|

చలికి పెయ్యి ఇర్రిర్రుమంటది

tsmagazine

‘ఈసారి చలి వశపడుతలేదు. చలి దెబ్బకు అందరూ వణుకుడు పట్టిండ్రు. చలి పాడుగాను! వాడు వణుకు పుచ్చుకున్నడు. మంది అందరు చలికి గజ్జ గజ్జ వణుకుతున్నరు’. ఈరకమైన వాక్యాలు తెలంగాణలో చలికాలంలో జనం మాట్లాడుకుంటూ వుంటారు’. ‘చలి వశపడుతలేదు’ అంటే అది మన వశంలోకి, అధీనంలోకి రావడంలేదని అర్థం. అది జనాన్ని తన వశంలోకి తీసుకొని బాధిస్తున్నది. ఇక ‘చలిదెబ్బకు అందరు వణుకుడు పట్టిండ్రు’ అనే వాక్యంలో ‘అందరు వణుకుతున్నారు’అనే క్రియారూపం కాకుండా ‘వణుకుడు’ అని నామవాచక ప్రయోగం వున్నది. ‘వాడు వణుకు పుచ్చుకున్నడు’లో కూడా ‘వణుకు’ నామవాచకమే! ‘గజ్జ గజ్జ వణుకుతన్నరు’లో క్రియారూపం వున్నది. అయితే యిక్కడ ప్రస్తావించదలిచింది ‘గజ్జ గజ్జ’లోని ద్విత్వం చలి తీవ్రతను తెల్పుతున్నది. తెలంగాణ భాషాగుణం ఈ ద్విత్వంలో కనిపిస్తున్నది. ‘ఆ సలాకను అండ్ల సొర్రగొట్టు’ అంటుంటారు భవన నిర్మాణ పనుల్లో. ‘చొరగొట్టడం, జొనపడం’ కాదు తెలంగాణలో సొర్రగొట్టుడు. రకారానికి రావత్తు రావడంవల్ల ఆ పదానికి ఒక విధమైన ఉనికి వస్తుంది.

తెలంగాణేతర తెలుగు ప్రాంతాల్లో ‘ఈసారి చలి వణికిస్తున్నది’, ‘చలికి జనం గజగజ వణికిపోతున్నారు’, ‘చలిపులి తన పంజా విసురుతోంది’ మొదలైన వాక్యరీతులున్నాయి. ఆంతర్యాల్లో, అర్థాల్లో, సారాంశంలో తేడాలేదు. అభివ్యక్తులే వేరువేరు. చలి పర్యవసానాలు ఘోరంగా వుంటాయి. ఉదాహరణకు ‘ముక్కులు కారుతాయి’, ఈ ముక్కులు కారడాన్ని ‘ముక్కు వచ్చింది చూడు’ అంటారు. ముక్కులు కారడంకన్నా ‘ముక్కు’ వచ్చింది అనడం సభ్యోక్తి. అర్థగౌరవం. ముక్కులు కారడమేకాక చలి బాగా ఎక్కువై కొందరు ‘ముక్కుతో మాట్లాడినట్లే’ మాట్లాడుతారు. ‘ముక్కు ఉన్నంతసేపు పడిశెం వుంటది’ అనేది ఒక సామెత. నిజమే! జీవితం, జిందగీ వున్నంతవరకు ఏవో కొన్ని యిబ్బందులుంటాయి. చలికి ‘చెవులు గడెలు పడుతయి. చెవులు గిల్లుమంటయి’. చలివల్ల చెవులూ ప్రభావితం అవుతాయి. అన్నట్లు ముక్కులు దిబ్బడ పడుతాయి. ఈ ‘ముక్కు దిబ్బడ’ అనే మాట రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వున్నట్లుంది. ఇంకా చలి తీవ్రమైతే ‘మొకం అంతా మీదికొస్తది-మొకం ఉబ్బుతది-మొకం వొదులకిస్తది’. ఈ ముఖం పైకి వచ్చినట్లూ,

ఉబ్బిపోయినట్లూ, వొదులకిచ్చినట్లూవంటి క్రియారూపాలు అచ్చంగా తెలంగాణవే! అంతేకాదు గొంతు దగ్గర పడుతది’. అంటే మట్లాడ్డం కష్టమయిపోతుంది. దగ్గు, దమ్ము, రోగం, సర్ది, పడిశెం, ఉబ్బసం, ఆయాసం, మొదలైనవి ప్రకోపిస్తాయి. ఇందులో దగ్గు, దమ్ము, రోగం తెలంగాణ సమాసం, ఆంగ్లంలో దీన్ని ఆస్తమా అనవచ్చును. ‘రొంప, జలుబు’ అనే మాటలకు సమానార్థకాలు దాదాపు సర్ది, పడిశం. తెలంగాణలో ‘పడిశెం మందులు తింటే వారం రోజులుంటది-తినకుంటే ఏడురోజులు ఉంటది’ అనే నానుడి వుంది. అంటే పడిశెం పట్టినప్పుడు అది తప్పనిసరిగా తమ ప్రతాపాన్ని ఓ వారం రోజులు చూపిస్తుంది అన్నమాట. వారమైనా, ఏడు రోజులైనా సమానమే కదా! ఔషధం తీసుకున్నా, తీసుకోకున్నా అది వారం దాకా వదలదని అర్థం.

చలికాలంలో పొద్దునలేచి చూస్తే ‘అంతట మన్సు కురుస్తది’. ఇక్కడ ‘మన్సు’ అంటే మనస్సు అనికాదు, మంచు అని అర్థం చేసుకోవాలి. ‘ఇంకు’ అనేది, ‘ఇనుకు’, ‘దూకు లేదా దుముకు లేదా దుంకు’ అనేది ‘దునుకు’ అయినట్లే ‘మంచు’ ‘మన్సు’ అయ్యింది. చలికి తట్టుకోవడానికి చాలామంది ‘గరంకోట్లు లేదా అంగీలు’ వేసుకుంటారు. ‘గరం కోటు’ అంటే స్వెట్టర్‌. పెద్దవాళ్లలో పురుషులు ‘రుమాలు’ చుట్టుకుంటారు. ‘తలపాగ’ను ‘రుమాలు’ అంటారు తెలంగాణ ప్రాంతంలో. మరి కొందరు చలి బాధకు మెడచుట్టూ, తలచుట్టూ చెవుల్ని కవర్‌ చేస్తూ ‘గుల్బందు’ కట్టుకుంటారు. దీన్నే ‘మఫ్లర్‌’ అంటున్నాం యివాళ. ‘గుల్బందు’ అంటే ‘గళబంధం’. ఆహార పదార్థాల్లో కూడా ఈ కాలంలో మార్పులు ఉంటాయి. ఏదైనా అప్పటికప్పుడు ‘ఉడుకుడుకు, గరంగరం’ పదార్థాలు తీసుకుంటాం. సాధారణంగా అప్పుడప్పుడైనా ‘మిర్చీలు’ వేసుకొని తింటాం. ఈ తెలంగాణ ‘మిర్చీలే’, ఇతర ప్రాంతాల్లో ‘మిరపకాయ బజ్జీలు’ అవుతాయి. అక్కడి ప్రాంతాల్లో మిర్చీ అంటే మిరపకాయల పంట. చలికాలంలో చాలామంది ఆన్గెపుకాయకూర తినరు. ఈ ‘ఆన్గెపుకాయ’ ఇతర తెలుగు ప్రదేశాల్లో ‘సొరకాయ’గా మారింది.

తెలంగాణలో ఎక్కువసార్లు చలికాలం ‘ఛాయ్‌’ తాగుతారు. ఇతర స్థలాల్లో టీ, కాఫీలు తీసుకుంటారు. చలికాలంలో చలిమంటలు కాగడం, నెగళ్ళవద్ద మూగడం సర్వత్రా జరిగేదే! అయితే తెలంగాణ సీమలో చలినుండి దూరంగా వుండడానికి తల్లులు తమ పిల్లలకు తల, చెవులూ ఆచ్ఛాదితం చేస్తూ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ‘మఫ్లర్‌’ చుట్టినట్టు గుడ్డ చుడతారు. దీన్ని ‘అరికంట్లం’ అంటారు. యాదవులు మొదలైన కొన్ని సామాజికవర్గాల పురుషులు ఏ కాలమైనా గొంగడిని కప్పుకుంటారు. ఇలా కప్పుకోవడాన్ని ‘కొప్పెర’ అని పిలుస్తారు. చలికాలంలో ఇతరులుసైతం గొంగళ్ళనుకానీ, ఇతర గుడ్డలనుకానీ ఒక పద్ధతిలో మడతపెట్టి తలనూ, వీపునూ కప్పేలాగా కొప్పెర వేసుకుంటారు.

ఇక చలికాలం ఎక్కువైనప్పుడు ‘పెయ్యి అంత ఇర్రిర్రుమంటది’. ఈ ‘ఇర్రిర్రుమనుడు’ అచ్చంగా తెలంగాణ పలుకుబడి. చలికి చర్మం పగుళ్ళు అదోరకమైన బాధ కలుగుతుంది. అదే ‘ఇర్రిర్రు’. రాత్రిపూట రగ్గులు కప్పుకుంటారు. ఇవే ఇవాళ బ్లాంకెట్లు ‘చిన్న పిల్లలకు, చీపురు కట్టకు చలిలేదు’ అని ఒక సామెత. చీపురుకట్ట నిర్జీవ వస్తువు. అది పొద్దున్నే లేచ్చి మూలకు వున్నా నేలను నాకుతుంది. దానికి చలిబాధ లేనట్లే పిల్లలు సైతం చలికి వణకరు. కాకుంటే ఎక్కువ యిబ్బంది మాత్రం చలివల్ల పిల్లలూ, ముసలివారికే! కాస్త సంపన్నులు కాళ్ళకు ‘పైతావులు’ వేసుకుంటారు. ఇవే ‘సాక్స్‌’! ‘చల్వ శరీరం వాళ్ళకు చలి బాధ ఎక్కువ. వేడి శరీరం గల్లోల్లకు తక్కువ! ‘చల్వ శరీరం’ తెలంగాణ మాట. ‘తియ్యటి మాటలకు తీర్తంబోతె నువ్వు గుల్లె నేను సల్లె’ అనేది సామెత. తెలంగాణలో చలికి సంబంధించిన పదాలు, పదబంధాలు, సామెతలు మొదలైనవి అభివ్యక్తిలో ప్రత్యేకతను కలిగివున్నవని చెప్పవచ్చు.

 

డా|| నలిమెల భాస్కర్‌