చూడామణి నిఘంటువు

డాక్టర్‌ భాగవతం రామారావు
ముద్రితమైన, అముద్రితమైన ఆయుర్వేద గ్రంథాలను పరిశీలించినపుడు క్రీస్తుశకం 15-16 శతాబ్దాలనుండి వస్తువుల గుణాలను తెలిపే నిఘంటువులు, రోగనిదానం చికిత్సలను వివరించు గ్రంథాలు ఎక్కువగా సంకలనం చేయబడినట్లు అవగతమౌతుంది. వీటికి సంకలన గ్రంథాలు లేక ప్రకరణ గ్రంథాలని వ్యవహారం. ఈ శతాబ్దాలనుండి దేశ విదేశ సంబంధాలు, రాకపోకలు బాగా పెరిగినవి. దానితో క్రొత్త క్రొత్త ద్రవ్యాలు, వస్తువులు, ఓషధులు, ఔషధాలు వాటితో బాటు క్రొత్త క్రొత్త రోగాలు ప్రబలినవి. అందుకని క్రొత్త పుస్తకాల అవసరము కలిగింది. నేను పరిశీలించిన తాళపత్ర ప్రతుల గ్రంథాలయాలలో ఇట్టి సంకలనాలు నా దృష్టికి చాల వచ్చినవి. గుణపాఠం, ద్రవ్యరత్నావళి, ద్రవ్యముక్తావళి, దక్షిణామూర్తి నిఘంటువు, లోలంబరాజీయము, వైద్య చింతామణి, ద్రవ్యగుణావళి, ద్రవ్యరత్నాకరం మొదలైనవి ఇంకను ఎన్నో మరుగునపడిన గ్రంథాలు ఉన్నవి. వీటి ప్రతులు ఎక్కువగా లభించుటను బట్టి అవి చాల ప్రచారంలోను నున్నట్లు తెలియవస్తున్నది. అన్ని నిఘంటువులే ఐనా ప్రతిదానిలో ఏదో వైశిష్ట్యము గోచరమౌతుంది. పర్యాయపదాలను మాత్రము ఇచ్చేవి కొన్ని. ఒక్కొక్క వస్తువులోని రకాలు -తోటకూరలో ఐదు రకాలు, వంకాయలలో నాలుగు రకాలు అన్నట్లు-చెప్పునవి మరి కొన్ని. కొన్ని ఎక్కువగా వాడబడేవి మాత్రమే చెప్పునవి. ఇట్టి నిఘంటువులలో చాల పెద్దదైన ద్రవ్యరత్నావళిని పరిష్కరించి తెలుగు అనువాదంతో ముద్రించి రమణాచారిచే ఆవిష్కరింప జేయటం జరిగింది. వేయి ప్రతులు చెల్లు బాటు అయినవి.

ప్రస్తుతం చెప్పదలచినది ‘చూడామణి నిఘంటువు’. తాళపత్రప్రతి. ఇది సూరయామాత్యుడు వ్రాసినది. దీనిని అవిభక్త ఆంధ్రప్రదేశరాష్ట్రంలో దేశీయవైద్యశాఖకు సలహాదారుగానున్న బాలరాజ మహర్షి నాకిచ్చినారు. ఇంకను కొన్ని తాళపత్రాలు తిరుపతిలోనున్నవని, ఇస్తానని అన్నారు.కాని కుదురలేదు. ఈ చూడామణి నిఘంటువు పదమూడు, ఒకటిన్నర అంగుళాల పరిమాణంగల అరువది తాటాకులలో రెండువైపుల వ్రాయబడింది. అన్ని నిఘంటువులలో వలె వస్తువు లేక ద్రవ్యం పేరు తెలుగులో ఇచ్చి పర్యాయపదాలు, గుణములు మున్నగునవి సంస్కృత శ్లోకాలలో ఇవ్వబడినవి. సాధారణంగా నిఘంటువులు, సంకలన గ్రంథాల ప్రతులు అక్కడక్కడ చాల ఉంటవి. కాని చూడామణి నిఘంటువు ప్రతి ఏ తాళ పత్రప్రతుల గ్రంథాలయాలలోను లభించలేదు. ఆశ్చర్యంగా దేవనాగరిలిపిలో వారణాసిలోని సరస్వతీభవన గ్రంథాల యంలో ఒక కాగితపు ప్రతి

ఉన్నది. అయితే మొత్తం లేదు, సుమారు మొదటి పది పత్రాలభాగం మాత్రమున్నది. తెలుగులో నున్న ద్రవ్యాల పేర్లు దేవనాగరిలిపిలోనే వ్రాయబడినవి. తెలుగులిపిలో వేరే ఒక్క ప్రతికూడ దొరకక దేవనాగరిలో వారణాసిలో లభించటం విచిత్రం.

చూడామణి నిఘంటువులో ముందు ఇరువది శ్లోకాల ఉపోద్ఘాతమున్నది. శ్రీరామచంద్రుని, గణపతిని, శారదను, ధన్వంతరి మున్నగు దేవతలకు నమస్కరించినాడు. తాను కౌండిన్యసగోత్రుడనని దండాపండితుడనే బిరుదుగల దండయామాత్యుని కొడుకునని, సూరయనామధేయుడనని, రఘునందనుని భక్తుడనని చెప్పుకొనినాడు. పుస్తకం పేరు చూడామణి నిఘంటువు, నిఘంటు చూడామణి, కోశచూడా మణి యని మూడు విధాలుగా వాడబడింది. ఎంతో విశాలమైన సముద్రమువంటి కోశనిధినుండి, బావినుండి అవసరమయినంత నీటిని చేదుకొన్నట్లు నిత్యవ్యవహారంలో ఉపయోగకరమైన వివరాలు గ్రహించి వ్రాసినానని పేర్కొన్నాడు. కొన్ని కొన్ని ద్రవ్యాలకు చాల పేర్లు ఉంటవి, కొన్ని పేర్లు రెండు మూడు ద్రవ్యాలను తెలుపునవిగా

ఉంటవి కాని వ్యవహారంలో ప్రసిద్ధమైనవి మాత్రమే వాడినానన్నాడు. అట్లే వనవాసులు, గోపాలకులు, స్థానిక వైద్యులు ఆటవికులు సాధువులు మున్నగు వారిని విచారించి వివరాలు సేకరించి జొప్పించి సంకలనం చేసినాడు.

సూరయామాత్యుడు తెలుగువాడనుటలో సందేహం లేదు. వస్తువుల పేర్లు తెలుగులో పుస్తకం తెలుగులిపిలో నున్నది. ఎప్పటి వాడు ఎక్కడివాడు తెలిపే ప్రత్యక్ష ఆధారాలేమీ లేవు. తాళపత్రప్రతిలో లేఖకుడు వ్రాయటం పూర్తిచేసిన తిథి ఉన్నది. అది విలంబి ఫాల్గుణ శుద్ధ త్రయోదశి గురవారం. పిళ్ళేగారి వేయి సంవత్సరాల పంచాంగంలో (ఎఫిమెరిస్‌) ఈ తిథి రెండు రోజులకు మాత్రమే సరిపోయినది. అవి 17-2-1239 మరియు 24-2-1659. తాళపత్రాలు మరీ శిథిలంగా లేవు కాబట్టి ఈ ప్రతి 1659లో వ్రాయబడి ఉంటుంది. గ్రంథకర్త ఇంకొక 50-100 సంవత్సరాల ముందువాడై ఉండవచ్చు. అనగా క్రీస్తుశకం పదహారు పదియేడవ శతాబ్దుల మధ్యవాడై ఉండవచ్చు. ఎక్కడివాడో తెలిపే ఆధారాలేమీ నా దృష్టికి రాలేదు.