చారిత్రక కట్టడాల పునరుద్ధరణకు కృషి


హైదరాబాద్‌ నగరంలో ఘణనీయమైన వారసత్వ సంపద కలిగి శిథిలావస్థలో ఉన్న పురాతన చారిత్రక భవనాల పునరుద్ధరణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ అన్నారు. యునెస్కో, ఆగాఖాన్‌ ట్రస్ట్‌, మున్సిపల్‌ శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక, వారసత్వ పరిరక్షణ అనే అంశంపై బేగంపేట్‌ మెట్రోరైలు కార్యాలయంలో రెండు రోజుల సదస్సుకు అర్వింద్‌కుమార్‌ హాజరయ్యారు.

యునెస్కోకు చెందిన న్యూఢిల్లీ క్లస్టర్‌ అధికారి జూనిహాన్‌, ఆగాఖాన్‌ సాంస్కృతిక ట్రస్ట్‌ సి.ఇ.ఓ రతీష్‌ నంద తదితరులు హాజరయ్యారు. ఈ సదస్సులో ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ మాట్లాడుతూ, హైదరాబాద్‌ పాతబస్తీలో ఇప్పటికి అనేక ప్రాచీన కట్టడాలు నిర్వహణలోపంతో శిథిలావస్థలో ఉన్నాయని, వీటిని పునరుద్ధరించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించనున్నట్టు తెలిపారు. అయితే ఈ పురాతన కట్టడాల పునరుద్ధరణ బాధ్యతలను వేర్వేరుగా స్వీకరించాలని, ప్రతి కట్టడాన్ని వ్యక్తిగతంగా దత్తత చేపట్టాలని జిహెచ్‌ఎంసి, హెచ్‌.ఎం.డి.ఏ అధికారులకు సూచించారు. హైదరాబాద్‌ నగరంలో దాదాపు 26 హెరిటేజ్‌ నిర్మాణాలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అన్నారు.

హైదరాబాద్‌ నగరానికి వచ్చే పర్యాటకుల ప్రాధాన్యత అంశాల్లో చార్మినార్‌, గోల్కొండలు ఉంటాయని, వీటితోపాటు ఇప్పటికీ అంతగా ప్రాచూర్యంపొందని హెరిటేజ్‌ కట్టడాలకు మరింత ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. చార్మినార్‌తో పాటు చార్మినార్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్న లాడ్‌ బజార్‌, మక్కా మసీద్‌, సర్ధార్‌మహాల్‌, చౌమహల్లా ప్యాలెస్‌, ముర్గీచౌక్‌, షాలిబండ క్లాక్‌టవర్‌ తదితర ప్రాంతాలను కలిపి ప్రత్యేక టూరిస్ట్‌ వాక్‌-వేను ఏర్పాటుచేస్తూ ప్రణాళిక రూపొందించే యోచన ఉందని అర్వింద్‌ కుమార్‌ అన్నారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతాన్ని హెరిటేజ్‌ ప్రాంతంగా ప్రత్యేకంగా రూపొందించడంతో నిజాముద్దీన్‌ను సందర్శించే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగిందని గుర్తుచేశారు. నిజాముద్దీన్‌ను అభివృద్ధి చేసిన మాదిరిగానే ఓల్డ్‌ సిటీలోని పలు వీధులను హెరిటేజ్‌ వీధులుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

న్యూ ఢిల్లీలోని యునెస్కో సాంస్కృతిక విభాగం ప్రతినిధి జూనిహాన్‌ సృజనాత్మకత, హరిత నగరాల నిర్మాణం అనే అంశంపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. హైదరాబాద్‌ నగరంతో పాటు ప్రపంచంలోని హెరిటేజ్‌ నగరాలన్నింటిలోనూ భవన నిర్మాణ వ్యర్థాల సమస్య ఉందని, భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్‌ అవశ్యకంగా మారిందని అన్నారు. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 50శాతం నగరాల్లో నివసిస్తున్నారని, 2050 నాటికి ఇది 70శాతానికి చేరుకుంటుందని అన్నారు. నగరాలన్నింటిని సిటీజన్‌ ఫ్రెండ్లీ, పర్యావరణహిత నగరాలుగా మార్చాలని అన్నారు. దీనిలో భాగంగా నగరాల్లో ఉన్న చారిత్రక భవనాలు, ప్రాంతాలన్నింటిని ఏకో ఫ్రెండ్లి నిర్మాణాలుగా మార్చాలని సూచించారు. ఇందుకుగాను ప్రపంచంలోని పలు నగరాల్లో పునరుద్ధరించిన పలు కట్టడాలను ప్రస్తావించారు. ఈ సదస్సులో కులికుతుబ్‌షా సమాదుల పునర్‌నిర్మాణానికి చేపట్టిన సాంప్రదాయ విధానాన్ని ఆగాఖాన్‌ ట్రస్ట్‌కు చెందిన ప్రశాంత్‌ బెనర్జీ వివరించారు. అదేవిధంగా హుమాయున్‌ టూంబ్‌ పునర్‌నిర్మాణంపై ఆగాఖాన్‌ ట్రస్ట్‌కు చెందిన సి.ఇ.ఓ రతీష్‌ నంద వివరించారు.

న్యూఢిల్లీలోని నిజాముద్దీన్‌ను హిస్టారిక్‌ సిటీగా రూపొందించిన అంశంపై శ్వేతమధు పత్రాన్ని సమర్పించారు. ఈ సదస్సులో జిహెచ్‌ఎంసి, హెచ్‌.ఎం.డి.ఏ, మున్సిపల్‌ శాఖలకు చెందిన పలువురు సీనియర్‌ ఇంజనీర్లు, టౌన్‌ప్లానింగ్‌ అధికారులు హాజరయ్యారు.