|

చారిత్రక నగరంలో సంచలన నాయకుడు

as‘‘సొతంత్రం అచ్చినకాంచి గిప్పటిదాకా గీ వరంగల్లుకు ఎంతోమంది మంత్రులు, ముఖ్యమంత్రులు అచ్చిండ్లు… బస్సులల్ల, కార్లల్ల, గాలి మోటర్లల్ల అచ్చినోళ్ళను సూసిన… గనీ, గిన్నేండ్ల నా వైసుల ఏ ముఖ్యమంత్రి గూడ మా గరీబోళ్ళ బస్తీలల్ల తిర్గంగ సూడలె… ఇనలె… కనలె…! మా బస్తీలోల్ల బతుకులను బాగు చెయ్యాలని అచ్చింది గా కేసీఆర్‌ ఒక్కడే! గా అయ్య సల్లంగుండాలె… గా అయ్య సక్కగుండాలె!!’’

వరంగల్‌ నగరంలోని దీన్‌దయాళ్‌నగర్‌ మురికివాడల సందులలోంచి నడిచి వెళ్తున్న మాకు, ఓ మసలమ్మ నోటినుండి వినిపించిన మాటలవి! ఈ మాటలు మాకు వినిపించింది ఆ ఒక్క తల్లి నోటినుంచే! కానీ సభకు వచ్చిన జనంలోకి వెళ్ళి నిలబడితే, వేలాది గుండె చప్పుళ్ళు కోరస్‌లా ఇవే మాటలను చెపుతూ ప్రతిధ్వనిస్తూ వినిపించాయి… బస్తీవాసుల కళ్ళల్లో నమ్మలేని ఆశ్చర్యం ఉంది…! వారి చూపుల్లో నిజాన్ని చూసి, దర్శించి నమ్మకం కుదిరిన తర్వాత కలిగే ఆనందం ఉంది! వారి మాటల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆకాశమంత అభిమానం కనిపించింది! దశాబ్దాలకాలంగా వాళ్ళు ఎదుర్కొంటున్న కష్టాలను కడతేర్చే నాయకుడు కదిలివచ్చాడనే భరోసా కనిపించింది…! అన్నింటినీ మించి ఇన్నాళ్ళకి, ఇన్నేళ్ళకి బస్తీ బతుకులు బంగారు బతుకులుగా మారే మంచి రోజులు వచ్చాయనే ఆశ పొడసూపింది!
ఆ మహానాయకుడు ఇచ్చిన భరోసాకు మొత్తం వరంగల్‌ జిల్లా కరిగిపోయింది.. కదలిపోయింది!
ఆయన ఊదిన ఆశకు యావత్‌ తెలంగాణ రాష్ట్రం పులకించిపోయింది… పల్లవించి జైకొట్టింది!!
4 రోజులు 9 మురికివాడలు
దక్షిణ భారతదేశంలోనూ, తెలంగాణా ప్రాంతంలోనూ ప్రముఖమైన చారిత్రకనగరం వరంగల్‌. కాకతీయుల పూర్వనుండే తనదైన ప్రత్యేకతను చాటిచెప్పిన ఈ ప్రాంతం, 11వ శతాబ్దంనుండి కాకతీయ సామ్రాజ్య రాజధాని నగరంగా సర్వతోముఖాభివృద్ధిని సాధించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. సంగీతం, సాహిత్యం, నృత్యం, శిల్పకళ, వాస్తుశిల్పం, ప్రజాపాలన, నగర నిర్వహణ, రక్షణ, కోటల నిర్మాణం, చెరువులు, దేవాలయాలు వంటి అంశాలలో భారతదేశ చరిత్రలోనే ఆదర్శంగా నిలిచి సాంస్కృతిక వారసత్వం ప్రస్తుతం వరంగల్‌గా పిలువబడుతున్న ‘ఓరుగల్లు’ సొంతం. అలాగే సమకాలీన పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్‌ తర్వాత అతిపెద్ద మహానగరం, వ్యాపార, వాణిజ్యరంగాలలో విస్తృతమైన అవకాశాలున్న నగరం, వైవిధ్య సాంస్కృతీ చైతన్యం కలిగిన నగరం వరంగల్‌.
వరంగల్‌ నగరం, జిల్లా ప్రాముఖ్యతను గుర్తించిన తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్‌తో సమానంగా రాబోయే కాలంలో అభివృద్ధి చేయాలనే సంకల్పాన్ని పూనింది. ఆ సంకల్పమే చివరికి, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఇటీవలి వరంగల్‌ పర్యటనకు దారితీసింది. జనవరి 8వ తేదీ సాయంత్రం హెలికాప్టర్‌లో హౖెెదరాబాద్‌ నుండి వరంగల్‌కు చేరింది మొదలు, జనవరి 11 వరకూ నాలుగురోజులపాటు ముఖ్యమంత్రి వరంగల్‌ నగరం, జిల్లాలోని వేర్వేరు ప్రాంతాలు, పేదల బస్తీలలో ‘‘జనయాత్ర’’ చేయడానికి కారణభూతం అయింది.
సాధారణంగా ముఖ్యమంత్రి అంతటి నిర్ణాయక పదవిలోఉన్న వ్యక్తి రాజధానికి దూరంగా జిల్లాల పర్యటనలకు వెళ్ళినపుడు ఒకరోజు ఉండటమే ఎక్కువ. అలాంటిది ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఏకంగా నాలుగురోజులు బస చేయడమేకాక, వరంగల్‌లోని తొమ్మిది మురికివాడలలో కలియతిరిగి, అక్కడి పేద ప్రజలతో మమేకమై, వారి కష్టాలను, కన్నీళ్ళను చూసి అడిగి తెలుసుకొని, వారి సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో నాలుగు రోజులు వరంగల్‌లోనే ఉండటం సర్వత్రా చర్చనీయాంశం అయింది. అదే సమయంలో బస్తీల ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడం ‘కేసీఆర్‌ మాటల మనిషికాదు.. చేతల మనిషి’ అని మరోసారి నిరూపించినట్లయింది.
ఇలా, ఓ ముఖ్యమంత్రి మురికివాడలలో పర్యటించడం దేశ చరిత్రలోనే అపూర్వమైన ఘట్టంగా, ప్రజాస్వామ్య పాలనలో స్ఫూర్తివంతమైన పాఠంగా కేసీఆర్‌ పర్యటన ప్రజల జేజేలందుకుంది.

గరీబీ బనేగా అమీరీ….
వరంగల్‌ నగరంలోని ప్రగతినగర్‌, జితేంద్రనగర్‌, అంబేద్కర్‌నగర్‌వంటి బస్తీలలో పర్యటించడంవల్ల, ఈ మరికివాడల ప్రజల అవసరాలు, సమస్యలు, కష్టాలను ప్రత్యక్షంగా ప్రభుత్వమే తెలుసుకున్నట్లయింది. ఈ బస్తీలలో జరిగిన ఓ మీటింగ్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నట్లు ‘‘నేనిక్కడికచ్చిందే నయమైంది. ఇన్ని రోజులు మీరెట్ల బతుకుతున్నరో, మీ జీవితాలను ఎట్ల మార్చాలో నాకు అర్థమైంది. మనందరం కలిసి బాగుపడాలె!’’.
అన్నట్లుగానే కేసీఆర్‌, ఈ బస్తీ ప్రజలు ప్రధానంగా 7 రకాల సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుసుకున్నారు. అవి:` (1) ఆహార భద్రతాకార్డులు (2) పింఛన్లు (3) పక్కా గృహాలు (4) రోడ్లు (5) త్రాగునీళ్ళు ` నల్లా కనెక్షన్‌లు (6) భూమి పట్టాలు (7) ఇళ్ళ క్రమబద్ధీకరణ. ఈ సమస్యలను గుర్తించిన వెంటనే పరిష్కారం కోసం జిల్లాలోని అధికార యంత్రాంగాన్ని కదిల్చి యుద్ధ ప్రాతిపదికన వీటికి పరిష్కారం చూపాలని ఆదేశించడమేకాక, నిర్ధిష్ట ఫలితాలు కనిపించిన తర్వాతనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరంగల్‌ నగరంనుంచి కదిలారు.
ఇదే సమయంలో ఆయన ‘‘మన గరీబుతనం పోవాలె. గరీబు గల్లీల్లో ఉన్నవాళ్ళందరూ అమీరులు కావాలె. తెలంగాణలో గరీబునగర్‌లు పోయి అమీర్‌నగర్లుండే విధంగా కష్టపడి సాధించుకోవాలె’’ అని పిలుపునిచ్చారు. అదే సందర్భంగా ఇంటింటికీ నల్లా, సీసీ రోడ్లు, సకల సదుపాయాలు కల్పించే బాధ్యత ఎం.ఎల్‌.ఏలదే అని గుర్తు చేశారు.
స్లమ్‌లెస్‌ సిటీ….
ప్రపంచవ్యాప్తంగా నగరీకరణ జరుగుతున్న ప్రతిచోటా కనిపించే ప్రధాన లక్షణం`మురికివాడలు! హైదరాబాద్‌, వరంగల్‌వంటి నగరాలు కూడా దీనికి మినహాయింపుకాదు. అయితే నగరీకరణవల్ల ఉద్యోగాలు, ఉపాధులు, జీవన ప్రమాణాలు పెరగడం ఆహ్వానించదగిందే. కానీ మురికివాడలు పెరగడంమాత్రం ఆక్షేపించదగింది. అపరిశుభ్రతకు, వ్యాధులకు, నేరాలకు, అవ్యవస్థీకృత జీవనానికి అడ్డాలుగా మారుతున్న బస్తీలు నగరీకరణ అనే సుందర స్వప్నానికి అడ్డుగోడలుగా ఉంటున్నాయని అంతర్జాతీయంగా ఎన్నో అధ్యయ నాలలో వెల్లడయ్యింది. ఈ విషయాన్ని గమనించి తెలంగాణ ప్రభుత్వం, రేపు రాబోయే ‘‘మురికివాడల విస్ఫోటనాన్ని’’ ఇప్పుడే పథకం ప్రకారం కట్టడి చేయాలని భావించింది. అందుకే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ‘‘వరంగల్‌ను స్లమ్‌లెస్‌ సిటీ’’గా మార్చాలని, అద్దంలెక్క తయారు చెయ్యాలె’’ అని ఆదేశించారు. గత పాలకుల నిర్లక్ష్య, నిర్హేతుక విధానాలవల్ల ‘‘బస్తీలలో ఎక్కడ చూసినా మురికి… మోరీలకంపు… వానొస్తే మోకాలి మంటి నీళ్ళు’’వచ్చే హీనస్థితి దాపురించిందని బాధపడి, ఈ పరిస్థితి ఇకముందు కనిపించకూడదని అన్నారు.
వరంగల్‌లో దాదాపు 60నుంచి 70 వరకు ‘స్లమ్‌’లు ఉన్నాయని మునిసిపల్‌ లెక్కలు చెపుతున్నాయి. ఈ స్లమ్‌ల రూపురేఖలు మారిపోయి, బస్లీల్లోని పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేదిశగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశాలు జారీ చేయడం, సీఎం పర్యటన ప్రజలకిచ్చిన గొప్ప కానుక అని చెప్పాలి.
తనవరకూ రాలేని పేద, నిర్భాగ్య ప్రజలను వెతుక్కుంటూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తనే స్వయంగా, వారి వాడలలోకి, వారి వాకిలిలోకి, వారి గుడిసెలలోకి వచ్చాడు. ‘‘తన దగ్గరికి రాలేని వనాల వద్దకి వసంతం వచ్చినట్లు’’గా వచ్చాడు. అంతేనా? తనతోపాటు మొత్తం ప్రభుత్వాన్నీ, ప్రభుత్వ యంత్రాంగాన్నీ పేద ప్రజల ముంగిళ్ళలోకి తరలించాడు.
అలా, వరంగల్‌లోని మురికి వాడలలో రెండు రోజులపాటు 60కిపైగా బృందాలతో హుటాహుటిన సర్వే చేయించారు. జిల్లాలోని రెవిన్యూ, హౌసింగ్‌, ఆర్‌ అండ్‌ బీ, నగరపాలకసంస్థ అధికారులు, సిబ్బంది ఈ సర్వేలో పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి అధికారులు రేమండ్‌పీటర్‌, బుర్రా వెంకటేశం, అనూరాధతోపాటు ఇతరులు కూడా మురికివాడల్లో మకాంవేసి, బస్తీ ప్రజల ఆర్థిక స్థితిగతులను సర్వే చేశారు. పింఛన్‌లు, ఆహార భద్రతాకార్డులు, ఇళ్ళపట్టాలు, నల్లా కనెక్షన్‌లువంటి వాటిని సమీకరించి నివేదికను రూపొందించడం, దానిననుసరించి సేవలను అందించడం విశేషం.

జీG1 గృహాలు..నిరుపేదలకు కవచాలు..
మనదేశంలో సామాన్యుడి జీవితకాల స్వప్నం`సొంతిల్లు! ఇక నగరాలలో అయితే సొంతిల్లు అనేది అందని మానిపండే! నగరాలలోని భూముల విలువలు, భవన నిర్మాణ వ్యయాల వంటి కారణాలవల్ల సొంతిల్లు అనేది పేద బస్తీవాసుల పాలిట గగన కుసుమమే అని చెప్పాలి. ఈ స్థితికి చరమగీతం పాడి పేదలకు సైతం పక్కా గృహాలను అందించినప్పుడు సంక్షేమ ప్రభుత్వం అన్న మాటకు సార్థకత చేకూరుతుందని నమ్మిన ముఖ్యమంత్రి కేసీఆర్‌. అందుకే వరంగల్‌ నగరంలోని మురికివాడల ప్రజలకోసం ‘జీG1’ పద్ధతిలో గృహ నిర్మాణాలకు పచ్చజెండా ఊపారు. అంబేద్కర్‌నగర్‌` జితేంద్రనగర్‌ (430), లక్ష్మీపురం`శాకరాశికుంట (429), దీన్‌దయాళ్‌కాలనీ (500), గిరిప్రసాద్‌నగర్‌ కాలనీ (400), గరీబ్‌నగర్‌ (617), ఎస్‌ఆర్‌ నగర్‌ (1000), గాంధీనగర్‌ (300), ప్రగతినగర్‌ (280)లలో గృహాలను నిర్మించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశించారు. వీటి నిర్మాణానికి కావలసిన 400 కోట్ల రూపాయలను (ఒక్కో ఫ్లాట్‌కు 4.53 లక్షలు) మంజూరీ చేయడమేకాక, ఇవి 5 నెలల కాలంలో పూర్తి అయి, గృహ ప్రవేశం జరుగాలని అధికారులకు సూచించారు. అలాగే, ఈ ఇండ్ల నిర్మాణ పనుల పర్యవేక్షణ కోసం బస్తీవాసులు కమిటీలుగా ఏర్పడాలని, వీటిలో సగంమంది మహిళలు ఉండాలని కూడా సీఎం సూచించారు.
అయితే, ఇన్నేళ్ళలో జరగనివి, ఇపుడేమైనా జరుగుతాయా? ఇంతకాలం బస్తీల్లో కానరాని ప్రగతి, ఇపుడు మాత్రం ఆకాశంలోంచి ఊడిపడ్తదా? అని సందేహాలు వ్యక్తంచేసే వ్యక్తులకు సీఎం కేసీఆర్‌ ఓ ఘాటైన సమాధానం ఇచ్చి, తెలంగాణాపట్ల, తెలంగాణ ప్రజలపట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారు. ‘‘గంత పెద్ద తెలంగాణానే సాధించుకున్న మనం, గీ బస్తీలను, కాలనీలను బాగుచేసుకోలేమా?’’ అనే ప్రశ్నతోనే సమాధానం చెప్పి, ప్రజల చేత జేజేలు కొట్టించుకున్నారు.
టెక్స్‌టైల్‌ హబ్‌….
నైజాం ప్రభువులకాలంలో వస్త్రోత్పత్తిలో అంతర్జాతీయ కీర్తిని గడిరచిన నగరాలలో వరంగల్‌ ఒకటి. ఇక్కడి ఆజంజాహీ మిల్‌ స్వాతంత్య్రానంతరం చాలాకాలం వరకూ తన ప్రాభవాన్ని కొనసాగించింది. కానీ తెలంగాణేతరుల పాలనలో తెలంగాణ ఎలా దోపిడీకి గురయిందో, అదే స్థితి ఆజంజాహీ మిల్లుకు కూడా దాపురించింది. ఫలితంగా, ఒకప్పుడు అద్భుతమైన వస్త్రాలు నేసిననేల గజాలలెక్కన రియల్‌ ఎస్టేట్‌గా మారి తన అస్తిత్వాన్నే కోల్పోయింది. ఇలాంటి పూర్వ చరిత్ర, వైభవం ఉన్న వరంగల్‌ నగరంలో వస్త్రాల ఉత్పత్తిపరంగా గత వైభవాన్ని పునరుద్ధరించాలనేది ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు స్వప్నం.
ప్రస్తుతం దేశంలోని వస్త్రోత్పత్తి కేంద్రాలలో ఒక్కో ప్రాంతం ఒక్కో రకం వస్త్రాల ఉత్పత్తికి మాత్రమే ప్రాధాన్యతనిస్తోంది. అలా చీరెలు, చద్దర్లు, గార్మెంట్స్‌, స్పిన్నింగ్‌, ప్రింటింగ్‌, డైయింగ్‌, హౌజేరీవంటి ఉత్పత్తులు భిన్న ప్రాంతాల్లో ఉన్నాయి. ఆ పరిశ్రమలన్నీ ఒకోచోట ఉండేలా ఏర్పాటు చేయాలని, దానికి అనువైన నగరం వరంగల్‌ అనీ ముఖ్యమంత్రి ఆలోచనగా ఈ పర్యటనలో ఆయన వెలిబుచ్చారు. దీనికోసం ప్రభుత్వ సలహాదారు పాపారావు, పార్లమెంటు సభ్యుడు కడియం శ్రీహరిలతో ఓ కమిటీని సూరత్‌, బీవండిలకు పంపించి అధ్యయనం చేయించారుకూడా. ఈ కమిటీ సూచనలను అనుసరించి వరంగల్‌ను వస్త్ర పరిశ్రమకు కేరాఫ్‌ అడ్రస్‌గా ‘‘టెక్స్‌టైల్‌ హబ్‌’’గా రూపొందించడమే తన లక్ష్యమని ఆయన ప్రకటించడం వరంగల్‌ వాసులలోనూ, రాష్ట్రానికి ఆవల ఉన్న తెలంగాణా వాసులలోనూ కొత్త ఆశలను చిగురింపచేయడం, ముఖ్యమంత్రి వరంగల్‌ పర్యటన సక్సెస్‌ ఆయిందనడానికి ఓ నిదర్శనం.
ఇలా మురికివాడల ప్రజలు, సామాన్య బీదలు, దిక్కులేని వృత్తికారులే ఎజెండాగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు చేసిన వరంగల్‌ పర్యటన కేసీఆర్‌లోని స్వచ్ఛమైన ప్రజానాయకుడిని, సంక్షేమ యోధుడిని, ‘‘బంగారు తెలంగాణ’’ కార్యసాధకుడిని మరొక్కసారి ప్రజలకు గుర్తుచేసింది. ‘‘మనందరం కలిసి బాగుపడాలె’’ అని ఆయన చెప్పిన మాటల్లోని సారాంశం ఆచరణలో తెలంగాణ ప్రజలందరికీ తేటతెల్లమయింది! మొత్తంమీద, ప్రముఖ రోమన్‌ చక్రమర్తి జూలియస్‌ సీజర్‌ గురించి ునవ షaఎవ, నవ ంaష, నవ షశీఅనబవతీవసు అని చెప్పిన మాటలను ముఖ్యమంత్రి వరంగల్‌ పర్యటన గుర్తు చేసింది.