చీరల పంపిణీతో మహిళల ఆనందం

tsmagazineతెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండగను రాష్ట్ర పండగగా ప్రకటించిన నాటి నుంచి ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగకు మహిళలకు చీరల పంపిణీ చేపడుతున్నది. ఈ సంవత్సరం బతుకమ్మ పండగకు రాష్ట్ర ఎన్నికల కోడ్‌ అడ్డు రావడంతో చీరల పంపిణీకి బ్రేక్‌ పడింది. దీనితో డిసెంబరు 7న ఎన్నికలు పూర్తికావడం, 11న ఫలితాలు ప్రకటించడంతో ఎన్నికల కోడ్‌ ఎత్తివేయ బడింది. డిసెంబరు 19 నుంచి రాష్ట్రంలో చీరల పంపిణీ ప్రారంభమయ్యింది.

బతుకమ్మ పండగ తిరిగి వచ్చిందా అన్నంత వేడుకతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోను బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభించారు. 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఆడపడుచుకు చీరలను పంపిణీ చేశారు. రేషన్‌ డీలర్ల ద్వారా ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి నియోజకవర్గంలోను ఆయా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభించారు. చీరలు అందుకున్న మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

అన్ని నియోజకవర్గ కేంద్రాలతో పాటు గ్రామ పంచాయతీల్లోను ఈ చీరలను పండగ వాతావరణంలో పంపిణీ చేశారు. అన్ని చోట్లా కూడా ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు పంపిణీ చేశారు. మారుమూల పల్లెల్లో ఉన్న మహిళలకు కూడా బతుకమ్మ చీరలు అందేవిధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆయా జిల్లాల అధికారుల పర్యవేక్షణలో చీరల పంపిణీ పకడ్బందీగా జరిగింది.

బతుకమ్మ చీరలు మంచి నాణ్యతతో, రకరకాల రంగుల్లో ఉండడంతో వాటిని అందుకున్న మహిళలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. సిరిసిల్ల చేనేత కార్మికులు నేసిన చీరలు కావడంతో వాటిని మంచి నాణ్యమైన చీరలుగా తయారు చేశారు. ఈ చీరల నేత వల్ల నేత కార్మికులకు కూడా ఉపాధి లభించింది. కార్మికుల ఉపాధితో పాటు మహిళలకు చీరలు పంపిణీ సక్రమంగా జరగడంతో రాష్ట్రంలో మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేశారు.