|

చరిత్రాత్మకంగా తెలంగాణ ఎయిమ్స్‌

-మార్గం లక్ష్మీనారాయణ
tsmagazine

వైద్య సేవలు ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని, ప్రతి నిరుపేదకు సయితం కార్పొరేట్‌ వైద్యం అందుబాటులోకి రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంకల్పం. వైద్యాన్ని అందించడం ప్రభుత్వాల కనీస బాధ్యతగా భావించిన కెసిఆర్‌, తెలంగాణ రాష్ట్ర అవతరణ నాటినుంచి రాష్ట్రంలో వైద్య రంగ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే దేశంలోనే ప్రతిష్టాత్మకంగా భావించే ఎయిమ్స్ని తెలంగాణకి సాధించడంలోనూ కెసిఆర్‌ అలుపెరుగని పోరాటమే చేశారు.ఆ పోరాట ఫలితంగా ఎయిమ్స్ని సాధించారు. ఇక ఇప్పుడు దేశంలోనే అత్యంత వేగంగా ప్రారంభమైన ఎయిమ్స్‌ హాస్పిటల్గా తెలంగాణ ఎయిమ్స్‌ చరిత్ర సృష్టించే దిశగా కెసిఆర్‌ చర్యలు తీసుకుంటున్నారు.

వైద్య విద్యా రంగంలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పడానికి భారత ప్రభుత్వం 1956లో పార్లమెంటులో ఓ ప్రత్యేక (The All India Institute of Medical Sciences Act, 1956) చట్టం ద్వారా ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌) ని నెలకొల్పారు. 1952లో మొదటి ఎయిమ్స్‌ కి ఢిల్లీలో పునాది పడింది. 1956 నాటికి అది పూర్తై పని ప్రారంభించింది. అంచెలంచెలుగా ఢిల్లీ ఎయిమ్స్‌ ఎదుగుతూ వచ్చింది. మొట్టమొదటి ఢిల్లీ ఎయిమ్స్‌ 1956లో ప్రారంభమవగా, ఆతర్వాత రెండో ఎయిమ్స్‌ ప్రారంభమవడానికి సుదీర్ఘమైన 56 ఏళ్ళు పట్టింది. 2012లో ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ -1956 యాక్డుని సవరించి భోపాల్‌, భువనేశ్వర్‌, జోద్పూర్‌, పాట్నా, రాయపూర్‌, రిషికేశ్లలో ఆరు ఎయిమ్స్‌ హాస్పిటల్స్ని నెలకొల్పారు. సరిగ్గా మరో ఆరేళ్ళ తర్వాత 2018లో మరో సవరింపు ద్వారా మరో రెండు ఎయిమ్స్‌ లను ఆంధ్రప్రదేశ్‌ లోని మంగళగిరి, నాగ్పూర్లలో ఏర్పాటు చేయడానికి అనుమతులిచ్చారు. ఎడతెగని విజ్ఞప్తులు, పార్లమెంటులో నిలదీతల తర్వాత 2018లోనే మరో 13 ఎయిమ్స్ని స్థాపించాలని నిర్ణయించారు.

స్వాతంత్య్రం సిద్ధించిన మొదట్లో ఉన్న చిత్తశుద్ధి ఆ తర్వాత పరిపాలకుల్లో కొరవడిందనడానికి ఎయిమ్స్‌ ఏర్పాటే నిదర్శనం. ఎయిమ్స్‌ కావాలంటూ అనేక రాష్ట్రాలు పట్టుపట్టడంతో కేంద్రం ఒక్కో అడుగు వేస్తూ, విడతల వారీగా ఎయిమ్స్ని ప్రకటిస్తూ వచ్చింది. 2014 జూలైలో 2014-15 బడ్జెట్‌ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, విదర్భ, పూర్వాంచల్‌ లలో ఎయిమ్స్‌ ఏర్పాటుకు రూ. 500 కోట్లు కేటాయిస్తున్నట్లు పార్లమెంటులో ప్రకటించారు. వీటిని 4వ దశలో పూర్తి చేస్తామన్నారు. ఇవి ప్రారంభం కావడానికి 2018 వరకు వేచి చూడాల్సి వచ్చింది.

2015 ఫిబ్రవరి 28న 2015-16 బడ్జెట్‌ ప్రసంగంలో జైట్లీ జమ్ము కాశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, అసోం, తమిళనాడులకు ఎయిమ్స్‌ ప్రకటించారు. ఇవన్నీ 5వ దశలో పూర్తి చేస్తామన్నారు. ఇవి కూడా అమలు కావడానికి 2018 వరకు వేచి చూడాల్సి వచ్చింది. 2017 ఫిబ్రవరి 1న 2016-17 బడ్జెట్‌ ప్రసంగంలో జైట్లీ – జార్ఖండ్‌, గుజరాత్‌ రాష్ట్రాలకు ఎయిమ్స్‌ ప్రకటించారు. 6వ దశలో వీటిని పూర్తి చేస్తామని ప్రకటించారు.

తెలంగాణ ఎయిమ్స్‌

తెలంగాణ ఎయిమ్స్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక, 2018లోనే ఆంధప్రదేశ్‌ రాష్ట్రానికి ఆ రాష్ట్ర రాజధానిగా నిర్మితమవుతున్న అమరావతికి సమీపంలోని మంగళగిరిలో ఎయిమ్స్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ విషయంలో ఆలస్యం చేసింది. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రత్యేకంగా ప్రధాని మోదీని కలిసి రాష్ట్రానికి ఎయిమ్స్‌ ప్రకటిచవలసిందిగా లిఖిత పూర్వకంగా అభ్యర్థించారు. తెలంగాణ ఎంపీలు అనేక సార్లు పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీశారు. మరోవైపు తెలంగాణ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రిగా పనిచేసిన డాక్టర్‌ సి లక్ష్మారెడ్డి కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి జెపి నడ్డా తెలంగాణకు వచ్చిన సందర్భాల్లో, ఢిల్లీకి వెళ్ళి మరీ ఆయనతోపాటు, అరుణ్‌ జైట్లీకి లేఖలు ఇచ్చారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతి సూదన్ని కూడా అభ్యర్థనలు వెళ్ళాయి. విరామమెరుగని అభ్యర్థన లు, ఒత్తిడిల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎయిమ్స్ని ప్రకటించింది.

2017-18 బడ్జెట్‌ పార్లమెంట్లో ప్రకటించిన వారం రోజుల త్వర్వాత ఫిబ్రవరి 9, 2017న అరుణ్‌ జైట్లీ తెలంగాణ ఎయిమ్స్ని ప్రకటించారు. 2018-19 బడ్జెట్లో నిధులు కేటాయించారు. కానీ పనులు ప్రారంభించలేదు. దీంతో 2018లో ఆర్‌.టి.ఐ. కింద అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఎలాంటి ప్రారంభ ప్రణాళికలు తమ వద్ద లేవని కేంద్రం ప్రకటించింది. దీంతో మరోసారి తెలంగాణ రాష్ట్ర ఎంపీ లు, సిఎం కెసిఆర్‌, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఒత్తిడిలు, విజ్ఞప్తులు చేస్తూ వచ్చారు. ప్రధానిని కలిసిన ప్రతి సందర్భంలోనూ సిఎం కెసిఆర్‌ ఎయిమ్స్ని అడుగుతూనే వచ్చారు. ఎట్టకేలకు ఎయిమ్స్‌ లో కదలిక వచ్చింది. కేంద్ర కమిటీ హైదరాబాద్కి వచ్చింది. స్థలాలను పరిశీలించింది. ఎయిమ్స్ని సాధ్యమైనంత వేగంగా తెలంగాణకు తేవడం, వెంటనే కనీసం ఓపీ ప్రారంభమయ్యే విధంగా ఆలోచించిన రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం పూర్తి కావచ్చిన బీబీ నగర్‌ నిమ్స్ని ఎయిమ్స్కి ఇవ్వడానికి ముందుకు వచ్చింది. బీబీ నగర్‌ నిమ్స్ని పరిశీలించిన కేంద్ర బృందం తమ సమ్మతిని తెలిపింది.

మూడో దశలో ఆమోదం పొందినప్పటికీ స్థల పరిశీలనల నుంచి భవన, ప్రహారీ గోడల నిర్మాణాలు వంటి వివిధ దశల్లో ఉన్న మిగతా రాష్ట్రాల ఎయిమ్స్కి భిన్నంగా తెలంగాణ ఎయిమ్స్కి ముందుగానే సిద్ధంగా ఉన్న భవనాల సముదాయం, కావాల్సినంత స్థలం అందుబాటులో ఉండటం కలిసి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సీఎం కెసిఆర్‌, ప్రభుత్వం ముందు చూపు పని చేసింది. తెలంగాణకు ఎయిమ్స్‌ మంజూరైంది.17 డిసెంబర్‌ 2018 న కేంద్ర మంత్రి వర్గం తెలంగాణలో ఎయిమ్స్‌ కి ఆమోదం తెలిపింది. తమిళనాడులోని మధురై ఎయిమ్స్‌ కి రూ.1,264 కోట్లు, తెలంగాణలోని హైదరాబాద్‌ సమీపంలో గల బీబీనగర్‌ ఎయిమ్స్కి రూ.1,028 కోట్లు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణ ఎయిమ్స్‌

రూ.1028కోట్లతో నిర్మితమయ్యే బీబీ నగర్‌ ఎయిమ్స్‌ పనులు ప్రారంభిస్తే, 750 పడకలతో కూడిన 15 నుంచి 20 రకాల సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. కొత్తగా 100 ఎంబీబీఎస్‌, 60 నర్సింగ్‌ సీట్లు వస్తాయి. వీటికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్‌ కూడా వెలువడింది. ఇక ఎమర్జెన్సీ, ట్రామా, ఆయుష్‌, ఐసియు వంటి వివిధ విభాగాలు సైతం ఏర్పడతాయి. ప్రతి నిత్యం కనీసం 1,500 ఓపీ, 1,000 ఐపీ ఉండే అవకాశం ఉంది. అత్యాధునిక సాంకేతిక అంతర్జాతీయ వైద్య విద్య, వైద్యం రాష్ట్ర ప్రజల ముంగిట్లోకి రానుంది.

వైద్య సదుపాయాలు

ఎయిమ్స్‌ లో 50కిపైగా స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ, ట్రెషరీ కేర్‌ సేవలు అందుబాటులోకి వస్తాయి. అనెస్తీషియాలజీ, అనాటమీ, హెచ్‌.ఐ.వి అండ్‌ ఎయిడ్స్లో యాంటీ రిట్రోవైరల్‌ ట్రీట్మెంట్‌, బయో కెమిస్ట్రీ, బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌, బయో ఫిజిక్స్‌, బయో స్టాటిస్టిక్స్‌, బయో టెక్నాలజీ, కార్డియాలజీ, కమ్యూనిటీ మెడిసిన్‌, కన్సర్వేటివ్‌ డెంటిస్ట్రీ అండ్‌ ఎండో డాంటిక్స్‌, డెర్మటాలజీ, వెనెరియాలజీ, డయాటెటిక్స్‌, ఎండోక్రైనాలజీ, మెటాబాలిజం అండ్‌ డయాబెటీస్‌, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ అండ్‌ టాక్సికాలజీ, జిరియాటిక్‌ మెడిసిన్‌, గ్యాస్ట్రో ఎంటరాలజీ అండ్‌ న్యూట్రీషన్‌, గ్యాస్ట్రోఇంటెస్టైనల్‌ సర్జరీ, హెమటాలజీ, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, ల్యాబరేటరీ మెడిసిన్‌, జనరల్‌ మెడిసిన్‌, మైక్రోబయాలజీ, నెఫ్రాలజీ, న్యూ క్లియర్‌ మెడిసిన్‌, న్యూక్లియర్‌ మ్యాగ్నెటిక్‌ రిసోనెన్స్‌ ఇమేజింగ్‌, నర్సింగ్‌, ఆబ్స్ట్రెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ, ఓరల్‌ అండ్‌ మ్యాక్సిలో ఫేషియల్‌ సర్జరీ, ఆర్థో డాంటిక్స్‌, ఆర్థోపెడిక్స్‌, ఓటోరైనోల్యారింజోలాజీ, పెడియాట్రిక్స్‌, పెడియాట్రిక్‌ డెంటిస్ట్రీ, పెడియాట్రిక్‌ సర్జరీ, పైథాలజీ, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, ఫిజికల్‌ మెడిసిన్‌ అండ్‌ రిహాబిలిటేషన్‌, ప్రాస్తోడాంటిక్స్‌ అండ్‌ మ్యాక్సిలోఫేషియల్‌ ప్రాస్తెటిక్స్‌, సైకియాట్రి, పల్మనరీ మెడిసిన్‌ అండ్‌ స్లీప్‌ డిజార్డర్స్‌, రేడియో డయాగ్నోసిస్‌, రిప్రొడక్టివ్‌ బయాలజీ, సర్జికల్‌ డిసిప్లిన్స్‌, ట్రాన్స్ప్లాంట్‌ ఇమ్యూనాలజీ అండ్‌ ఇమ్యూనోజెనెటిక్స్‌, ట్రాన్స్ఫ్యూజన్‌ మెడిసిన్‌ (బ్లడ్‌ బ్యాంక్‌) అండ్‌ యూరాలజీ వంటి విద్యా కోర్సులు, వైద్య సదుపాయాలు ఉంటాయి.

త్వరలోనే తెలంగాణ ఎయిమ్స్‌ పని ప్రారంభం

మిగతా రాష్ట్రాల ఎయిమ్స్కి భిన్నంగా అత్యంత వేగంగా తెలంగాణ ఎయిమ్స్‌ సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రెడీమేడ్‌ భవన సముదాయం ఎయిమ్స్కి అందివచ్చింది. బీబీ నగర్‌ నిమ్స్‌ స్థలంతోపాటు, నిర్మాణం పూర్తైన భవన సముదాయాన్ని కూడా రాష్ట్రం ఎయిమ్స్కి అప్పగించింది. దీంతో పరిపాలనా, ఆర్థిక అనుమతులు వేగంగా లభించాయి. అప్పట్లో ఢిల్లీ ఎయిమ్స్‌ పునాది రాయి పడిన నాలుగేళ్ళ తర్వాత కానీ ప్రారంభానికి నోచుకోలేదు. అలాగే ఇప్పటికే అనుమతులు పొందిన పలు రాష్ట్రాల ఎయిమ్స్‌ ఇంకా బాలారిష్టాల్లోనే ఉన్నాయి. కానీ తెలంగాణ ఎయిమ్స్కి రెడీగా ఉన్న ఇన్ఫ్రాక్ట్రక్చర్‌ కారణంగా 2019 కల్లా కోర్సులు ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.

ఇక ఓపిని ప్రారంభించడానికి అనువైన అన్ని పరిస్థితులు ఉన్నాయి. సిబ్బంది నియామకం పూర్తైతే త్వరలోనే ఓపీ ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలు, పథకాలతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందున్నది. ఇక ఇప్పుడు బహుశా దేశంలోనే అత్యంత వేగంగా ప్రారంభమైన ఎయిమ్స్‌ హాస్పిటల్గా తెలంగాణ ఎయిమ్స్‌ చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.