చిలువపడగఱేని పేరణము

మరింగంటి వంశ కవులలో శతఘంటావధాన సింగరాచార్యుల వారి శుద్ధాంద్ర నిరోష్ఠ్య సీతాకల్యాణం తర్వాత ఈ వంశం వారిలో వచ్చిన మరియొక అచ్చతెనుగు ప్రబంధం – ‘చిలువపడగఱేని పేరణము’ లేదా చిలువ పడగఱేని చరిత్ర. కృతికర్తయైన వేంకటనరసింహాచార్య కవి షోడశ ప్రబంధ నిర్మాతయైన వాటిలో కొన్ని మాత్రమే లభించినాయి. వీటి నుండి నాల్గు ప్రబంధాలు ముద్రణము కాగా, మరికొన్ని అముద్రితంగా వున్నాయి. కవిగారి కొన్ని రచనల గూర్చి ఇదే ‘తెలంగాణ’ పత్రికయందు ‘అముద్రిత ‘గ్రంథ సంపద’ శీర్షికన పరిచయం కలదు.

– డాక్టర్‌ శ్రీరంగాచార్య

చిలువపడగఱేని పేరణము – అనగా – చిలువ = సర్పం, పడగ=ధ్వజం (కల) ఱేడు=దుర్యోధనుడు. ఈయన పేరణము=పెండ్లి, కావ్యకథావస్తువు దుర్యోధనుడు ‘శుభాంగి’ యనే కన్యను వివాహమాడటం. (దుర్యోధనునకు భానుమతీ పరిణయం ప్రసిద్ధం) దీన్ని కవి మూడాశ్వాసాల్లో 1140 గద్య పద్యాల్లో చెప్పి – అచ్చ తెనుగు రచనయందు తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఈ వంశ కవుల్లో కొందరివలె ఈ గ్రంథాన్ని తన యిష్టదైవమైన సిరిసనగండ్ల నృసింహ స్వామికే సమర్పించి న్యస్త భరుడైన వేంకట నరసింహాచార్య కవి – ఈ గ్రంథాన్ని విశేషంగా సిద్ధంచేసి నాడు, అచ్చతెనుగు గ్రంథరచయితల్లో అధికులు పేర్లను, బిరుదాలను -గ్రంథనామ ఆశ్వాసనామాలను తత్సమంగానే చెప్పినారు. ప్రస్తుత కృతికర్త పై పద్ధతిని గ్రహించక గ్రంథనామం – పాత్రల పేర్లు – ఆశ్వాసాది విభజన మొదలైన వాటిని కూడా అచ్చాంధ్రంలో చెప్పి – ఆశ్వాసాల చివర్లో గద్య గాకుండా – ఆముక్తమాల్యద వలె పద్యాన్నే చెప్పటం (అదీ అచ్చతెనుగే) ఒక విశేషం. ఇది యాచిల్వసిడెంబుఱేని చరితం బింపొందగా తెన్గునన్‌… ఇట్లా ఆ పద్యాలున్నాయి.

సిరిసెనగండ్ల నృసింహస్వామి కవికి స్వప్నంలో దర్శనమిచ్చి అచ్చతెనుగు రచన గొప్పదని – చెప్పి

చిలువటెక్కెంబురా ఱేని చెలువుకతయు
నచ్చతెనుగునమాకు నునంకితముగ
నిమ్ము లెమ్మనిదయయునుయిచ్చయందు
నివ్వటిల్లంగ నననేను నిదుర దెలిసి

ఈ కావ్యరచనకుపక్రమించినాడు, సింగరాచార్య కవి వలెనే బాల్యం నుండి కవిత్వం చెప్పటమే గాకుండా ప్రబంధాలను రచించటం విశేషం. తన యితర రచనల్లో ఏ వయస్సులో ఏ ప్రబంధం రచించింది తెల్పినాడు.

దాని ప్రకారం ఈ గ్రంథాన్ని పదిహేను సంవత్సరాల ప్రాయంలో రచించినాడు. కవి కాలం వరకు (1750 క్రీ.శ.) అచ్చతెనుగు ప్రబంధ రచన చాల తక్కువ. కాబట్టి తాను సింగరాచార్యుల వారి వలెనే కొన్ని నియమాలను, కృతి ప్రాశస్త్యాన్ని తెల్పినాడు. ‘ఒకరి తెఱువు నేను బోను (1-13) వేలుపుబాస కుమారుపేళ్లునుడువుట చెల్లదు (1-14) తెలుగు పదముల తరమక (1-15) ఈ విధమైన పద్ధతులను తెల్పి తన కృతి ప్రాముఖ్యాన్ని నిరూపించిన కవి

అరయుచు తెనుగుల పదములు
తరమున నిరుమాఱుల రసితాల్మితొ నుడువన్‌
సరగున పదములఁదగుబిగి
తెఱగరయఁగవలయు దీని తెఱగేర్పడగన్‌’
అని దీనిలోని పద ప్రయోగ విషయాన్ని తెల్పి తర్వాత
అచ్చతెనుగుల బాసల నలరుకబ్బ
మెందునుంగల దందులపాటి మొదవు
నట్టియాంధ్రపుగుత్తిని బట్టినుడువు
లెల్ల నీకబ్బమందుల నలర జేతు’ – అన్నాడు.

అందుకే సహృదయుడైన పాఠకుడు ఈ ప్రబంధాన్ని ఓపికగా చదివి కవితా శక్తిని గమనించటం అవసరం – వెంకట నరసింహాచార్య కవి తన ప్రబంధ కథలను వినూత్నంగా గ్రహించి వివరించినట్లే వాటి పేర్లు గూడా విశేషంగా వున్నాయి. దీన్ని శుభాంగీ పరిణయమనో, శుభాంగీ దుర్యోధనోద్వాహమనో నేరుగా చెప్పక, కాస్తా తిప్పి చెప్పినాడు. ఇట్లే ‘సాంబోపాఖ్యానం’ అనకుండా ‘జాంబవతీ కుమార శృంగారలీలా విశేషం’ అని దూరాన్వయంగా చెప్పి పాఠకునికాలోచన కల్గించినాడు – (చూ- ‘తెలంగాణ’ – అక్టోబర్‌ 2019) నూతన కథను అన్వేషించి ప్రబంధీకరించటంలో నేర్పరియైన కవి యీ ‘చిలువపడగఱేనిపేరణం’లోని ముఖ్య కథయిది.

కళింగ దేశ పాలకుడైన చిత్రాంగునికి దైతకుని పుత్రికయైన ‘రూపవతి’ భార్య, వీరి పుత్రిక ‘శుభాంగి’ ఈమె అంగాంగవర్ణన – యౌవనం – వసంతర్తువర్ణనతో మొదటి ఆశ్వాసం పూర్తి కాగా, తన కూతురు రూపవతి కొరకు వరుణ్ణి చూడుమని చిత్రాంగుడు బ్రాహ్మణులను పంపగా వారు హస్తినాపురానికి చేరి ధృతరాష్ట్ర పుత్రునకీ విషయం తెల్పుతారు. ఆయన రాజలాంఛనాలతో సపరివారంగా బయల్దేరి చిత్రాంగుని నగరి దావలి పూదోటకు చేరుతాడు. ఆ సమయంలో దుర్యోధనుని చూచిన శుభాంగి విరహబాధలో మునుగుతుంది. కవియీ సందర్భంలో ద్రౌపదీ స్వయంవర ప్రస్తావన చేస్తాడు. తరువాత శుభాంగీ స్వయంవరం. సభలో రాజ వర్ణన చేస్తూ చెలికత్తెలు దుర్యోధనుని వద్దకు శుభాంగిని తీసు వచ్చి తెల్పగా వెంటనే ఆమె దుర్యోధనుని మెడలో పూలదండ వేస్తుంది. దీనితో రెండో ఆశ్వాసం ముగిసింది. దుర్యోధనుడు శుభాంగీయుక్తుడై హస్తినకు వెళ్లుతుంటే మధ్యన ‘గట్లగుము లంబు పేరొదవు వీడేలు నెఱసరి’ (గిరివ్రజ పురాధిపుత్రుడైన జరాసంధుడు) పాపపడిగిఱేని (దుర్యోధనుని) నధిక్షేపణ చేసి యుద్ధం చేయగా దానిలో జరాసంధుని ఓడించి దుర్యోధనుడు జయలక్ష్మీ సంతోషంతో తన నగరానికి చేరుకుంటాడు. తరువాత శుభాంగీ దుర్యోధనులకు ఒక కుమారుడు కలుగుతాడు. అతని బారసాల వర్ణన – బాలకుని పేరు లక్షణుడు – బాలిక లక్షణ. వీరి వర్ణన-తరువాత – గ్రంథ పఠన ఫలం యిట్లా చెప్పబడింది.

పుడమీ కబ్బము వ్రాసినంజదివినం బొల్పొప్పగావింపుచుం
దొడవున్‌ సంపద బందుగుల్సకియలుం దోబుట్టువుల్కూతులుం
కొడుకుల్మన్మలు పాడిపంటయశముం గోటైనభాగ్యంబునుం
నుడువున్‌ వారికి నుబ్బనంచుడివెన్‌…. నొందగా.

(అట్లో ‘యశము’. ‘భాగ్యము’ వచ్చినవి)

కవి ఈ కథ మహాభారతంలో కలదన్నాడు. చిత్రాంగ ప్రభువు, రాజధాని, శుభాంగీజననం, ఆమె వయఃపరీపాక వర్ణన, మన్మథావస్థ – శైత్యోపచారాలు – స్వయంవరం-వివిధ దేశ రాజవర్ణన, దుర్యోధన వైభవం, యుద్ధం, భోజనాలు, శృంగార క్రీడలు వీటిని అధికంగా వర్ణించి వర్ణనానిపుణఃకవిః అనే దాన్ని సార్థకం చేసినాడు. (అచ్చతెనుగు నియమం లేకుంటే ఇది పెద్ద ప్రబంధంగానే సిద్ధమయ్యేది).

రాజైన చిత్రాంగుడు ముగ్గురు దేవతల గుణాలు కల్గినవాడని ఇట్లా వర్ణించినాడు.

చిలువ పానుపువాని, చిలువతొడవులవాని
చిలువమేపరికాని చెలువుకలిగి
గట్టుగొట్టినవాని గట్టుదాల్చినవాని
గట్టు గూకెడువాని గరిమగలిగి
మెకము బెంచినవాని మెమునెక్కుడువాని
మెకముత్రుంచినవాని మిన్నతొదవి
నీరు గప్పినవాని నీరు దాగినవాని
నీరు జొచ్చిన వాని నేర్పు గలిగి
దయనుబలిమిని దయ సిరిధైర్య తేజు
మతికి వడికిని మగటిమిమైనియమ్మె
నీతియాలంబు నేర్పున నెన్నికెక్కె
పుడమి చితరాంగుడనియెడు యెడయడెలమి

(దీనిలో క్రీగీతగలవి అచ్చ తెనుగు పదాలు కావు)

శుభాంగీ విద్యారంభంలో అక్షరాలను నేర్పే విధానం యిట్లా వున్నది.

నెలత నేల బళ్లు నేర్పున దిద్దుచు
నక్కరాలు బలుక నమర వ్రాసె
గొప్ప వొయ్యి చూచి గొబ్బున చదువంగ
నేర్పె నాట పాట నేర్పె లర్ప.

దీంట్లో – ‘నేలబళ్లు’ అంటే నేలపై ఇసుకపోసి – చదరంగా చేసి దానిపైన అక్షరాలను దిద్దించటం. ఇది ఒక నాటి తెలంగాణలోని ఖాన్గీ (వీధిబడులు) పద్ధతి. వొయ్యి అంటే పుస్తకం. ఇదే వహిబహి (ఖాతాపుస్తకం) యైనది, పల్లెటూళ్లల్లో పుస్తకాన్ని ‘వయ్యి’ అనటం ప్రఖ్యాతం, అందుకే ‘వొయ్యిలవున్నంత బయ్యన్న గీకె’ అనే సామెత వచ్చింది. కవి చిత్రకవితా ప్రియుడని అచ్చతెలుగులోను తెల్పుకున్నాడు – శుభాంగి సౌందర్యం, రతి, రోహిణి, సరస్వతి, లక్ష్మి, పార్వతుల మించినదని…

ననవాలు వానియాలును
ననవాలుని మామయాలు నలువనియాలున్‌
ననవాలు నయ్యయాలును
ననవాలుని గొంగయాలు నాతికి సరియే’ –

అని శబ్ద శ్లేషను ప్రతిభావంతంగా చిత్రించినాడు. కవి వివిధ వర్ణనల్లో ఒకటి చంద్ర వర్ణన – యిట్లున్నది.

వలిగొండయల్లు నితలను మెలిగెడిపువ్వు
మేను లేని వజీరు మేనమామ
జిడ్డుకడలికి గల్గుబిడ్డకు తోబుట్టు
జడదారి కన్నున బొడముకందు
మంటబొడమెటియట్టి పంటపైరులరేడు
తమ్ముల చెలికాని దంటకాడు
మూడువేడులు మున్నుముప్పుచేసినమేటి
తేరుకుదాపలై తిరుగుగిల్ల
వేలుపుల బువ్వ పేరున నెలయుజోదు
చలివెలుంగును తెలిముద్దుకలువఱేడు
పేదవారిండ్లరేయిని బెట్టు దివ్వె
యనగరేఱేడు తొల్కడలందుబొడమె (2ఆ)

(దీనిలోని’గిల్ల’యనేది ‘చక్రం’-నల్లగొండ జిల్లాలో ‘గిల్ల’ అంటారు. చంద్రుడు పేదవారింటిలో రాత్రి పెట్టేదీపం అనటం కవిలోకజ్ఞత)

దుర్యోధనుడు కళింగనగరానికి పోతున్నప్పుడున్న ఈ వాయిద్యాలు అట్టహాసం – కవి నాటి జమీందార్లు పెండ్లికి తర్లిపోయే విధానాన్ని తెల్పుతున్నది. ఆ పద్యం –

తొడుములు డప్పుబేరులును
తోరపుడక్కలు తమ్మటంబులున్‌
కుడియెడనుండు వారలునుకొమ్ములునుం
బెళగొమ్ము చిందముల్‌
కడక తొమోగ నారవలి కన్నులవిల్లుని
నన్నజాలుకుం
వెడపని తాడునుం గుడుపె
నేల చెరంగుల నేతరాకకున్‌
స్వయంవర సమయంలో
శుభాంగి దుర్యోధనుమెడలో

దండవేయటానికి వచ్చినప్పుడు – ఆమె తీరు మహాప్రబంధమందలి కన్యకను తలపిస్తున్నదీ పద్యం –

అంచబోదలవిందు అంచు చీర చెడంగు
మేగాలి మేదుగమేలమాడ
పలుమానికంబుల చెలువుగుల్కెడునట్టి
యందియల్‌ నడుగుల సందడింప
మించు సంచుననొంచుమై నొప్పు రారేండ్ల
ముద్దు కనవలపై ముసుగు నింప
కైదోయి నిడినట్లు కంకణ రవళిక
దల్చెడి నెదఱేండ్లు డిందునొంద
చెళుకువాల్జూపు మెక్కువతళ్కులొదవ
పొత్తుకత్తెలు నెడనెడపొగడుచుండ
దండకునుడాసి తెలిదమ్మిదండకేల
నెత్తిరాఱేని యరుతను బత్తినిడియె,

గ్రంథకర్త యెంత ప్రతినబూనినా పద్యాల్లో సంస్కృత పదాలున్నాయి. వీటికి తోడు అచ్చతెను గులోనికి మార్చిన పదాలు-పేర్లు-ఎంతో శ్రమావహంగానే వున్నాయి.

ఉదా:- కర్ణుడు-ప్రాజదువులమేటిగన్నట్టి బిడ్డ, అంజన=గౌర గొంగని పేరుగల మేటిగరిత, మరికొన్ని పదాలు వెనుక సూచించినాను. తనయిలు వేలుపు-కృతి భర్తయైన సిరిసెనగండ్ల నరసింహ స్వామి యిట్లున్నాడని కృత్యాదిలో తెల్పినాడు.

సిరియున్‌ బంటనెలంతనీలయును దాజెన్నైనమైయొప్పుచే
నిరువంకంగొలువంగ బ్రేముడియెదన్‌ హెచ్చందయంబత్తులన్‌
నరలేకేవెడిచిల్వగట్టుదొరబాగైనట్టి దోరూపునన్‌
నరుడౌ సిర్సినగండ్లనుండు నరసింగప్పయ్యమమ్మోతన్‌
ఆశ్వాసాంతగద్య మత్తేభంలోయిట్లున్నది.
ఇదియాచిల్వసిడెంపుఱేని చరితంబింపొందగాదెనునన్‌
విదితుండౌ నరసింగసామిదయచేవేడ్కన్‌ మరింగంటి కం
నిధినిం బుట్టిన నారసింహకవి దానేర్పోప్పగా గూర్చినన్‌
ఇది మూడోదగు గద్దెపద్దెములనున్నింపొందనాశ్వాసమై

తెలంగాణ మారుమూల పల్లెలో నున్న కవిగారు వ్రాసిన యీ ప్రబంధం వ్యాఖ్యయుతంగా వస్తే – మనమాండలికాలు, కవి ప్రతిభ తెలుస్తాయి.