చింతచెట్టు

 

– డాక్టర్‌ శ్రీరంగాచార్య

మన తెలంగాణలో వర్ధిల్లిన పద్యకవుల్లో అందునా, కథా కావ్యాలను పద్య రూపంగా తెలిగించిన కొద్దిమంది కవుల్లో ప్రప్రథమంగా పేర్కొనదగ్గ ప్రతిభా మూర్తి కొరవి గోపరాజు. ఈయన ‘సింహాసన ద్వాత్రింశిక’ ప్రాచీన కథలను తెనుగు చేసిన రచనయైనా – ఇదొక సాంఘిక సామాజిక విషయ వివేచన చేసే విజ్ఞాన సర్వస్వం. ప్రతి కథలోను ఒక నూతనత్వం, అనూహ్య వస్తు – వ్యక్తిత్వాల వర్ణన వంటివి మనలను బాగా ఆకర్షిస్తాయి.

సింహాసన ద్వాత్రింశిక ఒక కథా కావ్యమైనా దాన్ని మనం సునిశిత పరిశీలనాదృక్పథంతో చదివితే అనూహ్యమైన ఎన్నో విషయాలు అవగతమైతాయి. ఈ పరంపరలో గోపరాజు వర్ణించిన ‘చింతచెట్టు’ను గూర్చి తెలుసుకుందాం.

వర్ణనా నిపుణులైన కవులు-తమ కావ్యాల్లో ఉద్యాన వనాలను – పుష్పాపచయకేళులను వర్ణిస్తూ అట్లే అటవీ వర్ణన చేసిన వారున్నారు. గద్యంలోనే అటవీ వర్ణన చేయవలెననే లాక్షణికోక్తికి అనుగుణంగా పోతన – గజేంద్ర మోక్షంలో చేసిన వనవర్ణన తరువాత ఎందరికో మార్గం చూపినా-పోతన చూపు మహావృక్షాలైన వేప, చింత, మర్రి మొదలైన వాటివైపు పోలేదు. దీర్ఘ సమాసాలతో వటక్ష్మాజమును – అశ్వత్థ వృక్షాలను వర్ణించిన మన మహాకవులు ‘చింత’లేని వర్ణనలు చాలా చేసినారు.

యథార్థంగా మన నిత్య జీవన విభాగ విధానాల్లో ‘చింత’పండు ఎంతో ముఖ్య పదార్థం. దీన్ని మనకు అందించే చెట్టు విశేషమైంది. అందుకే పల్లెల్లో తీరికలేని సంసారం చేసే గృహస్థురాలు. తన తల్లిగారింటికి పోవటానికి సమయం దొరకనందుకు బాధ పడుతూ – ‘నా సంసారం అంతా చింతచెట్టు బతుకైంది’ – అనటం మామూలు. అనగా మనం నిరంతరం చూస్తున్న చింత చెట్టు జీవన గమనమిది. ఆకురాలి కొత్త ‘చిగురు’ వేయటం. ఆకు ముదిరి పూతపూయటం. తరువాత ఒనగాయ – చింతకాయ (పచ్చడికాయ) ఇదే కాయ పండి – రాలి – రాల్పబడి – చింత పండు గావటం, తరువాత మళ్లీ మొదటికే. ఇది – చెట్టు సంసారం – చెలది సంసార సామ్యం. చింత చెట్టు – కేవలం పండుకేగాక దీని బెరడు కట్టె, చిగురు, ఒనగాయ, కాయ మొదలైనవి బహువిధాలుగా ఉపయోగపడుతాయనే విషయం మనందరికీ తెలుసు. ఆయుర్వేదంలో ఈ వృక్షోపయోగం అనేక విధాలుగా చెప్పబడింది.

ఇక దీన్ని చించావృక్షం-తింత్రిశీ వృక్షం అని సంస్కృత కోశాలు తెలుపుతున్నాయి. పరాయిభాషలో ఇది ‘ఇమ్లీ’ (చింతపండు) ఒకప్పుడు (మా గుర్తులో) అధికమైన ఇమ్లీ చెట్లున్నందున ఆ ప్రాంతాన్ని ‘ఇమ్లీ బన్‌’ ఇమ్లీ వనం (ఆమ్ల వనం) అన్నారు. ఆ స్థలమే ఇప్పుడు ‘ఇమ్లీ బన్‌ బస్‌ స్టాండ్‌’. ఇట్లా మన ప్రాచీన విశేషనామాలు వ్యాప్తి చెందినాయి. మన వూళ్లల్లో ‘చింత’ శబ్దంతో వచ్చేవి చాలా వున్నాయి. ఉదా:- చింతపల్లి, చింతమడక, చింతపూబండ, చింతగట్టు మొ||. మన వారి యిండ్ల పేర్లలోను ‘చింత’ చెట్టుచేరటమే గాక సంస్కృతీకరింపబడి ‘తింత్రిణీ’, ద్వితింత్రిణీ, చించాపట్టణ – ఇత్యాదులుగా వ్యాప్తిలో వున్నాయి. ఈ విధమైన ఎన్నో విశేషాలను లోకజ్ఞుడైన మహాకవి గోపరాజు గ్రహించి తన కథలో – తృతీయాశ్వాసంలో వర్ణించిన వనకేళీ సందర్భంలో పద్యాల్లో చింతచెట్టును వర్ణించిన విధానం గొప్పగా వున్నది.

నేటికీ రాచకొండ, నల్లగొండ జిల్లాలోనే గాదు, దక్షిణ దేశం తీర్థయాత్రా మార్గాల్లో అతి ప్రాచీన తింత్రిణీ వృక్షాలు దర్శనమిస్తాయి. పన్నిద్దరు ఆళ్వారుల్లో ఒకరి జన్మస్థలం ‘తింత్రిణీమూలమే’ ఇది ప్రసిద్ధి. శ్రీవైష్ణవ దేవాలయాల్లో ప్రసాదంగా వినియోగం చేసే ‘పులిహోర’ చింతపండు పులుసుతో చేసిన అన్నం (¬రా) రుచి వర్ణనాతీతం. ఇట్లా ఎన్నెన్నో విశేషాలు మన ‘చింతపండు’ – ‘చింత చెట్టు’ గూర్చి చెప్పుకోవచ్చు. మన వాడకంలో ‘టమాటా’ రానప్పుడు ‘చింతపండు’ ‘నిమ్మపండు’ వాడుకం అధికంగా వుండేది. గోపరాజు నాటి సమాజంలో అప్పుడు ‘చింత పండు’ చెంతచెట్టు పదార్థాల వినియోగం బాగావున్నందుకే తనివితీరా ‘చింతచెట్టు’ను ఇట్లా వర్ణించినాడు.

గోపరాజు తర్వాత మహబూబ్‌నగరం జిల్లా కవి కోవూరు భరతయ్య, గున్నచింతను అద్భుతంగా వర్ణించినాడు. (గోలకొండ కవుల సంచిక 180పు) సింహాసన ద్వాత్రింశికలో నర్మసఖుడు (విదూషకుడు) ‘చించావృక్షంబుజూడు చిత్తజరూపా!’ అనే విశేషణంతో పింఛసమంచిత పంచాయుధ మరకతాత పత్రంవలె నిశ్చంచల శాఖాంచితమైనదీ చించావృక్షం అని తర్వాత దాని ప్రభావాన్ని వర్ణిస్తాడు. మనుజులు చింతించిన కొలది చదువులకూర్చుడు చింతమదిలోన లేకుండా చేస్తుంది కాబట్టి చింతకు సరిగలదె లోకచింతామణికిన్‌ అని ‘చింత’కు ‘చింతా’మణిని చూపిస్తున్నాడు.

అంతేగాదు – ఈ చింతపండు సమానంగా దేవలోకంలోని అమృతం కూడా సరిరాదు. అందుకే దేవతలంతా చింతపండు రసం తాగినందున వారి జిహ్వలకు ఇతరమైన రుచులేవీ గిట్టటం లేదు. దీనితో బాటు కల్పవృక్షచ్ఛాయయందు సంతృప్తిగా విశ్రాంతినందని దేవలోకవాసులు – దీనికై నిరంతరం చింతించినారు గాబట్టే దీనికి ‘చింత’ అనే పేరు వచ్చిందట. ఇంకా – చిగురు – పువ్వు – ఓమనకాయ – దోరపండు. ఈరగ పండిన పండ్లు వీటిని ఎల్లకాలం మనకిచ్చే చింత చెట్టును మించిన చెట్టు లేదు. పూర్వం ఇంద్రుడు అమృతపానంతో రుచిగానక కృశిస్తూ విడిచిన కళలన్నీ ఈ’గొడిశెల’ రూపంగా చింతగొల్పుతున్నాయి. బ్రహ్మయంతవానికి షడ్రసములలో ఇది మాత్రమే నోరూర చేసి రసప్రసిద్ధి గాంచింది. ఇంకా

‘గరితలేనియిల్లు దొరలేని తగవును
చింతపండు లేని వింత చవియు
చనవు లేని కొలువు శశిలేని రాత్రియు
ముక్కులేని మొగము నొక్కరూపు’

‘చింత’ – శబ్దానికి సూర్యరాయాంధ్ర నిఘంటువు – ఈ గ్రంథంలోని ‘భ్రాంతివడికల్పవృక్ష, ప్రాంతంబున కూర్కుబట్టక సుర లశ్రాంతంబు దీనికై మది చింతించుట చేసి పరగి చింత యనంగన్‌ – పద్యాన్నే గ్రహించటం విశేషం. మన సమాజంలో ‘చింత చచ్చినా పులుపు చావదు’ ‘చింతల కాజ్ఞగాని గుటుకలకేమి యాజ్ఞ’ అని ప్రచారంలో వున్నాయి. గ్రంథాల్లోను ‘చింతకంత’ చింతయాకు మొదలైన పదప్రయోగాలున్నాయి. ‘చింత’ శబ్దం తెలుగులోను, సంస్కృతంలోను వున్నందున ప్రహేళికల్లో ‘చింతకాయ’ ప్రయోగం చేరింది. తెలుగులో చింతకాయ సంస్కృతంలో ‘చింతకుని కొరకు’ అని అర్థం. ఇట్లా ‘చింత’ ఉభయ భాషల్లోను వ్యాప్తిలో వున్నది.

గోపరాజు – వనవిహార సందర్భంలో ఇతర కవులవలె గాక ‘చింతచెట్టు’ను నర్మసఖుని ద్వారా వర్ణన చేయించటం ఆయన లోకజ్ఞత. సాంఘిక దృష్టికి నిదర్శనం. నేడు మన సమాజం మహావృక్షాలను స్వేచ్ఛగా నాశనం చేస్తున్నారు. వీటిని వందల యేండ్ల నాడు మన పూర్వులు నాటి మేలు చేసినట్లే – ఈనాడు జరిపే వన మ¬త్సవాల్లో మామూలు చెట్లతో పాటు చింత, వేమ, మర్రి, రాగి, మేడి వంటి వృక్షాలను నాటి భవిష్యత్తును మహా వృక్షమయం చేయటం అవసరం.