా పరిషత్తు సేవా నివేదికను అందించారు. డా.బెజవాడ గోపాలరెడ్డి ఉత్సవాలను ప్రారంభించారు. నూకల నరోత్తమరెడ్డి అధ్యక్షోపన్యాసం చేశారు.

  పరిషత్తు స్వర్ణోత్సవం
  1994 జనవరి 7న హైదరాబాద్‌ రవీంద్రభారతిలో సారస్వత పరిషత్తు స్వర్ణోత్సవాలు ఘనంగా జరిగాయి. భారత ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు ఉత్సవాలను ప్రారంభించారు. ప్రముఖ చిత్రకారులు కొండపల్లి శేషగిరిరావు రూపొందించిన డా.దేవులపల్లి రామానుజరావు నిలువెత్తు చిత్రలేఖనాన్ని పి.వి.ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి అధ్యక్షత వహించారు.

  పరిషత్తు వజ్రోత్సవాలు
  2003 డిసెంబర్‌ 27, 28 తేదీల్లో పరిషత్తు వజ్రోత్సవాలను వైభవంగా జరుపుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అధ్యక్షులు డా. సి. నారాయణరెడ్డి అధ్యక్షత వహించారు. ఆనాడు పరిషత్తుకు ఉపాధ్యక్షులుగా వున్న సుప్రసిద్ధ విద్వాంసులు గడియారం రామకృష్ణ శర్మకు ఐదువేల రూపాయల నగదు అందజేసి ఘనంగా సత్కరించారు.

  పరిషత్తు పేరు మార్పు
  దశాబ్దాల ఉద్యమ ఫలితంగా 2014 జూన్‌ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ ప్రజల అభీష్టాన్ని అనుసరించి అధ్యక్షులు డా.సి.నారాయణరెడ్డి అధ్యక్షతన 2015 ఆగస్టు 20న జరిగిన పరిషత్తు సర్వసభ్యమండలి ప్రత్యేక సమావేశంలో ఆంధ్ర సారస్వత పరిషత్తు పేరును తెలంగాణ సారస్వత పరిషత్తుగా మారుస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది.

  వెబ్‌సైట్‌ ఆవిష్కరణ
  2016 మార్చి 2న తొలిసారిగా తెలుగు, ఆంగ్లభాషల్లో రూపొందించిన సారస్వత పరిషత్తు వెబ్‌సైట్‌ ఆవిష్కరణ జరిగింది. పరిషత్తు ఆవిర్భావ నేపథ్యం, స్థాపననాటి పెద్దల కృషి, తెలంగాణలోనే గాక యావత్‌ తెలుగునేలంతా తెలుగును వెలిగింపజేసేందుకు పరిషత్తు బహుముఖాలుగా సాగించిన కృషిని, ఈనాటి కార్యక్రమాల సమాచారాన్ని విస్తృతంగా వెబ్‌సైట్‌లో సచిత్రంగా పొందుపరచడం జరిగింది.

  వైభవంగా పంచసప్తతి మహోత్సవం
  2018 మే 26న తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రాంగణంలో పంచ సప్తతి మహోత్సవం వైభవంగా జరిగింది. భారత ఉపరాష్ట్రపతి మాన్యులు ముప్పవరపు వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

  డా.జె.చెన్నయ్య